sai44స్వరాష్ట్రం వస్తే ఏం వస్తుంది అనే వారికి మొదటి జవాబు కోతల్లేని కరెంటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయగీతికలో పల్లవి విద్యుత్‌. పాలనే చేతకాదు అనే వాళ్ల నోళ్లు మూయించిన మొదటి అంశం విద్యుత్‌ సంక్షోభం నుంచి విజయవంతంగా గట్టెక్కడం. తెలంగాణ వస్తే ఇక చిమ్మచీకట్లే అని విమర్శించిన నోళ్లు మూయించిన సక్సెస్‌ స్టోరీ నిరంతర కరెంటు సరఫరా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్‌ దృష్టి పెట్టిన రంగం విద్యుత్‌. చాలా వేగంగా ఫలితం వచ్చి ప్రజలు నూటికి నూరు శాతం సంతృప్తితో ఉన్న అంశం విద్యుత్‌. సంస్థ ఉద్యోగులకు పాలనా పగ్గాలు ఇచ్చి చేసిన ప్రయత్నం విజయవంతమైన మొదటి ప్రభుత్వ రంగ సంస్థ విద్యుత్‌ సంస్థ. ఎంత డిమాండ్‌ పెరిగినా ఒక్క క్షణం కూడా ప్రజలపై భారం పడనీయకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా నడుస్తున్న శాఖ విద్యుత్‌ శాఖ.

తెలంగాణ వచ్చే నాటికి పరిస్థితి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఉంది. నిత్యం కరంటు కోతలు, పవర్‌ హాలిడేలు విధించేవారు. కావాల్సినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డవి. కరెంటు కోసం పారిశ్రామిక వేత్తలు నిత్యం ధర్నాలు చేసేవారు. అటు ఇందిరా పార్కు, ఇటు విద్యుత్‌ సౌధలో ఎప్పుడూ ఆందోళనలే కొనసాగేవి. హైదరాబాద్‌ లో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతావరణం ఉండేది. వ్యవసాయానికి రెండు మూడు గంటల కరెంటు కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయేవి. భూగర్భంలో నీళ్లున్నా తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంట కళ్లెదుటే నాశనం అయ్యేది. నష్టపోయిన రైతుల ఆత్మహత్యలు చేసుకునేవారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన కరెంటును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్‌ కొరత 2,700 మెగావాట్లు. ఆ లోటు ఎలా పూడుతుందో తెలియని పరిస్థితి.

తెలంగాణలో కరెంటు సంక్షోభానికి కారణం?

sai55తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువ. ఆంధ్రలో విద్యుత్‌ డిమాండ్‌ తక్కువ. తెలంగాణలో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువున్న హైదరాబాద్‌ నగరానికి రెండువేలకుపైగా మెగావాట్లు కావాలి. తెలంగాణలో వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువ. దాదాపు 25 లక్షల పంపుసెట్లున్నాయి. దీనికి మరో 2500 మెగావాట్ల విద్యుత్‌ కావాలి. విద్యుత్‌ డిమాండ్‌ కు అనుగుణంగా తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి అవకాశాలు కూడా ఎక్కువనే ఉన్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపనకు అవసరమయ్యే బొగ్గు తెలంగాణలోనే ఉంది. తెలంగాణలో డిమాండ్‌ ఉంది. ఉత్పత్తి అవకాశాలున్నాయి. ఆంధ్రలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. అక్కడ విద్యుత్‌ డిమాండ్‌ తక్కువ. బొగ్గు లేదు. అయినా సరే… విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను తెలంగాణలో తక్కువ, ఆంధ్రలో ఎక్కువ నెలకొల్పారు. విజయవాడ, కడపలో బొగ్గు లేకున్నా అక్కడ థర్మల్‌ పవర్‌ స్టేషన్లు పెట్టారు. ఫలితంగా రెండు రకాల నష్టాలు ఏర్పడ్డాయి. బొగ్గు లేని చోట కరెంటు ఉత్పత్తి చేయడం వల్ల రవాణా భారం అధికమైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ థర్మల్‌ కేంద్రాలు ఆంధ్రకు పోవడం వల్ల తెలంగాణకు లోటు కరెంటు, ఆంధ్రకు మిగులు కరెంటు దక్కింది. ఈ పరిస్థితి గమనించే విభజన చట్టంలో ఉభయ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన కరెంటులో ఆంధ్ర 47 శాతం, తెలంగాణ 53 శాతం వాడుకోవాలని పేర్కొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమ పరిధిలోని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి తెలంగాణకు ఇవ్వాల్సిన 53 శాతం కరెంటును ఇవ్వకపోవడంతో విద్యుత్‌ సంక్షోభం ఎక్కువైంది.

