మల్లినాథసూరి1ఒకవేళ ఈ ‘మహామనీషి’ వ్యాఖ్యాన వైదుష్యం సోకకపోయుంటే కాళిదాసు, భారవి, మాఘుడు. వంటి కవుల మహాకావ్యాలు చీకట్లో మగ్గిపోయి ఉండేవేమో!
ఒకవేళ ఈ ‘వ్యాఖ్యాతృ శిరోమణి’ సంజీవని అందకపోయి ఉంటే సంస్కృత సాహిత్యమంతా ‘కువ్యాఖ్యావిషమూర్చితమై’ పోయి ఉండేదేమో!!
కారణజన్ములు కొందరే ఉంటారు. వారి ప్రేరణ, పూనిక తరతరాలకూ ఆదర్శమై నిలుస్తుంది. అటువంటి ఆదర్శ పురుషుడు, మహామనీషి, మహామహోపాధ్యాయుడు, పదవాక్య ప్రమాణ పారావార పారీణుడు ` కోలాచల మల్లినాథసూరి.
తెలంగాణ సీమలోని మెదక్‌ జిల్లాలోని కొలాచలం (ప్రస్తుతం ఇది కొల్చెలమ ` కొల్చారంగా మారింది) వాస్తవ్యుడైైన మల్లినాథ సూరి వ్యాఖ్యాన చక్రవర్తిగా విశ్వవిఖ్యాతి పొందాడు. సంస్కృత కవికులగురువైన కాళిదాసు రఘవంశ, మేఘసందేశ కుమార సంభవ మహాకావ్యాలకే కాకుండా భారవి కవి కిరాతార్జునీయానికి, మాఘుని శిశుపాల వధకు శ్రీ హర్షుని నైషధానికి విద్యద్వ్యాఖ్యానాన్ని అందించాడు. కవిగానూ గీర్వాణ భారతిసేవలో తరించాడు.
మహాకవుల కావ్యాలు అందరికీ అర్ధమయ్యేలా ఆయా కావ్యాల సౌందర్యాన్ని ఆస్వాదించేలా, రసానందాన్ని అనుభవించేలా వ్యాఖా నించడం మల్లినాథసూరి అద్భుత ప్రతిభకు నిదర్శనం. కేవల వ్యాఖ్యాతగానే గాకుండా విద్వత్కవిగా స్వతంత్ర రచనలు చేసి సంస్కృత భారతిని అర్చించిన మహానీయుడితడు.
పంచకావ్యాలు చదవడం ఆరంభించిన ప్రతి సంస్కృత విద్యార్థికీ మల్లినాథుడే తోడుగా సహాధ్యాయిగా ఆచార్యునిగా ఉంటాడు (వ్యాఖ్యానం ద్వారా).
కవిలోని నిగూఢ భావాన్ని వ్యాఖ్యానం లేకుండా అందుకోలేని వారికి మల్లినాథుడే మార్గదర్శి. ‘‘ఇహాన్వయముఖేనైవ సర్వం వ్యాఖ్యాయతేమయా నా మూలం లిఖ్యతే కించిత్‌ నానపేక్షితముచ్యతే’’ ఇదీ మల్లినాథుని వ్యాఖ్యాన ప్రణాళిక
1. అన్వయ ప్రకారంగా (అంటే ప్రతి పదార్థం చదివితే శ్లోక భావం అర్థమయ్యే విధంగా వ్యాఖ్యానించడం.
2. మూలంలో లేని విషయాలను ప్రస్తావించక పోవడం.
3. అనవసరమైన విషయాలను పేర్కొనకపోవడం.
వ్యాఖ్యానం అంటేనే విశేషించి చెప్పడం (విశేషేణ ఆఖ్యానం ` వ్యాఖ్యానం) కవితో సమానమైన పాండిత్యంగానీ అంతకన్నా గొప్పదనం గానీ వ్యాఖ్యాతకుండాలి. అలాంటి వ్యాఖ్యాతనే కవిత్వతత్వాన్ని ` కవి హృదయాన్ని ఆవిష్కరించగలుగుతాడు. మల్లినాథ సూరి పూర్వ వ్యాఖ్యాతలెందరో తమ వ్యాఖ్యానాల్లో దండాన్వయ పద్ధతినే అనుసరించేవారు. మొదట విశ్లేషణాలు తర్వాత విశేష్యాలు ఆ తర్వాత క్త్వాణముల్‌ ల్యప్‌ మొదలైన ప్రత్యయాలు ఆ పిదప క్రియ ఉండి దండాకారంగా ఉండేదే దండాన్వయం.
