tsmagazine

తెలంగాణ
సాంస్కృతిక పునరుజ్జీవనంలో సంస్థల కృషి చరిత్రాత్మక మైంది. సంస్థలు స్థాపించిన వారు త్యాగధనులు. సాంస్కృతిక వేదికలు తమకు రాజకీయంగా ప్రమాదకారులు కావచ్చనే అనుమానంతో నిజాము నిర్బంధాలను ఎంత కఠినంగా అమలు జరిపినా సంస్థల స్థాపన, కార్యక్రమాల నిర్వహణ ఆగలేదు. పొరుగున వున్న ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిషువారి ఉదార వాదం, ఆర్ధికాభ్యుదయ దోహదంతో వయక్తికంగా సాహితీ సాంస్కృతిక వికాసం గణనీయంగా జరిగినా అక్కడ సంస్థాపరమ్కెన కృషి తెలంగాణతో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. అక్కడి కవి, పండితులు తమ సాహితీకళా ప్రతిభా ప్రదర్శనాన్ని తమ ప్రఖ్యాతిని పెంపొందించుకొనే లక్ష్యంతో చేయగా తెలంగాణలో ఈ ప్రాంత సాంస్కృతిక అభ్యుదయమే ప్రధానంగా భావించి స్వార్ధత్యాగదృష్టి ప్రదర్శించడం గమనార్హం.

శ్రీకృషదేవరాయాంధ్ర భాషా నిలయం
గ్రంథాలయోద్యమం నాటి హైదరాబాద్‌ రాష్ట్రాన్ని వెలిగించింది. ఊరూరా అక్షరాస్యతను, సాహిత్యాభిరుచిని, సామాజిక అభ్యుద యాకాంక్షను పెంపొందించింది. మొదట వెలసిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయోద్యమానికి కేంద్రబిందువైంది. అప్పటికి శ్రీకృషదేవరాయలు తెలుగు భాషా సాహిత్యాలకు కల్పించిన ఔన్నత్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని పెద్దలు ఆపేరు పెట్టారు. 1901 సెప్టెంబర్‌ 1 న హైదరాబాద్‌ నగరంలో భాషా నిలయం వెలసింది. భాషా నిలయస్థాపక వైతాళికుల్లో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, ఆయనకు అండదండగా నిలిచిన మునగాల రాజా నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు ప్రముఖంగా పేర్కొనదగినవారు. భాషా నిలయం తెలంగాణలో తెలుగువారి సామాజిక, సాంస్కృతిక చైతన్యానికి దోహదం చేసింది. ఒక్కడి ప్రజల్లో మాతృభాషపై అభిమానం కలిగించింది. సాహిత్యం విస్తరించడానికి, ఇతర ప్రాంతాల సాహితీమూర్తులతో పోటీపడి తమ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోడానికి స్ఫూర్తిని పంచింది. విద్యావిస్తరణకు, సాహిత్యాభినివేశానికి దోహదం చేసింది. కవి సమ్మేళనాలు, గ్రంథావిష్కరణలు, ప్రాచీనాధునిక సాహిత్యోపన్యాసాలు, కవి పండిత సన్మానాలు.. నిరంతరం జరిగాయి. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ స్ఫూర్తితో 1904 లో హనుమకొండలో శ్రీరాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం, 1905 లో సికింద్రాబాద్‌లో ఆంధ్ర సంవర్ధనీ గ్రంథాలయం, 1908 లో వరంగల్లులో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం, 1911 లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో మహబూబియా ఆంధ్ర భాషా నిలయం, 1917 లో సూర్యాపేటలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశనీ గ్రంథాలయం, 1918 లో నల్లగొండలో ఆంధ్ర సరస్వతీ గ్రంథాలయం, హైదరాబాద్‌ నాంపల్లిలో వేమనాంధ్ర భాషా నిలయం, గౌలిగూడలో బాలసరస్వతీ గ్రంథాలయం ప్రారంభమై తెలంగాణ ఆధునిక సాంస్కృతిక వికాసయుగంలో పురోగమించేలా చేశాయి. ”గ్రంథాలయముల మూలముగా తెలంగాణము నందు భాషా వ్యాప్తి, విద్యావ్యాప్తి, విజ్ఞాన ప్రచారము జరుగుటచే గ్రామగ్రామములందును కవులు, గ్రంథకర్తలు, వ్యాసకర్తలు, వ్యాసరచయితలు, లేఖకులు, విమర్శకులు, కథకులు, ఏకాంకిక రచయితలు, పరిశోధకులు విరివిగా బయలుదేరి భాషా సారస్వత సేవను విరివిగా నొనరించుచున్నార” ని బూర్గుల రామకృష్ణ రావు అన్నమాటలు అక్షరసత్యాలు.

