రెండేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి అందరికీ ఎరుకే. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినప్పుడు ప్రభుత్వానికి దీని ఫలితాలపై స్పష్టమైన అంచనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎట్లా కొనసాగించాలన్న అంశంపై విస్త తమైన చర్చ ముఖ్యమంత్రి స్థాయిలో జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యాచరణ రూపొందించడానికి సాగునీటి మంత్రి హరీశ్ రావు నేతత్వంలో ఒక మంత్రివర్గ ఉప సంఘాన్నిఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన కార్యాచరణని ప్రభుత్వం ఆమోదించింది. రెండేండ్ల కార్యాచరణ అనంతరం మిషన్ కాకతీయ ఫలితాలు ప్రజల అనుభవాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే మిషన్ కాకతీయ రెండు దశల పనులు జయప్రదంగా అమలైనాయి. మిషన్ కాకతీయ ఫలితాలను మదింపు చేసే ముందు మిషన్ కాకతీయ విజన్ ఏమిటీ, ప్రభుత్వం రూపొందించుకున్న కార్యాచరణ, వ్యవస్థాగత మార్పులు తదితర అంశాలని సంక్షిప్తతంగా ఒకసారి మననం చేసుకోవడం అవసరం.
మిషన్ కాకతీయ కార్యక్రమంలో ఏం జరిగింది?
- పూడికలు తీసి చెరువుల , కుంటల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం
- తొలగించిన పూడికను రైతుల పంట భూముల్లో పరచడం
- చెరువు కట్టలను బలోపేతం చెయ్యడం
- చెరువు అలుగు, తూములను మరమ్మతు చెయ్యడం
- క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్‌లను మరమ్మతు చెయ్యడం
- చెరువులకు నీటిని తరలించే ఫీడర్ ఛానళ్ళను రీ సెక్షన్ చేయడం, పూడిక తీయడం
- చెరువుల్లో పెరిగిన తుమ్మ చెట్లను నరికి వెయ్యడం, గుర్రపు డెక్క , లొట్టపీసు మొక్కల తొలగింపు
- కట్ట బలోపేతానికి సరిపడే మొరం పూడిక మట్టిని వాడుకోవడం
- చెరువుల శిఖం భూములను కబ్జాల బారి నుండి రక్షించడం
- మొదటి దశలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివద్ధిపరచడం
- హరితహారం కార్యక్రమంలో భాగంగా చెరువు శిఖంలో చెట్లు, చెరువు కట్టలపై ఈత చెట్లు నాటడం
మిషన్ కాకతీయ విజన్
అనాది ఆధారాలైన చెరువుల పునరుద్ధరణ ఒక తెలంగాణ ఉద్యమ అకాంక్ష. ఈ 60 ఏండ్ల సమైక్య పాలనలో చెరువులు నిర్లక్ష్యానికి గురి అయి ధ్వంసమైనాయి.
ఉద్యమం సందర్భంగా చెరువుల పునరుద్ధరణ జరగాలని ప్రజలు కలగన్నారు. ఉద్యమ ఆకాంక్షలు తెలిసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కలను సాకారం చేయడానికి బలమైన సంకల్పం చేసినాడు. చెరువుల నిర్మాణంలో అత్యున్నత నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించి దక్కన్ పీఠభూమిలో నెలకొని ఉన్న అననుకూల భౌగోళిక పరిస్థితులను అనుకూలతగా మార్చుకొని సముద్రాలని తలపించే చెరువులను కాకతీయులు నిర్మించినారు. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం అనితర సాధ్యంగా కొనసాగింది. తెలంగాణలో వ్యవసాయ విస్తరణకు బాటలు వేసింది. ఆర్థిక సాంస్కృతిక వికాసానికి దోహదం చేసింది. కాకతీయుల అనంతర కాలంలో కూడా దక్కన్‌ను పాలించిన రాజ వంశాలు.. కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, స్థానిక ప్రభువులు, సంస్థానాధీశులు కాకతీయుల వారసత్వాన్ని సమున్నతంగా కొనసాగించారు.
భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని చెరువులు తెలంగాణలో నిర్మాణం కావడానికి, కరువు కాటకాలు దరిజేరని పరిస్థితులు , జలవనరులతో అలరారిన తెలంగాణకు వేర్లు కాకతీయుల విజన్ లో ఉన్నాయి. విధ్వంసం పాలైన చెరువుల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఉద్దేశించిందే ‘మిషన్ కాకతీయ’. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెరువుల పునరుద్ధరణకు పెట్టిన పేరు అది. అందులో కాకతీయుల సేవలను స్మరించుకోవడం, వారి విజన్‌తో ప్రజల భాగస్వామ్యంతో చెరువులను పునరుద్ధరించుకోవడం అనే లక్ష్యాలు ఉన్నాయి.