విద్యుత్‌ సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకున్న ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ సంక్షోభం నుంచి గట్టెక్కడమనే సవాల్‌ ను మొదటగా స్వీకరించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. లోటు విద్యుత్‌ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు వేశారు. ముందుగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. సరఫరాలో, పంపిణీలో కలుగుతున్న నష్టాలు 16.83 శాతం నుంచి 15.98 శాతానికి తగ్గాయి. నత్తనడకన నడుస్తున్న భూపాలపల్లి, పాల్వంచ, జైపూర్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. అవి వేగంగా పూర్తయి ఉత్పత్తి ప్రారంభించే వరకు వెంటపడ్డారు. తెలంగాణలో పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్‌ అత్యవసరం కాబట్టి, ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఎక్కడ కరెంటు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి తీసుకున్నారు. ఉత్తరాది నుంచి కరెంటు పొందడానికి వీలుగా చత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని పిజిసిఎల్‌ ద్వారా కొత్త లైను నిర్మాణం చేయించారు. కొత్త విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు రూపకల్పన చేశారు.

ఫలించిన నాన్‌ ఐఎఎస్‌ ప్రయోగం

విద్యుత్‌ సంస్థలో నాలుగు భాగాలుంటాయి. విద్యుత్‌ ను ఉత్పత్తి చేసే జెన్‌ కో. విద్యుత్‌ ను సరఫరా చేసే ట్రాన్స్‌ కో. విద్యుత్‌ పంపిణీ చేసే ఎస్పీడిసిఎల్‌, ఎన్పీడిసిఎల్‌. ఈ నాలుగు విభాగాలకు ఐఎఎస్‌ అధికారులే సిఎండిలుగా ఉండే సంప్రదాయం ఉంది. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఈ ఒరవడిని మార్చేశారు కేసీఆర్‌. విద్యుత్‌ సంస్థలను నడపడంలో అనుభవం ఉన్న విద్యుత్‌ ఉద్యోగులకే పగ్గాలు అప్పగించారు. వారికయితేనే సాధకబాధకాలు తెలుస్తాయని భావించారు. విద్యుత్‌ సంస్థలో దాదాపు నాలుగు దశాబ్దాలు వివిధ స్థాయిలో పనిచేసిన అనుభవం కలిగిన దేవులపల్లి ప్రభాకర్‌ రావును జెన్‌ కో, ట్రాన్స్‌ కో సంస్థలకు సిఎండిగా నియమించారు. ఆ సంస్థలకు కావాల్సిన నిధులు సమకూర్చడంతో పాటు, విద్యుత్‌ ఉత్పత్తి,పంపిణీ తదితర విషయాల్లో ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కూడా ఇచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించి, ఆచరణ బాధ్యత వారికే అప్పగించారు. దీంతో కేసీఆర్‌ ఆశించిన ఫలితాలు వెంటనే వచ్చాయి.

