madaramతెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. ఈ జాతర నిర్వహణకు గత ప్రభుత్వాలు కేటాయించిన అరకొర నిధులు కాకుండా, ఈ సారి 100కోట్ల రూపాయలకు పైగా కేటాయించి పెద్ద ఎత్తున పనులను చేపట్టింది. వరంగల్‌ జిల్లాలోని మేడారం గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ జాతర జరుగుతుంది. జాతర ప్రధానంగా కోయ గిరిజనులకు చెందినదైప్పటికి అసంఖ్యాక ప్రజలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండే కాక చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ తదితర ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. జాతరలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు ప్రధాన వేల్పులు. జాతరకు సంబంధించిన మౌఖిక, చారిత్రక, కాల్పనిక గాథలు వేర్వేరుగా వ్యాప్తిలో ఉన్నాయి. 1996లో ఈ జాతర స్టేట్‌ ఫెస్టివల్‌గా ప్రత్యేక హోదాను పొందింది.

జాతరకు తరగని ఆదరణ

శాస్త్రీయంగా, సాంకేతికంగా హైటెక్‌ యుగంలో పయణిస్తున్న నేటి కాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన దేవతలపై ప్రజల విశ్వాసం పెరుగుతున్నదనడానికి మేడారంలో జరుగుతున్న జాతరయే ప్రత్యక్ష నిదర్శనం. మారుతున్న కాల పరిస్థితులు గిరిజన సాంప్రదాయాలను క్రమంగా కబళిస్తున్నప్పటికీ, దాదాపు 700 సంవత్సరాల చరిత్రగల మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతల పట్ల ప్రజల భక్తి విశ్వాసాలు ఏ మాత్రం తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఈ జాతరకు హాజరవుతున్నారు. సుమారు లక్షలాది మంది ఈ విషయాన్ని నిరూపిస్తున్నారు.

గిరిపుత్రుల్లో ఉండే పట్టుదల, నమ్మకం, నిజాయితీలకు ఈ జాతర ప్రత్యక్ష సాక్షి, వరంగల్లు జిల్లా కేంద్రానికి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవీ ప్రాంతంలో ఉన్న మేడారం గిరిజన గూడెంలో అత్యంత వైభవంగా, గిరిజన సాంప్రదాయబద్దంగా సాగే ఈ జాతర గిరిజన ఆచార వ్యవహారాలతో పాటు వారిలో ఉండే ఐక్యత, కట్టుబాట్లు ఆత్మగౌరవాలను ప్రపంచానికి చాటుతుంది. ప్రతీ రెండేళ్ళకొకసారి జరిగే ఈ జాతరకు హాజరయ్యే భక్తుల సంఖ్య గత కొన్ని దశాబ్దాలుగా గణనీయంగా పెరగడాన్ని బట్టి చూస్తే మేడారం జాతరకు నేటికి ప్రజల్లో ఆదరణ ఎంతమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. ఈ జాతరలో పాల్గొని సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కుబడులు చెల్లించి, వారి అనుగ్రహం పొందాలన్న ఏకైక లక్ష్యంతో లక్షలాది మంది భక్తులు ఎన్నో వ్యయప్రయాసలను లెక్కచేయకుండా వివిధ వాహనాల్లో మేడారం గ్రామానికి చేరుకుంటారు. సమీప అటవీ ప్రాంతంలో తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసుకుని విడిదిచేసి, సమ్మక్క-సారలమ్మ దేవతలకు పూజలు చేయడం ఈ జాతర ప్రత్యేకత.

రూ. 102కోట్లతో అభివద్ది పనులు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారి జరుగుతున్న ఈ అతిపెద్ద గిరిజన జాతరకు ప్రభుత్వం గతంలో ఎన్నడూలేనివిధంగా 101.87కోట్ల రూపాయలు కేటాయించింది. గతంలో జరిగిన జాతరలకు అప్పటి ప్రభుత్వాలు అరకొర నిధులు మంజూరు చేయడంతో ప్రతి జాతరకు భక్తులు వసతులలేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సారి జాతరకు మెరుగైన రహదారుల నిర్వహణ, మంచినీటి సౌకర్యాలు, పారిశుద్ద్యం, రవాణా, శాంతి భద్రతలు, నిరంతర విద్యుత్‌ తదితర సౌకర్యాల కల్పనకు ఈ 101.87కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు.

మెరుగైన రవాణా సౌకర్యం

తెలంగాణతో పాటు ఆంద్రప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుండి దాదాపు కోటి మందికిపైగా భక్తులు హాజరయ్యే ఈ మేడారం జాతరకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి ఈ సారి 40.25కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో కొత్తగా 65కిలోమీటర్ల మేర బిటీరోడ్లు, కొత్త అప్రోచ్‌రోడ్లు నిర్మిస్తున్నారు. వేలాదిగా వచ్చే వాహనాల పార్కింగ్‌కు 27 ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లను చేస్తున్నారు.

