కవులున్నారు కవిప్రకాండులకు సత్కారమ్ము కల్పించు భూధవులున్నారు ఫణీశ గౌతమ కణాద వ్యాసముఖ్యోక్త శాస్త్ర విచారమ్ముల వైరి గెల్చెటి బుధేంద్ర స్వాములున్నారు తక్కువ యేమున్నది మాకు రాష్ట్రమున మాకుం తెల్గు నేర్పింతురే!

మా నైజాము ధరిత్రిలోన తెలుగున్మాగాణమందుం గషిన్‌
దానై సల్పెడు సోదరాంధ్రునకు చిత్తప్రీతి గల్పింపగా
మేనున్వంచి పరిశ్రమించెదము కానీ మమ్ము దద్దమ్మలం
చీనాడెంచిననాడె వాని పస తానే పాటిదో ! చూడమే!
తడియారలేదు మాధవరాయ చంద్రికా
పరిణయాక్షర మషీపంకమందు
చినుగదింకను సదాశివశాస్త్రి నరస భూ
పాలీయ టీకార్థ పత్ర వితతి
మార్మ్రోత లిడుచుండె మల్లాదివారికి
చెవిలోన వెల్లాల సింహగర్జ
ముడి విప్పలేదింక మొన్న శ్రీపాద వా
రందిన వేయి రూప్యముల మూట
నేటికిని స్నేహలత పూయు నిరూపమాన
సుమములాంధ్రికి తలలోన సొమ్ములగుచు
ప్రాజ్యగుణమైన జటప్రోలు రాజ్యమహిమ
వినక మా రాష్ట్రమును, కొల్తవేయదగునె!
ప్రతివర్షమ్మును తెన్గుతల్లిని బవిత్ర ప్రేమ నర్చించు ను
న్నతుడౌ మావనపర్తిరాజు మఱియుం దామొన్న సింహాసన
స్థితుడౌ వేళ సమస్త దేశ సుకవిశ్రేణిన్‌ సమర్పించె నే
కొతుకంగంటిరొ? మాదు దేశమున మాకుం తెల్గు నేర్పింతురే.
త్రవ్వు కొలంది రత్నములె తప్పక చిక్కును మాదు రాష్ట్ర మం
దెవ్వరు కాదనంగల రికేటికి వాదము లింకమీద మా
మవ్వకు మల్లె పందిరి దుమారము
గప్పెడు కుప్పిగంతులం
దవ్వుల ద్రోయకున్న కలదా! మరి మోక్షము చూతమే గదా!

అని బ్రహ్మశ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి మహోదయులు ఆంధ్ర దాష్టీకాన్ని ఖండిస్తూ చేసిన కవితాగర్జన ఇది. ఆంధ్రసారస్వతపరిషత్‌ (తూపురాన్‌) సభల సందర్భంగా తెలంగాణ భాషాసాహిత్యాల పట్లతణీకార సూచకంగా మాట్లాడిన వారి అజ్ఞానంపై కేశవ పంతులవారెత్తిన కవితాపరశువు ఇది.)

