తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ట్యాగ్ లైన్ ”నీళ్ళు -నిధులు-నియామకాలు ”జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధుల వినియోగంపై రాజ్యాంగబద్దమైన హక్కు ఏర్పడింది. తన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించి నిధులు కేటాయించుకునే రాజకీయ స్వేచ్చ లభించింది. ఇప్పుడు నిధుల కోసం ఎవరినీ దేబిరించవలసిన పరిస్థితి లేదు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ వచ్చింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ట్యాగ్ లైన్ నీళ్ళు-నిధులు-నియామకాలు
జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధుల వినియోగంపై రాజ్యాంగబద్దమైన హక్కు ఏర్పడింది. తన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించి నిధులు కేటాయించుకునే రాజకీయ స్వేచ్ఛ లభించింది. ఇప్పుడు నిధుల కోసం ఎవరినీ దేబిరించవలసిన పరిస్థితి లేదు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ వచ్చింది.
తెలంగాణ ఉద్యమ నినాదంలో మొదటిది నీళ్ళు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దిశానిర్దేశనంతో, సాగునీటి మంత్రి హరీశ్ రావు ఆచరణతో ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణ ఎదుర్కొన్న వివక్షను, నీటి దోపిడీని అంతం చేయ్యడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. తెలంగాణ రాష్ట్ర అవరాలకు అనుగుణంగా తెలంగాణ భౌగోళిక పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేసి అమలుచేసే ప్రక్రియ మొదలయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలని తీర్చే దిశలో పురోగమనం సాగిస్తున్నది. రాష్ట్ర అవతరణ సందర్భంగా ఈ రెండేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటిరంగంలో సాధించిన పురోగతిని పున:శ్చరణ చేసుకోవల్సిన అవసరం ఎంతో ఉంది.
చెరువుల పునరుద్ధరణ – మిషన్ కాకతీయ :
2015 మార్చి 12 న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ పాత చెరువులో మిషన్ కాకతీయ చెరువుల పునరుద్దరణ పనులని ప్రారంభించిన సంగతి అందరికీ ఎరుకే. మిషన్ కాకతీయ పనులని అయిదు దశల్లో ఏడాదికి 20 శాతం చెరువులను ఎంపికచేసుకొని పునరుద్దరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిషన్ కాకతీయ ( చెరువుల పునరుద్దరణ ) తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష . తెలంగాణ గ్రామీణ ఆర్థిక, సామాజిక, సాంస్క తిక వికాసానికి అనాది ఆధారాలుగా ఉన్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఆంధ్ర వలస పాలకుల విధానపరమైన నిర్లక్ష్యం కారణంగా విధ్వంసం అయిపోయింది. 100 శాతం దక్కన్ పీఠభూమిలో నెలకొని ఉన్న తెలంగాణ ప్రాంతం ఎగుడు దిగుడు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగానే కాకతీయులు, వారి తర్వాత ఈ ప్రాంతాన్నిఏలిన కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, సంస్థానాధీశులు, స్థానిక భూస్వాములు తెలంగాణ ప్రాంతంలో వేలాది చెరువులను నిర్మించి వ్యవసాయ విస్తరణకు తోడ్పాటును అందించినారు. తెలంగాణలో వేలాది చెరువుల నిర్మాణం జరిగినందువలన తెలంగాణలో కరువు కాటకాలు అరుదుగా వచ్చేవి. గ్రామాలు స్వయంపోషకాలుగా విలసిల్లినాయి. 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎర్పడిన నాటికి తెలంగాణలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 33000 లకు పైగా చెరువులు ఉన్నట్లు, వాటి కింద 12 లక్షల ఎకరాలకు పైగా భూమి సాగులో ఉన్నట్టు తెలుస్తున్నది. తెలంగాణలో చెరువులేని గ్రామం లేదంటేె అతిశయోక్తి కాదు. ఒకటి కంటే ఎక్కువ చెరువులు ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి.
