మన దేశంల మనం కడుపుల సల్ల కదులకుంట ఉంటున్నం అంటే స్వాతంత్య్ర సమరయోధుల పుణ్యమే. దేశమంత బ్రిటీష్‌వాళ్ళతోని కొట్లాడితె తెలంగాణల రజాకార్లతో కొడ్లాడిన కత ఎప్పుడైనా ఊరికొక్కలైనా లేదు రెండు మూడు ఊర్లకు ఒక్కలైనా స్వాతంత్య్రంకోసం కొట్లాడిన వాల్లు ఇప్పటికీ ఉంటరు. ఊర్లల్ల వాల్లకు ఇప్పటికీ తెల్సినోల్ల దగ్గర గౌరవం ఉంటది. ఎందుకంటే నైజాం రాజ్యంల పెద్దపెద్ద భూస్వాములు హయాంల వెట్టి చాకిరి, అణిచివేత అవలీలగా జరిగింది. వీటికి వ్యతిరేకంగా ఊర్లల్ల చిచ్చు పుట్టింది.. దావానంలలా అయ్యింది. ఈ స్వాతంత్య్ర సమరంలో అన్ని కులాలవాల్లు కల్సి కొట్లాడి ప్రాణాలు సుత ఇచ్చిండ్రు. ఇసోంటి త్యాగాల చరిత్రలు పల్లెల్ల ఇప్పటికీ చెప్పుకుంటరు.
-అన్నవరం దేవేందర్
అన్యాయాన్ని సహించని తనంనుంచి పోరాటం రూపం తీసుకుంటది. నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు అది సాయుధ పోరాటం కావచ్చు. ఆయా ఉద్యమ తీవ్రతల దృష్ట్యా శాంతియుత పోరాటం కావచ్చు. తెలంగాణ నేల స్వభావరీత్యానే అన్యాయంపై ఎగబడుడు రక్తంలనే ఉన్నది. దీని సిల్‌సిలానుంచే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్నది.
దశాబ్దాల పరాయి పాలనను సాగనంపేందుకు జనం రకరకాల పోరు చేసిండ్రు. ఊరూరు సాంస్కృతిక చైతన్యం పొంది అన్ని బాటలు, రహదారులు, చౌరస్తాలు రవీంద్రభారతిని తలపించాయి. దేశంకోసం, సమాజంకోసం పని చేసేవాల్లు త్యాగధనులు. వాల్లకు ఏ స్వార్థం ఉండదు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీ, నెహ్రూనుంచి వేలాదిమంది దేశవ్యాప్తంగా పాల్గొన్నారు. వారి కీర్తి అజరామరంగా ఊరూరా నేడు కొనియాడబడుతంది. అదే సమయాన హైదరాబాద్ సంస్థానంనుంచి విముక్తి. అదే భారతదేశంలో విలీనందిశగా సాగిన పోరులోనూ ఎందరిపాత్ర ఉన్నది. పోరాట స్వభావం పల్లెల్లోనూ ఎక్కువగా ఉంటుంది. స్వాతంత్య్రం అనంతరం జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు సాగినయి. తదనంతర కాలంలో ప్రజాస్వామ్య స్ఫూర్తివల్ల భారత రాజ్యాంగ చట్టాలవల్ల శాంతియుత వాతావరణంవల్లనైతేనేమి తెలంగాణ సమాజం అశాంతినుంచి బయటపడింది.
ఊర్లల్ల ఇప్పటికీ బతికి ఉన్న స్వాతంత్య్ర ఉద్యమం బావుటా ఎగురవేసిన వాల్లకు జెండా వందనం రోజు కల్సుకొని గౌరవించుకోవాలె. ఏ ఊర్లనైనా ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్న వీరుల భార్యలు, కుటుంబసభ్యులు కన్పిస్తే ఆనాటి జ్ఞాపకాలను గడగడ చెప్పేస్తారు. వాల్ల పోరాటశీలత తుపాకులకు ఎదురు తిరిగి అడవులు పట్టిన వాల్ల వల్లనే కదా మనం ఇట్లా బతుకుతున్నది. తమకోసం తాముగాకుండా దేశంకోసం, సమాజంకోసం, ఊరుకోసం.. పని చేసేవాల్లు కొందరు ఉంటరు. వాల్లు సచ్చినంక సుత బతుకుతరు. సమాజం వాల్లను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటది.
ఊరుకోసం, అడవికోసం, వానలకోసం చెట్లు పెట్టేవాల్లు సుత ఉంటరు. పెద్దపెద్ద చింత చెట్లు, రావిచెట్లు, మర్రి చెట్లు ఎవలో ఒకలు మన తరంకోసం నాటినయే. అట్ల చెట్లు పెంచడంవల్లనే ఈ రోజు ఇట్లా బతుకుతున్నం. త్యాగం అనేది సామాజిక
ఉద్యమాలనుంచే కాదు ప్రాకృతికంగా కూడా ఉంటది. అందుకే వన జీవి రామయ్యకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. రామయ్య, ఆయన భార్య రోజంతా మొక్కలు నాటుడే పని. వేలకొలది మొక్కలు నాటిండ్రు. చెట్లు పెంచడంలోనే ఆయనకు ఆనందం ఉంది. మంచికోసం పనిచేయడంలో కూడా ఆ ఆనందం దొరుకుతుంది.
మనకోసం మనం కాదు.. ఇతరుల కోసం, లేని వాల్లకోసం ఏం చేసినవు.. ఏం ఇచ్చినవన్నదే లెక్క. ఒకప్పుడు అశోక చక్రవర్తి చెట్లు నాటినాడని పాఠ్యపుస్తకాలలో చదివినం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వేల లక్షల మొక్కలు నాటబడుతున్నయి. ఉద్యమాలు చేసిన తెలంగాణకు మొక్కలు నాటి సంరక్షించే ఉద్యమమూ తెలుసు. అడవులు తగ్గిపోయి వానలు పడని నేలమీద మల్లా మేఘాలు తిరగాలె. వానలు కురువాలెననే తలంపువల్ల పల్లెపల్లెన చెట్లు పెరుగుతున్నయి. ఇదీ ఒక ఉద్యమమే.
స్వాతంత్య్ర ఉద్యమాలు అన్యాయ వ్యతిరేక ఉద్యమాలు రకరకాల ఆలోచనలు చివరాఖరికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులేకాదు జనమంతా కదిలిన చరిత్ర మనది. పోరాటాల బాటలు, పాటలు, ఉపన్యాసాలు, ర్యాలీలు, రాస్తారోకోల చరిత్రలోనే స్వాతంత్య్రం సిద్ధించి స్వరాష్ట్రం సిద్ధించింది. ఇదే స్ఫూర్తితో అభివృద్ధికి పచ్చని హరిత తెలంగాణకు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.