తనలో చెలరేగే భావతీవ్రతను అనేక ప్రక్రియల ద్వారా ప్రతిభావంతంగా వ్యక్త పరిచే సృజనాత్మక శీలి డి.ఎల్.ఎన్. రెడ్డి. ఇటీవలి కాలంలో ఇంత వైవిధ్యంగా, వైశిష్ట్యంగా తెలుగువారి చిత్రకళా లోకంలో కృషి చేసిన కళాకారుడు బహుశా లేరు. ఈయన ఎంత విశేషమైన చిత్రకారుడో, అంత విశిష్టమైన శిల్పి.
చాలా కాలం వీరు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలోని సరోజినీదేవి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చిత్రకళా విభాగంలో అధ్యాపకులుగా పనిచేసి ఎందరో విద్యార్థులను సృజనశీలురుగా తయారు చేశారు. తనలాగా విద్యార్థులు సైతం వైవిధ్యమైన పలు మాధ్యమాల ద్వారా కృషి చేయడానికి ఎంతగానో దోహదం చేశారు. ఇవాళ చాలా మంది యువ చిత్రకారులకు ఆయన ఒక నమూనాగా నిలిచారు.
”మీరు డిప్లొమా చేసింది పేయింటింగ్‌లో. ఆ తర్వాత బరోడాలో చదివింది గ్రాఫిక్ ఆర్ట్ కదా? ఈ మాధ్యమాలలోనే కళాప్రదర్శన చేయకుండా ఇతర అనేక ప్రక్రియలలోకి ఎలా అడుగుపెట్టగలుగుతున్నారు?” అని ప్రశ్నిస్తే – కళాకారుడన్న వాడికి ఏకరీతి పనికి రాదు. ఏక స్వనము వల్ల విసుగు పుడుతుంది. పైగా ఈ అభేది చిత్రాలను గీయాలన్నా, వాటికి రంగులు పూయాలన్నా సృజనాత్మకత ఎంత మాత్రం అవసరం లేదు. ప్రతి గీతలో కొత్తదనం, చాకచక్యం చూపేవాడే నిజమైన చిత్రకారుడు. చిత్రకారులకు మార్గదర్శకుడైన పికాసో గీయని బొమ్మంటూ, వేయని భంగిమంటూ, ముట్టని ప్రక్రియంటూ ఏమీ లేదుకదా! అంటారు. ఈ అంశంలో ఆయనను అనుసరిస్తున్నట్లే అనిపిస్తారు డిఎల్‌ఎన్.రెడ్డి.
ఈ నేపథ్యంలో ప్రతి చిత్రకారుడు, శిల్పి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలంటే ఎప్పటికప్పుడు నిత్యనూతనత్వం తొణికిసలాడే వివిధ ప్రక్రియలను ఆశ్రయించక తప్పదని డిఎల్‌ఎన్ రెడ్డి అభిప్రాయం.
తన డ్రాయింగ్‌లలో, వర్ణ చిత్రాలలో చోటు చేసుకునే ప్రజానీకమ్ తన శిల్పాలలోను, ఆ మాటకొస్తే ఇతర ప్రక్రియలన్నింటిలో సైతం జీవించి తీరుతారని ఆయన అంటారు. నిజానికి అనేక అవకాశాలకోసం నిరీక్షించే జన సామాన్యమే వీరి చిత్రాలలోని వస్తువు. ఈ జన సామాన్యం కట్టూ – బొట్టూ – అంతా సమకాలీన సమాజానికి ప్రతిబింబం మాత్రమే.