ఆంధ్రజనసంఘ స్థాపన
గ్రంథాలయోద్యమం వల్ల సాధించిన విజయాలకు కొనసాగింపుగా ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయని మనవారు భావించడమే ఆంధ్రజన సంఘం ఆవిర్భావానికి మూలం. అది 1921 వ సంవత్సరం. తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజల త్రివేణీ సంగమం హైదరాబాద్‌ రాష్ట్రమైతే, ఆ రాష్ట్రానికి హృదయస్థానం హైదరాబాదు. అటువంటి స్థానంలో తెలుగువారికి జరిగిన అవమానం ఆంధ్ర జనసంఘ స్థాపనకు దారితీసింది. వివేకవర్ధిని కళాశాల ఆవరణలో జరిగిన సంస్కార సభలకు కార్వే పండితుడు అధ్యక్షత వహించారు. ఇంగ్లీషు, మరాఠీలోనే ఉపన్యా సాలన్నీ జరిగాయి. తెలుగు వారు నొచ్కుకున్నారు. న్యాయవాది ఆలంపల్లి వెంకటరామారావు ఒక తీర్మానంపై తెలుగులో మాట్లాడేందుకు లేవగా అవహేళన చేస్తూ చప్పట్లు కొట్టారు. ఆ అవమానంతో తెలుగు అస్తిత్వం కోసం అదే రాత్రి టేకుమాల రంగారావు ఇంట్లో సమావేశమై నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘాన్ని స్థాపించారు. ఈ సంఘంలో మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణరావు, ఆదిరాజు వీరభద్రరావు, కొండా వెంకటరంగారెడ్డి మొదలైన 11 మంది పెద్దలు ముఖ్యంగా ఉన్నారు. తెలంగాణలో తెలుగు సంస్కృతి వ్యాప్తి కి ఆంధ్ర జన సంఘం కృషి చేసింది. పల్లెల్లో తిరిగి శాసనాలను కనుగొని వాటి ప్రతిబింబాలను, తాళపత్ర గ్రంథాలను సేకరించడానికి ఆంధ్ర జన సంఘానికి అనుబంధంగా అంధ్ర పరిశోధక మండలి ఏర్పడింది. ఇది తర్వాత లక్ష్మణరాయ పరిశోధక మండలిగా రూపొందింది.

1907 లో ఆవిర్భవించిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి ‘విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి’ గురించి తప్పక చెప్పుకోవాలి. ఈ మండలి ఆదర్శాలకు ఆంధ్ర జన కేంద్ర సంఘ ఆదర్శాలకు సారూప్య ముంది. ఆంధ్ర జన సంఘం సారథి అయిన మాడపాటి వారికి కొమర్రాజు వారే మార్గదర్శకులు. గ్రంథాలయ ఉద్యమ ప్రచారానికి ఆంధ్ర జన సంఘం చేసిన కృషి అపారం.

ఆంధ్రోద్యమం
ఆంధ్య్రోద్యమం ద్వారా తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన కృషి జరగాలని భావించారు. ఆ దిశగా ఆంధ్ర మహాసభలు ఆలోచనలు, చర్చలు చేశాయి. హైదరాబాద్‌ రాష్ట్ర మొట్టమొదటి ఆంధ్రమహాసభ జోగిపేటలో 1930 లో జరిగింది. తర్వాత సంవత్సరానికొకచోట జరుగుతూ వచ్చింది. 1937 లో నిజామాబాద్‌ ఆంధ్రమహాసభ తర్వాత ఆంధ్రోద్యమం రాజకీయోద్యమంగా రూపొందింది. ఆంధ్ర మహాసభల్లో తెలుగులో తప్ప వేరే భాషలో మాట్లాడరాదని సురవరం ప్రతాపరెడ్డి గారి నాయకత్వంలో యువకులు ప్రతిపాదించగా అది వీగిపోయింది. దీనితో సాహిత్యాభిరుచి, సాంస్కృతిక దృక్పథం కలిగిన యువకులు అసంతృప్తి చెంది అభివృద్ధి పక్షంగా ఏర్పడ్డారు.

