maga

సంవత్సరానికి పన్నెండు మాసాలు. ఆరు ఋతువులు. ఒక్కొక్క ఋతువుకు రెండు మాసాలుగా సంవత్సరకాలం కొనసాగుతుంది. సంవత్సరంలో వచ్చే రెండు మాసాలు శ్రావణ-భాద్రపదాలు. ఇవి వర్ష ఋతువులో సంభవిస్తాయి. శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగింది శ్రావణమాసం. ఈ మాసానికి శ్రావణం, శ్రావణికం, నభం అని మూడు పేర్లు. శ్రావణ, శ్రావణిక పదాలు శ్రవణానక్షత్రయుక్త పూర్ణిమగలవి అనే అర్థాన్ని చెబుతున్నాయి. ఆకాశం మేఘాలతో కప్పబడి ఉన్నందువల్ల సూర్యకాంతి అంతగా ప్రకాశించని మాసం కనుక ‘నభం’ అనే పేరు సార్థకం.

ఇక భాద్రపదమాసానికి ప్రోష్ఠపదం అనీ, భాద్రం అనీ, భాద్రపదం అనీ, నభస్యం అనీ నాలుగుపేర్లున్నాయి. ప్రోష్ఠపదా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగిన మాసం కనుక ప్రోష్ఠపదం అనిపేరు. భాద్రం, భాద్రపదం అనే పదాలు భాద్రపద నక్షత్రాన్ని సూచిస్తాయి. ఆకాశంలో మేఘాలు సుసంపన్నమై ఉన్నందువల్ల నభస్యం అనే పేరు ఈ మాసానికి వచ్చింది. ఇలా శ్రావణ, భాద్రపదమాసాలు రెండూ వర్షర్తువుకు ఆలంబనాలై ప్రపంచానికి జలదానం చేస్తున్నాయి. కేవలం వర్షాలు పుష్కలంగా కురవడం ఒక్కటే కాకుండా ఈ మాసాలు ప్రాకృతికంగా ఎన్నో శోభలను అందించేవిగానూ, ఆధ్యాత్మికంగానూ ఉండడం గమనార్హం. అందుకే ఈ రెండు మాసాలు ఆయురారోగ్యం భాగ్యాలను కోరేవారికి కల్పవృక్షాలవలె కనబడుతున్నాయి.

శ్రావణ, భాద్రపదమాసాలలో వ్రతాలూ, ఉపవాసాలూ, నియమనిష్ఠలూ మెండుగా కనబడుతాయి. ‘వ్రతం’ అనే పదానికి నియమం అని అర్థం. మనిషి నియమపూర్వకంగా జీవితాన్ని గడిపితే నూరేళ్లు ఆనందోత్సాహాలతో గడుస్తుందని సకలశాస్త్రాలూ ఘోషిస్తున్నాయి. నియమాలకు నిలయాలుగా ఉన్న వ్రతాలను ఆచరించడంవల్ల ఇహలోకంలో శాంతి సౌఖ్యాలు కలగడమేగాక, మరణానంతరం ఉత్తమ లోకాలు లభిస్తాయని ప్రాచీనగ్రంథాలు చెబుతున్నాయి. వ్రతాలను ఆచరించే సమయంలో చేసే ఉపవాసాలు శరీరానికి మేలును కలిగిస్తాయి. వర్ష రుతువులో సూర్యకాంతి స్వల్పమై, జఠరాగ్ని మందగిస్తుంది. ఆ సమయంలో ఎక్కువగా తినడంవల్ల, తిన్న ఆహారం జీర్ణంగాక అనారోగ్యాలు కలుగుతాయి. ఇలాంటి బాధలనుండి విముక్తం కావాలంటే వ్రతాలు చేయడం, ఉపవాసాలు చేయడం ఆవశ్యకం.

శ్రావణమాసం శివుని అభిషేకార్చనలకు సరైన కాలం. శివునికి అభిషేకం అంటే ఎంతో ప్రీతి. అభిషేకం చేయాలంటే చాలా నీళ్లు కావాలి. వర్షర్తువులో నీటికి కొరత ఉండదు కనుక నిర్మల వర్షజలాలతో రుద్రాభిషేకాలు చేయడం పరిపాటి. శ్రావణమాసంలోని ప్రతి సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. సోముడంటే ఉమతోకూడినవాడు అని అర్థం. అంతేగాక శివుడు ధరించిన చంద్రుడు అని కూడా అర్థం. ఇలా శివునికీ, శివుడు తలదాల్చిన చంద్రునికీ సంబంధించిన ఈ మాసంలో అన్ని శివాలయాలలోనూ నమకచమకాలతో రుద్రాభిషేకాలు చేస్తూ భక్తులు తరిస్తారు.