సృజనాత్మక కళాకారుడు అంటే చిత్రకారుడు, లేదా శిల్పి – తన భారతీయతను వ్యక్తం చేయగల ప్రక్రియను ఎన్నుకుని సాధన చేస్తాడు, సాధిస్తాడు తప్ప, సమాజంలో ఎలాంటివి అమ్ముడు పోతున్నాయి అన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకో కూడదని ఆయన భావిస్తాడు. అలాగే ఆయన ముందుకు సాగుతున్నాడు. ఒకవేళ అట్లా రూపుదిద్దుకున్న కళా ఖండాలను సైతం కొనుగోలు చేయడానికి ఎవరైనా మనసుపడితే, ఎంతో సంతోషం అంటారాయన. చిత్రకళా ఖండాలు జన సామాన్యం కొనుగోలు చేయడానికి అందుబాటులో మూల్యం
ఉండాలనుకోవడం ఎంత మాత్రం భావ్యం కాదంటారు. చిత్రాలు, శిల్పాల ధర ఎంత పెరిగితే అంత మంచిదని రెడ్డి భావిస్తారు. ఇవ్వాళ్ళ ఎం.ఎఫ్.హుస్సేన్ చిత్రం కొనుగోలు చేయాలంటే రేటు లక్షల్లో ఉన్నదంటే అంత పెద్ద కాలం ఆయన చిత్రకళా రంగంలో అవిశ్రాంతంగా చేసిన కృషికి చెల్లిస్తున్న పారితోషికంగానే మనం భావించాలి. అట్లాగే బ్రిటిష్ చిత్రకళా రంగంలో సృజనాత్మక చిత్రకారులైన ఇటీవలి డేవిడ్ హకరీ, ప్రిన్సెస్ బేకర్‌ల ఒక్కొక్క చిత్రానికి ఏభై లక్షల రూపాయలకు పైగా పలుకుతున్నాయంటే చిత్రకళా రంగానికి వారు చేసిన సేవను, చిత్రకళ పట్ల ప్రజలలో పెరిగిన ఆభిరుచిని, వ్యామోహాన్ని, వారి కొనుగోలు శక్తిని పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందంటారు. వాస్తవానికి ఏ చిత్రకారుడైనా వేసిన ప్రతి చిత్రం కళాఖండం కాబోదని ఆయన నిష్కర్షగా చెబుతారు.
దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో చిత్రకళా వికాసం ఎంతగానో జరిగింది. కాని దురదృష్టవశాత్తు ఇక్కడ చిత్రకళపై సరైన విమర్శలు రావడం లేదన్నారు డిఎల్‌ఎన్. రెడ్డి. సద్విమర్శలు గొప్ప చిత్రాలు, శిల్పాల ఆవిర్భావానికి అంకురార్పణ చేస్తాయని ఆయన అంటారు. సమకాలీన చిత్రకళా రంగానికి బరోడాలో, శాంతినికేతన్‌లో తప్ప మరెక్కడా తగిన వాతావరణం లేదని కూడా డిఎల్‌ఎన్. రెడ్డి అభిప్రాయపడ్డారు.
దేశం మొత్తం మీద ప్రతియేటా చిత్రశిల్పకళలలో పెద్ద సంఖ్యలో వందల సంఖ్యలో డిప్లొమాలు, డిగ్రీలు పుచ్చుకుని కళాశాలల నుంచి బయటకు వస్తున్న, యువ కళాకారులు ఎంతమంది చిత్రకళనే నమ్ముకుని, పట్టుదలతో పాటుపడుతున్నారో వేరుగా చెప్ప నవసరం లేదని డిఎల్‌ఎన్. రెడ్డి అంటారు.