ఆంధ్ర యువతీమండలి
హైదరాబాద్‌ నగరంలో ఆంధ్ర యువతీ మండలి చాలా ప్రాచీనమైంది. ఆంధ్ర మహాసభలకు అనుబంధంగా స్త్రీల అభ్యుదయ దృక్పథంలో మహిళా సభలు కూడా జరిగేవి. వీటివల్ల మహిళాలోకంలో చైతన్యం కలిగిందనటంలో సందేహం లేదు. ఆంధ్ర యువతీ మండలి ఈ దిశగా నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించింది. యల్లాప్రగడ సీతాకుమారి, మాడపాటి మాణిక్యమ్మ, రంగమ్మ ఓబులరెడ్డి, బూర్గుల అనంతలక్ష్మీదేవి మొదలైన మహిళా ప్రముఖుల యువతీమండలి కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహ రించారు. సాంఘిక దురాచారాలు ముఖ్యంగా వరకట్నం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. స్త్రీ విద్యా వ్యాప్తి కోసం యువతీమండలి పాటుపడింది.

ఆంధ్ర సారస్వత పరిషత్తు
ఆంధ్ర మహాసభలు రాజకీయ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం, రాజకీయ పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు తమ తమ అభిప్రాయాలను బలంగా వినిపిస్తూ అందుకు అనుగుణంగా మహాసభల కార్యాచరణ వైపు మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్న దశలో పూర్తిగా భాషా సంస్కృతుల సముద్ధరణకు ఒక సంస్థను స్థాపించాలని కొందరు భావించారు. హైదరాబాద్‌ రెడ్డి వసతిగహంలో ప్రథమాంధ్ర మహాసభలు జరుగుతున్నప్పుడే 1943 మే 26 న వేరుగా సమావేశమై ఒక సారస్వత సంస్థను స్థాపించారు. నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు అని పేరు పెట్టారు. పరిషత్తు స్థాపన వెనుక మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన పెద్దల కృషి ఎన్నదగింది. తొలి అధ్యక్షకులుగా లోకనంది శంకర నారాయణ రావు ఎన్నికయ్యారు. కొంత కాలానికే ఉద్యోగరీత్యా ఆయన నగరం నుండి బదిలీ అయి వెళ్ళవలసి రావడంతో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షులయ్యారు.

తెలుగు వారిలో మాతృభాషాభిమానం పెంపొందించడం, తెలుగు భాషాభివృద్ధికోసం సర్వవిధాలుగా కృషి చేయడం, ఇందుకోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం ప్రధాన లక్ష్యాలుగా ఏర్పడిన ఈ సంస్థ ఎన్నో అంక్షలు, నిర్బంధాలను ఎదుర్కొంటూ పని చేసింది. ఆంధ్ర మహాసభల పద్ధతిలోనే హైదరాబాద్‌, వరంగల్లు, మహబూబ్‌నగర్‌, తూపురాన్‌, మంచిర్యాల, ఆలంపురం తదితర ప్రాంతాల్లో వార్షిక సభలు నిర్వహించింది. వేలకొలది తెలుగువారు ఈ సభల్లో పాల్గొనేవారు. తెలంగాణ నుండే కాకుండా ఆంధ్ర ప్రాంతం వారు కూడా సభలకు వచ్చేవారు. ఒక రకంగా అంతకు పూర్వం తెలంగాణలో తెలుగు వారున్నారా? తెలుగు భాష వుందా? అని అన్న ఆంధ్ర ప్రాంతం వారికి ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యక్రమాలు కండ్లు తెరిపించినవని చెప్పవచ్చు. పరిషత్తు సభలకు ఎంతో ప్రాధాన్యముంది.

