సంపూర్ణ 'శుది' పేటకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన స్వచ్చభారత్‌, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట నియోజకవర్గాన్ని సంపూర్ణ శుద్ధిపేటగా తీర్చిదిద్దారు. సిద్ధిపేట ప్రజలు ప్రభుత్వ పిలుపునందుకుని ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకున్నారు. బహిరంగ మలవిసర్జన లేని నియోజకవర్గంగా సిద్ధిపేట చరిత్రపుటల్లో నిలిచిపోయింది. ఈ ఘనత సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు సిద్ధిపేట మార్కెట్‌ యార్డులో స్వచ్ఛ సంబురాలు జరిగాయి. స్పీకర్‌ మధుసూదనాచారి సంపూర్ణ బహిరంగ మల విసర్జన లేని నియోజకవర్గంగా సిద్ధిపేటను ప్రకటించారు. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఢంకా బజాయించి సమర్ధించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, స్థానిక శాసనసభ్యుడు, భారీ నీటిపారుదలశాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు, మెదక్‌ ఎం.పి. కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్‌ మధుసూధనాచారి మాట్లాడుతూ వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తికావడమంటే ఇది ఒక చారిత్రక అంశమన్నారు. సిద్ధిపేట త్వరలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ గాంధీ జయంతి రోజునే సిద్ధిపేటలో ప్రాణార్పణకు సిద్ధపడి ఆమరణ నిరాహారదీక్ష చేశారని గుర్తుచేశారు. మళ్ళీ గాంధీ జయంతి రోజు సిద్ధిపేట ఈ ఘనత సాధించడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. నియోజకవర్గంలోని 64,961 గృహాలలో మరుగుదొడ్లు నిర్మాణం జరగడం చరిత్రపుటల్లో లిఖించదగిందన్నారు. ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్న సిద్ధిపేట ప్రజలు ధన్యులన్నారు. కేసీఆర్‌ గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీరు, హరితహారం, సిద్ధిపేటకు బైపాస్‌ రోడ్‌ తదితర కార్యక్రమాలు నిర్వహించి మహాశక్తిగా నిరూపించుకుంటే, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ హరీష్‌రావు అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ముందుకు వెళుతున్నారని కితాబిచ్చారు. ఇక్కడి స్పూర్తితో వెనుకబడిపోయిన తమ భూపాలపల్లి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిపరుస్తామన్నారు.

మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ, గాంధీజీ ఆశయాలను చెప్పడం కాదు చేసి చూపించారని సిద్ధిపేట ప్రజలను, మంత్రి హరీష్‌రావును కొనియాడారు. ఇక్కడ చేపట్టిన ప్రతి కార్యక్రమం జయప్రదం అవుతుందన్నారు. తాను సిద్ధిపేటకు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి నేర్చుకుని వెళతానన్నారు. బహిరంగ మలవిసర్జన మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, ఆ గౌరవాన్ని కాపాడే దిశగా సిద్ధిపేట అడుగులు వేసిందన్నారు. అలాగే నియోజకవర్గంలో నిరక్షరాస్యతను కూడా రూపుమాపాలన్నారు. తాను చైనాకు వెళ్ళినపుడు అక్కడ చెత్త నిర్వహణ, పరిశుభ్రత చూసి దీనికి సిద్ధిపేట ఏమాత్రం తీసుపోదని సహచరులతో తెలిపానన్నారు. అలా ప్రపంచంలోని ఇతర పట్టణాలకు తీసిపోని విధంగా సిద్ధిపేట తయారవుతోందని, దీని వెనుక హరీష్‌రావు శ్రమ ఎంతో ఉందని కొనియాడారు.

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధిలో సిద్ధిపేట చరిత్ర సృష్టించిందన్నారు. అన్ని నియోజకవర్గాలు ఈ విధంగానే అభివృద్ధి చెందితే బంగారు తెలంగాణ సుసాధ్యమవుతుందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కన్నా ముందుగానే ఆ కీర్తిని సిద్ధిపేట దక్కించుకుందని ప్రశంసించారు. సిద్ధిపేటలో స్చచ్ఛభారత్‌ కార్యక్రమం అద్భుతంగా అమలు జరిగిన తీరును చూసి కేంద్రం నిధులు ఇచ్చి ప్రోత్సహించాలని, దేశస్థాయిలో గౌరవించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కొద్ది వ్యవధిలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసి ప్రజల ఆదరాభిమానాలు పొందిందన్నారు.

నీటిపారుదలశాఖా మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు మాట్లాడుతూ, సిద్ధిపేట ప్రజల సహాకారంతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమష్టి కృషితో ఇంటింటికీ మంచినీరు, పరిశుభ్రత, హరితహారం కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 35 లక్షల మొక్కలు నాటామని, మరో 5లక్షలు నాటి 40 లక్షల మొక్కలు నాటిన నియోజకవర్గంగా నిలుపుతామన్నారు. 35వేల ఇండ్లకు చెత్తబుట్టలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ఇంకుడుగుంతల నిర్మాణంలో ఇబ్రహీంపూర్‌ గ్రామం ఆదర్శంగా నిలిచిందన్నారు. సిద్ధిపేటతో పాటు కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం కూడా వందశాతం మరుగుదొడ్లు నిర్మించిన నియోజకవర్గంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాలు ఈ ఘనతను సాధించాయని, భవిష్యత్తులో మెదక్‌జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో నూటికి నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేవిధంగా చూస్తామన్నారు.

మెదక్‌ ఎం.పి. కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్‌, యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీలు దేశపతి శ్రీనివాస్‌, ప్రియాంక వర్జీస్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Other Updates