ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి రెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాలలోను ఈ వేడుకలను నిర్వహించేందుకు కార్యక్రమాలు రూపొందిస్తోంది. రాష్ట్రంతో పాటు దేశ రాజధాని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కూడా వినూత్నరీతిలో అధికార కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల రూపకల్పన బాధ్యతను సాంస్కృతికశాఖకు అప్పగించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్మృతి చిహ్నంగా రాజధాని హైదరాబాద్ నగరంలో భారీస్థాయిలో అమరవీరుల స్థూపాన్ని, స్మృతివనాన్ని నిర్మించా లని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హుసేన్‌సాగర్ ఒడ్డున బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు సమీపంలోని 12 ఎకరాల స్థలంలో ఈ స్థూపాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఉన్న పర్యా టక, బుద్ధపూర్ణిమ, విద్యుత్ కార్యాల యాలను ఇతర ప్రాంతాలకు తరలించా లని సీఎం ఆదేశించారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్ల విషయంలో మే 3న ఉన్నతాధి కారు లతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. సమీక్షలో అమరవీరు ల స్థూపం, స్మృతి వనం విషయా లను ఆయన అధికారులతో చర్చిం చారు.
తెలంగాణ ఆవిర్భావ దినో త్సవం సందర్భంగా జూన్ 2న స్థూప నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.ఉద్యమ స్పూర్తిని తెలిపేలా నిర్మాణం జరగాలని కేసీఆర్ భావిస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించాలని త్యాగాలు చేసిన అమరవీరుల త్యాగనిరతిని భవిష్యత్ తరాలు తలుచుకునేలా స్మృతి వనం నిర్మాణం జరగాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సాహితీ, సాంస్కృతిక రంగాలను కళ్ళకు కట్టే విధంగా స్మృతి వనాన్ని తీర్చిదిద్దాలన్నారు. ఈ స్మృతి వనంలో తమ జీవితాలను తెలంగాణకోసం ధారబోసిన ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మహానుభావుల జీవిత చరిత్రలను పొందుపరచాలని సూచించారు.
అమరుల స్మృతి వనం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ”స్మృతి వనంలోకి ఎవలన్న పోతె అక్క డ్నించి ఎల్లబుద్దికావద్దు, అక్కన్నే కూసోని ప్రార్థన చేసుకునేటట్టు ఉండాలె” అని కేసీఆర్ తన అంతరంగాన్ని బయటపెట్టారు. సందర్శకులకు తెలంగాణపై గౌరవం మరింత పెరిగేలా ఉండాలన్నారు. ఈ నిర్మాణ బాధ్యతను రోడ్లు, భవనాలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డికి అప్పగించారు. ముందు తథాగతుడు బుద్దుడు, వెనక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఈ రెండింటి వెనక సచివాలయం, ఇప్పుడు ముందు భాగంలో ఎత్తైన అమరవీరుల స్థూపం ఉండాలె అని కేసీఆర్ అధికారులకు సూచించారు.
నింగినంటే జాతీయ పతాక
ఆవిర్భావ దినోత్సవంలో దేశంలోనే 300 అడుగుల అత్యంత ఎత్తైన జాతీయ జెండాను ఎగురవేయాలని సంకల్పించారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఘాట్ వద్ద దీన్ని ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించారు. కానీ మే 5న ఈ నిర్మాణంలో పాలుపంచుకోనున్న ఫాస్ట్‌ట్రాక్ ఇంజనీర్స్ సంస్థ ప్రతినిధులు, పలు శాఖల ఉన్నతాధికారులు పతాక స్థలం కోసం క్షేత్రస్థాయిలో అన్వేషణ జరిపారు. ట్యాంక్ బండ్ బతుకమ్మఘాట్ వద్ద స్థలాన్ని పరిశీలించిన అధికారులు అక్కడ పతాకదిమ్మెను నిర్మించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని గుర్తించారు. సందర్శకుల తాకిడి కూడా ఉంటుంది. వారి వాహనాలు పార్క్ చేయడానికి స్థలం సరిపోదని నిర్ణయానికి వచ్చారు. దీనితో ఆ స్థలం కాకుండా పక్కనే ఉన్న సంజీవయ్య పార్కును పరిశీలించారు. అది అనువుగా ఉంటుందని భావించి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు వివరించారు. దీనికి సీఎం సమ్మతించడంతో పాటు ఈ మేరకు ఏర్పాట్లు చూడాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దేశంలో ఎత్తైన జాతీయ జెండా (293 అడుగులు) జార్ఖండ్ రాష్ట్రంలో ఉండడంతో అంతకన్నా ఎత్తైన జెండాను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భావన పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రమంతటా ఘనంగా ఆవిర్భావ దినోత్సవ
వేడుకలు : సీఎస్ రాజీవ్‌శర్మ
రాష్ట్రమంతటా ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. మే 7న సచివాలయం లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకల గురించి సమీక్షించారు.
గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మండల కార్యాలయాలు, జిల్లా పరిషత్‌లు, రెవిన్యూ డివిజన్‌లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు, రాష్ట్ర కార్యాలయాల్లో పెద్దఎత్తున నిర్వహించాలని సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు సూచించారు. ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ఉదయం 8గంటల వరకు జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో బట్టల పంపిణీ, ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ, అంధ విద్యార్థులకు పరికరాలు, రక్తదాన శిబిరాలు, రాజధాని హైదరాబాద్ నగరంలోని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ బల్బులతో అలంకరించాలని ఆదేశించారు. నగరంలో ప్రభుత్వ పథకాల ప్రచార హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
ముఖ్యమంత్రి కార్యక్రమం
రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదట గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్యాంక్‌బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూప నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సంజీవయ్యపార్కులో అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే ఉత్సవాలలో పాల్గొంటారు. అక్కడ జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అవార్డు గ్రహీతలకు సర్టిఫికెట్లు అందచేస్తారు. మధ్యాహ్నం హెచ్‌ఐసీసీలో అన్ని శాఖల అధికారులు, వివిధ రంగాలకు చెందిన మూడువేల మంది ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
అవతరణ దినోత్సవం నిర్వహణ కోసం
క్యాబినెట్ సబ్‌కమిటీ
రాష్ట్రంలో అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించారు. దీనికి చైర్మన్‌గా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని నియమించగా, సభ్యులుగా మంత్రులు కేటీఆర్, ఈటెల, జూపల్లి, చందులాల్‌లను నియమించారు. వీరు మే 18న సమావేశమై అవతరణ దినోత్సవాల నిర్వహణ గురించి చర్చించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు అన్ని చోట్లా ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని క్యాబినెట్ సబ్‌కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్రలోని ముంబాయి, భీవాండీ, సూరత్‌లలో కూడా తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సబ్‌కమిటీ నిర్ణయించింది. ఇదేకాకుండా దుబాయ్‌లో కూడా అక్కడి తెలంగాణ ప్రజలు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకునేలా చూడాలని నిర్ణయించారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, పత్రికల ద్వారా జాతీయస్థాయిలో వినూత్న ప్రచారం నిర్వహించేలా సమాచారశాఖ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్‌ను ఆదేశించారు.
ప్రతి జిల్లాకు రూ. 30 లక్షలు
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రతి జిల్లాకు రూ. 30 లక్షల నిధులను మంజూరీ చేస్తున్నారు. ఈ నిధులతో జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు ప్రజలను అందులో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలు ఇది ప్రభుత్వ కార్యక్రమం అని భావించకుండా తాము చేసుకునే దసరా, దీపావళి పండుగలలాగే ఇదికూడా ఒక పండుగగా కలిసి చేసుకునే విధంగా ప్రజలను మమేకం చేయాలన్నారు. మే 23న జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈ విధమైన ఆదేశాలు జారీచేశారు. జిల్లా కేంద్రంలో మంత్రులు, అధికారులు విధిగా పాల్గొని పండగ వాతావరణాన్ని తలపింపచేయాలన్నారు. అలాగే రాజధాని కేంద్రమైన భాగ్యనగరంలో జరిగే ఉత్సవాలకు ప్రతి జిల్లా నుంచి వివిధ రంగాలలో నిష్ణాతులైన 50 మంది మేధావులను పంపించాలని సూచించారు.
అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం
అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. విద్యార్హతలు లేకున్నా ముందు ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హతలు సాధించడానికి 5 సంవత్సరాల సమయం ఇవ్వాలని ఆదేశించారు. ఈ నియామక పత్రాలు జూన్ 2న అవతరణ దినోత్సవం రోజు ఇవ్వాలన్నారు. అలాగే అమరుల కుటుంబాలకు చెందిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించాలన్నారు. మొత్తంగా అవతరణ దినోత్సవం అంగరంగ వైభవంగా జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.