ఓరుగల్లు సభలప్పుడు మతోన్మాదుల హెచ్చరికలను ప్రతిఘటించి నిలిచారు. తూపురాన్‌ సభలప్పుడు మెట్రిక్‌ వరకు మాతృభాషలో విద్యాభ్యాసం, ఇంటర్‌ వరకు తెలుగు తప్పనిసరి అధ్యయనాంశంగా ఉండాలని తీర్మానించడమే గాక అందుకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. హిందీ వారి పరం కాకుండా ఉస్మానియాను కాపాడుకున్నారు. 1953 ఆలంపురం సభలకు భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడంలో నాటి అధ్యక్షులు దేవులపల్లి రామానుజ రావు కృషి ప్రశంసనీయం. కార్యదర్శిగా వున్న గడియారం రామకృష్ణ శర్మ తమ స్వస్థలమైన ఆలంపురంలో పరిషత్తు సభల్లో వేలాదిగా పాల్గొనేలా చేసేందుకు, దిగ్విజయంగా జరిపించేందుకు కృషి చేశారు. పరిషత్తు తెలుగుదేశంలోనే గాక దేశ విదేశాల్లో వందలాదిగా శాఖల్ని నెలకొల్పింది. ప్రాథమిక, ప్రవేశ, విశారద పరీక్షలు నిర్వహించింది. వేల సంఖ్యలో పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి తెలుగు ఉపాధ్యాయులుగా

ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగాలతో వారి కుటుంబాలకు ఆర్ధికాభ్యు న్నతి లభించడమే గాక వారి బోధనతో తెలుగుసీమలో తెలుగు సుసంపన్నమ్కెంది. ‘సూర్యుని వెలుతురు సోకని చోటు లేదన్నట్లుగా పరిషత్తు కృషి చేరని గ్రామం లేదని నాటి విద్యామంత్రి బూర్గుల రామకృష్ణారావు అన్నమాట అక్షర సత్యం. పరిషత్తు ప్రాచ్య భాషా విద్యకోసం కళాశాలను నెలకొల్పింది. ప్రాచీనాధునిక సాహిత్య గ్రంథాలను ప్రచురించింది. మహాభారత, భాగవత, రామాయణాది పురాణేతిహాసాలపై ప్రసంగపరంపరను నిర్వహించింది. ప్రసంగ పాఠాలను పుస్తకాలుగా ప్రచురించింది. సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్రను’ పరిషత్తు ప్రచురించగా తెలుగులో తొలిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఆనాడు బహుమతి మొత్తం ఐదువేల రూపాయలు. ఒక్కమాటలో చెప్పాలంటే 1943 నుంచి నేటివరకు అవిచ్ఛిన్నంగా పరిషత్తు తెలుగు భాషా సంస్కృతులకు సమున్నత కేంద్రంగా పని చేస్తున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్కెన తర్వాత తన పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చుకుంది. మాడపాటి సురవరం వంటి పెద్దల చేతులమీదుగా జరిగిన కాలం ప్రారంభం, దేవులపల్లి రామానుజరావు నిరంతర కృషితో వికాసం, అనంతరం డా.సి.నారాయణ రెడ్డి కాలంలో సంపన్నం అని చెప్పవచ్చు. ఒక దశలో తెలంగాణలో మిగతా సంస్థలన్నీ నామమాత్రమైనప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏకైక మహా సాంస్కృతిక సంస్థగా పని చేసింది.