తెలుగు జాతి మనది రెండుగ వెలుగు జాతి మనది. తెలంగాణ ఆంధ్ర భాషాసాహిత్యాలు యుద్ధరంగంలో మోహరించిన రెండు శత్రుశిబిరాలు కావు. ఆవేశకావేశాలు వమనం చేసుకొంటూ పరస్పరం హననం చేసుకొనే విషయాలు అసలే కావు. భాషా సాహిత్య సాంస్క తిక రాజకీయ ఆర్థిక పరంగా వైలక్షణ్యం, వైశిష్ట్యం గలిగిన రెండు ప్రాంతాలు తమ అస్తిత్వాలను, విలక్షణతలను కాపాడుకుంటూనే పరస్పరం సహకరించు కోవాలి. శాతవాహనుల నుండి కాకతీయులు మీదుగా కుతుభ్‌ షాహీలు, నిజాంల దాక ఒకే పాలన కింద ఉన్న ప్రాంతంలోని కొన్నిభాగాలు వేర్వేరు కాలాల్లో ఆంగ్లేయులు పాలనలోకి వెళ్ళిపో యాయి. ఉర్దు ఆంగ్ల భాషా సాహిత్యాల రీతి, పాలనా విధానాలలో ఉన్న తేడాలు ప్రజలను వేరు చేశాయి. భేదభావాలను సష్టించాయి. జీవనప్రవత్తుల్లో మార్పులను తెచ్చాయి. పాలు నీళ్ళలా కలిసి పోకుండా నల్లనూగులు తెల్లబియ్యం లాగ ఎన్నేళ్ళు కలిసి ఉన్నా, మేం అక్కడి వారమే ఇక్కడి వారు వేరు అన్న భావమే నిలిచిపోయింది. ఏకత్వభావమే కల్గలేదు. దీంతో జరిగిన మేలు సైతం కనుమరుగై పోయింది. తెలంగాణ రాష్ట్రోదయం చారిత్రక వాస్తవికత అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు వేర్వేరు రాష్ట్రాలనేది ఈ రోజు కాదనలేని వాస్తవం. ఈ రెండు రాష్ట్రాల భాషాసాహిత్యాలు, ఆ మాట కొస్తే తమిళ, కర్ణాటక, ఒరియా రాష్ట్రాలలోని తెలుగు భాషా సాహిత్యాలు, అమెరికా, అస్ట్రేలియా వాసుల తెలుగు భాషాసాహిత్యాలు అన్నీ సమగ్ర (ప్రపంచ) తెలుగు భాషా సాహిత్య సౌధంలో కలిసిన అవిభాజ్యమైన అంతర్భాగాలే. పరస్పర పరిపూరకాలే.

సంప్రదాయ తెలుగు సాహిత్యం అంటే స్థూలంగా వ్యాకరణ ఛందోబద్ధమైన పద్యకవిత్వం అని అనుకొందాం. సంప్రదాయ తెలుగు సాహిత్యం మాట దేవుడెరుగు. అసలు తెలుగు అస్తిత్వానికే భంగం ఏర్పడుతున్న భావన చాలమందిని ఆందోళనకు గురిచేస్తుంది. దీనికి ఏ ఒక్క వర్గమో, వ్యక్తో, ప్రాంతమో, కారణం కాదు. పట్టణీకరణం, ఆంగ్ల భాషావ్యామోహం, ఆధునిక ప్రగతిశీల దక్పథం, సంప్రదాయ మూఢభక్తి, పెరిగిన సాంకేతికవరులు, శ్రుతిమించినవేగం, ప్రపంచీకరణం సర్వేసర్వత్ర తెలుగు భాషపట్ల ఏర్పడ్డ ఉదాసీన భావం. మరెన్నోకారణాలు మొత్తంపైన సంప్రదాయ సాహిత్యం ముఖ్యంగా పద్య సాహిత్యం చదవడమే పోయింది. కావ్యవాజ్ఞ్మయాన్ని చదివే తరం నిర్మాణం తయారుకాకపోను తద్వ్యతిరేకభావం నిండిపోయింది.

నన్నయ, పాల్కురికి సోమన, తిక్కన, పోతన లాంటి కవులందరు గ్రాంథిక (సాహిత్య) భాషలో రాసిన వారే తప్ప ఆధునికుల్లా ఆంధ్ర ప్రాంతీయ, తెలంగాణ ప్రాంతీయమౌఖిక భాషలకు ప్రాతినిధ్యం వహిస్తు రాసిన వారు కారు. అవి ”తెలుగులో” రాసిన కావ్యాలు. అక్కడక్కడ అవసరం మేరకు వాడుకున్న ప్రాంతీయ పలుకుబళ్ళు, పదాలు గోచరించవచ్చు. సమాంతర సాహిత్య మనదగిన జానపదసాహిత్యంలో నిర్దుష్టమైన తెలంగాణ పలుకుబళ్ళు లభిస్తాయేమో. మౌఖిక వ్యవహారంలో ఎన్ని తేడాలున్నా లిఖితవాఙ్మయంలో మన ప్రాచీనకవులు ఏకరూపతను సాధించారు.

డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఎంతో పరిశ్రమించి ‘ముంగిలి’ పేరుతో నిఘంటు ప్రాయమైన తెలంగాణ ప్రాచీన సాహిత్య నిధిని వెలువరించారు. ఇదెంతో విలువైన గ్రంథం. అందులో చాల పుస్తకాలు అముద్రితాలు, అలభ్యాలు అని వుంటుంది. అముద్రితాలు ముద్రితాలుగా మారడానికి ముందు అవి దొరకాలి. అది ఎంత మేరకు సాధ్యమో చెప్పలేము. కాని శ్రమపడి పాత గ్రంథాలయాలను గాలిస్తే చాలమటుకు అలభ్యాలు లభ్యాలు కావచ్చునేమో!.

తెలంగాణ తన అస్తిత్వ ప్రకటనలో భాగంగా ఈ ప్రాంతంలో వచ్చిన సమస్త సాహిత్యాన్ని ఒక చోటికి తీసుకొనివచ్చి, తగు విధంగా అర్థ తాత్పర్యాలు చేర్చి, పునర్ముద్రణలు చేయాలి. ఇంకా అవసరమైతే ”వచనీకరించి” కారుచౌకగా అందజేయాలి. మరెంతో తెలంగాణ సాహి త్యం ఇంకా వెలుగులోకి రావలసివుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కనుక తెలంగాణ సాహిత్యాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడం పట్ల కంకణ ధారులం కావాలి.

వస్తుభావ రస రచనల్లో వినూత్న మార్గం తొక్కి వీరశైవ మత ప్రచార ప్రయోజనవాదిగా కలం పట్టిన పాల్కురికి సోమన ఉదాహరణలు, ద్విపద, శతకం మొదలైన ప్రక్రియలకు అద్యుడయ్యాడు. పాల్కురికి సోముని గురించిన పాత కొత్త వ్యాసాలన్నింటిని కలిపి, ఆంధ్ర, తెలంగాణ తేడా లేకుండా సంపూటాల రూపంలో తీసుకొనిరావలసివుంది. పండితారా ధ్యుల వీరేశలింగం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పాల్కురికి మీద 1969లో డాక్టరేటు పొందారు. ఇక ఆయన కూతురు సైతం పాల్కురికి మీదే డాక్టరేటు పొందారు. ఇవి ముద్రిత భాగ్యం పొందాలి. తిమ్మావజల కోదండరామయ్య (దేశికవిత్వోద్యమం- పాల్కురికి సోమనపాత్రు1968) జీరెడ్డిచెన్నారెడ్డి (తెలుగు వ్మాయంపై వీరశైవమత ప్రభావం- 1965) లాంటి విద్వాంసుల సిద్ధాంతగ్రంథాలకు తగిన ప్రాచుర్యం లభించనేలేదు. చేతనావర్తం కవుల్లో ఒకరు, ఉస్మానియా తెలుగుశాఖ అధ్యాపకులు అయి 1973లో అకస్మాతుగా చనిపోయిన వేణుముద్దల నరసింహరెడ్డి పాల్కురికి గురించి డాక్టరేటు డిగ్రీ పొందారు. ఆయన అభిమానులందరు కలసి ఒక సంపుటంగా ప్రచురించారు.

బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర సోమన మహాకావ్యాలు. తెలుగు విశ్వవిద్యాలయంలో నేడు దొరకుతున్నాయి. 1909 (సౌమ్య నామ సంవత్సరం)లో ముదిగొండ మల్లికార్జునశాస్త్రి వరంగల్లులోని శ్రీశివ ధర్మవర్ధనీ రామలింగేశ్వర ముద్రాక్షరశాల ద్వారా పండితారాధ్యచరిత్రను ప్రప్రథమంగా ప్రచురించారు. ఆ తరువాతే 1914లో ఆంధ్రప్రాంతంలో పండితారాధ్యచరిత్ర వచ్చింది. ధూపం బసవ నాగయ్య ముసలితనంలో కాలికి బలపం కట్టుకొని పాల్కురికి లఘుకతులను అర్థ తాత్పర్యాలలో వెలువరించారు. అర్థ తాత్పర్యాలు రాసిన వారిలో ఆచార్య రవ్వాశ్రీహరి కూడ ఉన్నారు. అవన్నీ కలిపి విడివిడి లఘుగ్రంథాలుగా కాకుండా ఒకే సంపుటంగా తీసుకొని వస్తే మూలగ్రంథం చదువుదామనుకొనే వారికిఉపకారకంగా ఉంటుంది.

కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక కావ్యాన్ని రాశాడు. ఈయన నిజామాబాదు భీంగల్‌ ప్రాంతీయుడు. కావ్యాలను విజ్ఞాన సర్వస్వాలుగా తీర్చిదిద్దే ప్రక్రియకు ఆద్యుడు గోపరాజు అని ఆరుద్ర లాంటి వారన్నారు. సురవరం ప్రతాపరెడ్డి సాంఘికచరిత్ర నిర్మాణంలో బాగా ఉపకరించిన గ్రంథాల్లో ఇదొకటి. స్వతంత్రకావ్యం రాయడం చాల సులువు. అనువాదం చేయడమంటే ఒక విలుకాడు బాణం వేసిన చోట మరొకడు వేయగలగడం అని అనువాద సమస్యలను తొలిసారిగా ప్రస్తావించిన వాడు. సింహాసన ద్వాత్రింశకలోని కొన్ని భాగాలు హైస్కూలు, డిగ్రీ, పిజీస్థాయిల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఒకప్పుడు సాహిత్య అకాడమి ప్రచురించింది. ఇప్పుడు దానికి తగిన విధమైన అర్థతాత్పర్యాలు, ఆశ్వాసాల వారీ సారాం శాలతో పునర్ముద్రించాలి.

రంగనాథరామాయణం, భాస్కరరామాయణం ఏకకాలంలో వచ్చిన కృతులు. ఒకటి జానపదప్రపంచానికి మరొకటి పండితలోకానికి నచ్చాయి. భాస్కరరామాయణంలో పాఠాంతరాల సమస్య చాల వుంది. ఉస్మానియా తెలుగు శాఖ సంశోధిత మహాభారతంలా భిన్నభిన్న భాస్కరరామాయణం ప్రతులను సేకరించి పాఠాంతరాలను గుర్తించ వలసి ఉంది. ఏఒక్క వ్రాత ప్రతిలోను లేని ఒక ఆంశం భాస్కర రామాయణంలో చేరినట్లు విజ్ఞులు గుర్తించారు. దానిని తొలిసారిగా ప్రచురించిన పరిష్కర్త రాసి వుంటాడని భావిస్తారు.

మారన మార్కండేయ పురాణం తొలి తెలుగు పురాణంగా విజ్ఞుల నిర్ణయం. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధించి డాక్టరేటు పొందారు.

”కొందరికి తెనుగు గుణమగు. కొందరికిని సంస్క తంబు గుణమగు రెండున్‌. కొందరికి గుణములగు. నేనందరి మెప్పింతు కతులనయ్యై ఎడలన్‌” అని పోతన చెప్పిన భాషాపరమైన సమన్వయ సిద్ధాంతాన్ని శిరసా వహించక తప్పదు. వాదోపవాదాలతో పని లేకుండా సందర్భోచితమైన, రసానుగుణమైన, అభివ్యక్తిసమర్థమైన ప్రాచుర్యపదజాలం ఎక్కడున్నా స్వీకరించాల్సిందే అన్న పోతన సందేశం మనకెప్పుడూ మార్గదర్శనం కావాలి. పోతనగురించి వచ్చిన సిద్ధాంత గ్రంథాలు, విమర్శ గ్రంథాలు, వ్యాసాలు సంపుటాలుగా తీసుకొనిరావచ్చు.

