‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అనే జనాలు ఎక్కువగా ఉండే సమాజంలో, మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల సమాజంలో….ఇటువంటి ప్రచారాలు ఊపందుకుని వాస్తవాలకు సజీవ సమాధికట్టేస్తుంటాయి.
ఏప్రిల్ 21, 2019 ఆదివారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఒక గ్రంథావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యా. అప్పుడే కార్యక్రమం ఆరంభమయినట్టుంది. వేదిక మీద 20 మంది, వేదిక ముందు 200మంది కనిపించారు. వెళ్ళి వెనుక వరుసల్లో ఓ పక్కన సీటు చూసుకుని కూర్చున్నా. కొద్ది సేపటికి నా పక్క, వెనక సీట్లు, వరుసలు కూడా నిండి పోయాయి. ఆధునిక, సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆడామగా, చిన్నాపెద్దా, ముసలీముతకా అందరూ ఏవో మాట్లాడుకుంటున్నారు. ఒకర్నొకరు పలకరించుకుంటు న్నారు. క్షేమ సమాచారాలు వాకబు చేసుకుంటున్నారు. వేదికపై చేస్తున్న ప్రసంగాలకు కూడా అందరూ దీటుగా స్పందిస్తున్నారు.
బయటబోర్డు చూడకుండా పొరపాటున ఏ తమిళ/ మలయాళ / మరాఠీ కార్యక్రమానికో వెళ్ళి కూర్చున్న తెలుగు ప్రేక్షకుడిలా ఉంది నా పరిస్థితి. చెవికి ఒక్క ముక్క కూడా ఎక్కడం లేదు. కాసేపటికి వాళ్ళు నన్నుకూడా మాటల్లో దించబోయారు. మానం కాపాడుకోవడానికి ఆ క్షణాన మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది.
చిత్రం ఏమిటంటే-అది తెలుగు వాళ్ళ కార్యక్రమమే. ‘శ్రీలాలిత్యం’ అనేసంస్కతాంధ్ర గ్రంథావిష్కరణ. కానీ అక్కడ భాషామాధ్యమం అంతా సంస్క తమే. వేదికపైన ఉన్నవారూ, వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నవారూ, ఆవిష్కకర్తలూ, ప్రసంగాలు చేస్తున్నవారే కాకుండా కింద ఉన్న ప్రేక్షకులు కూడా సమయోచితంగా వాటికి స్పందిస్తూనే, వారిలోవారు కూడా సంస్కృతంలోనే మాటామంతీ సాగిస్తోంటే…. చిలకల తోటలో కాకినయి పోయా.
దేవుళ్ళు ఉన్నారో లేరో…ఉంటే ఏ భాషలో మాట్లాడుకుంటారో తెలియదు కానీ, సంస్కృతాన్ని మాత్రం దేవభాష అంటున్నాం. ఎందుకు ? ఈ పుణ్యభూమి మీద పుట్టిన హైందవ(ప్రధానంగా), బౌద్ధ, జైన మతాల (ప్రభావితం అయిన) భాష అది. మన దేశంలో ఇప్పుడు మనకు వాడుకలో ఉన్న చాలా భారతీయ భాషలకు అది మాతృక. లేదా దాని ప్రభావంతో వికసించినవి. చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే-అది బ్రాహ్మణులు, వైదిక పండితులు, అర్చకులు, పురోహితులకే పరిమితం-అంటే మత సంబంధ కార్యక్రమాలకే పరిమితం అని. కానీ కనుమరుగైన, లేదా పనిగట్టుకుని పక్కదోవ పట్టించబడిన వాస్తవం ఏమిటంటే…అది వాఙ్మయం, వేదాంతాలకే పరిమితం కాలేదు. తరాల తరబడి, శతాబ్దాల, సహస్రాబ్దాల తరబడి మన నాగరికతకు, మన సంస్కృతికి, మన వికాసానికి సంస్కృతంతో పేగు బంధం ఉంది. గణితం, వాస్తు, సంగీతం, నత్యం, ఖగోళ శాస్త్రం, మెటలర్జీ, వైద్యం(సర్జరీలతో సహా) వంటి ఎన్నో శాస్త్రాలు… మిగిలిన ప్రాచీన భాషలు పూర్తిగా కళ్ళు తెరవక ముందే, సంస్కృతంలోనే వెలువడ్డాయి, శాస్త్రాలే కాదు… పరిశోధనలు కూడా. ఈ భాషలోనే వాటి బోధన ఈ గడ్డమీద అప్పటికే ఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయాల్లో (నలందా, తక్షశిల వంటివి) జరిగితే విదేశాలనుంచి కూడా వేలసంఖ్యలో(వందలు కాదు)….విద్యార్థులు వచ్చి నేర్చుకుని పోయేవారు. (హ్యుయాన్ త్సాంగ్ వంటి విదేశీ యాత్రీకులు కూడా ధవీకరించిన వాస్తవాలివి).