ఇది అన్వయ కాఠిన్యంగా ఉండడమే కాక శ్లోక భావాన్ని రసాస్వాదనానుభూతిని అంతగా కలిగించని విధానమని చెప్పవచ్చు. సంస్కృత గ్రంథాల అధ్యయనం, అధ్యాపనంలోనే జీవితమంతా గడిపిన మల్లినాథసూరి దండాన్వయంలోని అన్వయ కాఠిన్యతను గుర్తించి భావ అన్వయ క్రమంలో వ్యాఖ్యానించడమే మంచిదని ఎంచుకొన్నాడు. ఆ మార్గమే తర్వాతి వారందరికీ ఆరద్శమైంది. కావ్య వ్యాఖ్యానంలో ఉండే ఉద్భోధన విధి, కోశవిధి, ప్రయోగ విధి, ఆగమనవిధి, వంటి వన్నీ తన వ్యాఖ్యానంలో సందర్భానుసారంగా తగిన విధంగా వాడుకొన్నాడు.

పూర్వ వ్యాఖ్యాతల వ్యాఖ్యానాల్లో అతిగా పాండిత్య ప్రకర్షను ప్రదర్శించడం ` అనవసరమైన ఉల్లేఖాలల్లో పఠితలను గందర గోళానికి గురిచేయడం వంటి లోపాలు ఉండేవి. మల్లినాథసూరి వాటిని పరిహరిస్తూ కవిత్వతత్వ విశ్లేషణకే ప్రాధాన్యమిచ్చే ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు.
మల్లినాథసూరి తన వ్యాఖ్యానాల్లో గానీ స్వతంత్ర రచనల్లో గానీ ఎక్కడా తన గురించి, తన పూర్వీకుల గురించి ప్రస్తా వించలేదు. వ్యాఖ్యానాంతంలోని గద్యను బట్టితాను పదవాక్య ప్రమాణ పారావార పారీణుడని, మహా మహోపాధ్యాయుడని, కోలాచలవంశీయుడని మాత్రం తెలుస్తుంది.
సూరి వంశీయుడే అయిన నారాయణ పండితుని చంపూ రామాయణ శ్లోకాలు, ప్రతాపరుద్రీయానికి రత్నాపణ వ్యాఖ్య వ్రాసిన ‘కుమార స్వామి సోమపీథి పీఠికా శ్లోకాలు, నృసింహకవి రచించిన స్వరమనోజ్ఞమండలికి పరిమళ వ్యాఖ్య రాసిన గిరినాథుని వ్రాతలు మల్లినాథుని వంశావళిని కొంతవరకు తెలుపుతున్నాయి. గ్రామనామంతో ఇంటిపేరు రావడం అనే సంప్ర దాయం ప్రకారం కోలాచలం వారి గ్రామమని, కాశ్యపగోత్రులని, యజ శ్శాఖీయుడైన వైదిక బ్రాహ్మణుడని తెలుస్తుంది. వేదశాస్త్ర పారంగతులైన పండిత కుటుంబం సూరిది. మల్లినాథుని తాత పేరుకూడా మల్లినాథుడే కాకతీయ గణపతి దేవచక్రవర్తి ఆస్థానంలో విద్వాంసునిగా ఉంటూ శతావధానిగా విఖ్యా తుడై కనకాభిషేక గౌరవాన్ని పొందిందీతడే.
చరిత్రలో తొలి శతావధానిగా గణనకెక్కింది మన మల్లినాథుని తాత గారైన శతావధాని మల్లినాథుడే.
ఎంత వరకు అమరవాణి వినిపిస్తుందో, ఎంత వరకు కావ్యరసాస్వాదనాసక్తి పాఠకుల్లో ఉంటుందో అంతవరకు మల్లినాథుడు వ్యాఖ్యాతృ ప్రభాకరుడై సారస్వతీ వినీలాకాశంలో ప్రకాశిస్తూనే ఉంటాడు. రెండవ దేవరాయల పాలనాకాలానికి చెందిన ధర్మనిర్ణయ సభలో మల్లినాథుడు ధర్మాసనంపై ఆసీనుడై న్యాయనిర్ణయ నివేదికగా ‘వైశ్యవంశ సుధాకరం’ అనే గ్రంథాన్ని సమర్పించినాడని రాఘవన్‌ గారి రాతల వల్ల తెలుస్తుంది. దీన్ని బట్టి క్రీ.శ. 1430 ప్రాంతంలో సూరి జీవించినాడని భావించవచ్చు.
మల్లాది సూర్యనారాయణశాస్త్రి, ఆచార్య బిరుదు రాజు రామరాజు గారల అభిప్రాయం ప్రకారం 14`15 శతాబ్దాల్లోకి మల్లినాథ సూరి జీవించాడని తెలుస్తుంది.

Other Updates