musilm-ramzan

– సూరి

రమజాను మాసమా

అవధుల్లేని సత్కార్యాల సమాహారమా!

నీరాకతో మాలో విశ్వాసం పెరిగే

ఉపవాస దీక్షతో మాలో ఉత్తేజం పొంగే!

నీకై వేచిచూసిన చూపులెన్నో

నీ రాకతో ఆనందమొందిన మనసులెన్నో!

పుణ్యాల పర్వతాలు మాకందించగ వచ్చావు

ఆకాశమే హద్దుగా సత్కార్యాలు చేసే స్ఫూర్తినిచ్చావు!

ఫిత్రా దానాలతో మాకు ఔదార్యం నేర్పావు

రోజా నియమాలతో మాలో దైవభీతి పెంచావు!

జకాత్‌ హక్కుతో మా సంపదను పవిత్రం చేశావు

నీ ప్రతి నిమిషం మాకై ఆత్మ ప్రక్షాళన సమయం

వృధా కానివ్వం ఏ నిమిషం

ప్రతి క్షణం దైవ నామస్మరణం!!

కఠోర ఉపవాస దీక్షలు… భక్తిప్రపత్తులతో నమాజులు… శోభాయమానంగా మజీదులు… ధాన, ధర్మాలు… హలీం ఘుమఘుమలు.. మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందులు… కళకళలాడే దుకాణాలు… షాపింగ్‌ సందడి… ఇవి పవిత్ర రంజాన్‌ మాసంలో నెలవంక నుంచి నెలవంక వరకు కనిపించే ప్రత్యేకతలు… పవిత్ర రంజాన్‌ మాసం ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత గలది, ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది పవిత్ర ఖురాన్‌ అవతరించిన మాసం. నమాజ్‌ విధి అయిన మాసం. అరుదైన వరాలు నిండిన మాసం. రెట్టింపు పుణ్యాన్ని అందించే మాసం. పాపాలను తుదముట్టించే మాసం. ముస్లిం క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల రంజాన్‌. నెలవంక అగుపించిన మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ఆరంభమవుతాయి. రంజాన్‌ మాసంలో రోజా పాటించడం నియమంగా నిర్ధేశించబడింది. ముస్లింలు నెల రోజుల పాటు అత్యంత నిష?తో ఉపవాస దీక్ష పాటిస్తారు. తప్పులు చేయకుండా, అబదా?లు అడకుండా, ఇతరులను నిందించకుండా, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో ఉండి ఆసాంతం దైవచింతనతో నెల రోజుల పాటు నియమబద్ధమైన జీవితం గడపడం వల్ల చక్కని క్రమశిక్షణ, క్రమబద్ధమైన జీవన విధానం, ఓర్పు, సానుభూతి, సేవాభావం వంటి సద్గుణాలు అలవడటంతోపాటు జీవితంలో ఎలాంటి కఠిన పరీక్షలనైనా ఎదుర్కొనగలమనే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. రంజాన్‌ మాసంలో తెల్లవారు జామున భోజనం తీసుకునడాన్ని సహర్‌ అంటారు. రోజంతా ఉపవాసం ఉండి తిరిగి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్ష విరమించే సమయంలో తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్‌ అంటారు.

ముస్లింలు సాధారణంగా ప్రతిరోజు ఐదుసార్లు నమాజు చేస్తారు. కాగా రంజాన్‌ మాసంలో వీటికి తోడు ప్రత్యేక నమాజులు ఉంటాయి. ఈ నెలలో తరావీహ్‌ నమాజు ప్రత్యేకమైంది.