చెరువుల పునరుద్ధరణ ఎందుకు?
సాగునీటి రంగం అభివృద్ధి మీదనే తెలంగాణ పునర్నిర్మాణం ఆధారపడి ఉన్నది. వ్యవసాయాభివృద్ధి జరిగితే తెలంగాణలో ప్రజల వలసలు ఆగిపోతాయి. రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. వ్యవసాయం పుంజుకుంటే గ్రామాల్లో అనేక కుల వృత్తులు బతుకుతాయి. అందుకే తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ ప్రధాన చోదక శక్తిగా పని చేస్తుందని ప్రభుత్వం భావించింది. తెలంగాణకు గోదావరి బేసిన్ లో 165 టిఎంసిలు, కృష్ణా బేసిన్లో 90 టిఎంసిలు మొత్తం 255 టిఎంసిలు చిన్న నీటి వనరుల కేటాయింపులు ఉన్నాయి. కాని తెలంగాణలో చిన్ననీటి వనరుల వినియోగం 90 టిఎంసిలకు మించి లేదు. చెరువులను పునరుద్ధరించుకొని వాటి నిల్వ సామర్థ్యాన్ని పూర్తి స్థాయికి పెంచుకోవాలనుకున్నది తెలంగాణ ప్రభుత్వం. మిషన్ కాకతీయ వలన ఒనగూరే ప్రయోజనాలను ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా, వెంటనే ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. అయితే చెరువు మీద ఆధారపడే అనేక కుల వృత్తుల వారికి…. వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారికి తమ జీవనాన్ని గ్రామంలోనే కొనసాగించడానికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. చెరువులో నీరు నిలువ ఉండటం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. బోర్ల కింద వ్యవసాయం పెరుగుతుంది. ప్రజల, పశువుల తాగునీటి అవసరాలు తీరుతాయి. చెరువు పూడిక మట్టి రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చునని, పూడిక మట్టి వాడకం వల్ల 50% రసాయనిక ఎరువుల (యూరియా, డిఎపి) వినియోగాన్ని తగ్గిస్తుందని, పంట దిగుబడి 15%-20% పెరుగుతుందని ఇక్రిశాట్ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆ మేరకు రైతులకు ఆదాయం పెరుగుతుంది. తెలంగాణలో చెరువు సాంస్కృతిక కేంద్రం కూడా. బతుకమ్మ , కట్టమైసమ్మ బోనాలు, బంజారాల తీజ్ , శ్రావణ మాసంలో సామూహిక వన భోజనాలు, గంగ జాతరలు తదితర పండుగలకు చెరువు ఆధరువుగా ఉంటది. ఒక్క మాటలో చెప్పాలంటే చెరువు గ్రామ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసానికి దోహదం చేస్తుంది.
చెరువుల పునరుద్ధరణ పనుల పురోగతి:
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జూలై 2014 లో మొదటి సారిగా తెలంగాణలో చెరువుల సమగ్ర సర్వే జరిగింది. అన్ని జిల్లాల్లో మొత్తం చెరువుల సంఖ్య 46531 గా తేలింది. ఇందులో గొలుసుకట్టు చెరువులు 4000 ఉన్నట్టు లెక్క తేలింది.
జిల్లాలవారీగా చెరువుల వివరాలు:
ఆదిలాబాద్ 3951 , నిజామాబాద్ 3251 , కరీంనగర్ 5939 , వరంగల్ 5839, మెదక్ 7941, నల్లగొండ 4762, మహబూబ్‌నగర్ 7480 , ఖమ్మం 4517 రంగారెడ్డి 2851,
మొత్తం 46531. వీటిలో 38411 చెరువులు కాగా మిగతావి ఇంకుడు కుంటలు (Percolation Tanks), అటవీ శాఖ కుంటలు , ఇతర వ్యక్తిగత కుంటలు ఉన్నాయి. ఈ చెరువుల కింద ఉన్న అయకట్టు 24.50 లక్షల ఎకరాలు. ( కొత్త జిల్లాల్లో చెరువుల లెక్క మధింపు జరుగుతున్నది ). ప్రతీ సంవత్సరం చెరువుల పునరుద్ధరణకు 9300 చెరువులను ఎంపిక చెయ్యాలని ప్రభుత్వం భావించింది.