స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు

తెలంగాణ విద్యుత్‌ రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అనుసరించింది. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో పకడ్బందీ వ్యూహం రూపొందించింది. అప్పటికప్పుడు సంక్షోభంలోంచి బయటపడి ప్రజలకు కావాల్సిన విద్యుత్‌ అందించడం కోసం ఎక్కడ దొరికితే అక్కడ విద్యుత్‌ కొనుగోలు చేసే స్వల్పకాలిక వ్యూహాన్ని అనుసరించింది. కొద్దికాలం పాటు విద్యుత్‌ అందించగలిగే సంస్థలతో మధ్యకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుని కరెంటు పొందింది. తెలంగాణకు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా కొత్త పవర్‌ స్టేషన్ల నిర్మాణానికి, నాణ్యమైన కరెంటు సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త పవర్‌ స్టేషన్లతో పాటు సబ్‌ స్టేషన్లు, లైన్లు నిర్మించింది. ఉత్తరాదితో నిరంతరం లింకు ఉండేందుకు కొత్త లైన్లు నిర్మింపచేసింది.

ఆరో నెల నుంచే కోతల్లేని విద్యుత్‌

sai66ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల (2014, నవంబర్‌ 20) నుంచే కోతల్లేని విద్యుత్‌ ప్రజలకు అందిస్తున్నారు. గ హావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నది. వ్యవసాయానికి 9 గంటల త్రీఫేజ్‌ కరెంటు అందిస్తున్నారు. భవిష్యత్‌ లోనూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలుండకుండా ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో దాదాపు 29 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నది. ఇందులో 5వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కూడా ఉన్నది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు కూడా భారీగానే కేటాయిస్తున్నది. 2017-18లో 4203.21 కోట్లు కేటాయించింది. 2014-15 లో 4878.68 కోట్లు, 2015-16 లో 7480.06 కోట్లు, 2016-17 లో 5341.46 కోట్ల రూపాయలను కేటాయించింది.

తెలంగాణ వచ్చే నాటికి 6,575 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 6,575 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉంది.ఇందులో నికరంగా విద్యుత్‌ అందచేయగలిగే జెన్‌ కో సామర్థ్యం కేవలం 4,365 మెగావాట్లు.

సిజిఎస్‌ ద్వారా 1908, థర్మో పవర్‌ టెక్‌ ద్వారా 270, గ్యాస్‌ ద్వారా 31, సోలార్‌ ద్వారా 1 మెగావాట్‌ విద్యుత్‌ వచ్చేంది.

35 నెలల్లో అదనంగా 4,190 మెగావాట్లు

తెలంగాణ ఏర్పడిన తర్వాత నిదానంగా నడుస్తున్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల పనులను ప్రభుత్వం వేగం చేసింది. భూపాలపల్లి పవర్‌ ప్లాంటు నిర్మాణం పూర్తి చేయడం ద్వారా 600, జైపూర్లో సింగరేణి పవర్‌ ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి 1200 మెగావాట్లను అందుబాటులోకి తెచ్చింది. థర్మల్‌ పవర్‌ టెక్‌ ద్వారా 570, సిజిఎస్‌ ద్వారా 178, జూరాల హైడ్రో స్టేషన్‌ నుంచి 240, పులిచింతల నుంచి 30, సోలార్‌ ద్వారా 1273, విండ్‌ ద్వారా 99 మెగావాట్ల విద్యుత్‌ తెలంగాణ వచ్చిన తర్వాత అదనంగా చేకూరింది. మొత్తం 35 నెలల కాలంలో తెలంగాణకు అదనంగా వచ్చిన 4,190 మెగావాట్ల విద్యుత్‌ తో మొత్తం స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 11,689 మెగావాట్లకు చేరింది.