విశాలంగా స్నానఘట్టాలు

మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు గాను కొత్తగా 800మీటర్ల స్నానఘట్టాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 2,681 మీటర్ల స్నానఘట్టాలకు మరమ్మతులు చేయడంతో పాటు, కొత్తగా మరో రెండు ఇన్‌ఫిల్టరేషన్‌ బావులను నిర్మిస్తున్నారు. జంపన్నవాగులోభక్తుల రక్షణార్థం దాదాపు 150మందికి పైగా గజ ఈతగాళ్ళను నియమించారు.

సమ్మక్క పూజారులు

సంఖ్య పేరు

1 ఎంపల్లి మహేష్‌

2 కొక్కరి నర్సింహ్మా

3 చందా బాబురావు

4 సిద్దబోయిన మునేందర్‌

5 సిద్దబోయిన లక్ష్మణ్‌రావు

శ్రీ సారలమ్మ పూజారులు

సంఖ్య పేరు

1 కాక వెంకటేశ్వర్లు

2 కాక కిరణ్‌

3 కాక కనకమ్మ

4 కాక బుజంగరావు

5 కాక లక్ష్మిబాయి

6 కాక సారయ్య

గోవిందరాజుల పూజారి

1. దబ్బకట్ల గోవర్థన్‌

పగిడిద్దరాజు పూజారి

1. పెనక బుచ్చిరామయ్య

విస్తృతంగా వైద్య సదుపాయాలు

మేడారంలో లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం 100పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఆసుపత్రిలో వివిధ రంగాలకు చెందిన నిష్నాతులైన 14మంది డాక్టర్లను నియమిస్తున్నారు. 150మంది వైద్యాధికారులు, 600మంది పార మెడికల్‌ సిబ్బందిని నియమించడంతో పాటు సరిపడ మందులను అందుబాటులో ఉంచారు.

మేడారంలోని ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో మరో 20పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో పాటు 15 ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. తాడ్వాయిలో పది పడకలు, పస్రాలో ఐదు పడకల తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు మేడారం దారిలో ఉన్న 11ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారు. మేడారంలో రెండు అత్యవసర ఆపరేషన్‌ థియేటర్లను ఏర్పాటు చేశారు.

4000 ఆర్టీసీ బస్సులు

రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం దాదాపు 4,000బస్సులను ఆర్టీసీ నడుపనున్నది. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుండి ప్రత్యేకంగా బస్సులు నడుపనున్నారు. లక్షలాది మంది ప్రయాణికుల సౌకర్యార్థం మేడారంలో ప్రత్యేక బస్టాండ్‌ ఏర్పాటుతో పాటు క్యూలైన్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు.

50కోట్లతో పస్రా, తాడ్వాయి రోడ్డు నిర్మాణం.

మేడారానికి వచ్చే ప్రధాన రహదారి అయిన పస్రా, తాడ్వాయి మార్గాన్ని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చడానికి 50కోట్ల రూపాయలతో పనులను చేపట్టారు. గత దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రస్తుత ప్రభుత్వం హయాంలో జరగడంతో జాతరకు వచ్చే వేలాది వాహనాలు ప్రయాణానికి మార్గం సులభమైంది.

వివిధ శాఖలచే విస్తృత ఏర్పాట్లు

ఈ జాతరకుగాను దాదాపు 3.70కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా 11కేవీ, 6.3కేవీ లైన్లను విద్యుత్‌ శాఖ ఏర్పాటు చేస్తోంది. 10లక్షల రూపాయల వ్యయంతో జాతరకు వేలాది బండ్ల ద్వారా వచ్చే పశువుల ఆరోగ్య నిమిత్తం ప్రత్యేక వ్యాక్సినేషన్‌, మందులను ఏర్పాటు చేశారు. జాతర మొత్తంలో సిసికెమెరాల ఏర్పాటు, జాతర ముందు, అనంతరం పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వహణ, వ్యర్థపదార్థాల తొలగింపుకు కోటి 25లక్షల రూపాయలను జిల్లా పంచాయతీ అధికారికి కేటాయించారు.

వీటితో పాటు జాతర విశేషాలను ఎప్పటి కప్పుడు ప్రపంచానికి అందించే వీలుగా 13.50లక్షల రూపాయల వ్యయంతో ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ ఏర్పాటును జిల్లా పాలనా యంత్రాంగం చేపట్టింది. వీటితో పాటు ఎక్సైజ్‌, టూరిజం, పోలీసు, రెవెన్యూ, ఫిషరీష్‌, ఫైర్‌ సర్వీస్‌లు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో పాటు పలు విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ జాతర నిర్వహణలో పాలు పంచుకుంటున్నాయి.

జాతరను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజురు చేసి ఆయా పనులను సకాలంలో పూర్తి చేస్తుండడంపట్ల ప్రజలు హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నారు.

Other Updates