గత ఎన్నికల్లో 90శాతం పోలింగ్ నమోదై, ఆ పోలింగ్ కేంద్రంలో ఒకే అభ్యర్థికి 75శాతం ఓట్లు పడ్డ పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించాలని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జరిగిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారుల సమావేశంలో నిర్ణయించారు.
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతా ధికారులు, రిటర్నింగ్ అధికారులు హాజరైన ఈ సమావేశంలో హైదరాబాద్‌లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు తదితర అంశాలపై సవివరంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటర్లు నమోదు అయిన పోలింగ్ కేంద్రాలు, ఎన్నికలకు సంబంధించి హింసాత్మక, శాంతి భద్రతలకు భంగం కలిగిన సంఘటనలు జరిగిన ప్రాంతాలను గుర్తించి తగు బందోబస్తు ప్రణాళికను రూపొందించాలని తెలిపారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో, వచ్చినందున వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిర్వహించే సమావేశాలు, పాదయాత్రలు తదితర ప్రచార కార్యక్రమాలకు తప్పనిసరిగా సంబంధిత రిటర్నింగ్ అధికారిచే ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, పాదయాత్రల నిర్వహణ అనుమతికై వచ్చే దరఖాస్తులను సంబంధిత పోలీస్ నోడల్ అధికారి అంగీకారం అనంతరమే ఆమోదం తెలపాలని రిటర్నింగ్ అధికారులకు దానకిషోర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, సభలు, సమావేశాల నిర్వహణ, రాజకీయపరమైన పత్రికా ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవడం తదితర అంశాలపై నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రాజకీయ సభలు, సమావేశాలు, పాదయాత్రలు జరుగుతున్నాయని, వీటన్నింటిని పూర్తి స్థాయిలో వీడియో గ్రఫీ చేయించి ఆయా సభలు, సమావేశాల నిర్వహణ వ్యయాన్ని ఎన్నికల వ్యయంలో కలిపేందుకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. పౌర సేవలు, నిర్వహణ సంబంధిత పనులపై నిషేధంలేదని, కొత్తగా అభివద్ధి కార్యక్రమాలపైనే నిషేధం ఉందని స్పష్టంచేశారు. తమ పరిధిలో క్రిటికల్, హైపర్ క్రిటికల్ ప్రాంతాలను రిటర్నింగ్ అధికారులు విధిగా సందర్శించా లని అన్నారు.
నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏసిపి, డిసిపిలు వ్యక్తిగతంగా తనిఖీచేసి వాటిపై ప్రత్యేక దృష్టి సాధిస్తారని పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తాము నిర్వహించే సభలు, సమావేశాలు, పాదయాత్రలకు సంబంధించి అనుమతులను రిటర్నింగ్ అధికారులు జారీచేస్తారని, అయితే ఆయా ర్యాలీలు, సభలకు సంబంధించి సంబంధిత నోడల్ పోలీసు అధికారి నిరభ్యంతర అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు నిర్వహణలో ఎంత మంది హాజరవుతారు, సభ నిర్వహణకు పట్టే సమయం, ర్యాలీలు నిర్వహించే మార్గాలు తదితర అంశాలను సభలు, సమావేశాల అనుమతులకు అందజేసే దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు నగర పోలీస్ కమిషనర్ సూచించారు.