తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రాజెక్టులపై సమీక్షలు జరుపుతున్న క్రమంలో జలయజ్ఞంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల్లో సాంకేతిక అపసవ్యతలు, మరికొన్ని డిజైన్ల లోపాలు, నీటి లభ్యత, అమలులో ఎదురవుతున్న సమస్యలు , అంతర రాష్ట్ర సమస్యలు, వన్యప్రాణి కేంద్రాలు , బొగ్గు గనులు ప్రాజెక్టులకు అవరోధాలుగా మారనున్నాయని ప్రభుత్వం గ్రహించింది. వీటిని రీ ఇంజనీరింగ్ చేస్తే తప్ప మరో పరిష్కారం లేదని ప్రభుత్వం భావించింది. గంటల తరబడి కొన్ని నెలల పాటు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా ఇంజనీరింగ్ నిపుణులతో , రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమై సర్వే ఆఫ్ ఇండియావారి మ్యాపులు, గూగుల్ ఎర్త్ సాఫ్ట్ వేర్ సహాయంతో చర్చించిన అనంతరం కొన్ని ప్రాజెక్టులను రీ డిజైన్ చేయవలసిన అవసరం ఉన్నదని గ్రహించినారు.
అందులో ఖమ్మం జిల్లాలో చేపట్టిన రాజీవ్ దుమ్ముగూడెం , ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ ద్వారా కొత్త ప్రతిపాదనలని సిద్ధం చేయడం జరిగింది. అదే సమీకృత సీతారామ ప్రాజెక్టు. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో భాగంగా కొత్త బ్యారేజీలు, జలాశయాలు, పంపుహౌజ్‌లు, టన్నెళ్ళు, కాలువలు నిర్మాణం చేయాలి. పాత జలాశయాల నిల్వసామర్థ్యం పెంచడం, పంపుల సామర్థ్యం పెంచడం.. ఇట్లా ప్రాజెక్టుల స్వరూప స్వభావాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన సీతారామ ప్రాజెక్టుపై కొంత మంది ప్రతిపక్ష నాయకులు అర్థ రహితమైన విమర్శలు చేయడం జరుగుతున్నది. ఈ విమర్శల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు రూపకల్పనకు దారితీసిన పరిస్థితులను ప్రజలకు వివరించవలసిన అవసరం ఉన్నది.
సమీకృత సీతారామ ప్రాజెక్టు సమగ్ర నివేదికను తయారు చేసే భాద్యతను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్‌కి అప్పగించింది. వాప్కోస్ సంస్థ ఇంజనీర్లతో,అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో ముఖ్యమంత్రి సమక్షంలో మేధోమథనం జరిగిన తర్వాత తుది నివేదికను వాప్కోస్ ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్ర క్యాబినెట్ కూడాఈ నివేదికను ఆమోదించింది. రాజీవ్ దుమ్ముగూడెం , ఇందిరాసాగర్ రుద్రమకోట ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ ద్వారా ఒకే సమీకృత సీతారామ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి16.2.2018న శంకుస్థాపన చేసిన సంగతి అందరికీ ఎరుకే. ఈ రెండు ప్రాజెక్టులను కలిపి ఒకే సమీకృత ప్రాజెక్టుగా ఎందుకు రూపకల్పన చెయ్యవలసి వచ్చిందో ప్రజలు తెలుసుకోవాలి.
