meatingఅద్భుతాలు సాధించిన దేశాలు, రాష్ట్రాల విజయ రహస్యం సమష్టి కృషి మాత్రమేనని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు.

ప్రజల ఆకాంక్షలు, బంగారు తెలంగాణ సాధనకు ప్రభుత్వం రూపొందించిన పలు పథకాలు, కార్యమ్రాల అమలుపై సమీక్షించి, అవసరమైన మార్గనిర్దేశనం చేసేందుకు ఏప్రిల్‌ 17, 18 తేదీలలో జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహించారు. హైదరాబాద్‌లోని మారియట్‌ హోటల్‌లో రెండు రోజులపాటు జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి ఆద్యంతం పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించారు. కలెక్టర్లతో పాటు సమావేశంలో పాల్గొన్న ఎస్‌.పి.లు., తదితర అధికారులతో పలు అంశాలపై చర్చించి, అమలు చేయాల్సిన పలు కార్యమ్రాలపై ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు, ప్రభుత్వం వేరనే అభిప్రాయాన్ని తొలగించి, ప్రజలు ప్రభుత్వంలో భాగస్వాములనే విధంగా జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

తొలిరోజు సదస్సులో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రసంగిస్తూ, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో పథకాలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలు అట్టడుగుస్థాయి వరకూ చేరాలి. పూర్తి పారదర్శకతతో, వేగంగా పనులు జరగాలి. సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సి.ఎం. చెప్పారు.

గతంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలకోసం 8700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, ఇప్పుడు 27000 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేస్తున్నామని, వీటి ఫలితాలు నూటికి నూరుశాతం అర్హులందరికీ అందాలని ముఖ్యమంత్రి చెప్పారు.

cమొదటి రోజు సదస్సులో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, వాటర్‌గ్రిడ్‌, ఆసరా పెన్షన్లు, స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ తెలంగాణ, హరితహారం, గుడుంబా నివారణ, మహిళల భద్రత, సంక్షేమం, ఐ.సి.డి.ఎస్‌., పరిశ్రమలు, విద్యుత్‌, ఐ.టి, వ్యవసాయం, తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఆయా జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించారు. ప్రభుత్వ కార్యదర్శులు ఆయా శాఖలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కలెక్టర్లదే కీలక బాధ్యత అని, పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లాలోని ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించ వచ్చన్నారు.
ముఖ్యంగా, ఇంటింటికీ తాగునీరు అందించే ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకం, ప్రతి గ్రామంలో సాగునీరు అందించే ‘మిషన్‌ కాకతీయ’, పేదలకు సహాయకారిగా ఉన్న ఆసరా పథకం, పచ్చదనాన్ని పెంపొందింపజేసే ‘తెలంగాణ హరితహారం’, తదితర కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలన్నారు.

‘వాటర్‌గ్రిడ్‌’ కార్యక్రమంలో భూసేకరణ కొంత సమస్యగా మారుతోందని, దాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు సామరస్యంగా పరిష్కరించి, పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేయాలని సి.ఎం. సూచించారు.

మనకు వచ్చే సగం జబ్బులు జల కాలుష్యం వల్లనే వస్తున్నాయని స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న దేశాలలో ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నారని, అందువల్ల ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.

మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరిస్తే, తెలంగాణలోని పల్లెలు పచ్చదనంతో కళకళలాడతాయని సి.ఎం. చెప్పారు. ఒక్కసారి చెరువు నిండితే, మూడు సంవత్సరాల వరకు సాగునీటి కొరత లేకుండా ఉంటుందని అందువల్ల చెరువులు పునరుద్ధరణ పనులలో కలెక్టర్లు, అధికారులు పాల్గొనడంతో పాటు, ప్రజలను మమేకం చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచించారు.

‘హరితహారం’ వారోత్సవం

ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో జూలై రెండవవారంలో ‘హరితహారం’ వారోత్సవాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సి.ఎం. సూచించారు. అన్ని ఖాళీ ప్రదేశాలలో, విద్యా సంస్థల్లో, ప్రయివేటు ప్రభుత్వ సంస్థల్లో, రోడ్లకు ఇరువైపులా, పోలీస్‌స్టేషన్లు,జైళ్ళలో విరివిగా మొక్కలు నాటాలని సి.ఎం. సూచించారు.

అటవీ సంపదను రక్షించే అటవీ శాఖాధికారులకు అవసరమైనచోట పోలీసు భద్రత కల్పిస్తామని, అటవీశాఖ భూములపై సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని, హరితహారంకోసం ఎం.ఎల్‌.ఏ.లు రూ. 10 లక్షల చొప్పున సి.డి.ఎస్‌.కు కేటాయించాలని సి.ఎం. చెప్పారు. చెరువు కట్టలమీద ఈత చెట్లు, కట్ట క్రింద సిల్వర్‌ ఓక్‌ చెట్లు పెంచాలన్నారు.