ఇప్పుడు మన దేశంలో ఏ భాషకు చెందిన వారికి వారి భాషే సర్వోత్తమం..వాటికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి వారు కిందామీదా పడుతుంటే, వాటికన్నింటికీ మాతకయిన సంస్కృతం మాత్రం ‘ఎవడికి పుట్టిన బిడ్డరా ఇది ఎక్కిఎక్కి ఏడుస్తున్నది’ అన్న చందాన అనాథగా మిగిలిపోతున్నది.
2011నాటి లెక్కల ప్రకారం భారత దేశంలో సంస్క తం మాట్లాడేవారి సంఖ్య 24,821 అనీ, అంటు 0.00198% అనీ….70 వేలమంది ఫ్రెంచి మాట్లాడుతున్నారనీ, అలాగే జర్మన్, స్పానిష్ మాట్లాడేవారు వేలల్లో ఉంటే, అరబిక్ మాట్లాడేవారి సంఖ్య లక్షల్లో ఉంటుందనీ, పూర్తిగా సంస్క తంలో మాట్లాడుకునే ప్రజలు ఉన్న గ్రామాలు దేశం మొత్తంమీద ఒకటేమో తమిళనాడులోనూ, ఒకటేమో కర్ణాటకలోనూ…..అంటూ ప్రచారం మోత మోగిపోతున్న ఈ క్షణాల్లో….
రాజధానీ నగరం నడిబొడ్డున, పట్టపగలు, ఓ చిన్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలోనే ఇంతమంది నాకు కనిపించడం, వారంతా ఏ ఇబ్బంది లేకుండా, స్వేచ్ఛగా, సాఫీగా, సరళంగా, నిర్భయంగా పరస్పరం మాట్లాడుకుంటూ, హావభావాలు పంచుకుంటూంటే….కళ్ళారా చూస్తున్న నాకు పైన చెప్పిన లెక్కలు, ఆ సర్వేలు ఎంత బూటకమో ఈ ఆదివారం నాకు రవీంద్ర భారతిలో బోధపడింది.
అసలు కార్యక్రమం ఇది…..
ప్రముఖ సంస్కృతాంధ్ర విద్వత్కవులు, సద్వ్యాఖ్యాన నవ మల్లినాథ, మధుర వాగ్విలాస వంటి బిరుదులు పొందిన శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ రచించిన ‘శ్రీలాలిత్యం’ గ్రంథావిష్కరణ కార్యక్రమం అది. లలితా సహస్రనామంలోని ప్రతి నామానికి భావగంభీరమైన ఒక సంస్కృత శ్లోకాన్ని, నవరసభరితంగా సరళమైన ఒక తెలుగు పద్యాన్ని స్ఫూర్తిదాయకంగా అందిస్తూ, సామాన్య చదువరి కోసం చిన్న చిన్న వాక్యాలతో తాత్పర్యాన్ని వివరిస్తూ సాగిన రచన అది. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీతీర్థ స్వామి దీనిని ఆవిష్కరించారు. ‘గురుశరణ్య’ నృత్య బృందం సందర్భోచితంగా ప్రదర్శించిన నత్యరూపకం ఆద్యంతం ఆహూతులను విశేషంగా అలరించింది.
సాహిత్యవిలువలు ఉన్న ఒక గ్రంథాన్ని ఆవిష్కరించడం అంటే – ‘ఇదిగో ఇలాఉండాలి’ అన్న చందంగా ఆదర్శప్రాయంగా జరిపిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సాంస్క తిక శాఖ ప్రోత్సహించగా, సంస్క త భారతి చేయూతనిచ్చింది. ప్రముఖ పండితులు దోర్బల ప్రభాకర శర్మ ప్రయోక్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్, ప్రముఖ శతావధాని గౌరీభట్ల రామశర్మ, ప్రముఖ విద్వాంసులు ఆయాచితం నటేశ్వర శర్మ, శలాక రఘునాథ శర్మ ప్రభృతులు వారి వంతు సహకారాన్ని అందించారు. సాహిత్యపరంగా ఎంతో విలువైన ఈ పుస్తకాన్ని, ఎంతో ఖర్చుకోర్చి అందంగా 520 పేజీలతో బైడింగ్‌తో ఆకర్షణీయంగా రూపొందించి ప్రేక్షకులకు ఉచితంగా అందించారు.
-ములుగు రాజేశ్వర రావు