గత సమైక్యాంధ్ర ప్రభుత్వ హయాంలో జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాకు 16.5 టిఎంసి గోదావరి నీటిని వినియోగించి 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం ,16.5 టిఎంసిల గోదావరి నీటిని వినియోగించి ఖమ్మం, కృష్ణా , పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాలకు నీరందించే ఇందిరా సాగర్-రుద్రమకోట ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగింది. ఇందిరాసాగర్ – రుద్రమకోట ఎత్తిపోతల పథకం ఖమ్మం జిల్లాలో 1,32,657 ఎకరాలకు, 68272 ఎకరాలకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూములకు నీరందించడానికి రూపొందించిన పథకం. వెరసి ఈ రెండు పథకాల ద్వారా తెలంగాణలో 27.72 టి ఎం సి ల గోదావరి నికర జలాల వినియోగంతో 3 లక్షల 33 వేల ఎకరాలు సాగవుతుంది. ఈ రెండు పథకాలకు అయ్యే ఖర్చు 2392 కోట్లుగా అంచనా వెయ్యబడింది. అయితే ఈ పథకం అమలు కోసం ప్రధానంగా 18 కి మీ ల పొడవున కిన్నెరసాని వన్య ప్రాణి నివాస ప్రాంతం ప్రధాన ఆటంకంగా ఉన్నది.ఈ రెండు పథకాలకు కలిపి 1.2 టి ఎం సి ల జలాశయ సామర్థ్యం మాత్రమే అదనంగా కల్పించబడింది.
రాష్ట్ర విభజన ఫలితంగా ఖమ్మం జిల్లా 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ అయిన కారణంగా ఇందిరాసాగర్ రుద్రమ కోట ప్రాజెక్టు అంతర రాష్ట్ర ప్రాజెక్టుగా మారింది. ఈ మార్పు కారణంగా ఖమ్మం జిల్లాలోని ప్రతిపాదిత 1,33,000 ఎకరాలకు నీరు అందివ్వగలగటం ఆంధ్రప్రదేశ్ అనుమతి సహకారం లేకుండా సాధ్యపడదు. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందున భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు నిర్వహణలో సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నవి. దీన్ని అంతర రాష్ట్ర ప్రాజెక్టుగా ఒప్పందం కుదుర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. అదే సమయంలో రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్టు పైప్ లైన్ మార్గం కిన్నెరసాని వన్యప్రాణి అటవీ ప్రాంతం నుండి వెళుతున్నందున అటువంటి ఎకో సెన్సిటివ్ జోన్ లో అనుమతులు పొందడం కష్టం. అంతర రాష్ట్ర సమస్యలను శాశ్వతంగా అధిగమించడానికి, వన్యప్రాణి అటవీ ప్రాంతం అనుమతుల సమస్యలని అధిగమించడానికి ఈ రెండు ప్రాజెక్టులను కలిపి ఒకే సమీకృత ప్రాజెక్టుగా (సీతారామ ఎత్తిపోతల పథకం) రూపొందించడం అనివార్యంగా మారింది.
ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రతిపాదించిన 3.33 లక్షల ఎకరాలకు అదనంగా మరో 3.41 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఉద్దేశ్యంతోనూ , ప్రస్తుతం ప్రతిపాదించిన 1.2 టి ఎం సి నిలువ సామర్థ్యానికి అదనంగా మరో 10 టి ఎం సిల సామర్థ్యం కల్పించే లక్ష్యంతో ప్రత్యామ్నాయంగా సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రు.7967కోట్ల ఖర్చుతో చేపట్టడం జరుగుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని 25 మండలాల్లో, వరంగల్ జిల్లాలోని ఒక మండలంలో స్థిరీకరణ సహా మొత్తం 6.74 లక్షలఎకరాలకు సాగునీరు , వందలాది గ్రామాలకు తాగునీరు అందించడానికి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది.
