pathanguluజ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పుణ్యదినం ‘సంక్రాంతి’. ప్రతి మాసం సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించడం కాలచక్రంలో సహజ పరిణామం. మేషంతో ప్రారంభమై మీనం వరకు పన్నెండు రాశులలోనికి సూర్యుడు ప్రవేశించే దినాన్ని ‘సంక్రాంతి’ అని పిలుస్తారు.

‘సంక్రమణం’ అంటే మార్పు. ప్రతి నెలా జరిగే ఈ మార్పుకు ‘సంక్రమణం’ లేదా ‘సంక్రాంతి’ అని పేరున్నా, మకరరాశిలోకి ప్రవేశించే పవిత్రదినాన్ని మాత్రమే ప్రధానపర్వంగా జరుపుకోవడం వెనుక ఎన్నో విశేషాలున్నాయి. వాటిలో ప్రధానమైంది ఉత్తరాయణ ప్రవేశం. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే దినాన దక్షిణాయనం ప్రారంభమౌతుంది. ఇది ఆరు మాసాలూ, మూడు రుతువులూ కొనసాగుతుంది. మకర రాశిలోకి ప్రవేశించే దినాన ఉత్తరాయణం ప్రారంభమై ఆరుమాసాలూ, మూడు రుతువుల వరకు సాగిపోతుంది.

ఇలా ఆరు మాసాలు దక్షిణాయనం, ఆరు మాసాలు ఉత్తరాయణం ఏర్పడుతాయి. దేవతలు ఉత్తరాయణం అంతా మేల్కొని ఉంటారనీ, దక్షిణాయనంలో శయనిస్తారనీ జనుల విశ్వాసం. దేవతలు మేల్కొని ఉండే ఉత్తరాయణం పుణ్యప్రదమైన కాలం అనీ, దేవతలు నిద్రించే దక్షిణాయనం కీడు కాలమనీ అందరి నమ్మకం. ఈ కారణంగా ఉత్తరాయణ ప్రవేశ దినం అయిన ‘మకర సంక్రాంతి’ మహా పర్వదినంగా జనుల వ్యవహారంలో ఆరాధించబడుతోంది. ఉత్తరాయణంలో స్వర్గాది పుణ్యలోక ద్వారాలు తెరుచుకొని ఉంటాయనీ, ఆ కాలంలో ఏ పుణ్యకార్యం చేసినా ఉత్తమలోకాల దాకా చేరి, దేవతానుగ్రహాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. దక్షిణాయనంలో నరకానికి వెళ్లే దక్షిణద్వారాలు తెరుచుకొని ఉండడంవల్ల ఈ కాలంలో ఏ శుభకార్యాలూ పనికిరావనీ, ఈ కాలంలో సంభవించే మరణాలు నరకప్రాప్తిని కలిగిస్తాయనీ ఒక నమ్మకం. అందుకే ఈ కాలాన్ని పితృదేవతలకు సంబంధించినదిగా భావిస్తారు. కనుక ఈ కాలంలో పితృ దేవతలకు సంబంధించిన కర్మలే చేస్తారు. ఈ విధంగా ఈ రెండు అయనాల మధ్య వేర్వేరు విశేషాలున్నాయి.

చలికాలంలో వచ్చే ఈ పండుగనాడు వెచ్చదనంకోసం ‘భోగి’ మంటలు వేయడం అలవాటు. సంక్రాంతికి ముందురోజు వచ్చే ‘భోగి’ పండుగనాడు ఇంటి వాకిళ్లను చక్కగా అలికి రంగురంగుల ముగ్గులు వేయడం, ఆవుపేడతో చేసిన గురుగులను ఆ ముగ్గులపై పెట్టి, చెరుకుముక్కలు, బియ్యం, రంగురంగుల పూలు, పండ్లూ వాటిపై పెట్టడం పరిపాటి. నువ్వులు, సజ్జలువంటి ఉష్ణ జనక ధాన్యాలతో చేసిన ఉండలు, తీపి పదార్థాలను ఆరగిస్తారు. ధాన్యాలనూ, కూరగాయలనూ దానమిస్తారు.