చెరువు తెలంగాణ ప్రజలకు ఒక పాతజ్ఞాపంకంగా మారిన పరిస్థితి. తెలంగాణ తల్లి తలాపున పారుతున్న గోదావరి, కాళ్ళను తడుపుతూ పోయే కష్ణా నదులు తమ పొలాలకి మళ్ళాలని కవులు, గాయకులు పాడినారు. విధ్వంసం అయిన గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ జరగాలని ప్రజకు కోరుకున్నారు. తెలంగాణలో మైనర్ ఇర్రిగేషనే మేజర్ ఇర్రిగేషన్ అని కె సి ఆర్ సహా ఉద్యమ నాయకులు ఎన్నో ఉపన్యాసాల్లో అన్నారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే చెరువుల పునరుద్ధరణ ఒక ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణ భౌగోళిక అనివార్యత గనుకనే టి ఆర్ ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలుపరుస్తామని ప్రజలకు వాగ్దానం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి సంబంధించి మేధో మధనాన్ని ప్రారంభించినారు ముఖ్యమంత్రి కె సి ఆర్. రోజుల తరబడి చర్చ జరిగింది. జులై 2014 లో మొదట చెరువులను లెక్కగట్ట్టేె పని జరగాలని తలంచి మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ జరపాలని ఆదేశించినారు. వారం రోజుల సెన్సెస్ అనంతరం 10 తెలంగాణ జిల్లాల్లో తేలిన చెరువుల సంఖ్య 46 351, వాటి కింద 24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు తేలింది. ఇందులో100 ఎకరాలకు పైబడి ఆయకట్టు ఉన్న చెరువులు 38,411, వాటి కింద 20.46 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు తేలింది. అత్యధికంగా చెరువులున్న జిల్లాలు మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ రెండు జిల్లాలు అత్యంత కరువు బారిన పడిన జిల్లాలు. 25 సెప్టెంబర్ 2014న జె ఎన్ టి యూ ఆడిటోరియంలో దినమంతా సాగునీటి శాఖ ఇంజనీర్ల సదస్సు జరిగింది. ముఖ్యమంత్రి సదస్సులో స్వయంగా పాల్గొని ఇంజనీర్లకు దిశా నిర్దేశం చేసినారు.
ఆ తర్వాత సాగునీటి మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన అరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది . సబ్ కమిటీ తెలంగాణ మేధావులతో, సీనియర్ జర్నలిస్టులతో, సాగునీటి రంగ నిపుణులతో, పూడిక తీసివేత పనులపై అవగాహన ఉన్న ఫ్రీడం సంస్థ, ఇతర ఎన్ జీ వో ల ను సంప్రదించింది. ఇక్రిసాట్ ప్రచురించిన పరిశోధనా పత్రాలను, ధన్ ఫౌండేషన్ వారు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల అనుభవాలను రికార్డు చేసి ప్రచురించిన పాలసీ పత్రాలను అధ్యయనం చేసింది. అనంతరం ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేసి ముఖ్యమంత్రికి సమర్పించడం జరిగింది. సబ్ కమిటీ తయారు చేసిన యాక్షన్ ప్లాన్ కు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసినారు.
మిషన్ కాకతీయ మొదటి దశ జయప్రదం :
మొదటి దశలో 8105 చెరువులకు ప్రభుత్వం రూ.2591 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది. ఇందులో 8039 చెరువులకు సుమరు రూ.1633 కోట్లకు కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకొని పనులను పారంభించడం జరిగింది. చెరువు మట్టి కట్టలను వెడల్పు చేసి బలోపేతం చేయడం, చెరువుకట్టల మీద, చెరువు లోపల పెరిగిన తుమ్మ చెట్లను, లొట్టపీసు చెట్లను, గుర్రపు డెక్క తదితర పిచ్చి చెట్లను తొలగించడం, తూము, అలుగులను మరమ్మతు చేయడం, అవసరమైన చోట పునర్నిర్మాణం చేయడం,చెరువులకు నీటిని మోసుక వచ్చే కట్టు కాలువలను (ఫీడర్ చానల్స్)ను పునరుద్దరించడం, పంట కాలువలను పునరుద్దరించడం, చెరువు శిఖంను గుర్తించి రాళ్ళు పాతడం, చెరువు వద్ద హరిత హారంలో భాగంగా వేలాది ఈత, సిల్వర్ ఓక్, తదితర చెట్లను నాటడం జరిగింది.
