ఒక క్రీడాకారుడు క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించి, 90 పరుగులు చేశాడు, అతని కోచ్ అతన్ని అభినందించాడు. క్రికెటర్ కూడా చాలా ఉప్పొంగిపోయాడు. కానీ ఎక్కడ పొరపాట్లు చేశాడో.. తెలుసుకోవాలి కదా! ఇప్పుడు కోచ్ ఏం చెయ్యాలి. 1. పొరపాట్లు చెప్పి.. మళ్లీ ఆట ఎలా ఆడాలో చెప్పాలా? 2. ఇప్పుడు అభినందించి తర్వాత… తప్పులు చెప్పాలా? 3. కలిసి చర్చించి.. తప్పులు ఎక్కడ జరిగాయో.. గుర్తించేట్లు చెయ్యాలా 4. బాగానే ఆడాడని తనే నేర్చుకుంటాడు అని ఏమి చర్చించకుండా వదిలిపెట్టాలా… ఇంకా మంచి ప్రదర్శన కోసం.. ఎదురు చూడాలా! ఏం చెయ్యాలి…
నిజానికి చేసిన పరుగులను గుర్తించి, అప్పుడు అభినందించి.. తర్వాత దానిలో ఉన్న లోపాలను చర్చలో గుర్తించేట్లు చేసి, ఆ లోపాలను సవరించుకునే నైపుణ్యాలను ఆ’కోచ్’ నేర్పిస్తే అప్పుడు ఆ క్రికెటర్ గొప్ప ఆటగాడుగా పరిణామం చెందుతాడు.. ఆటగాడికి కావలసిన పరిపక్వత వస్తుంది.. అలా కాకుండా ఆట అయిపోగానే… ప్చ్! ఇంకా బాగా ఆడాల్సింది.. నువ్వు ఎందుకు తొందరపడ్డావు.. నీమీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు చేశావ్!… ఆ’బాల్’ను ఎందుకు అలా ముందుకు వచ్చి ఆడావ్!.. అని అప్పుడే విమర్శ మొదలుపెడితే.. క్రీడాకారుడు తీవ్రమైన నిరాశలోకి జారిపోతాడు…
జీవితంలో చాలామంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలుసుకోలేరు. దాంతో జీవితంలో జరుగుతున్న మంచిని, జరిగిన గొప్పతనాన్ని గుర్తించలేక… నిరాశ పడిపోతారు.
‘సక్సెస్ స్ట్రాటజీ’ని ప్రభావితం చేసే అంశాలను అలవాటు చేసుకుంటె… మార్గదర్శనం చేసేవారి, మార్గదర్శనంలో నడిచేవారికి… ఇద్దరికి లాభిస్తుంది.
అపజయం అనేది లేదు.. అది ‘ఫీడ్‌బ్యాక్’ మాత్రమే. ఒక పని చేస్తాం, అనుకున్న ఫలితం కాకుండా, వేరే ఫలితం వస్తుంది.. దానికి మనం ఇచ్చే అర్థం, ఫెయిల్ అయ్యామని. నిజానికి అది ఒక ‘ఫీడ్‌బ్యాక్’ను ఇస్తుంది. నువ్వు పాటించిన మార్గం.. ఈ ఫలితం ఇచ్చింది.. అనుకున్న ఫలితం రావాలంటె, ఇంకా శ్రమించాలనే అర్థం అందులో వుంది. విజేతలందరూ ఈ రకమైన ఆలోచననే కలిగి వుంటారు. అందుకే వాళ్ళు విజయాలు సాధిస్తారు. ఇప్పుడు విజయులుగా గుర్తించబడుతున్న ప్రతీ విజేత.. ఒకప్పుడు.. అనుకున్న ఫలితం రాక చాలా శ్రమించిన వాళ్లే… అపజయం అనేది లేదు.. జస్ట్.. ఫలితం మాత్రమే..
1 అసూయను విడిచిపెట్టండి
పోటీ పరీక్షలకోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి, నా దగ్గరకు వచ్చాడు.. తను వ్రాసిన పరీక్షల్లో తను అనుకున్నన్ని మార్కులు రాలేదని.. మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలో తెలియదని, తన స్నేహితుడిగురించి ఎన్నోసార్లు కంప్లెయిన్డ్ టోన్‌లో చెప్పాడు. దానికి నేను ప్రతి నిమిషం అతనితో పోల్చుకోకు అది నీలో ‘అసూయ’ను రగిలిస్తుంది… కాబట్టి.. నీ మిత్రుడు చేసిన పనిని, చదివే పద్ధతిని వీలయితే గమనించి, నీవు చదివే పద్ధతిలో మార్పులు తెచ్చుకుంటె బావుంటుందని అది నీకు ఒక ‘ఇనిస్పిరేషన్‌లా పని చేస్తుందని చెప్పాను’.. చాలామంది విద్యార్థులు తెలియకుండానే ఒకరి విజయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతారు. తమలో ఏం తప్పులు ఉన్నాయో తెలుసుకోకపోవడం.. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించకపోవడంవల్ల.. అనుకున్న ఫలితం రాదు.. కాబట్టి పోల్చుకోవడం మానివేసి… కష్టిస్తే మీ మిత్రునిలాగా మీరు కూడా విజయం సాధిస్తారని నమ్మండి.