4500 మెగావాట్లు ఉన్నా లేనట్లే

మే 2017 నాటికి 11వేలకు పైగా మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం కలిగి ఉన్నట్లు లెక్కవచ్చినా ఇందులో 4500 మెగావాట్ల విద్యుత్‌ లేనట్లే లెక్క. హైడల్‌, సోలార్‌, విండ్‌ ద్వారా వచ్చేది 3,531 మెగావాట్లు. ఇది నమ్మకం లేని కరెంటు. ఐపిపి గ్యాస్‌ 925 రావల్సి ఉన్నాఅది కూడా రావట్లేదు. థర్మల్‌ ద్వారా అందుబాటులో ఉన్నది 7,371 మెగావాట్లు. ఇందులో 80 శాతం వరకు విద్యుత్‌ వస్తుందనుకుంటే 6వేల మెగావాట్లకు లోపే నికర విద్యుత్‌ ఉన్నట్లు లెక్క. కానీ తెలంగాణలో గరిష్టంగా ఉన్న డిమాండ్‌ 9వేల మెగావాట్లు. అందుకే తెలంగాణలో కొత్త విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.

ఈ ఏడాది చివరి నాటికి అదనంగా మరో 4,130 మెగావాట్లు

ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్ల పాల్వంచ లో అదనంగా మరో 800, చత్తీస్‌ గఢ్‌ నుంచి 1000, భద్రాద్రి పవర్‌ ప్లాంటు నుంచి 1080, పులిచింతల నుంచి 90, సోలార్‌ ద్వారా 954,

సిజిఎస్‌ నుంచి 206 మెగావాట్లు 2017 చివరి నాటికి తెలంగాణలో అదనంగా అందుబాటులోకి వస్తాయి. అంటే 2017 డిసెంబర్‌ నాటికి మొత్తం 15,032 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం తెలంగాణకు సమకూరుతుంది.

వచ్చే మూడేళ్లలో అదనంగా 14,426 మెగావాట్లు

తెలంగాణలో విద్యుత్‌ అవసరాలు ఇంకా పెరుగుతాయి. టిఎస్‌ ఐపాస్‌ చట్టం వల్ల హైదరాబాద్‌ లో పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయి. వీటికి 24 గంటల కరెంటు ఇవ్వాల్సి ఉంటుంది. రైతులకు సాగునీరు అందించడం కోసం భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. దీనికి కూడా కరెంటు బాగానే అవసరం. మిషన్‌ భగీరథ కు, హైదరాబాద్‌ మెట్రో రైలు నడవడానికి కూడా అదనంగా కరెంటు అవసరం. తెలంగాణ రైతాంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్నది కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. వీటన్నింటిని ద ష్టిలో కొత్త విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కేంద్రప్రభుత్వంపై వత్తిడీ తెచ్చి రామగుండం ఎన్‌.టి.పి.సి. లో 4000 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రానికి ఆమోదం తీసుకుంది. ఇప్పటికే మొదటి దశలో 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణం ప్రారంభం అయింది. యాదాద్రిలో కూడా 4,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి అన్ని అనుమతులు సాధించింది. త్వరలో నిర్మాణ పనులు పూర్తవుతాయి. చత్తీస్‌ గఢ్‌ నుంచి రెండో దశలో మరో 1000 మెగావాట్లు, సింగరేణి నుంచి మరో 800, సిజిఎస్‌ ద్వారా మరో 809, సోలార్‌ ద్వారా ఇంకో 3727, హైడల్‌ ద్వారా ఇంకో 90 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. వీటన్నిటి ద్వారా వచ్చే మూడేళ్లలో మొత్తం 14,426 మెగావాట్లు అదనంగా వచ్చి చేరుతుంది. ఇప్పుడున్న కరెంటుతో కలుపుకుంటే మూడేళ్ల తర్వాత తెలంగాణలో 29,321 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. అప్పుడు తెలంగాణ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారి ఇతరులకు కరెంటు అమ్ముకునే స్థితి వస్తుంది. ఇది తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు లాభాలు తెచ్చిపెడుతుంది. విద్యుత్‌ విషయంలో మరిన్ని రాయితీలు ప్రజలకు ఇచ్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

Other Updates