రాజకీయ నాయకుడిగానే కాకుండా సమాజసేవకుడిగా ప్రజలకు సేవలందిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ జన నేతగా పేరుతెచ్చు కుంటున్నారు కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయం చేస్తూ, తమ కుటుంబ సభ్యుల పెళ్లి వేడుకల్లో అదే మంటపంపై పేద కుటుంబాల పిల్లలకు వివాహాలు జరిపించి కుటుంబ పెద్దగా నిలిచారు కోనప్ప. గత దశాబ్ద కాలంగా ఎండాకాలంలో నియోజకవర్గ ప్రజలకు వేసవిలో అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి వారి దాహార్తిని తీర్చారు.
వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోకుండా విద్య, వైద్యం, సంక్షేమానికి ఆమడ దూరంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల విభజనలో కుమురంభీం అసిఫాబాద్ జిల్లా ఏర్పాటుతో కాగజ్‌నగర్ రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక సహకారం కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృషితో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రతీ గ్రామం నుండి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుండి ప్రధాన రహదారికి రెండు లైన్ల రోడ్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. అంతరాష్ట్ర ప్రధాన రహదారులను కలుపుతూ గూడెం హవేలీ వద్ద, పెంచకల్‌పేట – దాహిగాం మధ్య పెద్ద వాగుపై వంతెనల నిర్మాణం ఎమ్మెల్యే కృషితో పూర్తికావచ్చాయి. రైతులకు విద్యుత్ సమస్యను తీర్చడానికి గత నాలుగు సంవత్సరాలలో 7 సబ్ స్టేషన్‌ల నిర్మాణం పూర్తి చేసుకొని 3వేలకు పైగా రైతులకు కొత్తగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లను ఇచ్చి, నియోజక వర్గంలో విద్యుత్ సమస్యలేకుండా చేశారు.
పేపర్ పరిశ్రమకు మారుపేరుగా ఉన్న కాగజ్ నగర్ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు. వీరిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌లతో చర్చలు జరిపారు. త్వరలోనే పేపర్ మిల్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు న్నాయని కోనప్ప తెలిపారు. పేపర్ మిల్లు మూత పడినా కార్మికులు నివసించే క్వార్టర్స్‌కు నీరు, విద్యుత్ ప్రభుత్వమే సరఫరా చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు, మిషన్ కాకతీయ, భగీరథ పనులు సాఫీగా సాగుతున్నాయని, ప్రత్యేక రాష్ట్రంలో కాగజ్ నగర్ నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని హర్షం వక్తం చేశారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.
కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా సమాజసేవకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు కోనప్ప. అదికారంలో ఉన్నా, లేకున్నా సమాజసేవకు మాత్రం దూరం కాలేదు. వేసవిలో దాహంతో అలమటించే ప్రజల కోసం ‘అంబలి’ పంపిణీ చేయాలనుకున్నారు. 2011 వేసవిలో రైతుల దగ్గర ఐదు క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేసి కాగజ్‌నగర్ ప్రయాణ ప్రాంగణం, అంబేడ్కర్ చౌరస్తాలలో తొలిసారిగా అంబలిని పంపిణీ చేశారు. ప్రజల నుంచి స్పందన బాగా ఉండటంతో ఆ సంవత్సరం మొత్తం 70 క్వింటాళ్ల జొన్నలు కొని వివిధ చోట్ల అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ఏడాది దాదాపు 300 క్వింటాళ్ల జొన్నలతో ప్రతిరోజూ తన ఇంటి దగ్గర ఉదయం 6నుంచి 9గంటల వరకు, 6వేల లీటర్లతో కాగజ్‌నగర్ పట్టణంలో 15వేల మందికి, నియోజక వర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని వారాంతపు సంత ల్లోనూ వెయ్యి లీటర్ల అంబలిని పంపిణీ చేస్తున్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం ఆదిలాబాద్ వచ్చిన యువకులకు అంబలి పంపిణీ చేసి దాహార్తి తీర్చారు.
వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన కాగజ్‌నగర్ అభివృద్ధితో పాటు ‘బంగారు తెలంగాణ’ సాధించాలంటే విద్యతోనే సాధ్యమని భావించి గత నాలుగు సంవత్సరాలుగా నియోజక వర్గంలోని 2500 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేసి విద్యార్థులకు చేయూతనందించారు. తద్వారా రాష్ట్రంలోనే ఇంటర్మీడియట్ ఫలితాలలో ఘన విజయం సాధించి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రలోనే మొదటి స్థానంలో నిలవడంలో తనవంతు కృషి చేశారు కోనప్ప. విద్యార్థులు ఇంగ్లీష్‌లో వెనుకబడకుండా దాతల సహా యంతో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించడంతో నియోజక వర్గ విద్యార్థులు 100 శాతం విజయం సాధించడంలో తనవంతు సహకారాన్ని అందించారు. 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యం పెరిగేలా స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు అందించి ప్రోత్సహించారు.