1969లో హైదరాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో పెయింటింగ్‌లో డిప్లొమా పొంది, 1971లో బరోడాలోని ఎం.ఎస్. విశ్వ విద్యాలయం నుంచి గ్రాఫిక్ ఆర్ట్స్ పూర్తి చేసిన డిఎల్‌ఎన్ రెడ్డి. అదే ఏడాది హైదరాబాద్‌లోని కళా భవన్‌లో తన గ్రాఫిక్స్ ప్రదర్శన ఏర్పాటు చేసి, చిత్ర కళా రంగంలో తన పుట్టుకను ద్యోతకం చేశారు. తిరిగి 1973 నాటికి గ్రాఫిక్స్ ప్రింట్లతో పాటుగా తన చాతుర్యాన్ని చాటే పెయింటింగ్‌ల ప్రదర్శన సైతం బొంబాయిలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1976లో మాక్స్ ముల్లర్ భవన్ (హైదరాబాద్)లో పెయింటింగ్స్‌తో జతచేసి పాస్టిల్స్ ప్రదర్శించారు. బొంబాయిలోని మాక్స్ ముల్లర్ భవన్‌లో 1977లో పెయింటింగ్స్ ప్రింట్లు ప్రదర్శించారు. పిదప 1981లో డ్రాయింగ్‌లు, నీటి వర్ణ చిత్రాల ప్రదర్శన మద్రాసులోని సరళా ఆర్ట్ సెంటర్‌లో నిర్వహించారు. 1982లో బరోడాలోని
ఉర్దూ ఆర్ట్ గ్యాలరీలో డ్రాయింగ్‌లు, నీటి వర్ణ చిత్రాలే ప్రదర్శించారు. 1985లో డ్రాయింగ్‌లు, పాస్టిల్స్ హైదరాబాద్‌లోని చింగారీ గ్యాలరీలో ప్రదర్శించారు. నీటి వర్ణ చిత్రాలు, డ్రాయింగ్‌లు పాస్టిల్స్ కలిపి 1987లో బొంబాయిలోని పుండోల్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. అనంతరం ఎచ్చింగ్‌లు, ఎన్‌గ్రేవింగ్‌లు, టెర్రకోటాలు, కంచు శిల్పాలను, 1988లో మాక్స్‌ముల్లర్ భవన్ (హైదరాబాద్)లో ప్రదర్శించారు. ఆ తర్వాత 1988లోనే ఎచ్చింగ్‌లు, ఎన్‌గ్రేవింగ్‌ల ప్రదర్శన వరసగా బరోడా, ఆహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశాడు. 1989లో బొంబాయిలో గ్లాస్ పెయింటింగ్స్ ప్రదర్శించాడు. ఇట్లా ఇంకా ఎన్నో వ్యష్ఠి చిత్ర శిల్ప కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. మధ్య మధ్య అనేక సమష్టి కళా ప్రదర్శనలలోను ఆయన పాల్గొన్నాడు.
1990లో ఆత్మాహుతి దళాల ప్రేరణతో కలప మ్కులతో మానవాకృతులను ఆయన రూపొందించిన తీరు కళాత్మకమైంది. వాటిని వారు కలకత్తాలోని సాంస్కృతి ఆర్ట్స్ గ్యాలరీలో ప్రదర్శించారు.
అప్పట్లోనే పింగాణీ మాధ్యమం లోను ఆయన ప్రయోగాలు చేశాడు. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేశాడు. ఇట్లా ఒక ప్రక్క డ్రాయింగ్‌లు, మరో ప్రక్క పెయింటింగ్స్‌లో నీటి వర్ణాలు, తైల వర్ణాలు, గ్లాసుపై చిత్రాలు, వేరొక ప్రక్క గ్రాఫిక్స్‌లో, లిన్‌కట్, ఉడ్‌కట్, లిథోగ్రాఫ్స్, ఎచ్చింగ్స్, సెరీగ్రాఫ్ట్, ఇంకొక్క ప్రక్క – శిల్పాలతో టెర్రాకోటా, దారుశిల్పాలు, కంచు శిల్పాలు, పింగాణి శిల్పాలు, ఏ మాధ్యమికం తీసుకున్నా తనదైన ముద్రను వేసి, ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అందరు నడిచే బాటకన్నా తన దారి వేరైనదని ఎప్పటికప్పుడు ప్రస్ఫుటం చేస్తున్న అసాధారణ ప్రజ్ఞావంతుడు డి.ఎల్.ఎన్. రెడ్డి.
టి. ఉడయవర్లు