రెండవ దినం అయిన ‘మకర సంక్రాంతి’నాడు చక్కెరతో కలిపిన నువ్వులు, నూల ఉండలు, ఇతర భక్ష్యాలు, పిండివంటలు ఆరగిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. కుంకుమ, సుగంధద్రవ్యాలు, బియ్యం, బెల్లం, పువ్వులు, వస్త్రాలు మొదలైనవి దానాలుగా సమర్పిస్తారు. ‘సంక్రాంతి’ని పెద్ద పండుగగా అభివర్ణించడానికిగల నేపథ్యం వ్యవసాయ ప్రధానమైన భారతావనిలో పంటలు సమద్ధిగా పండి, ధాన్యరాశుల ఇంటికి చేరే శుభకాలం సంక్రాంతి కావడమే. ధాన్య సమృద్ధితో ఏర్పడిన ధన సమృద్ధితో జనుల ఇండ్లు కళకళలాడే వేళ ఈ పండుగ అమితానందాన్ని ప్రసాదించడమే.

ఇక మూడవ దినం అయిన ‘కనుమ’ పండుగ వ్యవసాయదారులైన రైతులకూ, వ్యవసాయాధారిత జనావళికి ఆనందాలను పంచుతుంది. ఈ దినాన వ్యవసాయానికి ఉపయోగపడే పశుసంపదనూ, పనిముట్లనూ, వాహన సామగ్రిని చక్కగా అలంకరించి, పూజించడం, ఆరాధించడం కనబడుతుంది. ఇవన్నీ తమ సుఖజీవనానికి ఆధారాలని మానవులు విశ్వసించడమేగాక, వాటిపట్ల కృతజ్ఞతాభావాన్ని తెలపడం కూడా కనుమ పండుగలోగల విశిష్టత.

తెలంగాణ జనపదాలలో సంక్రాంతికి ‘పతంగుల పండుగ’ అని పేరు. పల్లెలు మొదలుకొని, మహానగరాల వరకు పిల్లలూ, పెద్దలూ అనే తేడా లేకుండా అందరూ గగన వీధులలో పతంగులను (గాలిపటాలను) ఎగురవేస్తూ, తమ ఆనందాలను దేవతలకు తెలుపుతున్నారా అన్నట్లు ఉల్లాసంగా పతంగులను గాలిలోకి పంపుతూ ఆనందిస్తారు. రంగురంగుల కాగితాలతో రూపొందించిన పతంగులు ఆకాశవీధులలో తారలవలె మెరుస్తూ, మానవాళికి శుభ సంకేతాలను చేరవేస్తుంటాయి. పతంగులు గాలిలో కదులుతూ సుదూర వినీలాకాశంలో నాట్యాలు చేస్తుంటే, ఆబాలవృద్ధులు ఉల్లాసంతో పోటీలు పడుతూ తమతమ పతంగులను సుదూర తీరాలకు చేర్చాలని తహతహలాడుతుండడం ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది. పతంగులకు కట్టిన దీపాలు ఆకాశదీపాలైన నక్షత్రాలవలె మెరుస్తూ అందరినీ ఆనందడోలికలలో విహరింపజేస్తాయి.

సూర్యుని ఆరాధనకు విశిష్టమైన ‘మకర సంక్రాంతి’నాడు కర్మసాక్షిని వివిధ పూజలతో, అర్చనలతో, ఆరాధనలతో దేవాలయాలలోనూ, గృహాలలోనూ సేవించడం మానవాళికి ఎంతో ఇష్టం. భూమిపైనగల సకల చరాచరాలకూ ప్రత్యక్ష దైవం సూర్యుడే. అంతేకాదు ఆయన ఆరోగ్యప్రదాత కూడా. సూర్యుడులేని ప్రపంచం నిర్జీవం అవుతుంది. సూర్యుడే జగతికి ప్రాణం. సూర్యుడే జనజీవనానికి మూలం. సూర్యుడే జగత్తుకు నేత్రం. సూర్యుని పారమ్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన అపూర్వమైన పండుగ ఈ ‘మకర సంక్రాంతి!

Other Updates