తెలంగాణా రాష్ట్రం ఏర్పడడమే ఓ రికార్డు. అయితే
నవ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారి నిర్వహించిన బడ్జెట్ సమావేశాలు మరిన్ని రికార్డులను సృష్టించాయి. ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచాయి. అత్యధిక పనిగంటలు, ఎక్కువ మంది సభ్యులు మాట్లాడడమే కాకుండా సమావేశాల ప్రారంభంలోనే లక్ష కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టి భారతదేశంలోని ఏ ప్రభుత్వమూ చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసింది.
అంతేకాకుండా తీర్మాణాలకు, ప్రభుత్వ బిల్లులు, సభాసంఘాల ఏర్పాటుకు, ద్రవ్యవినిమయ బిల్లుకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి కొత్త ఒరవడిని సృష్టించింది. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసినా చివరకు కొత్త రాష్ట్ర అభివృద్దికి, బంగారు తెలంగాణ సాధనకు తాము సైతం సహకరిస్తామని పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చారు నాయకులు. మొదట అనుకున్నదానికంటే మరో వారం రోజులు సభను పొడిగించిన ప్రభుత్వం తాను అనుకున్నది సాధించింది. వాకౌట్‌లు, సభ్యుల సభా బహిష్కరణలు జరిగినా మొత్తానికి సభా సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి.
నవంబర్ 5న ప్రారంభమైన శాసన సభ సమావేశాలు నవంబర్ 30వ తేదీన ముగిశాయి. మొత్తం 19 రోజుల పాటు జరిగాయి. శాసన సభలో ఒక్క నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలుపుకొని మొత్తం 120 మంది సభ్యులుండగా, గతంలో ఎన్నడూలేని విధంగా 113 మంది సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం దక్కింది. తెలంగాణా రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాల్లోనే ఇంతమందికి మాట్లాడే అవకాశం లభించడం ఒక రికార్డుగా నిలిచింది. 19 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఒక్క నిమిషం కూడా సభా సమయం వృదాకాకపోవడం మరో రికార్డుగా నిలిచింది.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభలో ఆసరా పథకం, విద్యుత్ స్థితిగతులు ` రైతు సమస్యలు అనే రెండు అంశాలపై లఘు చర్చలు జరిగాయి.
ఏపి నుంచి తెలంగాణకు న్యాయంగా రావల్సిన విద్యుత్ వాటాను అందించాలని, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్న రాష్ట్ర క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ, శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరును యథాతథంగా కొనసాగించాలని కోరుతూ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని రాష్ట్రం మొత్తానికి విస్తరించి, వ్యవసాయానికి అనుసంధానించాలని. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సిపీఏ)లో కొత్త రాష్ట్రం తెలంగాణకు సభ్యత్వం కల్పించాలని, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలనే ఆరు తీర్మాణాలను ఆమోదించింది.. కాంటీజెన్సీ ఫండ్, నూతన పారిశ్రామిక విధానం, ద్రవ్య వినిమయం మూడు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభలో ఆసరా పథకం, జూబ్లీహిల్స్ కాల్పుల ఘటనలపైన ప్రభుత్వం ప్రకటనలు చేసింది. అసైన్డ్‌ల్యాండ్, వక్ఫ్ భూములు, హౌసింగ్ సొసైటీలపై మూడు సభా సంఘాలను నియమించింది. సభ్యులు వేసిన 173 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
సభా నియమాలను పాటిస్తూ ప్రతిపక్ష సభ్యులు కోరిన అనేక అంశాలను చర్చించేందుకు అంగీకరించింది శాసన సభ. కీలకమైన నిర్ణయాలలో అన్ని పక్షాలతో చర్చలు జరిపి అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి అన్ని పక్షాలు సహకరించేలా వ్యవహరించింది. కాల్ అటెన్షన్, 344 నిబంధనల కింద గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమైన ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు కోరిన చర్చలకు అవకాశమిచ్చారు. 344 నిబంధన కింద శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి) ప్రాజెక్ట్‌పై ప్రత్యేక చర్చను చేపట్టింది. గత ప్రభుత్వ విధానాల వల్లే పనులు నత్తనడకన సాగుతున్నా యని సిఎం కె.చంద్రశేఖర రావు వివరించారు. దీనికి గల అడ్డంకులను తొలగించడానికి అన్ని పక్షాలతో సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో చేస్తున్న తిరకాసును సభలో