నీటి ఎద్దడి నివారించండి

జిల్లాల వారీగా మంచినీటి ఎద్దడి గురించి కలెక్టర్లను వివరాలు అడిగి సి.ఎం. తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి మాట్లాడుతూ, జిల్లాలో ఒక్క షాద్‌నగర్‌లోనే మంచినీటి ఎద్దడి ఉన్నదని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ కృష్ణానీటి నుంచి షాద్‌నగర్‌కు నీరు కేటాయించమని అధికారులను ఆదేశించారు. జలమండలి ఎం.డి. జగదీష్‌ మాట్లాడుతూ తాము నీటిని ఇచ్చామని, పైపులైన్‌ లీకేజీవల్ల వారు వినియోగించుకోలేక పోతున్నారని చెప్పారు. ఈ విషయంలో జిల్లా మంత్రులు చొరవ తీసుకొని, నీటి ఎద్దడిని పరిష్కరించాలని సి.ఎం. సూచించారు.

సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష

కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రెండవరోజు మొదటి సెషన్‌లో సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కింద లబ్ది పొందడానికి తహసీల్దార్లకే దరఖాస్తు చేసుకోవాలి. రెండు రోజుల్లో పరిశీలన పూర్తి చేసి పెళ్లికి ముందే డబ్బులు ఇవ్వాలి. అనవసర చిక్కులు కలిగించకుండా, సరళమైన విధానాలతో పేదలకు సాయం చేయాలి. దళితుల అభివృద్ధి విషయంలో ప్రచారం జరిగింది తప్ప, గుణాత్మక మార్పులేదు. దళితుల కుటుంబాల్లోంచి దారిద్య్రాన్ని పారద్రోలడమే ప్రభుత్వ లక్ష్యం. దారిద్య్రరేఖకు దిగువన వున్న కుటుంబాలను అభివృద్ధి చేయాలి. వారు మళ్లీ పేదలుగా మారకుండా చర్యలు తీసుకోవాలి. దళితులకు భూ ములు ఇవ్వడమే కాకుండా వ్యవసాయం చేసుకునే ఏర్పాట్లు చేయాలి. రూరల్‌, సెమిఅర్బన్‌, అర్బన్‌ దళితులు, ఎస్టీలకు ఇంకా ఏమి చేయవచ్చో అధ్యయనం చేసి ప్రభుత్వానికి అధికారులు సూచనలు చేయాలి.

దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టి`ప్రైడ్‌ అనే కార్యక్రమం తీసుకున్నాం. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. ఇంజినీరింగ్‌ చేసిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువకులకు శిక్షణ ఇచ్చి, పెట్టుబడి సమకూర్చి ప్రోత్సహించాలి. దళితులను కాంట్రాక్టర్లుగా అభివృద్ధి చేయాలి. కాంట్రాక్టర్లవద్ద పనిచేసే ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే అనుభవం వుంది. వారిని గుర్తించి, కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలి.

ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్లాంట్లు రిజర్వు చేసి పెట్టాలి.
వివిధ పోటీ పరీక్షలకోసం విద్యార్థులను సిద్ధం చేయాలి. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ ఉద్యోగాలున్నాయి? అవి దక్కాలంటేె ఎలా ప్రిపేర్‌ కావాలి? అనే విషయాలను అధికారులు విద్యార్థులకు చెప్పాలి. జిల్లాల్లో స్టడి సర్కిల్స్‌ ఏర్పాటు చేయాలి. కలెక్టర్లు, ఎస్పీలు కూడా పిల్లలకు నేరుగా బోధన చేస్తే స్ఫూర్తిదాయకంగా వుంటుంది.అమ్మాయిలు చదువుకునేందుకు అవసరమయ్యే విధంగా బోధన, వసతి సౌకర్యాలు కల్పించాలి
విద్యార్థులు ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించే విధంగా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు, అధికారులు త్వరలోనే సమావేశం పెట్టుకుని ఈ వర్గాల విద్యార్థులు, యువకులకోసం ఏమి చేయాలనే విషయంపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. కలెక్టర్లు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి సూచనలు పంపాలి.

వివిధ సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ బాధితులకు ఆర్థిక సహాయం అందించడానికి అనువుగా ప్రతీ కలెక్టర్‌వద్ద రూ. కోటి నిధిని పెడతాం.

దళితుల వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడిని విడుదల చేసే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తాం. భూపంపిణీతో పాటు, వ్యవసాయం చేయడమూ అవసరం.

ఎస్సీ, ఎస్టీలతోపాటు మైనారిటీ పిల్లలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. మైనారిటీల్లో, ముఖ్యంగా ముస్లింలలో చాలా పేదరికం వుంది. వివిధ ప్రభుత్వ పథకాల్లో ముస్లింలు ఎక్కువగా లబ్దిపొందడంలేదు. ముస్లింలను ఓటు బ్యాంకుగానే ఉపయోగించారు. ఈ ప్రభుత్వం అలాకాదు. ముస్లిం పిల్లలను ప్రోత్సహించాలి. గృహ నిర్మాణం, డిఆర్‌డీఏ పథకాలు తదితర పథకాల్లో ముస్లింలు తక్కువశాతం ఎందుకు ఉంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. గ్రామీణ, సెమి అర్బన్‌, అర్బన్‌ ముస్లింలకోసం ఏమి చేయాలో అధ్యయనం చేయాలి. ఇప్పటికి ఉన్న పథకాలను సమీక్షించి, కొత్త పథకాలు రూపకల్పన చేయాలి.