మొదటి దశ
మొదటి దశలో 8113 చెరువులకు ప్రభుత్వం 2597 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 8030 చెరువుల్లో పనులను ప్రారంభించడం జరిగింది. 7503 చెరువుల పనులు పూర్తి అయినాయి. మిగతా చెరువుల పనులు కోర్టు కేసులు, రైతుల అభ్యంతరాలు తదితర కారణాల వల్ల ఆలస్యం అయినాయి. వాటి పనులు కూడా వివిధ దశల్లో ఉన్నాయి.
రెండో దశ
రెండో దశలో 9043 చెరువులకు 3080 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది. 8826 చెరువుల పనులని చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు రెండో దశలో 947 పనులు పూర్తి అయినాయి. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని 2017 జూన్ నాటికి పూర్తిచెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నారు. మూడో దశ పనులని త్వరలోనే చేపట్టడం జరుగుతుంది.
మిషన్ కాకతీయ ఫలితాలు:
ఈ సంవత్సరం వర్షాలు విస్తృతంగా కురిసినందున చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈ సారి చెరువుల కింద సాగు విస్తీర్ణం రెండింతలు అయ్యిందని ప్రాథమిక సమాచారం. వ్యవసాయ శాఖ చెరువుల కింద సాగు విస్తీర్ణాన్ని అంచనా వేస్తున్నది. అదే విధంగా రైతుల అభిప్రాయాలను సేకరించినప్పుడు స్థూలంగా అందుతున్న సమాచారం మేరకు పూడిక మట్టి చల్లుకున్న చేను చెలకల్లో పత్తి పంట, మిరప, సోయాబీన్, వరి పంటల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు తేలుతున్నది. పంట ఏపుగా పెరిగిందని రైతులు పేర్కొన్నారు. ఖరీఫ్‌లో పంట దిగుబడి తప్పకుండా పెరుగుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం కూడా తగ్గిందని వారు అన్నారు. ఈ అంశాలపై వ్యవసాయ శాఖ, అమెరికా మిచిగాన్ యూనివర్సిటీ వారి అధ్యయనం కొనసాగుతున్నది. ఈ ఖరీఫ్ పంట కాలం తర్వాత ఈ ఫలితాలు మరింత సమగ్రంగా తెలిసివస్తాయి.
భూగర్భజలాల వృద్ధి
భూగర్భజలాల వృద్ధిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని భూగర్భజల శాఖ వారి అధ్యయనంలో తేలింది. భూగర్భజల శాఖ వారు ప్రతీజిల్లాలో మిషన్ కాకతీయ అమలవుతున్న ఒక మైక్రో బేసిన్‌ని తమ అధ్యయనానికి ఎన్నుకున్నారు. వాటి అధారంగా భూగర్భజలాలపై మిషన్ కాకతీయ ప్రభావాలను అంచనా వేయడం జరిగింది. 2016 మే నెల నుంచి సెప్టెంబరు దాకా వారి అధ్యయన ఫలితాలను క్రోడీకరించారు. ఆదిలాబాద్ జిల్లాలో మే నెలలో 12.04 మీ. లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 3.12 మీ.కు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భజలమట్టం 8.92 మీ. పెరిగింది. కరీంనగర్ జిల్లాలో మే నెలలో 13.68 మీ. లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 4.55 మీ. లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భజలమట్టం 9.13 మీ. పెరిగింది. ఖమ్మం జిల్లాలో మే నెలలో 10.12 మీ. లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 4.62 మీ. లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 5.50మీ. పెరిగింది. మహబూబ్‌గర్ జిల్లాలో మే నెలలో 24.31 మీ. లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 22.50 మీ. లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 1.81 మీ. పెరిగింది. మెదక్ జిల్లాలో మే నెలలో 17.85 మీ. లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 2.68 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భజలమట్టం 15.17 మీ పెరిగింది. నల్లగొండ జిల్లాలో మే నెలలో 18.57 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 8.94 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భజలమట్టం 9.63 మీ పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో మే నెలలో 20.30 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 10.06 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భజలమట్టం 10.24 మీ పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో మే నెలలో 30.70 