సాకారమవుతున్న-పేదల--కలల-సౌధాలు.పేదల కలల సౌధం స్వంత ఇంటి నిర్మాణం త్వరలో సాకారం కాబోతోంది. స్వంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఆర్ధిక పరిస్థితి లేకపోవడంతో ఇరుకు ఇంట్లోనే ఏళ్ల తరబడి కుటుంబం మొత్తం కాలం వెల్లదీస్తున్నారు. ఎక్కడ ఖాళీ జాగ దొరికితే అక్కడ గుడిసె వేసుకుని, ఎవరు ఎప్పుడు వచ్చి ఖాళీ చేయిస్తారో తెలియక ప్రతినిత్యం భయం భయంగా గడుపుతున్నారు పేదలు. కనీస సౌకర్యాలులేక మురికి వాడల్లో మగ్గుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు నాయకులు హామీ ఇచ్చినా అవి కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోయి గూడు చెదిరిందే కాని, స్వంతింటి కల మాత్రం నెరవేరలేదు. గత పాలకుల నిర్లక్ష్యంతో పేదలు పేదలుగా మిగిలిపోయారు. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ఉండాలన్న కనీస అవసరాన్ని గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సికింద్రాబాద్‌లోని ఐడిహెచ్‌ కాలనీలో మొట్టమొదటగా రెండు పడక గదులు, కిచెన్‌, టాయిలెట్లు కలిగిన ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తన వంతు సహకారాన్ని అందిస్తోంది. దీనికి నిదర్శనమే శరవేగంగా కొనసాగుతున్న హైదరాబాద్‌ బోయిగూడలోని ఐడీహెచ్‌ మోడల్‌ కాలనీ నిర్మాణ పనులు. శిథిలావస్థలో ఉండి, కనీస సౌకర్యాలు లేని బోయిగూడ ఐడీహెచ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2014 సెప్టెంబర్‌ 1వ తేదీన సందర్శించారు. ఆ కాలనీ దీనావస్థను, నివాసితులు ఎదుర్కొంటున్న సమస్య లను స్వయంగా చూసిన కేసీఆర్‌ అక్కడ ఎప్పుడు కూలుతాయో తెలియని ఇండ్లను కూల్చివేసి వాటి స్థానంలో ప్రతి నివాసితుడికి రెండు బెడ్‌రూమ్‌లు, హాల్‌, కిచెన్‌, టాయిలెట్‌ కలిగిన ఫ్లాట్‌ను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని, ఈ కాలనీ దేశంలోనే ఒక మోడల్‌ కాలనీగా రూపొందిస్తామని కెసిఆర్‌ హామీ ఇచ్చారు. వెంటనే అక్టోబర్‌ 3వ తేదీన 396ఫ్లాట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. జిG2 పద్ధతిలో నిర్మించే 33బ్లాక్‌లు ఉండే ఈ కాలనీలో 276మంది షెడ్యూల్డ్‌ కులాలు, 31మంది షెడ్యూల్డ్‌ తెగలు, 79 మంది బలహీనవర్గాలు, 10మంది మైనార్టీలు, ఓసీలకు చెందినవారు ఉన్నారు. మొత్తం 36కోట్ల 54లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ఐడీహెచ్‌కాలనీ నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ కాలనీలో కనీస మౌలిక సదుపాయా లైన అంతర్గత రోడ్లకు కోటి 16లక్షలు, వర్షపునీటి కాల్వ నిర్మాణానికి 56లక్షలు, మురుగునీటి కాల్వలకు 74.36లక్షలు, మంచినీటి సరఫరాకు 62లక్షలు, విద్యుత్‌ సదుపాయాలకు 72లక్షలు, వ్యాపార కలాపాలు నిర్వహించుకునేందుకు దుకాణాల నిర్మాణానికి 50లక్షలు, పార్కులు, కూరగాయల మార్కెట్‌ వ్యవస్థకు 30లక్షలు, ఇతర సదుపాయాలకు 60లక్షల రూపాయలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కె.చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బెడ్‌రూమ్‌లు, హాల్‌, కిచెన్‌, టాయిలెట్‌తో కూడిన ఇళ్ళను నిర్మించే భృహత్‌ సంకల్పానికి బోయిగూడ ఐడీహెచ్‌కాలనీ ఉదాహరణగా నిలిచింది. గత ఉమ్మడి రాష్ట్రంలో బలహీన వర్గాలకు కేవలం 220 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇచ్చే విధానం ఉండేది. ఈ ఇరుకు ఇంట్లో బాత్‌రూమ్‌గాని, కిచెన్‌గాని లేకుండా ఉండి లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా మహిళలు, యువతుల ఇబ్బందులు వర్ణాణాతీతం. ఈ పరిస్థితులు చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక నుండి ఏ మహిళ అయినా ఆత్మవిశ్వాసంతో జీవనం గడపాలని కోరుతూ రెండు బెడ్‌ రూమ్‌లు, హాల్‌, కిచెన్‌, టాయిలెట్‌తో కూడిన ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని తమ ఎన్నికల విధాన ప్రకటనలో పొందుపరిచారు. గత ఇందిరమ్మ గృహ నిర్మాణ యూనిట్‌కు లక్ష రూపాయలు మాత్రమే ఉండగా ప్రస్తుతం నిర్మిస్తున్న 580చదరపు అడుగుల ఇళ్ల యూనిట్‌కు 7లక్షల 90వేల రూపాయలను కేటాయించి నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ ఇళ్ళ నిర్మాణాన్ని వంద శాతం ప్రభుత్వ నిధులతో చేపడుతున్నారు. లబ్ధిదారులు ఏవిధమైన డబ్బులు చెల్లించే అవసరం లేదు. ఈ బోయిగూడ ఐడీహెచ్‌కాలనీ నిర్మాణ పనులను జిహెచ్‌ఎంసి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడానికి ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ ఇళ్ళను సకాలంలో పూర్తిచేసి వచ్చే దసరాను బోయిగూడ ఐడీహెచ్‌కాలనీలో జరుపుకుంటానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ దసరా లోపు ఐడీహెచ్‌కాలనీ నిర్మాణం పూర్తిచేసి గృహ ప్రవేశాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా చేయించడానికి జిహెచ్‌ఎంసి ప్రణాళిక బద్ధంగా పనులు చేపడుతోంది. ఈ ఐడీహెచ్‌కాలనీ నిర్మాణంతో దేశంలోనే ఇదొక ఆదర్శవంతమైన కాలనీగా రూపొందడంతో పాటు బడుగు, బలహీన వర్గాలకు కూడా రెండు బెడ్‌రూమ్‌లు, హాల్‌, కిచెన్‌, టాయిలెట్‌తో కూడిన ఇళ్ళలో నివసించడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందనడానికి ఉదాహరణగా నిలువనుంది.

Other Updates