సర్కారుబడి సమస్యల ఒడి కాదు.. సిద్ధిపేటలో మాత్రం చదువులమ్మ గుడి అంటున్నది..! ప్రేవేట్‌పై వేటును వేస్తున్నది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లోనే ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన చేపడుతున్నది.
ఒకప్పుడు వానొస్తే.. విలవిల, గాలొస్తే.. గలగలంటూ నలుగురు నవ్వుకునేలా.. సిద్ధిపేటలోని ఇందిరానగర్ హైస్కూల్ ఉండేది. ఈ స్కూల్లో చేరాలంటే విద్యార్థులు పారిపోయేవాళ్లు. కానీ ఇవాళ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక దృష్టి పెట్టడంతో డిజిటల్ క్లాస్ రూమ్స్, నాణ్యమైన విద్య సకల సదుపాయాలను సమకూర్చుకుని సరస్వతీ నిలయానికి చిరునామాగా మారింది. నాణ్యమైన విద్యపై భరోసా ఇవ్వడంతో దారులన్నీ ఇందిరా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలవైపే మళ్ళుతున్నాయి.
ఇంగ్లీషు చదువుపై ఉన్న మోజుతో సర్కారు చదువంటే సామాన్యుడు సైతం వద్దంటున్నకాలమిది. వేల కోట్లు ప్రభుత్వ విద్యపై సర్కారు వెచ్చిస్తున్నా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడమే తప్ప పెరుగుతున్న పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం, కేజీ టు పీజీ ఉచిత విద్యకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానంలో చేపడుతున్న కొత్త సంస్కరణలు, విధి విధానాలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మళ్ళీ నమ్మకం పుట్టుకొచ్చింది. హరిత తెలంగాణ పాఠశాల సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. విద్యార్థులతో కమిటీలు, విద్యార్థుల చేత మానిటరింగ్ చేయించడం, గతంలో చదివిన విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ప్రధాన కారణమైంది.
బడిబాటతోనే మొదలైన చేరికలు !
ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను లింగారెడ్డిపల్లి పంచాయతీలో ఉన్నప్పుడే నిర్మించారు. ఆ తర్వాత ప్రశాంత్ నగర్ పరిధిలోకి మారి 1994 స్థాయి పెంపు చేస్తూ ఉన్నత పాఠశాలగా, 2005లో సక్సెస్ పాఠశాలగా మార్చారు. ప్రైవేట్ పాఠశాలలు లేని సమయంలో విద్యార్థులతో కళకళలాడిన ఈ బడిలో క్రమేపీ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత సిద్ధిపేట కొత్త పట్టణ పరిధిలోని మురికివాడల్లో ఒకటైన ఇందిరా నగర్ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో విద్యా బోధన చేస్తున్నారు. పాఠశాల సామర్థ్యం 480 మంది విద్యార్థులకే ఉన్నప్పటికీ ఈ పాఠశాలలో 2015-16 విద్యా సంవత్సరంలో 390 మంది విద్యార్థులు చేరగా, 2016-17 విద్యా సంవత్సరంలో తరగతి గదులు లేకున్నా అదనంగా 300 పైచిలుకు తో ప్రారంభమైన విద్యార్థుల సంఖ్య 600 మందికి చేరింది.
ఈ విద్యా సంవత్సరం 2017-18 ప్రారంభానికి ముందే బడిబాటలోనే దాదాపు 150 మంది తమను చేర్చుకోవాలని ఆ స్కూల్‌లో సీటు కోసం విద్యార్థులు క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంలో కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. వర్షాలు వస్తే, ఒక్కో గదిలో పదుల సంఖ్యలో నక్కినక్కి ఉండాల్సిన సందర్భం. సమైక్యపాలనలో నరకానికి నకలుగా ఉన్న స్కూల్‌పై ఒకప్పుడు ఖాళీలు, గైర్హాజరీలతో బోసిపోయినట్లుండే పరిస్థితి నుంచి లక్ష్యానికి మించి చేరికలు చేసే స్థాయికి ఎదిగింది. ప్రత్యేకించి సిద్ధిపేట జిల్లాలో 450 పైచిలుకు ఇంగ్లీషు మీడియంలో చదివే విద్యార్థులు ఉన్న ఏకైక పాఠశాలగా నిలిచి స్ఫూర్తిదాయకంగా వెలుగొందుతున్నది. దాదాపు 600 పైచిలుకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పదవ తరగతిలో వందకు వంద శాతం సత్ఫలితాలను అందిస్తున్నది.
