KCRఅన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రిష్టియన్‌లతో పాటు ఇతర మతాలకు చెందిన ప్రజల మనోభావాలకు విలువనిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్నది. ప్రజలకు సంబంధించిన పండుగలను ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తూ ఆయా మతాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హిందువులకు సంబంధించి బతకమ్మ, దసరా, బోనాల పండగలను, ముస్లింలకు సంబంధించిన రంజాన్‌ పండగను, క్రిస్టియన్లకు సంబంధించి క్రిస్‌మస్‌ పండగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. బతకమ్మ పండగ సందర్భంగా ప్రభుత్వం పది కోట్ల రూపాయల ఖర్చుతో అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలలోను బతుకమ్మ ఆడడానికి అన్ని ఏర్పాట్లను చేసింది. జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేసి, అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. గ్రామాలలోని దేవాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించడం, బతుకమ్మ నిమజ్జనం చేసే చెరువుల వద్ద మహిళలకు మంచినీరు, విద్యుత్‌ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.

బోనాల సందర్భంగా కూడా బస్తీల్లో ఉన్న అమ్మవారి దేవాలయాల అభివృద్ధికి, అలంకరణలకు ఆలయాన్ని బట్టి రూ. 10వేల మొదలుకుని ఆపైన నిధులు కేటాయించారు. అలాగే ముస్లింల పండగ రంజాన్‌ సందర్భంగా కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి రూ. 26 కోట్లు విడుదల చేశారు. అన్ని మజీద్‌లను విద్యుత్‌ బల్బులతో అలంకరించారు. మజీదుల వద్ద మంచినీటి వసతి, విద్యుత్‌ తదితర కనీస వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఖర్చుతో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు.

పేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌ నగరంలోని నిజాం కళాశాల మైదానంలో ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ముస్లిం మత పెద్దలు, నగరానికి చెందిన మంత్రులు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే కాకుండా మజీద్‌లలో ఉండే ఇమామ్‌లకు గౌరవవేతనాన్ని కూడా నిర్ణయించారు.

ఇక క్రిస్టియన్‌లకు సంబంధించిన క్రిస్‌మస్‌ పండగను కూడా ప్రభుత్వ పండగగా జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని చర్చిలను విద్యుత్‌ దీపాలతో అలంకరించడంతో పాటు చర్చిలకు ప్రార్థనలకు వచ్చే భక్తులకు కనీస వసతి సౌకర్యాలు కల్పనకు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. పేద క్రిష్టియన్‌లకు కూడా క్రిస్‌మస్‌ పండగరోజు నూతన వస్త్రాల పంపిణీ చేయడానికి నిర్ణయించారు. ఈ నిర్ణయాలకు సంబంధించి అన్ని మతాల మత పెద్దలు తమ హర్షం వ్యక్తం చేశారు. సర్వమత సమానత్వానికి తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలుస్తున్నదని మేధావులు, మత పెద్దలు, వివిధ వర్గాల, మతాల ప్రజలు ప్రశంసించడమే కాకుండా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.

Other Updates