తెలంగాణకున్న సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, వారసత్వం అతి ప్రాచీనమైనది. క్రీ.పూ. రెండువేల సంవత్సరాల కంటే పూర్వమే, తెలుగు మాట్లాడబడేదట! తెలుగు భాషకు దక్కనుపీఠభూమిపై మాట్లాడిన ‘తొలి భాష’ అంటారు. త్రవ్వకాలలో దొరికొన నాణెములు శాసనాలు ఇతర ఆధారాల ప్రకారము క్రీ.పూ. 200 నుండి క్రీ.శ. 300 వరకు తెలంగాణ ప్రాంతాన్ని శాతవాహనులు పాలించారు. వారి తర్వాత ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు పాలించారు. క్రీ.శ. పదవ శతాబ్దము నుండి సుమారు 14వ శతాబ్దము వరకు ఈ నేలను కాకతీయులు పాలించారు.
ఏ జాతికైనా, చరిత్ర సంస్కృతి, భాష, సాహిత్యములు ప్రముఖమైనవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక వీటిపైన అధ్యయనం మరింతగా చేయటం ముదావహము. ఈ దిశగా తెలంగాణ సాహిత్య అకాడమి గత సంవత్సరం అక్టోబర్‌లో ‘జాతీయ సదస్సు’ను నిర్వహించారు. పలు ప్రముఖుల పత్ర సమర్పణలను స్వీకరించారు. సమర్పించబడిన 26 వ్యాసాలను ఈ సంకలన రూపంలో మన ముందుకు తెచ్చారు. ఈ సంకలనానికి సంపాదకులు ఆచార్య జి. కరుణ కుమారి డా|| మల్లె గోడ గంగా ప్రసాద్‌లు.
ప్రాచీన భారత దేశానికి సంపూర్ణమైన లిఖిత చరిత్ర లేనట్లే, ప్రాచీన తెలంగాణకు కూడా అది కొరవడింది. త్రవ్వకాల్లో దొరికిన ఆధారాలు, శాసనాలు ప్రాచ్య గ్రంథాలు (పురాణాలు) ఆధారంగా, తెలంగాణ ఒక చారిత్రక ప్రత్యేకత కలిగిన ప్రాంతంగా తెలుస్తున్నది. డా|| దేమెరాజారెడ్డి, సంగనభట్ల నరసయ్య, డా|| ఈమని శివనాగిరెడ్డి, వాడ్రేేవు చిన వీరభద్రుడులాంటి ప్రముఖులు సమర్పించిన పత్రాలలో తెలంగాణ గురించి పలు ఆసక్తికరమైన అంశాలు ఈ సంకలనం ద్వారా పాఠకులకు తెలుస్తాయి.
‘గతం గూర్చి అధ్యయనం అవసరమా?’ అన్న ప్రశ్నకు ‘అత్యవసరం’ అన్న జవాబు వస్తుంది. వాడ్రేవు చినవీరభద్రుడు తన వ్యాసంలో చెప్పినట్లు ‘ఏదేశమైనా, ప్రాంతమైనా, సమాజమైనా, చరిత్ర ఎందుకు తెలుసుకోవాలంటే మనం తిరిగి అవే తప్పులు చేయకుండా ఉండటానికి (పే. 254) అంటారు. మరోచోట వీరు ”నిర్విరామ యుద్ధ కార్యకలాపమే తెలంగాణ కొక నిర్దిష్ట రాజకీయ ఆర్ధిక స్వభావాన్ని సంతరింపచేసింది (పేజీ 252) అంటారు.
గతమెరిగిన వర్తమానాన్ని సమీక్షించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకోవటంలోనే విజ్ఞత ఉంది.
తెలంగాణ సాహిత్య అకాడమి వారి ఈ సంకలనాన్ని ఆలోచనాత్మక సంకలనాలు అకాడమి వారు మన ముందుకు మరిన్ని తీసుకువస్తారని ఆశిద్దాం.
శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ
(చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం)
సంపా
దకులు:
ఆచార్య జి. అరుణ కుమారి
డా|| మల్లె గోడ గంగా ప్రసాద్
పేజీలు: 259. వెల:రూ. 110/-
ప్రచురణ, ప్రతులకు :
తెలంగాణ సాహిత్య అకాడమీ, రవీంద్ర భారతి
ప్రాంగణము, హైదరాబాదు – 40