ర్చించి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మాణం చేశారు. బీజెపి సభ్యుల కోరిక మేరకు నిరుద్యోగ సమస్యపై చర్చించి లక్ష ఉద్యోగాలపై సిఎం కెసిఆర్ ప్రకటన చేశారు. కాలింగ్ అటెన్షన్ కింద అసైన్డ్ భూముల ఆక్రమణలు, జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై వాడిగా చర్చ జరిగినా వీటన్నింటిపై అన్ని పార్టీలు సభా సంఘాన్ని స్వాగతించాయి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పారిశ్రామిక విధానానికి అన్ని పక్షాల నుంచి ప్రశంసలు లభించాయి. సీనియర్ మాజీ మంత్రి గీతారెడ్డి చేసిన సూచనలను ముఖ్యమంత్రి కెసిఆర్ స్వీకరించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రువల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ (టిఎస్`ఐపాస్)కు, ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
శాసన సభా సమావేశాల్లో ముఖ్యమంత్రి చాకచక్యంగా వ్యవహరించి అన్ని పక్షాలను కూడగట్టడంలో విజయం సాధించారు. ప్రతి విషయాన్ని సభకు, సభ్యులకు వివరంగా చెబుతూ వారి ప్రశ్నలకు సమాధానాలిస్తూ సభ్యులను కట్టిపడేశారు. వార్షిక బడ్జెట్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. బడ్జెట్ రాబడులు, ఖర్చులు, కేంద్ర గ్రాంట్లు, ఆర్‌బిఐ ఆర్ధిక పరిమితులపై అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడంతో సీనియర్ సభ్యులు సైతం అభినందించారు. బడ్జెట్‌పై ముఖ్యమంత్రి ప్రసంగించే సమయంలో సభలో శ్రద్దగా వినడంతో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. తెలంగాణా అభివృద్ధితో ముడిపెట్టి కెసిఆర్ బడ్జెట్ ప్రసంగం చేశారు.
సభలో గందరగోళం, గొడవలు జరిగినప్పుడు శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు సభ్యులకు సమాధా నాలిస్తూ, వారిని సమన్వయపరిచి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. మంత్రి కెటిఆర్ ఆసరా, సంక్షేమ పథకాలమీద వచ్చిన విమర్శలను హుందాగా తిప్పికొట్టారు. మొత్తానికి ప్రభుత్వం శాసన సభా సమావేశాలను విజయవంతంగా ముగించి కొత్త తరహా పంథాకు శ్రీకారం చుట్టింది. సభను సజావుగా నిర్వహించడంలో స్పీకర్ మధుసూధనాచారి ఎంతో చాకచక్యంతో వ్యవహరించారు.
హుందాగా పెద్దల సభ
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి (కౌన్సిల్) సమావేశాలు హుందాగా జరిగాయి. నవంబర్ 5న ప్రారంభమైన సమావేశాలు 28న నిరవధిక వాయిదాతో ముగిసాయి. ప్రతిపక్షాల నుంచి చిన్న చిన్న నిరసనలు ఎదురైనా మొత్తంగా సభ సజావుగా సాగింది. సభ తొలిరోజు ఉప ముఖ్యమంత్రి కె. రాజయ్య రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సభకు సమర్పించారు. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ సభను నడిపించడంలో ఎంతో చాకచక్యాన్ని ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులకు కూడా అవకాశాలు ఇస్తూనే, వారు సభ చక్కగా నడవడానికి సహకరించేలా చేయగలిగారు. ప్రతి అంశంపై కూడా చర్చను అర్థవంతంగా చేపట్టగలిగారు. మంత్రులంతా కూడా కౌన్సిల్ సభలకు హాజరుకావడం, చివరిరోజు 28న సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది.
ఒకటి, రెండు సందర్భాలలో ప్రతిపక్షాలు వాకౌట్ చేసినా త్వరగా తిరిగి సభకు చేరుకున్నారు. ముఖ్యంగా పెన్షన్లు, దళితులóకు భూపంపిణీ, భూ ఆక్రమణలు, బడ్జెట్‌లో వివిధ పద్దుల కింద కెటాయించిన నిధులు, వాటి సాధ్యాసాధ్యాలపై చర్చ సుదీర్ఘంగా కొనసాగింది. రాబడి, ఖర్చులు, కెటాయించిన నిధులు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడంలో వచ్చే అడ్డంకులు, ఉద్యోగుల ఖాళీలు తదితర విషయాలపై చర్చించారు. బడ్జెట్‌లో అంకెల గారడీ అగుపిస్తున్నదని, చెప్పిన పథకాలేవీ కార్యరూపం దాల్చే విధంగా లేదని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ డి.శ్రీనివాస్ ఆరోపించగా, బడ్జెట్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని కార్యరూపంలోకి తెచ్చి చూపుతామని గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే సభా సమయాన్ని వృధా చేయకుండా, ప్రభుత్వ ధనం నిరుపయోగం కాకుండా సభ పెద్దల సభ గౌరవాన్ని ఇనుమడిరపచేసే విధంగా సాగిందని చెప్పవచ్చు. సభను నడిపించడంలో చైర్మన్ కృతకృత్యుడైనాడనడంలో సందేహం లేదు.