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 24.41 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భజలమట్టం 6.29 మీ పెరిగింది. వరంగల్ జిల్లాలో మే నెలలో 14.19 మీ లోతులో ఉన్న నీరు సెప్టెంబరు నెలలో 5.09 మీ లోతుకు చేరింది. అంటే మూడు నెలల్లో భూగర్భ జలమట్టం 9.10 మీ పెరిగింది. రాష్ట్ర సరాసరి చూసినప్పుడు భూగర్భజల మట్టం 8.42 మీ పెరిగినట్టుగా తేలింది. మెదక్ జిల్లాలో అత్యధికంగా 15.17 మీ, అత్యల్పంగా మహబూబ్ నగర్ జిల్లాలో 1.81 మీ భూగర్భజలమట్టం పెరిగినట్టుగా అధ్యయనాలు తెలియ జేస్తున్నాయి. మిషన్ కాకతీయ ఫలితాలపై ప్రభుత్వానికి ఉన్న అంచనా ఈ అధ్యయనం ద్వారా నిజమని నిర్ధంద్వంగా తేలిపోయింది. ఈ రబీ పంట కాలానికి కూడా చెరువుల కింద సాగునీరు అందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ ఏడు సెప్టెంబరులో కురిసిన వర్షం 100 ఏండ్లకు ఒక్కసారి వచ్చే పెద్ద వర్షం. అయినా కూడా మిషన్ కాకతీయలో చెరువు కట్టలు బలోపేతం అయిన కారణంగా వరదలకు తెగిపోయిన చెరువులు , ఇతరత్రా నష్టపోయిన చెరువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వేల సంఖ్యలో నష్టానికి గురి అయ్యే చెరువులు వందల్లోకి పడిపోయినాయి. బాగా వర్షాలు పడిన సంవత్సరాల్లో నష్టపోయిన చెరువుల సంఖ్య ఈ విధంగా ఉన్నది. 2009 లో 1107 , 2010 లో 4251, 2013 లో 1868, 2016 లో కేవలం 571 మాత్రమే. అది మిషన్ కాకతీయలో చెరువు కట్టలను బలోపేతం చేసినందువల్లనే సాధ్యమయ్యింది.
12 మార్చ్ 2015 రోజు ముఖ్యమంత్రి నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ గ్రామంలోని పాత చెరువు పునరుద్ధరణ పనులతో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మైనర్ ఇరిగేషన్‌లో వ్యవస్థాగత మార్పులు చేసుకోవడం ద్వారా, టెండర్ల ప్రక్రియను సరళతరం చేసుకోవడం ద్వారా, ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభించడం ద్వారా రెవెన్యూ , అటవీ, వ్యవసాయ, భూగర్బ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవడం ద్వారా మిషన్ కాకతీయ పనులను గతంలో ఎన్నడూ లేనంత వేగంగా అమలు చేయడం జరిగింది. పనులని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి, ఈ అన్నిశాఖలను సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక జిల్లా సమన్వయ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసినందున ఇప్పటివరకు తెలంగాణ అన్ని జిల్లాలు కలిపి 30,000 చెరువులు పూర్తిగాను, 5,300 చెరువులు 50 నుండి 75 శాతం వరకు, 3,900 చెరువులు 25 నుండి 50 శాతం వరకు, 4,750 చెర్వులు 25 శాతం కన్నతక్కువ నీటితో నిండినాయి.
5 వేలకు పైగా మిషన్ కాకతీయ చెరువుల్లో మత్స్య శాఖ తరపున 40 కోట్ల చేప పిల్లలని వదలడం జరిగింది. సంవత్సర కాలంలో మత్స్యకారుల చేతికి పంట అందుతుంది. మిషన్ కాకతీయ ఫలితంగా మత్స్యకారుల కుటుంబాలకు నిశ్చితమైన ఆదాయం సమకూరే పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా మిషన్ కాకతీయ ఆశించిన ఫలితమే.
రైతులు చాలా చోట్ల తమకు సరిపడినంత పూడిక మట్టి లభించలేదని షికాయతు చేసిన సందర్భాలు, వారు పోరాడి అదనంగా పూడిక మట్టిని తరలించుకపోయినట్టు ఇంజనీర్లు సమాచారమిచ్చారు.
రెండు దశల్లో ఈ పూడిక తీత వల్ల సుమారు 5 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.
మొదటి దశలో 8 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని అంటే దాదాపు 3 కోట్ల 20 లక్షల ట్రాక్టర్ ట్రిప్పుల పూడిక మట్టిని , రెండో దశలో ఇప్పటిదాకా 6 కోట్ల 33 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అంటే 2 కోట్ల 53 లక్షల ట్రాక్టర్ ట్రిప్పుల మట్టిని రైతులు స్వచ్ఛందంగా తమ పొలాల్లోకి తరలించుకపోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 కోట్ల రూపాయల విలువ గలిగిన పూడిక మట్టిని రైతులు స్వచ్ఛందంగా తరలించుకపోయినట్లు అంచనా. ఇది నిజంగా అపూర్వం. ప్రజల భాగస్వామ్యంతోనే మిషన్ కాకతీయ కొనసాగిందనడానికి ఇది ప్రభలమైన దాఖలా.
శ్రీధర్‌రావు దేశ్‌పాండే