మణవాళజియ్యర్‌ మనుమడు, పరాంకుశుని కుమారుడు, కొలనుపాక పరిసర ప్రాంతీయుడు అయిన తిరువాయిపాటి వేంకటకవి (కాలం1840) అనే చాత్తాద శ్రీవైష్ణవుడు రాసిన యాదగిరీంద్ర శతకాన్ని వావిళ్ళ రామశాస్త్రులు 1900లో ఒకసారి ,1928లో మరోసారి ప్రచురించారు.

శ్రీరమణీకళత్ర బుధసేవిత భూరిభవాబ్ధినావ, స
చ్ఛీలగుణాలవాల, యదుశేఖర సంతత దాసపోష నీ
లాలక కాంచనాంబర సులాలిత నీరద గాత్ర నీ కపన్‌
పాలన చేయవే పతిత పావన యాదగిరీంద్ర మొక్కెదన్‌

ఈ శతకంలో దశావతారాలను వర్ణించడం విశేషం. దశావతారాలను వర్ణిస్తు చివర మాత్రం యాదగిరీంద్ర మొక్కెదన్‌ అనడం గమనార్హం. యాదగిరి నరసింహస్వామిని కేంద్రంగా చేసి రాసింది. నూటపదిహేడేళ్ళ కింద వచ్చిన ”యాదగిరీంద్రశతకం” ప్రచురితమైన యాదగిరి నరసింహ సాహిత్యంలో మొదటిది కావచ్చు. దీనిని యాదాద్రిదేవస్థానమైనా ముద్రించుకోవచ్చు.

నాగర్‌ కర్నూలు జిల్లాలోని వట్టెం గ్రామంలో నారదగిరి వెంకటేశ్వరుని స్తుతించి భవబంధాల నుండి విముక్తుడైన పుణ్యశ్లోకుడు తిరునగరి పాపకవి. పాండిత్యానికి, వైష్ణవ సంప్రదాయ నిష్ఠ’కు నిలయమైన పావన చాత్తాద శ్రీవైష్ణవ కులంలో తిరునగరి వంశంలో జన్మించిన పాపకవి తెలంగాణా ప్రాంతంలో పేరుకు రానికవులలో ఒకడు. 1903 లో నారదగిరిమీద వెంకటేశ్వరస్వామి స్థాపన జరిగిన సందర్భంలో ఈ శతక పద్య ప్రసూనాలలో స్వామిని అర్చించాడు. ఈ శతకాన్ని వ్యాకరణ శిరోమణి ఖండవల్లి నరసింహశాస్త్రి పరిష్కరించారు. కవి చిన్నాన్న వరుసైన వట్టెం సీతారామదాసు పాండురంగ ప్రెస్‌, క్షీరసాగరంలో ప్రచురించారు. క్షీరసాగర మంటే ఏదో అనుకోవలసిన పని లేదు. పాలమూరు కు సంస్క తీకరణం.

ఇది భక్తి కావ్యం శరణాగతి కావ్యం. నిసర్గ సుందరంగా రచితమైన కావ్యం. ఎన్నెన్నో సమకాలీన శతకాల కావ్యాలలోని పద్యాల ప్రతిబింబాలు కనిపించవచ్చు. కాస్త అధిక్షేపం, పల్లెటూరి పెద్దమనిషితనం, వ్యావహారిక రీతి, తెలంగాణతనం అడుగడుగున గోచరించి మనలను అలరిస్తుంది. శేషప్ప ధర్మపురి నరసింహశతకం, కాసులపురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం, పోతన భాగవత పద్యాల ప్రభావం బాగా ప్రసరించింది. భగవంతుని వర్ణించని, శరణు జొచ్చని మనుజుని బతుకు బతుకు గాదని గాఢంగా పాపకవి విశ్వసించారు.