2 మీరు ఆనందించే మంచి లక్షణాన్ని మీలో గుర్తించండి
మిమ్మల్ని మీరు గమనించుకోండి, చిన్నప్పటినుండి, మీరు ప్రవర్తిస్తున్న తీరు, వచ్చిన అభినందనలను పరిశీలించండి.. అవి మీ బలాలుగా అంగీకరించండి. అవి మీ ప్రోగ్రెస్‌కు ఏ రకంగా ఉపయోగపడతాయో పరీక్షించి.. వాటిని వాడండి.. పరిశీలించండి.. మెరుగు పరుచుకోవాల్సిన అంశాలను గుర్తించి, వాటికోసం ప్రయత్నించండి… అప్పుడు మీకు తెలియకుండానే మీరు చాలా ప్రభావవంతంగా మారిపోతారు.
3 శ్రమించడానికి సిద్ధంకండి
ప్రపంచంలో ఏ విజేత అయిన శ్రమ ద్వారానే అనుకున్న ఫలితాలను సాధించగలరనేది అందరికీ తెలిసిన సత్యం. శ్రమించాలనే పట్టుదల చేసే పని పట్ల ‘ప్రేమ’ వుంటె, ఆ పని తనకు ఎంతో అభివృద్ధిని, సంతోషాన్ని కలిగిస్తుందని నమ్మితేనే.. ఆ ప్రేమ జనిస్తుంది. అది గొప్ప ఉత్తేజాన్ని ఇస్తుంది.. అప్పుడు తమకు తాము సిద్ధం అవుతారు. అలాంటి నమ్మకాన్ని పెంపొందించుకోవాలి.. ఆ ఆలోచనే మీకు కావాల్సినంత ఉత్తేజాన్ని అందిస్తుంది. అప్పుడు శ్రమనే మీ జీవిత విధానమవుతుంది. అప్పుడు ప్రతీది మీకు విజయాన్ని తెచ్చి పెడుతుంది. కాబట్టి శ్రమించడానికి సిద్ధం కండి.
4 శ్రమ ద్వారానే లక్ష్యాన్ని సాధిస్తామని నమ్మండి
ప్రణాళికను వేసుకోండి.
దాని ప్రకారం శ్రమించండి
శ్రమ ద్వారానే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని నమ్మండి
శ్రమ ఎప్పుడు ఫలితాలను ఇస్తుందని నమ్మండి
శ్రమవల్ల మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకుంటున్నారని నమ్మండి
శ్రమవల్లనే మీకు మీ చుట్టు ప్రక్కలవాళ్లు
గౌరవం ఇస్తారని గమనించండి
5 కొత్త పద్ధతులను నేర్చుకోండి
చదివే విధానంలో లోపాలను గుర్తించండి. ఎలా చదివితే చాలా రోజులు గుర్తుంటుందో, ఆ పద్ధతులు ఉంటే నేర్చుకోండి. నిపుణులను కలవండి, సలహాలు తీసుకోండి.. ఒక్క సలహా చిన్నదే కావొచ్చు కానీ అది గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఎంతోమంది ఆటగాళ్ళలో ఇలాంటి చిన్నపాటి సలహాలవల్ల, ఎంతో గొప్పగా ఆటమారిపోయింది.. హైదరాబాదుకు చెందిన అజహరుద్దీన్.. బ్యాట్ పట్టుకునే విధానంలో చిన్న మార్పును చేయమని ఎం.ఎల్. జయసింహ సలహా ఇచ్చాడు. ఆ మార్పు చేశాడు. అజహరుద్దీన్ అప్పటినుండి.. ‘అజహర్’ ఎన్నో సెంచరీలు చేశాడు.. నిపుణులనుండి సలహాలు ఎప్పుడూ ఉపయోగకరంగా ఉంటాయి. ‘విజయానికి దారిది’ పుస్తకం చదవండి.. విజయానికి కావలసిన విలువైన సూచనలు తెలుసుకోవచ్చు.
పై వాటిని పాటించి.. విజయాలను కైవసం చేసుకోండి.. రాబోయే పోటీ పరీక్షలకోసం శ్రమను ప్రారంభించండి… నూతన సంవత్సర శుభాకాంక్షలు.