శ్రావణమాసం సౌభాగ్యవతులైన స్త్రీలకు ఆరాధ్యం. శ్రావణమాసంలో మంగళ గౌరీవ్రతాలూ, వరలక్ష్మీవ్రతాలు స్త్రీల సౌభాగ్యానికీ, కుటుంబ యోగక్షేమాలకూ దోహదం చేస్తాయి. స్త్రీల సౌమాంగల్యాన్ని రక్షించే దేవత గౌరి. ఆమెకు సర్వమంగళ అని పేరు. అంటే ఆమెను కొలిస్తే అన్నీ మంగళాలే కలుగుతాయి. వరలక్ష్మీవ్రతం సకల సంపదలనూ ప్రసాదిస్తుంది. మానవజీవనం సుఖవంతం కావాలంటే సంపదలు కావాలి. వాటిని ప్రసాదించే తల్లి వరలక్ష్మి. పేరులోనే వరాలను దాచుకొన్న అమ్మను పూజించడంవల్ల సకలశుభాలూ కలుగుతాయి. ఈ నెలలో సంభవించే రక్షాబంధన పూర్ణిమకు ‘రాఖీపూర్ణిమ’ అని పేరు. దీనినే జంధ్యాలపున్నమి అని కూడా వ్యవహరిస్తారు. శ్రావణపూర్ణిమనాడు అక్కాతమ్ములూ, అన్నాచెల్లెళ్లూ తమతమ రక్షణలను కోరుతూ రక్షాకంకణాలను చేతికి ధరించడం సంప్రదాయం. ఈ పర్వదినం స్త్రీజాతి సంరక్షణకై ప్రతిజ్ఞాకంకణాలను ధరించే పుణ్యదినంగా ప్రసిద్ధిపొందింది. ఈ మాసంలోనే వచ్చే మరొక పర్వదినం కృష్ణాష్టమి. సంపూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు శ్రావణమాసంలోని కృష్ణపక్షంలో అష్టమినాడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడు భువిపై ఆవిర్భవించి అధర్మవర్తనులైన దుష్టులను సంహరించి, లోకాన్ని కాపాడి, ధర్మాన్ని నిలిపిన దేవదేవుడు. అతని జయంతి లోకానికే పూజనీయం.

భాద్రపదమాసంలో వచ్చే ప్రధానమైన పండుగ వినాయకచతుర్థి. సకల విఘ్నాలను దూరంచేసి, అనేక వరాలను ప్రసాదించే వినాయకుని లోకమంతా ఆరాధిస్తుంది. భాద్రపదమాసంలో వర్షాలవల్ల ప్రకృతి పచ్చని పందిరిలా విస్తరించుకొని ఉంటుంది. వినాయకుడు పార్వతీపరమే శ్వరుల జ్యేష్ఠపుత్రుడు. ఆది దంపతులకు అల్లారుముద్దుబిడ్డ. కనుకనే లోకంలో అందరూ నవరాత్రోత్సవాలు జరుపుతూ తొమ్మిదిరోజులూ వీధివీధిలో, ప్రతి యింటిలో మట్టి విగ్రహాలను నెలకొల్పి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వినాయకుడు ప్రకృతిని ఇష్టపడే దేవత కనుక స్వామికి ఎన్నో ఔషధీగుణాలుగల ఏకవింశతి (21) పత్రాలతో అర్చనలు చేస్తారు. ఈ పత్రపూజలు వినాయకునికి ప్రీతిని కలిగిస్తాయి. తొమ్మిదిరోజులూ విగ్రహాలకు పూజలూ, సేవలూ చేసి, చివరినాడు వినాయక విగ్రహాలను జలాలలో నిమజ్జనం చేయడం సంప్రదాయం. ఈ పండుగ మానవులలో స్నేహసౌభ్రాతృత్వ భావాలను పెంపొందించడానికీ, మాన వులంతా ఒక్కటే అనే సత్యాన్ని ప్రపంచానికి చాటడానికీ ఉపయోగపడుతోంది. ప్రజలలో సమైక్యతాభావాన్ని పెంపొందింపజేస్తోంది.

ఈ మాసంలోనే ఆచరించే అనంతపద్మనాభ వ్రతం ఎంతో విశిష్టమైంది. మానవుడు సంసారి కనుక ఎన్నో కష్టనష్టాలకూ బాధలకూ లోనవుతూ ఉంటాడు. మానవుని కష్టాలు అనంతమైనవి. అవి కడలి కెరటాలవలె అనుక్షణం పుడుతూనే ఉంటాయి. కనుక వాటికి నివారణోపాయంగా అనంతవ్రతాన్ని ఆచరించడం పరిపాటి. ఈ మాసంలోనే సంభవించే హరితాళికావ్రతం కుటుంబ జీవులైన మానవులకు శ్రేయోదాయకమైన పండుగ.

ఇలా శ్రావణ, భాద్రపదాలు మానవాళికి సకల శ్రేయస్సులనూ అందించేవిగా పురాణాలలో ప్రసిద్ధిని పొందాయి. కనుక మానవులు సంస్కృతికి ప్రతీకమైన ఈ మాసాలలో ఆయా ఇష్ట దేవతలను పూజించి, జీవితాలను సార్థకం చేసుకోవాలి.

 

డా|| అయాచితం నటేశ్వరశర్మ

Other Updates