డా|| అయాచితం నటేశ్వర శర్మ
ప్రతి ఏడాదీ సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే శుభసమయాన ఏర్పడే ‘మకర సంక్రాంతి’ సకలలోకానికే ఆరాధ్యమైన పర్వదినం. సూర్యుడు ప్రతి నెలా ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ సంవత్సర కాలం సంచరిస్తుంటాడు. కనుక ప్రతి నెలా ఒక సూర్య సంక్రాంతి ఏర్పడడం సహజం. కానీ అన్ని సంక్రాంతులకూ లేని విశిష్టత కేవలం మకర సంక్రాంతికే ఎందుకు వచ్చిందనే ప్రశ్న కలుగు తుంది. సూర్యుడు ఆరునెలలకొకసారి తన గమనం లో దిశను మార్చుకొంటుంటాడనేది భౌగోళిక సత్యం. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణం వైపుకు వాలుతాడు కనుక ఆ నాటి నుండి దక్షిణాయనం ప్రారంభమై ఆరునెలల పాటు కొనసాగుతుంది. మళ్లీ సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరంవైపు వాలుతాడు కనుక, ఆనాటి నుండి ఉత్తరాయణం ప్రారంభమై ఆరునెలల పాటు కొనసాగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం రెండు అయనాలు మానవుల జీవితాలను ప్రభావితం చేస్తాయి.
ఉత్తమలోకాలన్నీ ఉత్తరం వైపున ఉంటాయనీ, నరకాది తామసలోకాలన్నీ దక్షిణంవైపున ఉంటాయనీ పురాణాలు చెబుతున్నాయి. పుణ్యాలు చేసినవాళ్లు
ఉత్తమలోకాలకు చేరుకుంటారనీ, పాపాలు చేసిన వాళ్లు తామసలోకాలకు వెళ్తారనీ అందరి నమ్మకం. అందుకే పుణ్యకార్యాలకు ఆరంభదినం అయిన మకర సంక్రాంతికి ఎక్కడలేని ప్రాధాన్యత కలిగింది. దక్షిణాయనంలో కేవలం పితృ దేవతలకు సంబంధించిన కర్మలు తప్ప మరే
శుభకార్యాలనూ జనులు తలపెట్టకపోవడం గమనార్హం. ఉత్తరాయణంలో భూమిపై సూర్యుని కాంతి విశాలంగా, స్వచ్ఛంగా ప్రసరించడం వల్ల ఎక్కువ కాలం పుణ్యకార్యాలకు అనువుగా ఉంటుందనే భావన సకల జనులలో నాటుకొని ఉండడం ఈ పండుగకు ఎంతో ప్రత్యేకతను సంతరించి పెట్టింది.
సూర్యుడు మానవాళికే గాక సకల జీవరాశులకూ ప్రాణప్రదాత. సమస్త ప్రకృతికి బంధువు. చరాచరాలను వెలిగించే దివ్యజ్యోతి సూర్యుడు ఒక్కనాడు కనబడకున్నా మనిషి సుఖంగా ఉండలేడు. మానవదేహాలను చైతన్యవంతంగా నడిపే సూర్యుడు లేనిదే మనుగడలేదు. అందుకే మకర సంక్రాంతి గొప్ప పర్వదినంగా భాసిల్లుతున్నది.
మకర సంక్రాంతి ఒక్కరోజు పండుగ కాదు. ముందురోజు, తరువాత రోజూ కలిపి మొత్తం మూడు దినాలుగా ఈ పర్వదినాన్ని లోకంలో జనులంతా జరుపుకొంటారు. సంక్రాంతికి ముందు రోజు భోగి, సంక్రాంతికి మరుసటి రోజు కనుము.
మొదటి దినం అయిన భోగి పండుగ ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకొనేందుకు ఆచరించే పండుగగా పురాణాలలో ప్రసక్తమై ఉంది. మేఘాలకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుని కరుణ ఉంటేనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి. ‘భోగం’ (దేవతారాధన కోసం చేసే పుణ్య కార్యం) కలిగింది భోగి. అందుకే ఈ రోజున నెయ్యితో వండిన ‘పొంగలి’ని దేవతలకు నివేదించడం ద్వారా భోగాన్ని నిర్వహిస్తారు కనుక భోగి అనే పేరు సార్థకమైంది. భోగినాడు అందరూ అభ్యంగన స్నానాలను ఆచరించి, ఇష్టదేవతలకు పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో భోగిమంటలు రగిలించి ఆనందించడం కనబడుతుంది. చలికి వీడ్కోలు పలికి, సూర్యుని వెచ్చదనాన్ని ఆహ్వానించడం అనే భావన భోగిమంటల ద్వారా వ్యక్తమవుతోంది. తెలంగాణ జన పదాలలో భోగి పండుగనాడు చిన్న పిల్లలను నూతన వస్త్రాలతో అలంకరించి తలలపై (బోడులపై) ఆశీర్వచన పురస్సరంగా రేగుపండ్లు, చెరుకు ముక్కలు, బియ్యం, చిల్లర నాణాలు కలిపి పోయడాన్ని ‘బోడపండ్లు పోయడం’ అని వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియ వలన పిల్లలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనే ఆకాంక్ష వ్యక్తమౌతుంది. భోగినాడు వైష్ణవాలయాలలో రకరకాల పొంగళ్లు, పులిహోరలను దేవతలకు నివేదించి, ప్రసాదాలుగా స్వీకరించడం కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో డప్పులను మ్రోగిస్తూ వీధులలో ఊరేగుతూ భోగిపండుగను విశేషోత్సాహంతో జరుపుకుంటారు.