జి.ఓ. యం.యస్.11, తేదీ.18.02.2016 ద్వారా సీతా రామ ఎత్తిపోతల పథకం చేపట్టుటకు రూ.7926.147 కోట్లకు పరిపాలన అనుమతి ఇవ్వటం జరిగింది. ఈ ప్రాజెక్టు రూపకల్పన వెనుక ఖమ్మం జిల్లా ప్రజల ప్రయోజనాలు , అంతర రాష్ట్ర సమస్యలను శాశ్వతంగా అధిగమించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి జలాశయాల నిర్మాణం, కిన్నెరసాని వన్యప్రాణి నివాస ప్రాంతాన్ని తప్పించడం మొదలైన లక్ష్యాలే ఉన్నాయి.ఇందిరా రుద్రమకోట ప్రాజెక్టుల పనులు 80% పూర్తి అయినట్లు, ఇట్టి ప్రాజెక్టును ప్రభుత్వం వదిలేసిందని కొందరు ఆరోపించడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. పంపుహౌజ్ తవ్వి పెట్టారు. పంపులు, మోటార్లు తెప్పించి గోదాముల్లో పెట్టుకున్నారు. పైపులు మాత్రం వేశారు. పంపులు, మోటార్లు బిగించకుండానే 80శాతం పనులు పూర్తి అయినాయని వారు చెప్పడం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది. మనకు రావాల్సిన కృష్ణా నీటి వాటాలపై పేచీలు పెడుతున్నది. ఇటువంటి పేచీకోరు రాష్ట్రంతో శాశ్విత పరిష్కారంగా సమీకృత సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసి గతంలో కన్న ఎక్కువ భూమికి సాగునీరు అందించే ప్రయత్నం చేస్తుంటే స్వాగతించవలసింది పోయి విమర్శలకు దిగడం శోచనీయం. 1145 కోట్ల అగ్రిమెంట్ విలువలో 768 కోట్లు ఖర్చు పెట్టి 80శాతం పనులు పూర్తి అయినాయని చెప్పడం వాస్తవ విరుద్దం. ఫిజికల్ ప్రోగ్రేస్ 60శాతం కూడా లేదు. క్రిటికల్ పనులు అయిన పంపు హౌజ్ పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.
ఇక రీ డిజైన్ వలన 400 టి ఎంసి శబరి నీళ్ళను కోల్పోవలసి వస్తున్నదని వారు భాధపడుతున్నారు. శబరి నది గోదావరిలో కలిసిన తర్వాతనే ఇందిరాసాగర్ హెడ్ వర్క్స్ ఉన్న మాట వాస్తవమే. ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు కేటాయించిన నీళ్ళే 16.5 టి ఏంసి లు. ఇక 400 టి.ఎం.సి.లు కోల్పోవడం సమస్య ఎక్కడిది? అయినా ఈ పాపం ఎవరిది? ఖమ్మం జిల్లా 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పనంగా రాసిచ్చిన కేంద్రంలో అధికారంలో ఉన్న బి జె పి ప్రభుత్వానిది. వారితో ఆ పని చేయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. భౌగోళికంగా శబరి నీళ్ళని తెలంగాణ వాడుకునే పరిస్థితి లేదు. దుమ్ముగూడేం వద్ద గోదావరిలో పుష్కలంగా నీళ్ళున్నాయి. కనుకనే 70.40 టి ఎం సి లతో సమీకృత సీతారామ పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా సశ్యశ్యామలం అవుతుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అక్కసుతో వారు ఇటువంటి విమర్షలకు దిగుతున్నట్లు భావించవలసి వస్తుంది. ఖమ్మం జిల్లా ప్రజలు విజ్ఞత కలిగినవారు. అన్నీ గమనిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు వలన ఖమ్మం జిల్లాకు అందే ప్రయోజనాలు వారికి ఎరుకే. గత ప్రభుత్వం చేపట్టిన రెండు ప్రాజెక్టులని , సీతారామ ప్రాజెక్టుని పోల్చిచూసినట్లైతే తేడా అర్థమవుతుంది.
- సీతారామ ప్రాజెక్ట్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం , వరంగల్ జిల్లాల్లోనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎదురయ్యే అంతర రాష్ట్ర సమస్యలని శాశ్వతంగా పరిష్కరిస్తుంది. ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అంతర రాష్ట్ర ప్రాజెక్టు అన్న సంగతిని ప్రజలు గమనించాలి
- సీతారామ ప్రాజెక్టు పైప్ లైన్లు , కాలువలు కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి, ఎకో సెన్సిటివ్ జోన్‌కి దూరంగా ఉన్నాయి. అటవీ అనుమతుల్లో సమస్యలు ఉండవు.
- గతంలో రెండు పథకాల్లో ఉన్న నీటి కేటాయింపులు 33 టిఎంసిలు అయితే సమీకృత పథకంలో నీటి కేటాయింపులు 70.40 టిఎంసిలు.