సాహిత్య అకాడమీ
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 1957 లో ఏర్పాటై 1985లో రద్దయ్యేవరకు తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి ఇతోధికంగా కృషి చేసింది. డా.దేవులపల్లి రామానుజరావు కార్యదర్శిగా ఉన్న కారణంగా ఆంధ్ర, రాయలసీమ పండితులకు తగిన ప్రోత్సాహం అందిస్తూనే తెలంగాణ కవి పండితులకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అకాడమీ ప్రచురించిన గ్రంథాల్లో తెలంగాణ వారికి అగ్రతాంబూలం లభించింది. కె.గోపాలకృష్ణరావు ‘అధిక్షేపశతకములు’, కేశవపంతుల నరసింహశాస్త్రి ‘అనర్ఘ రాఘవము’, చెలమచర్ల రంగాచార్యుల ‘అ భిజ్ఞానశాకుంతలం’ వ్యాఖ్యానం, ఎస్‌.సదాశివ ‘అమ్జద్‌ రుబాయిలు’, కె.గోపాలకృష్ణారావు ‘ఆంధ్రశతక వాఙ్మయము’, డా.సి.నారాయణ రెడ్డి ‘ఆధునికాంధ్ర కవిత్వము- భావ కవిత్వయుగము, ‘గాంధీయం’ డా.పి.యశోదారెడ్డి ‘ఉత్తర హరివంశం’, సామల సదాశివ ‘ఉర్దూ కవుల కవితా సామాగ్రి’, ‘ఉర్దూ సాహిత్య చరిత్ర’, గడియారం రామకృష్ణశర్మ ‘కేయూరబాహు చరిత్ర’ ఆనాటి తెలంగాణ కవి పండితుల పరిశో ధన గ్రంథాలను పెద్ద సంఖ్యలో ప్రచురించింది. గ్రంథ ప్రచురణలో తెలంగాణ వారికే అగ్రస్థానం లభించింది.

తెలంగాణ రచయితల సంఘం
యువకవులు, రచయితల నాయకత్వంలో తెలంగాణ అంతా సాహిత్య చైతన్యం వెల్లివిరిసేలా కృషి చేయడంలో తెలంగాణ రచయితల సంఘం పాత్ర నవనవోన్మేషమైంది.బిరుదురాజు రామరాజు, దాశరథి, కాళోజి, నారాయణరెడ్డి, వట్టికోట వంటి వారు తమ కవితాత్మక ప్రసంగాలతో కవితా పఠనాలతో హోరెత్తించారు. ఆస్ఫూర్తితో నవయువ కవులెందరో బయలుదేరి కలాలతో గళాలతో తెలుగు సాహిత్య చైతన్యాన్ని ఒక ఉద్యమ రూపం సంతరించుకునే విధంగా చేశారు. నగరంలోనే వ్యవస్థాగతంగా సంస్థలు పని చేసేకాలంలో నగరం దాటి ఊరూరా తిరిగి సాహిత్యాభ్యుదయానికి కృషి చేసిన ఘనత నాటి యువకవి రచయితలకు తర్వాత మహాకవి రచయితలైన వారికీ దక్కుతుంది.

తెలుగు భాషా సమితి
తొలుత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఎంతో శ్రమకోర్చి ప్రారంభించిన తెలుగులో విజ్ఞానప్రచార కృషి, విజ్ఞాన సర్వస్వాల తయారీ ప్రయత్నం తర్వాత ఆ కృషిని, ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు ఏర్పడిందే తెలంగాణ భాషా సమితి. మద్రాసులో 1957లో బెజవాడ గోపాలరెడ్డి, మోటూరి సత్యనారాయణల ఆధ్వర్యంలో పనిచేసి అనేక సంపుటాలుగా తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించింది. అది తర్వాత హైదరాబాద్‌ కు మారింది. తెలుగు సంస్కృతి, లలితకళలు, దేశముచరిత్ర, విశ్వసాహితి, భారతభారతి మొదలైన అనేక సంపుటాలను ప్రచురించింది. తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమైంది. సాహిత్య అకాడమీ కూడా విశ్వవిద్యాలయంలో కలిసిపోయింది.