నియోజకవర్గంలో అత్యధిక అటవీ ప్రాంతం కావడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పేదలకు, ఆస్పత్రులలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో దాదాపు 10వేల రగ్గులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే
ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ల్లకు ధీటుగా టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు డిజిటల్ విద్యను మారుమూల గ్రామాలకు సైతం పరిచయం చేశారు కోనప్ప. ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ – ఖమ్మంవారి సహకారంతో 9లక్షల రూపాయల ఖర్చుతో 52 పాఠశాలలో కంప్యూటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరో 73 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో చదువుకోవాలనే ఉత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. జూన్ 2018 నాటికి నియోజక వర్గంలో 100 శాతం డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకొస్తామని కోనప్ప ధీమా వ్యక్తం చేశారు.
సరైన వైద్యం, అత్యవసర చికిత్స అందక అవస్థలు పడుతున్న నియోజవర్గ ప్రజలకు వైద్యం అందరికీ అందేలా ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రక్త హీనతతో ఇబ్బంది పడుతున్న గర్భిణీలకు పోషకాహార లోపం ఏర్పడకుండా నియోజక వర్గంలోని ప్రతి గర్భిణీకి 4నెలల పాటు ప్రతి నెల 2కిలోల బెల్లం, 2కిిలోల రాగిపిండి, 2కిిలోల పల్లిపట్టీలు పంపిణీ చేస్తున్నారు. దీంతో రక్తహీనత లేకుండా ప్రసవం సాఫీగా జరుగుతుంది. ప్రతి శుక్రవారం ప్రాథమిక వైద్య కేంద్రంలో పరీక్షలకు వచ్చే గర్భిణీలకు, ఇతర వైద్య పరీక్షలకు వచ్చే రోగులకు మధ్యాహ్న భోజనం, పప్పు, గ్రుడ్డు, అరటిపండును కోనప్ప సహకారంతో అందిస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం ఇతర నగరాలకు రోగులను తరలించడానికి ఎంపి నిధుల నుండి అంబు లెన్స్‌ను, చనిపోయిన వారి శవయాత్రకు వాహనాలను ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు.
సమాజ సేవలో భాగంగా తన కూతురు, కుమారుడి వివాహ వేదికలపైన పేద వారి పిల్లలకు వివాహాలు జరిపించి తన ఉదారతను చాటుకున్నారు కోనేరు కోనప్ప. తన కూతురి వివాహంలో అదే వేదికపై 22 మంది గిరిజనులకు, కుమారుడి వివాహంలో 16 మంది హిందువులకు, 6 ముస్లీం పేద కుటుంబాల పిల్లలకు వివాహాలు జరిపించి వారికి కావలసిన వస్తువులు, పుస్తె, మట్టెలు అందించి సహకరించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సామెతను నిజం చేస్తూ తన సేవాకార్యక్రమాలు కేవలం తానొక్కడివల్లే సాధ్యం కాలేదని, తన కుటుంబ సభ్యులు, దాతలు, కార్యకర్తలు, నియోజక వర్గ ప్రజల సహకారంతోనే సాధ్యమైందని కోనప్ప అన్నారు.
ప్రభుత్వం నుంచి తనకు పూర్తి సహకారం అందుతోందని, సీఎం చంద్రశేఖర రావు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నియోజక వర్గ అభివృద్ధి జరుగుతోందన్నారు. నియోజకవర్గంలో కుమ్రంభీం ప్రాజెక్టు సీఎం కృషివల్లే పూర్తయిందని, దాదాపు 20వేల ఎకరాలకు నీళ్లు అందిచగలిగామన్నారు. జగదేవ్‌పూర్ ప్రాజెక్టుతో 15వేల ఎకరాలకు, లిఫ్ట్ ఇరిగేషన్‌తో మరో 15వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడంతో రెండు పంటలు పండుతున్నాయన్నారు. మిషన్ కాకతీయలో 250 చెరువులను అభివృద్ధి చేసుకొని నీటికొరత రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తండాలు గ్రామ పంచాయితీలుగా మారడంతో కాగజ్‌నగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆశాభావం వ్యక్తం చేశారు.