అవని సద్రత్న సింహాస నమ్ముంగాగ
నంబరం బాతపత్రంబు గాఁగ
హరవిధి నిర్జరేంద్రాదు లాప్తులుగాఁగ
ఘనవేదములు వంది గణముగాఁగ
జలజగర్భుడు భక్తి సలుపు పుత్రుడు గాఁగ
పుణ్యశాలిని గంగ పుత్రిగాఁగ
నిఖిల లోకమ్ములు నిజమందిరము గాఁగ
భాగ్యదాయిని లక్ష్మి భార్య గాఁగ
మంగళము గల్గి నిరతంబు మమ్ము బ్రోచి
వద్ధి జెందుము లోక ప్రసిద్ధి గాఁగ
లలిత దరహాస! నారదాచల నివాస!
విబుధరంజన సంకాశ! వెంకటేశ !

పాపకవి సీస పద్యంలో రాసిన ఈ పద్యానికి నారాయణ శతకంలోని ప్రసిద్ధ పద్యానికి అనుసరణ అని సులువుగానే గ్రహించవచ్చు.

ధరసింహాసనమై, నభంబు గొడుగై, తద్దేవతల్‌ భత్యులై,
వరమామ్నాయములెల్ల వంది గణమై బ్రహ్మాండ, మాగారమై
సిరి భార్యామణియై, విరించి కొడుకై, శ్రీ గంగ సత్పుత్రియై
వరుసన్నీ ఘనరాజసంబ నిజమై వర్ధిల్లు నారాయణా !

నారాయణ శతకంలోని ప్రతిపాదితాంశాల వరుస సైతం మార్చకుండా మత్తేభాన్ని సీస పద్యంలోకి మార్చిన ప్రతిభాశాలి పాపకవి.

తెలంగాణలో ఆశుధారా కవిత్వం అనేది భట్రాజు వంశీయుల ఆడపడుచు. ధారాళంగా తడుముకోకుండా తెల్లవార్లు ఆశువుగా, ఛందోబద్ధంగా పద్యాలు చెప్పగలగడ మనేది వారికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి వంశంలో వరంగల్లుకు సమీపంలోని ఆత్మకూరులో 1891 లో పుట్టిన అంబటి లక్ష్మీనరసింహరాజు 1939 నాటికి దాదాపు ముప్పై కావ్యాలు రచించిన వారు. ప్రముఖ జర్నలిస్టు అంబటి సురేంద్రరాజుకు చిన్నతాత గారని తెలుస్తోంది. కర్ణాభ్యుదయము 1939 అనే 5 ఆశ్వాసాల మహాకావ్యం రాశారు. ఎలుకుర్తి సాంబమూర్తి శతకం (1941), మంగపతిరావు వెంకటేశ్వర శతకం (1941), అర్జునాభ్యుదయం అనే మూడాశ్వాసాల కావ్యం (1942), పార్వతీపరిణయం అనే నాటకం (1943), చిలువూరు వెంకటేశ్వర శతకం (1955) పాండవ ప్రభావము, ప్రచ్ఛన్నపాండవము, యదువీరవిజయం, హనుమద్విజయం, ప్రహ్లాద చరిత్ర, ప్రభావతీప్రద్యుమ్నం, రఘువీర విజయం, సుమతీనాటకం, రుక్మాంగద, త్యాగరాజు చరిత్ర, గజేంద్రమోక్షం మొదలైన కావ్యాలు, నాటకాలు రాశారు. ఏడు తరాలు వీరు కవులని తెలుస్తోంది.

