tsmagazineతెలంగాణలో సృజనాత్మక కవిత్వం, కథ, నవల ఇత్యాది ప్రక్రియలలో చాలినంత సాహిత్యం వచ్చిందని అనుకోవచ్చు. కానీ మన సాహిత్యం మనకు మాత్రమే పరిమితం కాకుండా ఖండాంతరాలు ఏమైనా దాటుతుందా అనేది ప్రశ్నార్థకం. కనీసం ప్రసిద్ధి చెందిన ఇతర భాషీయుల సాహిత్యమైౖనా మనతెలుగు వారికి అనుసృజన రూపంలో అందుతుందా అంటే అదీ సందేహమే. కవికి ప్రాంత దృష్టితో పాటు క్రాంతదృష్టి కూడా ఉండాలి. అప్పుడే అనంతమైన లోకంలో మన ఆలోచనలు ఆవగింజంతైన వెదజల్లగలుగుతాము. ఆ కోణంలో రచనలు చేసి ప్రసిద్ధులైన ఠాగూర్‌, కబీర్‌, షేక్స్‌పియర్‌, వేమన వంటి వారెందరో చాలా భాషలలో సహృదయులైన సాహితీకారుల హృదయాల్లో సజీవంగా సవారి చేస్తున్నారు.

కవులు సామాన్యంగా మునిత్వం, ముందుచూపు కలిగి ఉంటారని లక్షణ గ్రంథాలు నిర్వచనాలిచ్చాయి. సరిగ్గా అవే గుణాలు కలిగిన మహా కవులలో కబీర్‌ ఒకరు. అంతగొప్పనైన కబీర్‌ సాహిత్యం తెలుగులో సామాన్యులకు సైతం అర్థం అయ్యేవిధంగా కవి, రచయిత, సాహిత్య పోషకులైనా జలజం సత్యనారాయణగారు అనువదించి అందించారు. ఉద్యమం, ఉద్రేకతల ప్రేరణతో వచ్చిన కవిత్వాన్ని అనువదించడం కొంత కష్టంతో కూడుకున్నదైనప్పటికీ సులభమే. కానీ తాత్త్వికతతో రాసిన కవిత్వాన్ని అందుకుని, అర్థం చేసుకుని అనువదించడం అతి కష్టమైన పని. అయినప్పటికి కబీర్‌ కవిత్వాన్ని అంతే సులభంగ అందించడం అనేది జలజం వారి ప్రతిభకు నిదర్శనం.

జలజంవారు కబీర్‌ సాహిత్యంతో పాటు కబీర్‌ మీద జరిగిన వివిధ పరిశోధన గ్రంథాలను తాత్త్వికంగా పరిశీలించి జననం, జీవనం, మతం, కులం, కవిత్వం వంటి అంశాలను వివరంగా పొందుపరిచారు. కబీర్‌గారి 367 దోహాలను 16 శీర్షికలుగా విభజించి కవితాత్మకంగా అనువదించారు. మచ్చుకు ఒకటి… ”నీటికుండతో ఎక్కడికి పరుగెడుతావ్‌/ ప్రతి ఇంట్లో ఒక కన్నీటి చెరువుంది/ దప్పిగొన్న వారెవరైనా వుంటే/ వారు ఆ నీళ్ళను తప్పక తాగుతారు” (పుట.44) ఇక్కడ అత్యాశ పరుడు చివరకు పొందె పరిణామాన్ని తెలిపిన తీరు అది. ఇదే స్థాయిలో 54 పారవశ్య గీతాలను అనువదించారు. ఆత్మ సంవేదనలను ప్రేయసి పరితాపంగా ”నాలోని అంతర్గ ప్రేమికునితో మాట్లాడుతాను, నేను అడుగుతాను ఎందుకు తొందర పెడుతున్నావని?…” (పుట.261) గురువు అందించే హితోక్తులుగా ”నీవు స్పృహలో ఉన్నపుడే ఆలోచించు…”, శిష్యుని కలవరింతగా ”నాలోపల దైవిక శక్తి నా మాటలు వింటున్నాడు….” ఇలాగే పుష్పాల పులకరింతగా, పిచ్చివాడి ప్రయాణంగా, వేణువు నాదంలా, మేఘాల గర్జనల వంటి అరుపులను, ఆర్తిని, విరహాన్ని, ఆనందాన్ని, పారవశ్యాన్ని వివరించిన తీరు అనిర్వచనీయం. ఇంత సుందరంగా తెనిగించాడంటే కబీరు సాహిత్యాన్ని ఇంగ్లీషు, హిందీలో కూడా అధ్యయనం చేయడం వల్లనే సాధ్యం అయిందనిపిస్తుంది. జలజం వారు అధ్యయనం చేసిన ఇంగ్లీష్‌ గ్రంథాల రచయితలను పరిశోధకులను కూడా ఈ గ్రంథంలో ఛాయా చిత్రంతో పాటు పేర్కొనడం గొప్ప సహృదయకు తార్కాణం. ఈ గ్రంథంలో సామిడి జగన్‌రెడ్డి రాసిన సుదీర్ఘ వ్యాసం కబీర్‌ ప్రభావం తెలంగాణలో ఉన్న తీరును సమూలంగా అందించింది.

పుస్తకం : కబీర్‌ గీత
అనుసృజన జలజం సత్యనారాయణ
పుటలు:350
వెల :250
ప్రతులకు : ధ్వని పబ్లికేషన్స్‌,
ఇం.నెం.7-5-297, లక్ష్మినగర్‌ కాలనీ,
మహబూబ్‌నగర్‌ – 509 002
– అట్టెం దత్తయ్య

Other Updates