సచ్చింది-గొర్రెబిఎస్‌సి స్వామిసార్‌ మాకు లెక్కల్జె ప్పెటోడు. గాయిన నల్లగా  పొడుగ్గ ఉండెటోడు. కండ్లద్దాలు  బెట్టెటోడు. గాయిన అందరి తీర్గ పాఠాలు జెప్పెటోడు గాదు. ఆడుకుంట పాడుకుంట పాటాలు  జెప్పెటోడు. ఫార్ములాను పాటలెక్క బాడెటోడు. పాడుకుంట ఆడెటోడు. గాయిన పూర్తి పేరేందో మాకెర్కలేదు. మేము గూడ గాయినను అడ్గలేదు. గాయిన జెప్పేటి లెక్కలతోని గని, గాయిన పేరుతోని మాకేం పని. గాయిన మా అందరితోని దోస్తు లెక్క ఉండెటోడు. సిన్మ గురించి ముచ్చట బెట్టెటోడు. ఒకపారి గాయిన ఆనంద్‌ సిన్మజూసి వొచ్చిగా దాని గురించి జెప్పిండు. గాయిన జెప్పబట్కెనే నేను, శ్రీమన్నారాయణ గా సిన్మ జూసినం.

స్వామి సార్‌ సొంత ఊరు ఇందూరు. శ్రీమన్నారాయణది గూడ గావూరే. ఇగ దాంతోని గాల్లిద్దరు జిగ్రి దోస్తుల్లెక్క మాట్లాడుకునేటోల్లు. ఇంటికెల్లి వొచ్చిన పైసలు కతమైతె శ్రీమన్నారాయణ, స్వామి సార్‌ తాన అప్పుదీస్కునేటోడు. గదేందో గాని గాడు గిట్ల అడ్గంగనే గట్ల సార్‌ అప్పు ఇచ్చెటోడు. గా నెల మస్తు సిన్మాల్  రిలీజైనయి. కొత్త సిన్మను ఇడ్వకుంట సూసెబట్కె శ్రీమన్నారాయణ తాన పైసల్ కతమైనయి. అప్పు అడ్గి దీస్కుందామంటే స్వామి సార్‌ గాన్కి గండ్లబడలేదు. పనిబడ్తె గాయిన తాతీల్‌ దీస్కున్నడని గాన్కి ఎర్కైంది. గా నెల అందరి తాన గాడు అప్పు దీస్కున్నడు. కొత్తగ అప్పు ఇచ్చెటోడు ఎవడు గానికి గండ్లబడలేదు. ఇగ లాభం లేదనుకొని పైసల కోసం గాడు ఇందూరు బోయిండు.

‘‘ ఏం రా! గిట్లచ్చినవు. కాలేజీకి గిన తాతిల్లు ఇచ్చిండ్రా’’ అని గాల్ల నాయిన అడిగిండు.
‘‘ ఇయ్యలే నాయినా’’ అని శ్రీమన్నారాయణ జెప్పిండు.
‘‘ మల్లెందుకొచ్చినవురా’’ అని గాయిన అడిగిండు.
‘‘ పైస కోసం’’
‘‘ మొన్ననే బంపిన గదరా. గప్పుడే కతమైనయా?’’
‘‘ మా కాలేజీ స్పెషల్‌ ఫీజు గట్టిపిచ్చుకున్నరు’’
‘‘ ఏం ఫీజులో ఏమో. ఒకపారి ఫీజు గట్టాలంటవు. ఇంకోపారి వైలు గొనాలంటవు. గిట్లయితె ఎట్లరా?’’
‘‘ నన్నేం జెయ్యమంటవు నాయినా.. నేనేమన్న ఒకటో తరగతి సద్వుతున్నానా? డిగ్రి సదువంటె కర్సుంటది’’
గులుక్కుంటనే శ్రీమన్నారాయణకు గాయిన పైసలిచ్చిండు. పైసల్ చేత్ల బడంగనే చెంగో బిల్లనుకుంట  పట్నం బోదామని గాడు అనుకున్నడు. గట్ల జేస్తె బాగుండదని గా రాత్రి గాడు ఇందూర్లనే ఉన్నడు. దోస్తుతోని గల్సి సిన్మ జూసిండు.
పొద్దుగా శ్రీమన్నారాయణ నిద్రలేసిండు. పోయొస్త అని ఇంట్ల జెప్పిండు. బస్టాండుకు బోయిండు. పట్నం బోయే బస్సు ఎక్కిండు. గాని ముంగటి సీట్ల గూసున్నోల్లు  ముచ్చటబెట్టబట్టిండ్రు. గాల్ల ముచ్చట ఇనుకుంట గాడు గూసున్నడు.

