ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పడిన ‘నీతి ఆయోగ్‌’ దేశానికి గొప్ప ముందడుగు కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఢల్లీిలో ఫిబ్రవరి 8న జరిగిన ‘నీతి ఆయోగ్‌’ తొలి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రధాని నివాసంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన ఈ సమావేశంలో సి.ఎం. చంద్రశేఖరరావు మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం, సహకారం, సమాన భాగస్వామ్యంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని అన్నారు. ‘నీతి ఆయోగ్‌’లో రాష్ట్రాలపాత్ర ప్రముఖంగా ఉండాలని కెసిఆర్‌ నొక్కి చెప్పారు.

‘నీతి ఆయోగ్‌’ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలన్నా, ఆశించిన ఫలితాలు సాధించాలన్నా రాష్ట్రాలన్నింటికీ ‘నీతి ఆయోగ్‌’లో సమాన భాగస్వామ్యం ఉండాలని సి.ఎం. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు జరిపే వ్యవస్థ రూపొందాలని, కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగే చర్చలుకూడా పరస్పరం సహకరించుకొనే తీరులో సాగాలన్నారు.

సమిష్టి కృషితో అన్ని రాష్ట్రాలు పనిచేసినప్పుడే ‘టీమ్‌ ఇండియా’ అనే లక్ష్యం సాధ్యమని ‘నీతి ఆయోగ్‌’లో రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం ఇవ్వడంతోపాటు ప్రతి రాష్ట్రానికి ఒక నిర్ధిష్ట బాధ్యతను, తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని సి.ఎమ్‌. సూచించారు.

రాష్ట్రాలు కేంద్రప్రభుత్వ మార్గదర్శకత్వం కింద పనిచేస్తాయని, అందువల్ల ‘నీతి ఆయోగ్‌’ రూపొందించే మార్గదర్శకాలు రాష్ట్రాలకు కరదీపికలా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ‘నీతి ఆయోగ్‌’ ద్వారాగానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారాగానీ రాష్ట్రాలలో ఆయా పథకాలు అమలుచేసే విషయంలో రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఉండాలని సూచించారు.

సమస్యలను మూలాలనుంచి గుర్తించాలని, అభివృద్ధి ప్రక్రియలో దీర్ఘకాలిక వ్యూహం, బహుళ ప్రయోజనాలపై దృష్టి ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సాగునీటి పారుదల రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘మిషన్‌ కాకతీయ’ పథకం గ్రామీణ ప్రాంతాలల్లో, వ్యవసాయరంగంలో ఏ విధమైన గుణాత్మక మార్పును తీసుకొస్తుందో, దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చబోతున్నదో ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. వివరించారు.
కేంద్ర ప్రభుత్వం సహజంగా కొన్ని పథకాల అమలును ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తుందని, అలాంటి పథకాలు పటిష్టంగా, పకడ్బందీగా అమలు కావాలంటే కేంద్రం ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రాలు అందిపుచ్చుకొనేందుకు తరచూ సమావేశాలు జరపాలని సి.ఎం. సూచించారు. ఇందుకుగాను సబ్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.

ఈ సూచనకు ప్రతిస్పందనగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌, స్వచ్ఛభారత్‌, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను తగ్గించాలా? లేక రాష్ట్రాలకు బదిలీ చేయాలా? లేక కొన్నింటిని ఎత్తివేయాలా? అనే విషయంపై తలా ఒక సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రసంగానికి ప్రధాని నరేంద్రమోది ప్రతిస్పందిస్తూ ‘‘రావుగారు చేసిన సూచనలు చాలా విలువైనవి’’ అంటూ వ్యాఖ్యానించారు.

Other Updates