యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్నినవ గిరులతో యాదాద్రిగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో బర్కత్‌పురాలో యాదాద్రి సమాచార భవనాన్ని నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణానికి నవంబర్ 23న రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజచేసి, శంకుస్థాపన చేశారు.
1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ లో యాదాద్రి ఆలయ సమాచార కేంద్రం, పరిపాలనా భవనం, మిగిలిన అంతస్తులలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో కల్యాణ మండపం, తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. అధునాతన హంగులతో ఈ భవన నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయలకుపైగా వ్యయమవుతుందని అంచనా. ఏడాదిన్నర కాలంలో నిర్మాణం పూర్తిచేయాలకు నిర్ణయించారు. ఈ సమాచార కేంద్రంలో యాదాద్రి ఆలయానికి చెందిన సేవలు, అద్దెగదులు, తదితర పూర్తి సమాచారం అందుబాటులో వుంటుంది.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, యాదాద్రి తెలంగాణలో రెండవ తిరుపతిగా తీర్చిదిద్దేందుకుకృషి జరుగుతోందని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా, క్షేమంగా ఉండాలనే ఆకాంక్షతో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిధులతో ఈ సమాచార భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం రూపొందించిన 2016 సంవత్సర క్యాలండర్‌ను ఈ సందర్భంగా హోం మంత్రి నాయికు నరసింహారెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జి. జగ దీశ్వర రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి, వంశపారంపర్య ధర్మకర్త నర్సింహ మూర్తి, యాదాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. గీత, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.