రెండవ దినం మకర సంక్రాంతి. సూర్యుడు దక్షిణాయనాన్ని వీడి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ప్రధాన పర్వదినం నాడు ఉషస్సులోనే మేల్కొని మంగళ స్నానాలు చేయడం, ఇష్టదేవతలను ఆరాధించడం సంప్రదాయం, ఇంటి వాకిట రంగురంగుల రంగవల్లులను రచిస్తూ, గృహప్రాంగణాలను కొత్త శోభలతో తీర్చిదిద్దుతారు. ఆవుపేడతో పిరమిడ్ ఆకృతిలో చేసిన గొబ్బెమ్మలపై బంతిపూలనూ, చేమంతిపూలనూ ఆలంకరించి, ఇళ్లముందు ముగ్గులపై ఉంచి, సకల మంగళాలనూ కోరుకోవడం ఈ పండుగ నాటి విశేషం. ఈ దినాన దేవాలయాలన్నింటిలోనూ విశేష పూజలను నిర్వహించి, దేవతల ఆశీస్సులు స్వీకరించడం కనబడుతుంది. నువ్వులు, చక్కెర కలిసిన మధురపదార్థాలను, నువ్వులు, బెల్లంతో కలిసిన వంటలను సేవించడం ఆరోగ్యదాయకంగా భావిస్తారు. ‘నువ్వులు తిని నూరేళ్లు బ్రతుకు, చక్కెరతిని తీయగా మాట్లాడు’ అంటూ ఒకరికొకరు నువ్వులు, బెల్లం, చక్కెరలు కలిపిన పదార్థాలను ఇచ్చిపుచ్చుకుంటారు.
సంక్రాంతి పండుగ విశేషంగా మహిళలకు ఉల్లాసోత్సాహాలను కలిగిస్తుందనడంలో సందేహం లేదు. స్త్రీలకు ముగ్గులంటే ఎంతో ఆసక్తి. అవి రాగరంజితమైన జీవనానికి ప్రతీకలుగా భావిస్తారు. ఏడు రంగులు సూర్యునిలో భాసిస్తాయి. అందుకే సూర్యుడు సప్తవర్ణాలనే గుర్రాలతో కూడిన దివ్యరథంపై ఊరేగుతాడని అందరూ భావిస్తారు. తెలుపు, నలుపు, ఎరుపు, నారింజ, పసుపు, ఊదా, ఆకుపచ్చ రంగులు జీవనగమనంలోని అనేక విషయాలకు ప్రతీకలుగా దర్శనమిస్తాయి. అన్నింటినీ రంగరించుకొని పోయే జీవితమే ఆనందదాయకం అనే సత్యానికి మకరసంక్రాంతి ఒక
ఉదాహరణగా కనబడుతుంది. ఈ పుణ్యదినాన దానాలు చేయడం కూడా పుణ్యదాయకమని ప్రజల విశ్వాసం. అందుకే కంబళ్లు, పత్తి, నువ్వులు, చక్కెర, బెల్లం వంటి పదార్థాలను దానం చేస్తారు. పితృదేవతలకు బలులను (నైవేద్యాలను) సమర్పిస్తారు. సంక్రాంతికి చెరుకు పంట విశేషంగా వస్తుంది కనుక చెరుకు రసం వలె జీవితం మధురం కావాలని ఈ పండుగలోని సందేశంగా కూడా అనుకోవచ్చు.
సంక్రాంతి మరుసటి దినం అయిన ‘కనుము’ వ్యవసాయ ప్రధానమైన పండుగ. భారతదేశం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన భూమి కనుక వ్యవసాయానికి ఉపయోగపడే ఎడ్లు, నాగళ్లు, బండ్లు తదితర వ్యవసాయోపకరణాలను చక్కగా అలంకరించి పూజించడం సంప్రదాయం. ఎడ్ల బండ్లను మామిడి తోరణాలతోనూ, పూలదండలతోనూ చక్కగా అలంకరించి ఊరేగించడం పాడిపంటల సమృద్ధిని కోరుకునే మానవాళి ఆకాంక్షకు అద్దం పడుతుంది. కనుము నాడు ముత్తయిదువలు పసుపు కుంకుమలను, నువ్వులు చక్కెరలను పంచుతూ సౌభాగ్యాన్ని కోరుకుంటారు. పశుసంపద ఎంత వర్ధిల్లితే, అంతగా సస్య సమృద్ధి కలుగుతుందనీ, భోజనానికి కొదువ ఉండదనీ భావించడం ఈ పండుగలోని విశేషం.
జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి సంక్రమణకాలం పీడాకారకం కనుక అటువంటి పీడ తొలగిపోయేందుకు దేవతల ఆరాధనలు, జపాలు, తపస్సులూ, దానాలూ ఉపయోగపడతాయనీ, అందరికీ ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయనీ అందరూ నమ్ముతారు. ఈ కారణంగా ‘మకర సంక్రాంతి’ పండుగ సకల జనులకూ ఆరాధ్యంగా రూపొంది, విశ్వక్షేమాన్ని ప్రసాదిస్తోంది.