ఫలించిన మంత్రి చొరవ, ఉపాధ్యాయుల కృషి !
పాఠశాలలో సమస్యలను తాను పరిష్కరిస్తానని, ఉపాధ్యాయులుగా మీ బాధ్యత మీరు నిర్వర్తించాలని మంత్రి హరీష్ రావు ఇచ్చిన భరోసాతో ముందుకుసాగారు. బడి ఆవరణలో వచ్చదనం, ఆహార, హాజరు, విద్యాసంవత్సరం, టిఎల్‌ఎం, ఆటలు, సాంస్కృతిక, పారిశుద్ధ్య, గ్రంథాలయం, క్రమశిక్షణ కలిగి ఉండేలా 10 రకాల కమిటీలు వేశారు. ఒక్కో కమిటీలో ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థి, విద్యార్థినికీ ప్రాతినిథ్యం కల్పించి పాఠశాల సమస్యలు, కంప్యూటర్ క్లాసులు నిర్వహించడం, వివిధ అంశాలపై సమన్వయపర్చడం ప్రతి విద్యార్థిపై పర్యవేక్షణ చేయడం ప్రారంభించారు.
ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ అంశాలు నిర్వహిస్తూ విద్యార్థులకు బడిపై మక్కువ పెంచారు. విద్యార్థులతో కలిసి పాఠశాల సమీపాన చేపట్టిన మద్యపాన నిషేధ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో అందరి చూపు ఈ బడిపై పడింది.
ఇందిరా నగర్ పాఠశాలలో 20 మంది తెలుగు, ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయులతో పాటు బోధనేతర సిబ్బంది వివరాలు, పదవతరగతిలో తాము సాధించిన ఫలితాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పయ్యావుల రామస్వామి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపి వారి నమ్మకాన్ని రెట్టింపు చేశారు. పక్కా ప్రణాళికతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించి విద్యా కుసుమాలను వికసింపజేస్తున్న అధ్యాపకుల కృషిని అభినందిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
రూ. 53 లక్షలతో పాఠశాలకు అధునాతన హంగులు
అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న సిద్ధిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలను అభివృద్ధి చేసేందుకు నాట్కో ట్రస్టు ఫార్మాలిమిటెడ్ శ్రీకారం చుట్టింది. రూ. 10 లక్షలతో పరిశుభ్రమైన మంచినీటిని విద్యార్థులకు అందించడానికి ఆర్వోప్లాంట్, స్టోర్ రూమ్, వాష్ ఏరియా, అత్యాధునిక వంటగది, షెడ్ నిర్మాణం, రూ.17 లక్షలతో బాల, బాలికలకు ప్రత్యేక మూత్రశాలలు, రూ.3 లక్షలతో డిజిటల్ క్లాస్ రూమ్స్, రూ. 23 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
మానవీయ, సామాజిక విలువలు నేర్పుతున్నాం -పయ్యావుల రామస్వామి ప్రధానోపాధ్యాయుడు
ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్టులో పట్టు సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. కేవలం పుస్తక పరిజ్ఞానమే కాకుండా సమాజం పట్ల అవగాహన, మానవీయ విలువలు నేర్పుతున్నాం. ప్రైవేట్ పాఠశాలల్లో కంటే నాణ్యమైన విద్యను అందించే 20 మంది ఉపాధ్యాయులున్నారు. వీరందరి అంకిత భావం, పనిలో చిత్తశుద్ధి, నిరంతర కృషే మా పాఠశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని సాధించగలుగుతున్నాం. ప్రతి రోజు అరగంట ‘ఇన్‌హౌస్ ఓరియంటేషన్’తో విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి మంత్రి హరీష్ రావు చొరవతో… కేటాయించిన సీట్లకంటే అధిక సంఖ్యలో వచ్చిన దరఖాస్తులే ప్రభుత్వ పాలన, పాఠశాల నిర్వహణకు నిదర్శనం.