govt-schoolsగటిక విజయ్‌కుమార్‌

ఇస్రోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

విద్యార్థులు, ఉపాధ్యాయులకు డిజిటల్‌ పాఠాలు

కేబుల్‌ టివి ద్వారా టెలి పాఠాలు

ఎల్‌.సి.డి. ప్రొజెక్టర్లతో వీడియో పాఠాలు

ప్రతీ పాఠశాలలో డిజిటల్‌ లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌

మన టివిలో పాఠాల నిడివి రెట్టింపు

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన పురోగతి సమాజంలోని అట్టుడుగునవున్న వారికి ఉపయోగపడినప్పుడే సార్థకత అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలంగా నమ్ముతున్నది. సమాచార సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు నేటి సమాజానికి ఉపయోగపడడమే కాకుండా భావి తరాలను తీర్చిదిద్దడానికి ఉపయోగించుకోవాలనే విధాన నిర్ణయం తీసుకున్నది. కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలకే పరిమితమైన డిజిటల్‌ పాఠాలను ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కేబుల్‌ టివి ద్వారా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు టెలిపాఠాలు అందించే విధంగా ఇస్రోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో తెలంగాణలో సర్కారు బడుల స్థితిగతులే మారనున్నాయి. తెలంగాణలోని 3,352 ఉన్నత పాఠశాలల్లో మొదటి దశలో డిజిటల్‌ పాఠాలు అందించే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు 2016 నవంబర్‌ 16న ప్రారంభించారు.

ఆన్‌ లైన్‌, ఆఫ్‌ లైన్‌ సేవలు

డిజిటల్‌ పాఠాలు ఇకపై పాఠశాలలకు రెండు రకాలుగా అందుతాయి. ప్రస్తుతం పాఠశాలల్లో ఉండే కంప్యూటర్ల ద్వారా టెలీ పాఠాలు అందేవి. కానీ ఇప్పుడు కేబుల్‌ టివి సౌకర్యం ద్వారా టెలి పాఠాలు అందుకునే అవకాశం వచ్చింది. దీని ద్వారా ప్రతీ రోజు విద్యార్థులకు వివిధ అంశాలపై మన టివి ద్వారా పాఠాలు ప్రసారం అవుతాయి. పాఠశాలల్లోని టివిలను చూస్తూ పిల్లలు విషయావగాహన పెంచుకోవచ్చు. ఇక ప్రతీ వారం జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్‌)ల్లో శిక్షణ పొందే ఉపాధ్యాయులకు కూడా పాఠాలు అందుతాయి. సబ్జెక్టుల వారీగా ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమాలు కూడా ప్రసారం అవుతాయి. ప్రధానోపాధ్యాయులతో కూడా ఆన్‌ లైన్లోనే సమీక్ష నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఇలాంటి ఆన్‌ లైన్‌ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి), స్టేట్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ (ఎస్‌.ఐ.ఇ.టి) ఇప్పటికే రూపొందించిన పాఠ్యాంశాల వీడియోలను ప్రతీ పాఠశాలకు పంపుతారు. పాఠశాలల్లోని కంప్యూటర్లను వినియోగించి ఎల్‌.సి.డి. ప్రొజెక్టర్ల ద్వారా తరగతి గదిలో స్క్రీన్‌ పై ప్రదర్శిస్తారు. ఇప్పటికీ కంప్యూటర్లు లేని పాఠశాలలకు దశల వారీగా కంప్యూటర్లు సరఫరా చేస్తారు. అన్ని పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబులను ఏర్పాటు చేస్తారు. సర్వర్ల సామర్థ్యం పెంచుతారు. బోధనాంశాలతో కూడిన వీడియోలను భద్రపరిచిన 1 టిబి హార్డు డిస్కులను కూడా పాఠశాలలకు సరఫరా చేస్తారు. సదరు వీడియో పాఠాలు ప్రతీ పాఠశాలలో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు వాటిని ఎప్పటికప్పుడు వినే అవకాశం ఉంటుంది. కంప్యూటర్‌ ల్యాబులున్న 2,600 పాఠశాలల్లో 2017 జూలై నాటికి సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. 2017-18 విద్యా సంవత్సరానికి మిగతా అన్ని పాఠశాలల్లో కూడా కంప్యూటర్లను సమకూరుస్తారు.

రోజూ నాలుగు గంటల పాటు మన టివి పాఠాలు

మన టివి ద్వారా ప్రస్తుతం కేవలం రెండు గంటల నిడివిగల పాఠాలే ప్రసారం అవుతున్నాయి. ఇకపై నాలుగు గంటల పాటు పాఠాలు ఉంటాయి. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన పాఠ్యాంశాలు రెండు గంటల పాటు, ఎస్‌ఐఇటి, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రూపొందించిన పాఠ్యాంశాలు కూడా ప్రసారం అవుతాయి. దాదాపు అన్ని పాఠశాలల్లో మన టివి వీక్షించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది.

Other Updates