చెరువుల పునరుద్ధరణలో అత్యంత కీలకమైన పని పూడిక తొలగింపు కార్యక్రమం. ఇది రైతుల భాగస్వామ్యంతో అధ్భుతంగా జరిగింది. 2 కోట్ల 52 లక్షల 14 వేల ట్రాక్టర్ ట్రిప్పుల పూడిక మట్టిని రైతులు స్వచ్ఛందంగా తమ పొలాల్లోకి తరలించుకపోవడం జరిగింది. ఇది 6కోట్ల 53 లక్షల 37 వేల క్యూబిక్ మీటర్లతో సమానం. రైతులు చాలా చోట్ల తమకు సరిపడినంత పూడిక మట్టి లభించలేదని షికాయతు చేసిన సందర్భాలు, వారు పోరాడి అదనంగా పూడిక మట్టిని తరలించుకపోయినట్టు ఇంజనీర్లు సమాచారమిచ్చినారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పూడిక మట్టిని తరలించుకపోవడానికి రైతులు సుమారు 300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టినట్టు అంచనా. ఇది నిజంగా అపూర్వం.ప్రజల భాగస్వామ్యంతోనే మిషన్ కాకతీయ కొనసాగిందనడానికి ఇది ప్రబలమైన దాఖలా. 10 మే 2016 నాటికి మొదటి దశలో 6158 చెరువుల పనులు పూర్తి అయినాయి.మిగతా 1881 చెరువుల పనులు మే నెలాఖరుకు పూర్తి అవుతాయి.
ప్రారంభమైన మిషన్ కాకతీయ రెండో దశ :
మిషన్ కాకతీయ రెండో దశ కార్యక్రమం ప్రారంభమయ్యింది. అన్నిజిల్లాలో అన్ని మండలాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం అందుతున్నది. ఇప్పటివరకు(10.5.2016) రెండో దశ పునరుద్ధరణలో భాగంగా 9 జిల్లాల్లో మొత్తం 9032 చెరువులకు 2970 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు జారీ అయినాయి. 8819 చెరువుల పునరుద్దరణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. 6676 చెరువుల పనులు ప్రారంభమయినాయి. మిగతా చెరువుల పనులు ప్రారంభం కాబోతున్నాయి. మే నెలాఖరు వరకు మొదటి దశ పనులు సంపూర్ణంగా పూర్తి కానున్నాయి. దీనితో మొదటి దశ, రెండో దశలో పునరుద్ధరణ జరిగిన దాదాపు 16000 చెరువులు నీరు నిలుపుకునేందుకు సిద్దంగా ఉంటాయి. ఈ సంవత్సరం రుతుపవనాల ప్రభావం వలన వర్షాలు సగటు వర్షపాతానికంటే ఎక్కువే కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా. అదే నిజమైతే మిషన్ కాకతీయ ఫలితాలు తెలంగాణ రైతాంగం, ప్రజల అనుభవాల్లోకి రానున్నాయి.
