నర్సన్నపేట గ్రామసభలో సిఎం పిలుపు
సమస్యలను చూసి బెదరిపోకుండా వాటిపై యుద్ధం చేసి గెలవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. మెదక్‌జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్‌పూర్ మండలంలోని నర్సన్నపేట గ్రామాన్ని ఆయన అక్టోబరు 4న సంద ర్శించారు. అక్కడ నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.ఎం. మాట్లాడుతూ, తెలంగాణ సాధించుకోవడానికి ఎలాంటి పోరాటాన్ని నిర్వహించామో అలాగే అభివృద్ధిని సాధించుకోవడానికి కూడా అదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. తాను ఇంతకుముందు ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, ఇప్పుడు నర్సన్నపేట గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటున్నట్లు ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ రెండు గ్రామాలను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతానన్నారు. గ్రామాలలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి డబ్బులు అక్కరలేదని, ప్రజలు తలుచుకుంటే సాధించవచ్చని అన్నారు. గ్రామంలో ప్రజలంతా కులం, మతం, రాజకీయపార్టీలు, ఇతర ఎలాంటి విభేదాలనైనా పక్కన పెట్టి కలిసికట్టుగా పనులు చేస్తే అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని అన్నారు. అందుకు ఉదాహరణ చెబుతూ అంకాపూర్, గంగదేవిపల్లి గ్రామాలు, గ్రామ ప్రజల ఐక్యతతో ఎంతో అభివృద్ధిని సాధించాయన్నారు.
దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలిచాయన్నారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు కూడా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ముందుగా అంకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నట్లుగా సర్వవర్గ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కమిటీ వేసుకోవడం వల్ల గ్రామస్థులంతా ఒకేతాటిపైకి వస్తారన్నారు. అప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా సులభంగా పరిష్కారమవు తుందన్నారు. పక్క గ్రామమైన ఎర్రవల్లి ఒక్కరోజులో ఐకమత్యంగా కాలేదని, నెలరోజుల పాటు కష్టపడి ఆ గ్రామ ప్రజలందరినీ ఒకేతాటిపైకి తెచ్చినట్లు తెలిపారు.
ఇప్పుడు ఆ గ్రామ ప్రజలు ప్రతి శనివారం పారిశుధ్యంపైన, ప్రతి ఆదివారం గ్రామాభివృద్ధిపైన కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. నర్సన్నపేట వాసులు కూడా సంఘటితమై ప్రజా సమస్యలను, అభివృద్ధిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. పక్క పక్క గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వా ములు కావాలన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లకు సంబంధించిన అర్హులైన వారి జాబితాను అధికారులు గ్రామంలో పర్యటించి తయారుచేస్తారని చెప్పారు.
ఈ సందర్భంగా డబుల్ బెడ్‌రూం ఇండ్ల నమూనాను ఆయన గ్రామ ప్రజలకు చూపించారు. గ్రామంలోని ప్రతి రైతుకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తానన్నారు. గ్రామానికి బైపాస్‌రోడ్ ఏర్పాటు చేసుకునేలా గ్రామస్థులు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. గ్రామంలోని సమ స్యలను గుర్తించాలని ‘గడ’ ఓఎస్‌డి హన్మంతరావును ఆదేశించారు. నర్సన్నపేట అభివృద్ధి కోసం ప్రత్యేక అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. తమ గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకోవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.