రంజాన్‌ మాసం మొత్తం పవిత్రమైనది, కాగా ఈ మాసం చివరి భాగానికి మరో ప్రత్యేకత ఉంది. రంజాన్‌ చివరి దశలో వేయి మాసాల కన్నా విలువైన ఒక మహారాత్రి ఉంది. కాగా పుణ్యప్రదమైన, శుభప్రదమైన ఆ రాత్రి ఫలానా అని ఖచ్చితమైన నిర్ధారణ లేదు. రంజాన్‌ మాసంలోని చివరి పది రోజుల్లో దానిని అన్వేషించమని మహమ్మద్‌ ప్రవక్త ఉపదేశించారట. రంజాన్‌ చివరలో బేసి రాత్రుల్లో అంటే 21, 23, 25, 27, 29లో ఏదో ఒక రాత్రి ప్రత్యేకమైన షబేఖద్ర్‌ కావచ్చు. అందుకని ఆ మహారాత్రి పుణ్యఫలాలను పొందేందుకుగాను ఆ ఐదు రాత్రులు దైవారాధనలో గడుపుతారు. 21 నుంచి 29 వరకు ప్రతిరాత్రి ఆరాధనలు చేసినప్పటికి 27వ రాత్రి షబేఖద్ర్‌ కావడానికి ఎక్కువ అవకాశాలుంటాయని చెప్పి ఆ రాత్రిపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధనలు, సత్కార్యాలు ఇతర వేయి మాసాల్లో చేసే ఆరాధనలు, సత్కార్యాల కన్నా ఎంతో శ్రేష?మైనవి, విలువైనవని భావిస్తారు.

రంజాన్‌ మాసంలో రోజా పాటించడం, ప్రత్యేక నమాజులతోపాటు దాన ధర్మాలు చేయడం మరో విశేషం. ఖురాన్‌ బోధనల ప్రకారం సంపాదనపరులు, సంపన్నులు ఈ నెలలో జకాత్‌ ఆచరించాలి. అంటే ఏడాది చివరలో మిగిలిన తన సంపద నుంచి రెండున్నర శాతం చొప్పున ధన, వస్తు రూపేణా పేదలకు దానం చేయాలి. పేదలు కూడా అందరితో పాటుగా రంజాన్‌ పండగను జరుపుకునేందుకు జకాత్‌ ఏర్పాటు చేయబడిిందని చెబు తారు. జకాత్‌తోపాటు మూడు పూటలా తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని నిరుపేదలు, అభాగ్యులకు ఫిత్రా దానం చేయాలని ఇస్లాం మతం ఉద్బో ధించింది. ఉపవాస దీక్ష విజ యవంతంగా ముగి సినందుకు దేవుడికి కృతజ్ఞతా పూర్వకంగా పేదలకు ఫిత్రా దానంగా యాభై గ్రాములు తక్కువ రెండు కిలోల గోధుమలను గాని లేదా దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గాని లేదా దానికి సమానమైన ధనాన్ని గాని పంపిణీ చేస్తారు. ఫిత్రాదానం వల్ల రోజా పాటించే క్రమంలో తెలియక జరిగిన పొరపాట్లు క్షమించబడి, పుణ్యం కలుగుతుందని ముస్లింల విశ్వాసం.

రంజాన్‌ నెలంతా ఆధ్యాత్మిక భావనలతో, నియమనిష?లు, సత్కార్యాలతో ముగియగా నెలవంక ప్రత్యక్షమయ్యాక ఉపవాస దీక్షలు విరమించి మరుసటి రోజు ఆనందోత్సాహాలతో రంజాన్‌ పర్వదినాన్ని జరుపు కుంటారు. ఆ రోజున ప్రతి ఒక్కరు కొత్త బట్టలు ధరించి ఈద్గాలకు తరలివెళ్లి ప్రత్యేక నమాజులు చేస్తారు. అనంతరం ఒకరి కొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ ముబారక్‌ అంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. రంజాన్‌ పండగ రోజున మిత్రులు, సన్నిహితులైన వారిని ఇళ్లకు ఆహ్వానించి రంజాన్‌ దావత్‌ ఇస్తారు.

గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం రంజాన్‌ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ఏర్పాట్లకోసం నిధులు కేటాయించడంతోపాటు ముస్లిం సోదరులకు ప్రభుత్వ పక్షాన ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేస్తోంది. అలాగే పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తోంది. కాగా ప్రభుత్వం గతేడాది ఒక లక్షా 95 వేల మందికి దుస్తులు పంపిణీ చేయగా, ఈసారి కూడా లక్షలాది మందికి దుస్తులు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

Other Updates