సర్వమతాల సమాహారం తెలంగాణ అని, అన్ని మతాల, కులాల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. అందుకే రంజాన్, క్రిస్‌మస్ పండుగలను కూడా రాష్ట్ర ప్రభుత్వ పండుగలుగా నిర్వహిస్తున్నామన్నారు. క్రిస్‌మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అన్నారు. మతసామరస్యంలోనే కాదు, అభివృద్ధిలో కూడా రాష్ట్రం ముందుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ఆర్థిక అభివృద్ధి సాధించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రెవిన్యూ వృద్ధి 29.97 శాతం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్.బి.స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రిస్‌మస్ వేడుకలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రిస్‌మస్ కేక్ కట్‌చేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. దుస్తుల పంపిణీ చేశారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన క్రైస్థవులకు నగదు పురస్కారాలు అందచేసి సన్మానించారు.
భగవంతుడి దయవల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం శాంతియుత వాతావరణంలో అద్భుతమైన ప్రగతి, మత సామరస్యాన్ని సాధించిందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. క్రైస్తవ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. త్వరలోనే క్రిస్టియన్ భవన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వం రూ. 4వేల కోట్లు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ. 2వేల కోట్లు కేటాయించిందన్నారు.
విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే మైనారిటీలకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వారికి విద్య నేర్పుతున్నట్లు తెలిపారు. ఈ గురుకుల పాఠశాలలు అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.
ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, పలువురు క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.