kcr-in-yadagiriభక్తులు పరిపూర్ణ ఆధ్యాత్మికభావనను పొందడంతోపాటు, నిత్యజీవన వత్తిడినుండి విముక్తి పొందే వాతావరణాన్ని యాదగిరిగుట్టలో కల్పించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంకల్పించారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా కేటాయిస్తూ యాదగిరిగుట్టను సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఫిబ్రవరి 25న ముఖ్యమంత్రి ప్రముఖ ఆర్కిటెక్టులు రాజ్‌, జగన్‌, టెంపుల్‌ ఆర్కిటక్ట్‌ ఆనంద్‌సాయి, స్థపతి సౌందర్‌రాజ్‌, యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్‌ అథారిటీ సారథి కిషన్‌రావులతో కలిసి యాదగిరిగుట్టపై ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఆలయ ప్రాంగణమంతా కలియతిరిగారు ముఖ్యమంత్రి. దాదాపు 40 నిమిషాలపాటు గుట్టపై, మధ్యభాగంలో, గుట్ట పాద ప్రాంతంలో కాలినడకన తిరిగి అణువణువు పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏమి చేయాలో అధికారులతో కలిసి అంచనా వేశారు. అనంతరం దేవాదాయశాఖ, రెవిన్యూశాఖ, అటవీశాఖ అధికారులు, ఆలయ ఆర్కిటెక్టులు, స్థపతి తదితరులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో అతి పెద్ద దైవ క్షేత్రమైన యాదగిరిగుట్టను అద్భుతరీతిలో తీర్చిదిద్దాలని చెప్పారు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం నిర్మాణాలు జరగాలని, ప్రస్తుతం ఉన్న వాటిలో మార్పు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. చిన్న జీయర్‌స్వామిని కూడా త్వరలోనే యాదగిరిగుట్టకు తీసుకువచ్చి ఆయన సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని వెల్లడిరచారు. రాయగిరినుండి యాదగిరిగుట్ట వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మించాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను ఆదేశించారు. గుట్టకు నాలుగువైపులా ఉన్న వంగపల్లి, తుర్కపల్లి, రాయగిరి, రాజుపేట రోడ్లను బాగా అభివృద్ధి చేయాలని, రోడ్ల ప్రక్కన ఆకర్షణీయమైన పూలు పూసే చెట్లు పెట్టాలని, గుట్ట చుట్టూ సుగంధం వెదజల్లే చెట్లు పెంచాలని ముఖ్యమంత్రి అటవీశాఖ అధికారులను ఆదేశించారు. నాలుగు దిక్కులనుండి యాదగిరిగుట్టకు వెళ్ళే మార్గంలో ప్రవేశించగానే వేదమంత్రాలు, స్తోత్రాలు, భక్తిగీతాలు, ఆలయ ప్రకటనలు వినిపించే విధంగా సౌండ్‌సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా భక్తి భావాన్ని పెంచే, నైతిక విలువలు పెంపొందించే, పర్యావరణాన్ని కాపాడే విధంగా రాతలు కనిపించాలని ముఖ్యమంత్రి సూచించారు.

గుట్ట పై భాగంలో దాదాపు 14.5 ఎకరాల స్థలం ఉందని, దీనిని అణువణువు సమర్థవంతంగా, వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రధాన ఆలయంచుట్టూ మాడవీధులు నిర్మించాలని చెప్పారు. చాలా దూరంనుంచి కూడా గోపురం, ఆలయం చక్కగా కనిపించే విధంగా నిర్మాణం ఉండాలన్నారు. గుట్టపై భాగంలోనే ప్రధాన ఆలయంతోపాటు కళ్యాణమంటపం, యాగశాల, ప్రవచనశాల, వ్రతశాల, వంటశాల నిర్మించాలని చెప్పారు. కనీసం 500 గదులు వచ్చేవిధంగా గుట్టలోని వివిధ ప్రాంతాలలో కాటేజీలు నిర్మించాలని సూచించారు. గుట్టపైన కొన్ని వాహనాలు పట్టేవిధంగా పార్కింగ్‌స్థలం ఏర్పాటు చేయాలని, వచ్చిపోవడా నికి వేరు వేరు దారులు నిర్మించాలని చెప్పారు. పెళ్లిళ్లు, వ్రతా లను పునరుద్ధరించాలని, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. నిర్మాణాలు జరిగే సందర్భంగా కూడా పూజలకు ఆటంకం కలగని ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని చెప్పారు.

గుట్టపై హెలిప్యాడ్‌ నిర్మించాలని కొందరు అధికారులు చేసిన సూచనను ముఖ్యమంత్రి తిరస్కరించారు. ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సంప్రదాయాలను, పవిత్రతను కాపాడటం కూడా అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు అనేకమంది దాతలు కూడా ముందుకువస్తారని, కార్పొరేట్‌సంస్థలు, బహుళజాతి కంపెనీలు కూడా ఆలయ అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. తాను ఎప్పటికప్పుడు యాదగిరిగుట్టకు వస్తూనే ఉంటానని, నిత్యం పనులను పర్యవేక్షిస్తానని చెప్పారు. యాదగిరిగుట్టలో నిర్మించే ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహానికి కావలసిన రాయి ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలని, మంచి నైపుణ్యం కలిగిన శిల్పులకు ఆ బాధ్యతను అప్పగించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆలయ ఇఓ గీత, ఆలయ పూజారులు లక్ష్మీనరసింహాచారి, కారంపూడి నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.

Other Updates