భారీ ప్రాజెక్టులు :
ఒకవైపు చెరువుల పునరుద్దరణ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం భారీ మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంలోనూ అత్యంత శ్రద్దతో, అంకిత భావంతో ముందుకు సాగుతున్నది. 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ఒక భారీ ప్రాజెక్టు (నిజాంసాగర్), 11 మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణం అయి ఉన్నాయి. వాటి కింద సుమారు 3 లక్షల 50 వేల ఎకరాలు సాగులో ఉన్నాయి. 1956 నుండి 2014 ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థిని సమీక్షించుకుంటే.. 1960-70 దశకాల్లో 5 భారీ ప్రాజెక్టులు ( రాజోలి బండ మళ్ళింపు పథకం, జూరాల ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీరామసాగర్ ప్రాజెక్టు, కడం ప్రాజెక్టు) 23 మధ్యతరహా ప్రాజెక్టులు ప్రారంభమయినాయి. భారీ ప్రాజెక్టుల కింద 18.42 లక్షల ఎకరాలు, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 2.47 లక్షల ఎకరాలు సాగులోనికి రావాలసి ఉండే. ఉమ్మడి ప్రభుత్వాల వివక్ష కారణంగా వాటి కింద పూర్తి స్థాయిలో ఆయకట్టు ఎప్పుడూ సాగులోనికి రాలేదు.
ఇక 2005లో ప్రారంభమైన జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలో 19 భారీ ప్రాజెక్టులు, 12 మధ్యతరహా ప్రాజెక్టులు, 2 ఆధునీకీకరణ ప్రాజెక్టులు, గోదావరి కరకట్టల పనులు ప్రారంభం అయినాయి. వీటికి ఉమ్మడి ప్రభుత్వం 1,31,987.81 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు ఇచ్చి పనులని ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించడం జరిగింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 7.65 లక్షల ఎకరాలను సాగులోనికి తీసుకరావాలని లక్ష్యం. వీటిలో కేవలం మూడు ప్రాజెక్టులు (అలీసాగర్, గుత్పా, సుద్దవాగు) మాత్రమే పూర్తిఅయినాయి. మిగతావి అనేక సమస్యల్లో చిక్కుబడి నత్తనడకన సాగుతున్నాయి.
ప్రాజెక్టుల పురోగతి నత్తనడకన సాగుతున్న క్రమాన్ని వేగవంతం చెయ్యడానికి సాగునీటి శాఖా మంత్రి హరీశ్ రావు నిరంతరం సమీక్షా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, ప్రాజెక్టుల పర్యటనలు చేస్తూ, ప్రాజెక్టుల వద్ద నిద్ర తీస్తూ ప్రాజెక్టు పనులను అనుకున్న సమయానికి పూర్తికావడానికి చర్యలు తీసుకుంటున్నారు. గత పదేండ్లుగా ప్రాజెక్టుల పురోగతికి అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ పరుగులు పెట్టిస్తున్నారు. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు టార్గెట్లు పెట్టి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఈ జూలై నాటికి పూర్తి అయ్యే ప్రాజె క్టులు, వచ్చే సంవత్సరం జూలై నాటికి పూర్తి అయ్యే ప్రాజెక్టులను గుర్తించి వాటికి నిధుల కొరత లేకుండా చూడడం, ప్రభుత్వపర మైన అనుమతులు ఇప్పించడం తదితర అంశాలపై దష్టి సారించి ప్రాజెక్టులు పూర్తి కావడానికి చర్యలు తీసుకుంటున్నారు.
భూసేకరణలో విధానపరమైన మార్పు :
భూసేకరణలో తీవ్రమైన జాప్యం జరుగుతుండడంతో భూసేకరణకు విధానపరమైన మార్పు తీసుకరావడం జరిగింది. రైతుల, భూ యజమానుల స్వచ్చంద అనుమతితో భూములను ప్రభుత్వం కొనే ల్యాండ్ ప్రొక్యూర్ మెంట్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే జిఒ నంబరు 123. రైల్వే, రోడ్డుక్రాసింగుల సమస్యలను, అటవీ అనుమతుల సమస్యలను కూడా ఆయా శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిష్కరించడం జరుగుతున్నది.
ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ :
గత ప్రభుత్వాలు ప్రాజెక్టులని రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయన లోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణలో తేలింది. ఈ సాంకేతిక సమస్యలతో పాటూ అంతర రాష్ట్ర సమస్యలు, అటవీ సమస్యలు, ముంపు సమస్యలు, జలాశయాల సామర్థ్యం లేకపోవడం తదితర అంశాలు బయటపడినాయి. వీటన్నింటిని పరిహరించి క ష్ణా గోదావరీ జలాల్లో తెలంగాణ వాటాని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొన్ని కొనసాగుతున్న ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ ని చేపట్టింది. ముఖ్యమంత్రి స్వయంగా రోజుల తరబడి సాగునీటి రంగ నిపుణులతో చర్చించి, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులను, గూగుల్ ఎర్త్ చిత్రాలతో పోల్చుకొని ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ చేపట్టడం జరిగింది. వాటిలో ప్రాణహిత చేవెళ్ళ, శ్రీరాంసాగర్ వరద కాలువ, దేవాదుల ప్రాజెక్టు, రాజీవ్ ఇందిరా సాగర్, కాంతనపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి.
ప్రాణహిత – చేవేళ్ళ సుజల స్రవంతి :
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు 2008 లోనే ప్రారంభించబడినప్పటికీ నేటికీ తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం మొదలుకాలేదు. కానీ చిట్టచివరన ఉన్న చేవెళ్ళలో కాలువల తవ్వకం మొదలుపెట్టడం గమనిస్తూఉంటే అసలు ప్రాజెక్టును పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. మహారాష్ట్ర అనుమతి లేకుండానే తుమ్మిడిహట్టి బ్యారేజీ పూర్తి జల మట్టము 152 మీటర్లుగా నిర్ణయించి తదనుగుణంగా కాలువల పనులు మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ బ్యారేజీ మూలంగా కలిగే ముంపును మహారాష్ట్ర అంగీకరించలేదు. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్ లిఖితపూర్వకంగా చేసిన హెచ్చరికలను ఉమ్మడి ప్రభుత్వం బేఖాతర్ చేసి పాత డిజైన్ ప్రకారం పనులను కొనసాగించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై దష్టి పెట్టింది. ఆ క్రమంలో కేంద్ర జల సంఘం తదితర సంస్థలతోనూ, మహారాష్ట్ర ప్రభుత్వంతోనూ జరిపిన చర్చల వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు మొత్తాన్ని రీ-ఇంజనీరింగు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించింది.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడానికి ముంబై వెళ్ళినపుడు తుమ్మిడిహట్టి బ్యారేజీలో మహారాష్ట్ర భూభాగంలో ముంపు లేకుండా చూడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కోరడం జరిగింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 160 టీఎంసీల నీటిని తరలించుకోవడానికి తమకు అభ్యంతరంలేదని ప్రకటించినారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కోరికను మన్నించి, సూచనలను పరిగణన లోనికి తీసుకొని ముంపును తగ్గిస్తూ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రయోజనాలను పూర్తిగా పొందడానికి అనేక ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసింది. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజి సైటుకు దిగువన నీరు పుష్కలంగా ఉండి, మహారాష్ట్రలో ముంపు లేకుండా ఉండే చోటును అన్వేషిస్తున్న క్రమంలో మేడిగడ్డ బ్యారేజీ ప్రతిపాదన ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై సర్వే చేసి సవివరమైన అధ్యయన నివేదిక సమర్పించమని ఆదేశించడమైంది.
పాత డిజైన్ లో ఎత్తిన నీటిని నిలువ చేయడానికి అవసరమైన సామర్థ్యం కలిగిన జలాశయాల నిర్మాణం ప్రతిపాదించకపోవడం వల్ల కేంద్ర జలసంఘం సూచనపై దారిపొడుగునా ఉన్న జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని 16 టి ఎం సి ల నుంచి 185 టి ఎం సి లకు పెంచడం జరిగింది.