- గత పథకాల్లో పైప్ లైన్ల మొత్తం పొడవు 77 కి.మీ అయితే సమీకృత సీతారామ ప్రాజెక్టులో పైప్ లైన్ల పొడవు 8.56 కి.మీ మాత్రమే.
- ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని మెరక ప్రాంతాలైన తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ మండలములకు సాగునీటి సౌలభ్యము లభిస్తుంది. జిల్లాలోని మధ్యతరహాప్రాజెక్టులైన వైరా, లంకాసాగర్, పాలేరుమరియు బయ్యారం ప్రాజక్టులకుకింద 46,187 ఎకరాలుమరియు పాలేరు ప్రాజక్టు ద్వారా నాగార్జున సాగర్ ప్రాజక్టు ఆయకట్టు 2,37,573 ఎకరాలు స్థిరీకరించబడతాయి.చిన్ననీటి చెరువుల కింద 1,35,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు సాగునీటి సౌలభ్యము లభిస్తుంది.
- గత పథకాల్లో మొత్తం విద్యుత్ వినియోగం 349 మె వా అయితే ప్రస్తుత సమీకృత ప్రాజెక్టులో విద్యుత్ వినియోగం 294 మె వా మాత్రమే.
- గత ప్రాజెక్టుల్లో తెలంగాణలో ఆయకట్టు 3.33 లక్షలు అయితే ప్రస్తుత సమీకృత ప్రాజెక్టులో ఆయకట్టు 6.74 లక్షల ఎకరాలు.
ప్రాజెక్టు ప్రధాన సాంకేతిక వివరాలు:
నీటిని ఎత్తిపోసే ప్రదేశం :
గోదావరి పై ప్రస్తుత దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన
లబ్ది పొందే మొత్తము ఆయకటు : 6.74లక్షల ఎకరాలు
ఎత్తిపోయు నీటి పరిమాణం : 70.40 %ువీజ
కాలువ డిశ్చార్జీ : 9000 క్యూసెకులు
పంటల తరహా : ఖరీఫ్ మెట్ట
వాలు కాలువ పొడవు : 243.20 కి.మీ.
పంపింగ్ కేంద్రాలు : 4
ప్రెజర్ మెయిన్ పొడవు : 8.56 కి.మీ.
ఆయకట్టు వివరాలు
జిల్లా ఆయకట్టు (ఎకరాలలో)
కొత్తది స్థిరీకరణ మొత్తము
భద్రాద్రి కొత్తగూడెం 1,57,574 42,935 2,00,509
ఖమ్మం 1,62,083 2,96,925 4,59,008
మహబూబాబాద్ 9,196 5,674 14,870
మొత్తము 3,28,853 3,45,534 6,74,387
1 పర్యావరణ ప్రభావ నివేదికలు తయారు చేయటానికి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ నుండి 04.08.2017 న అనుమతి లభించింది.నివేదికలు తయారు చేయబడుతున్నవి.
2 అటవీ భూముల బదలాయింపు నకు కావలసిన మొదటి దశ అనుమతి 02.02.2018 న లభించింది.
అటవీ భూముల బదలాయింపు నకు కావలసిన మొదటి దశ అనుమతి 02.02.2018 న లభించింది.
3 రెండవ దశ అటవీ అనుమతి పొందుటకు, మొదటి దశ అనుమతి నిచ్చేటప్పుడు విధించిన షరతుల ప్రకారం చెల్లించవలసిన రు.276 కోట్లు చెల్లించే ప్రక్రియ పురోగతిలో ఉన్నది.
4 వన్య ప్రాణి సంరక్షణ ఎకో సెన్సిటివ్ ప్రాంతానికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ పురోగతిలో ఉన్నది.
5 పథకంలో ప్రధాన కాలువ 8 ప్యాకేజి పనులు పురోగతిలో ఉన్నవి. ఈ పథకములో ఇప్పటి వరకు రు.240 కోట్ల విలువైన పనులు పూర్తి చేయటం జరిగింది.