వరంగల్లులో జ్ఞానాంబిక ప్రెస్‌, రామలింగేశ్వర ముద్రాక్షరశాల, శ్రీనివాసముద్రాక్షరశాల మొదలైన అచ్చుకూటాలు ఎన్నో కావ్యాలను ప్రచురించాయి. 1939 నాటికే శ్రీనివాసముద్రాక్షరశాల స్థాపకులు చెలువూరి గౌరయ్య తమ ముద్రణశాలలో ”నవలలు, నాటకాలు” ప్రచురించినట్లు తెలిపాడు. మరి వాటిని వెతికి పట్టుకొని వెలుగులోకి తేవలసిన బాధ్యత మనతరం మీద ఉంది.

కవినాథ బిరుదాంకితులైన ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు (1884 – 1959) వరంగల్‌ కు చెందిన మహాకవులు. వీరు కుబ్జాకష్ణ విలాసం (1952) అనే అచ్చ తెనుగు ప్రబంధం. వేల్పుగొండ క్షేత్రమాహాత్మ్యం (1950) ముద్రితాలు. శ్రీలక్ష్మీపుర (కాశీబుగ్గ) రంగనాథ క్షేత్రమాహాత్మ్యము, యోగభూషణం ఉపాఖ్యానం, కొడవటంచ లక్ష్మీనసింహ క్షేత్రమాహాత్మ్యం, శ్రీరామ పాదుకాపట్టాభిషేకం- నాటకం, ప్రపంచపరశురామం. నిర్వచనశుభాంగి కళ్యాణం, హేమాంగీ విలాసం యక్షగానం, కేకయ రాజ నందన చరిత్ర అనే నిరోష్ఠ్య నిర్వచన ప్రబంధం, శుద్ధాంధ్ర రామాయణ సంగ్రహం బాలకాండ, ముకుంద శతకంలాంటివి నేటికీ అముద్రితాలు. వీరి కుమారులు ఠంయాల వెంకట నరసింహాచార్యులు రాసిన సురగిరి లక్ష్మీ

నసింహ శతకం 1939 లో వెలువడింది. ఇలాంటి కావ్యాలు పునర్ముద్రణకు నోచుకోవాలి. ఈ కతులను కోవెల సుప్రసన్నాచార్యుల వారు డి.టి.పి. చేయుంచి అచ్చుతప్పులు సరిచేసి సిద్ధాన్నం లాగ ఉంచా రని తెలుస్తుంది. ఏ వదాన్యునికి, ఏ సంస్థకు వాటిని ప్రచురించే భాగ్యం కల్గనున్నదో!.

మహబూబునగర్‌ జిల్లాకు చెందిన మానాజిపేట సంస్థానాధీశులు తూము రామచంద్రారెడ్డి రచించిన అలమేల్మంగా పరిణయం కావ్యం పునర్ముద్రణ యోగ్యమైంది. వీరి ఆస్థానంలో ఉన్న వేమూల రామాభట్టు గౌరీవిలాస కావ్యం పై పరిశోధంచి కే. బాలస్వామి డాక్టరేటు పొందారు. కానీ గౌరీ విలాస కావ్యం ముద్రితం కాలేదు. ఇది రామరాజ భూషణుని వసుచరిత్రకు ధీటైన ప్రౌఢ ప్రబంధం.

తూము రామదాసు ( 1856- 1904) తెలగకులస్థుడు . నిర్వచన మిత్రవిందోద్వాహం పేరుతో రాసిన గర్భబంధ , చిత్రబంధ కవిత్వం, ఆంధ్రపదనిధానం అనే పద్య నిఘంటువు, కాళిదాసు నాటకం మళ్ళీ అందరి చేతుల్లోకి రావాలి. దొంతి పట్టాభిరామిరెడ్డి ఆంధ్రపూర్ణాచార్య ప్రభావం, ఫణికుండలుని (గాండ్లకులస్థుడు) సీమంతీనీ పరిణయం మొదలగు వెన్నోంటినో వెలుగులోకి తేవలసిన కర్తవ్యం. మనమీద ఉన్నది.

ఆచార్య వెలుదండ నిత్యానందరావు
tsmagazine
tsmagazine

Other Updates