ప్రతీ జిల్లాలో మైనారిటీలకోసం రెండు మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ఒకటి బాలికలకు, మరొకటి బాలురకు.

వక్ఫ్‌ భూముల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించాలి. వక్ఫ్‌ భూముల వివరాలు కలెక్టర్లకు పంపుతాం. జీవో 58కింద వక్ఫ్‌ భూములు రెగ్యులరైజ్‌ చేయడానికి వీలులేదు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ నిధులను గ్రీన్‌ ఛానల్‌లో అందుబాటులో పెట్టాలి.

వక్ఫ్‌ అంటే దానం/విరాళం. అలా వచ్చిన భూములను ముస్లింల అభివృద్ధికి వాడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువ. అందుకే వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇస్తున్నాం. సంక్షేమ హాస్టళ్లలో అవినీతిని సహించవద్దు. సన్న బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలి. హాస్టల్‌ పిల్లలకు బ్లాంకెట్లు కొనివ్వాలి.

ఈ సమావేశం ముగిసిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో ఆర్‌డీవో, ఎంఆర్‌వో, ఎంపీడీవోలతో జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలను, వీటి అమలు వారితో పర్యవేక్షించాలి.

హాస్టల్‌ విద్యార్థులకు వెంటనే కొత్త గ్లాసులు, ప్లేట్లు కొనియ్యండి. ఎస్పీలు జిల్లాలో పర్యటించే సందర్భంగా హాస్టళ్లను సందర్శించాలి. అక్కడి పరిస్థితులు గమనించాలి. హాస్టళ్ళలో మంచినీరు, మరుగుదొడ్లు, మురికి నీటి కాల్వలు, విద్యుత్‌ బాగుండాలి. వాటి నిర్వహణకు అవసరమయ్యే పనులు వెంటనే చేపట్టాలి. నెలలో ఒకరోజు హాస్టల్‌ డే నిర్వహించాలి. కాస్మొటిక్‌ ఛార్జీలను సమీక్షించి, అవసరమైన మేర పెంచుతాం.

విద్యారంగంపై సమీక్ష:

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కలెక్టర్ల సదస్సులో రెండవ రోజు విద్యాశాఖను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలు, చేసిన సూచనలు, తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ విద్యార్థులు తయారయ్యేలా విద్యా విధానం ఉండాలి. తెలుగును విస్మరించకుండానే ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన జరగాలి. రాష్ట్రంలో కేజీటు పీజీ విద్యా విధానం రూపకల్పన జరుగుతున్నది. నిర్భంధ ఉచిత విద్య అందించడం లక్ష్యం. కులాల అంతరాలు లేకుండా పిల్లలంతా ఒకే చోట, ఒకే విద్య నేర్చుకోవాలనేది నా ఉద్దేశ్యం.

ప్రయోగాత్మకంగా వచ్చే ఏడాది ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రారంభిస్తాం. కేజీ టూ పీజీ విద్యా విధానం ఎలా ఉండాలి? ఏ తరగతి నుంచి రెసిడెన్షియల్‌ విద్య అందించాలి? ఇప్పుడున్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఎలా ఉండాలి? అనే విషయాలపై అధికారులు ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించాలి.

సూచనలు, సలహాలు తీసుకోవాలి. చివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలను యధావిధిగా కొనసాగిస్తాం. మూడవ తరగతి వరకు విద్యాబోధన స్థానికంగానే జరుగుతుంది.

గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల పరిస్థితిని కలెక్టర్లు పరిశీలించాలి. పాఠశాలల్లో నూటికి నూరుశాతం టాయిలెట్లు నిర్మించాలి. నిధుల కొరతలేదు. అన్ని పాఠశాలల్లో మంచినీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా ఉండాలి. గ్రామ పంచాయతీలు మంచినీళ్లు ఇవ్వాలి. వెంటనే విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తాం. హరితహారం ద్వారా పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాలి. అన్ని పాఠశాలలకు ప్రహరీగోడలు నిర్మించాలి.

అన్ని విద్యా సంస్థలను సరిగా నిర్వహించే బాధ్యతను అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలి. ఐఏఎస్‌., ఐపీఎస్‌ అధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి.

కొందరు టీచర్లు విధులకు పోకుండా, వారి బదులు వేరే వారిని బడికి పంపుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వారిపై చర్యలు తీసుకోవాలి.

మధ్యాహ్న భోజనం బిల్లులు నెలనెలా చెల్లించడానికి ప్రయత్నిస్తాం.

Other Updates