యువభారతి
”చుట్టూరా ఆవరించుకొని వున్న చీకటిని తిట్టుకుంటూకూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది” అన్న లక్ష్యంతో 1963 విజయదశమి పర్వదినాన ఏర్పడింది యువభారతి. ఉత్తమ సాహిత్యాన్ని సరళమనోహరంగా ప్రచురించడమే గాక అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సార్థక కృషి చేసింది. అనుముల కృష్ణమూర్తి ‘సరస్వతీ సాక్షాత్కారం’ కావ్యంతో ప్రారంభించి సుమారు 180 గ్రంథాలను ప్రచురించింది. ‘లహరి’ ఉపన్యాసపరంపరలో తెలుగులో ప్రాచీనాధునిక సాహిత్య వికాసం అవిష్కృతమైంది. పుస్తకరూపంలో కూడా వచ్చి అందరి ఆదరణ పొందింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు ‘యువ భారతి’ని తల్లిలా ఆదరించి తన కార్యక్రమాలకు వేదికనిచ్చింది. డా.సి.నారాయణ రెడ్డి ‘తెలుగు కవిత- లయాత్మకత’ ప్రసంగాలు యువ భారతి వేదిక పై జరిగాయి. పుస్తకరూపంలో కూడా వచ్చింది. నూరు వ్యాసాల సంపుటి ‘మహతి’ గ్రంథం, నూరేళ్ళ నవల చరిత్రలో ముఖ్యమైన నవలలపై ఆంగ్ల పాఠకులకోసం పరిచయాలు వేసింది. ప్రముఖ సాహితీవేత్తల రచనల్లోని ముఖ్యాంశాలన్నీ సామాన్య పాఠకులకోసం ‘సాహితీవాహిని’ పరంపరలో పుస్తకాలు ప్రచురించింది. యువ కవి రచయితల కోసం సాహిత్యం పై, వ్యక్తిత్వ వికాసం పై ప్రసంగాలు, రచనల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసింది.

ఇవే గాక నవ్యసాహితీ సమితి, విశ్వసాహితి వంటి సంస్థలు ఇక్కడ భాషా సాహిత్య వికాసానికి, కవి రచయితలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాయి. విశ్వసాహితి నిర్వహించిన అఖిల భారత తెలుగు రచయితల మహాసభలు తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వరంగంగా వున్నాయని భావించినవారున్నారు. అప్పట్లో మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంంగా వున్న నిజాం కళాశాలలో విద్యార్థుల వేదికగా పనిచేసిన ‘తెలుగు సారస్వత సమితి’ కూడా చెప్పుకోదగింది. నల్లగొండలో అంబడిపూడి వెంకటరత్నం ఆధ్వర్యంలో సాహితీమేఖల ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడమే గాక ఉత్తమ గ్రంథాలను ప్రచురించింది. వట్టికోట ఆళ్వారుస్వామి నెలకొల్పిన దేశోద్ధారక గ్రంథమాల, కె.సి.గుప్త ‘అణా గ్రంథమాల’ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అద్భుతమైన తెలుగు గ్రంథాలను ప్రచురించి తక్కువ ధరకు పాఠక లోకానికి అందించాయి.

సంస్థానాల సేవ
గద్వాల, వనపర్తి, ఆత్మకూరు మొదల్కెన సంస్థానాలలో కూడా భాషా సాహితీ వికాసానికి గణనీయమ్కెన కృషి జరిగింది. అవధానులు, కవి పండితులు సంస్థానాలను సందర్శించి తమ విద్యను ప్రదర్శించి మెప్పుపొందిన ఘటనలు సాహిత్య చరిత్రలో అనేకం వున్నాయి. 1880 ప్రాంతంలోనే వనపర్తి, గద్వాల సంస్థానాల్లో తెలుగు అచ్చుయంత్రాలు స్థాపితమై ఉత్తమ గ్రంథాలు ముద్రించాయి. వనపర్తి సంస్థానంలో మానవల్లి రామకృష్ణ కవి కొంతకాలం సేవలందించి అనేక గ్రంథాలను అచ్చు వేయించారు. తెలుగు, సంస్కృత భాషలను పోషించి ప్రోత్సహించిన సంస్థానాలు సాంస్కృతిక పునరుజ్జీవన కృషిలో అర్ధవంతమ్కెన భాగస్వామ్యం వహించాయి.

ఈ విధంగా తెలంగాణలో సంస్థల కృషివల్ల సాంస్కృతిక పునరు జ్జీవనం బహుముఖీనంగా సాగింది. ఆ కృషి కొన్ని వందల సంవత్సరా లుగా భాషా సాంస్కృతిక వికాస రంగంలో కమ్ముకున్న చీకటిని పారద్రోలింది.

జె. చెన్నయ్య
tsmagazine
tsmagazine

Other Updates