‘‘ మొన్న స్వామి సార్‌ సచ్చిపోయిండు. నీ కెర్కేనా’’ అని ఒకడన్నడు.
‘‘ నాకెర్కలేదు’’ అని పక్కన గూసున్నోడు అన్నడు.
‘‘ ఏ స్వామి సార్‌’’ అని శ్రీమన్నారాయణ గాల్లను అడిగిండు.
‘‘ లెక్కల్  జెప్పేటి స్వామి సార్‌’’ అని గాల్లలో  ఒకడు జెప్పిండు.
‘‘ గాయిన యాడ పని జేస్తుండు’’ అని శ్రీమన్నారాయణ అడిగితె
‘‘ పట్నంల ఏదో డిగ్రి కాలేజీలో  పనిజేస్తుండట’’ అని గాల్లల్ల ఒకడు జెప్పిండు.

స్వామి సార్‌ సచ్చిపోయిండని ఎర్క గాంగనే శ్రీమన్నారాయణ కండ్లల్ల నీల్లు దిర్గినయి. గుండె మీద బండ బడ్డట్లు అయ్యింది. సార్‌ ఎంత మంచోడు. ఆడుకుంట పాడుకుంట పాటాలు జెప్పెటోడు. అడ్గంగనే అప్పు ఇచ్చెటోడు. గని అప్పు ఎప్పుడు దేర్పతవని అడిగెటోడు గాదు. ఇచ్చినప్పుడే దీస్కునేటోడు. దోస్తు లెక్క ఉండెటోడు. పైసలు అక్ర బడ్తె గిప్పుడెవ్వరిని అప్పు అడ్గాలె. మా వూరోడయ్యె బట్కె నన్ను దగ్గర దీసెటోడు. ఒక్కోసారి ఊరు ముచ్చట్లు జెప్పెటోడు. ఇగ గిప్పుడెవ్వరు జెప్తరు అని శ్రీమన్నారాయణ అనుకోబట్టిండు.

పట్నం బస్సు దిగంగానే గాడు మేముంటున్న తాన్కి రాలేదు. సక్కగ కాలేజికి వొచ్చిండు. స్వామి సార్‌ సచ్చిపోయిండని మాకు జెప్పిండు.

‘‘ప్రిన్సిపాల్‌కు జెప్పురా’’ అని మేమంటే`
‘‘గాయిన తాన్కి బోవాలంటె నాకు బుగులైతది’’ అని గాడు అన్నడు.
‘‘ నీ తోని మేము గూడ గాయిన తాన్కి వొస్తం పా’’ అని మేము అన్నం.
అందరం గల్సి ప్రిన్సిపాల్‌ తాన్కి బోయినం.
మమ్మును జూసి..
‘‘ఎందుకొచ్చిండ్రు’’ అని ప్రిన్సిపాల్‌ అడిగిండు.
‘‘ స్వామి సార్‌ సచ్చిపోయిండు సార్‌’’ అని శ్రీమన్నారాయణ గాయినకు జెప్పిండు.
‘‘ నీ కెట్ల ఎర్క’’ అని ప్రిన్సిపాల్‌ అడిగిండు.
‘‘గాయినది, మాది ఒక్కే ఊరు’’ అని శ్రీమన్నారాయణ జెప్పిండు.

ప్రిన్సిపాల్‌ మీటింగ్‌ బెట్టిండు. గా మీటింగ్ల మాట్లాడినోల్లందరు స్వామిసార్‌ అసువంటి లెక్చరర్‌ దొర్కడని, గాయిన ‘ఆత్మకు శాంతి చేకూరాలె’ అని అన్నారు.

మీటింగ్‌ కతమైనంక రొండు గంటలకు శ్రీమన్నారాయణను మా ప్రిన్సిపాల్‌ బిల్సిండు. గాడు గాయిన తాన్కి బోయిండు. గాడ గాన్కి స్వామిసార్‌ గండ్ల బడ్డడు. గాయినను సూడంగనే సచ్చింది గొర్రె అని గాడు మనసుల అనుకున్నడు.

‘‘ స్వామి సార్‌ సచ్చిపోయిండని అబద్ధం జెప్తవా. నిన్ను గీ కాలేజీ కెల్లి బంపిస్త’’ అని ప్రిన్సిపాల్‌ అన్నడు.
‘‘ గీ పిల్లగాడు అబద్ధం జెప్పలేదు సార్‌. మా వూర్లె నా పేరే ఉన్న లెక్కల సార్‌ ఒకడున్నడు. గాయిన నా లెక్కనే పట్నంల ఒక డిగ్రి కాలేజీ లెక్చరర్‌. మొన్న గాయిన సచ్చిపోయిండు. ఒక్కే పేరయ్యె బట్కే నేనే సచ్చిపోయిన అని గీ పిల్లగాడు అనుకున్నడు’’ అని స్వామిసార్‌ జెప్పిండు.

బచ్‌ గయా అన్కుంట శ్రీమన్నారాయణ మా తాన్కి ఉర్కొచ్చిండు.

Other Updates