గోదావరిపై సుందిళ్ళ, అన్నారం వద్ద మరో రెండు బ్యారేజీలను నిర్మించి నదీ మార్గం ద్వారా రోజుకు 2 టి ఎం సి ల గోదావరి నీటిని యెల్లంపల్లి బ్యారేజీకి, అక్కడి నుండి పాత మార్గంలో నీటిని మిడ్ మానేరు, మల్లన్నసాగర్ (తడ్కపల్లి), కొండపోచమ్మ (పాముల పర్తి)వరకు తరలించాలన్నది రీ ఇంజనీరింగ్ లో ప్రధాన అంశం. తుమ్మిడిహట్టి వద్ద 148 మీ ఎత్తులో ఒక బ్యారేజి నిర్మించి ఆదిలాబాద్ అవసరాలు కూడా తీర్చడం జరుగుతుంది. పాత స్కీములో ప్రతిపాదించిన 56500 ఎకరాలే కాకుండా అదనంగా మరో లక్ష ఎకరాల ఆయకట్టును కూడా సాగులోనికి తీసుకవచ్చే అవకాశాలను పరిశీలించడం జరుగుతుంది. ప్రాణహిత డిజైన్ ను మార్చినందువలన ఆదిలాబాద్ పశ్చిమ జిల్లా నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో ప్రతిపాదించిన ఒక లక్ష ఎకరాలకు ఏ ఢోకా ఉండదు. కొత్త డిజైన్ ప్రకారం 7 జిల్లాల్లో ప్రతిపాదించిన 16 లక్షల ఆయకట్టుతోపాటు శ్రీరామ సాగర్, నిజాంసాగర్, సింగూరు జలాశయాలని కూడా అవసరమైనప్పుడు నింపి వాటి కింద ఉన్న16 లక్షల ఎకరాలను స్థిరీకరించడానికి ప్రతిపాదించడమైనది. రీ ఇంజనీరింగ్ తర్వాత పాత ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్టు ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులుగా విభజన జరిగింది.
శ్రీరాంసాగర్ వరద కాలువ పథకం :
ఈ పథకంలో 1.9 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్రతిపాదన. రీ ఇంజనీరింగ్ లో భాగంగా ఈ కాలువ కింద మొత్తం 4.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించి నారు. ఇందులో గతంలో దేవాదుల కింద ప్రతి పాదించిన 2 లక్షల ఎక రాలను వరద కాలువ పరిధిలోనికి తీసుక రావడం జరిగింది. గండిపల్లి జలాశయం కింద మరో 30000ల ఎకరాలను సాగు లోనికి తేవాలని ఆలోచన. ఈ అదనపు ఆయ కట్టుని సాగులోనికి తీసుక రావడానికి గౌరవెల్లి, గండిపెల్లి జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది.
దేవాదుల ఎత్తిపోతల పథకం :
గత ప్రభుత్వం దేవాదుల కింద 6 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని తలపెట్టింది. అందుకు కేవలం 38 టి ఎం సి ల నీటినే కేటాయించింది. ఇది అన్యాయమని ప్రభుత్వం గుర్తించింది. దేవాదుల ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను 60 టి ఎం సి లకు పెంచింది. దేవాదుల కింద గతంలో జనగామ, స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గాల్లో ఉన్న 2 లక్షల ఎకరాలను ఎస్సారెస్పీ వరద కాలువ పరిధిలోనికి తెచ్చి భూపాలపల్లి, ములుగు, పరకాల, మహబూబాబాద్ నియోజక వర్గాల్లో భూమిని దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని తేవాలని ప్రతిపాదన. ఆయకట్టులో వందలాది చెరువుల కు, రామప్ప, పాకాల, లఖ్నవరం మధ్యతరహా ప్రాజెక్టులను స్థిరీక రించడం దేవాదుల రీ ఇంజనీరింగ్ లో ప్రతిపాదించడమైనది.
రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలు:
జలయజ్ఞంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులు ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడానికి ప్రతిపా దించినారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇందిరాసాగర్ హెడ్ వర్క్స్, కొంత కాలువ ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనికి పోయినాయి. రెండు ప్రాజెక్టుల్లో ఇమిడి ఉన్న అనేక సాంకేతికపరమైన సమస్యలని పరిష్కరించి, అంతర రాష్ట్ర సమస్యలు లేని ఒకే ఒక సమీకత ప్రాజెక్టుని రూపకల్పన చేసినారు. అదే ఇటీవలే ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో శంకు స్థాపన చేసిన సీతారామ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద గతంలో వదిలేసిన ఒక లక్ష ఎకరాలని కలుపుకొని మొత్తం ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకుసాగునీరు అందించాలన్నది లక్ష్యం. బయ్యారం జలాశయం ద్వారా శ్రీరాం సాగర్ రెండో దశ కింద డి బి ఎం 60 కాలువ కింద ఉన్న 60000 ఎకరాలను స్థిరీకరించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగం.
కంతనపల్లి ప్రాజెక్టు :
వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలో కంతనపల్లి వద్ద గోదావరి నదిపై బ్యారేజీ నిర్మించి దేవాదుల ప్రాజెక్టుకు ఎల్లకాలం గోదావరిలో నీటి నిలువను అందుబాటులో ఉంచడం, ఎస్సారెస్పీ రెండోదశకు కింద ఉన్న 4.4 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేసే స్థిరీకరించడం అనే రెండు లక్షాలతో కంతనపల్లి బ్యారేజీని ప్రతిపాదించడం జరిగింది. అయితే రీ ఇంజనీరింగ్‌లో భాగంగా ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందించాలని తలపెట్టడం వలన కంతన పల్లి రెండో లక్ష్యం నెరవేరినట్టయ్యింది. ఇక మిగిలింది దేవాదులకు నీటి నిలువ సష్టించడం మాత్రమే. ఇక్కడ బ్యారేజీ నిర్మాణానికి ఆదివాసీల నుంచి నిరసన వ్యక్తం అవుతుండడంతో ముంపు తగ్గించడానికి గోదావరిపై ఎగువన బ్యారేజీ స్థలాన్ని తుపాకుల గూడెం వద్దకు మార్చడం జరిగింది. దేవాదుల ప్రాజెక్టుకు ఈబ్యారేజీ వలన ఏడాది పొడుగునా నీటినిలువ అందుబాటులో ఉండి మొత్తం 6లక్షల ఎకరాలకు సరిపడే నీటిని ఎత్తిపోసుకో వడానికి అవకాశం ఉంటుంది.
కొత్త ప్రాజెక్టులు :
శ్రీ రీ ఇంజనీరింగ్ తో పాటు ప్రభుత్వం గత ప్రభుత్వాలు సర్వేలకు ఆదేశించి అటకెక్కించిన కొన్ని కొత్త (పాత) ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారంభించింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,
శ్రీ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీరు, 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం,
శ్రీ ఆదిలాబాద్ జిల్లాలో 58000 వేల ఎకరాలకు సాగునీరు అందించే చనాక కొరాటా బ్యారేజీ,
శ్రీ ఎస్సారెస్పీ రెండొ దశలో డి బి ఎం 60 కింద ఖమ్మం జిల్లా పాలేరు, ఖమ్మం నియోజక వర్గాల్లో ఉన్న 60 వేల ఎకరాలకు నాగార్జునసాగర్ పాలేరు జలాశయం నుంచి భక్త రామదాసు ఎత్తిపోతల పథకం,
శ్రీ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజక వర్గంలో ఉన్న సదర్మాట్ ఆనకట్ట కింద ఉన్న 20 వేల ఎకరాల ఆయకట్టుకు స్థిరంగా గోదావరి నీరు అందించడానికి ఎస్సారెస్పీకి దిగువన బ్యారేజీ నిర్మించడం,
శ్రీ కడం జలాశయానికి అయకట్టుకు అవసరమైనప్పుడల్లా రెగ్యూలేటెడ్ ఫ్లోస్ అందివ్వడానికి కడం నదిపై కుప్టి గ్రామం వద్ద 6 టి ఎం సి నిల్వ సామర్థ్యంతో జలాశయ నిర్మాణం,
శ్రీ ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద యాత్రికులకు నీటి సౌకర్యం కలిగించడం, ఆ ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాలకు తాగునీరు అందించడం, బాసర ట్రిపుల్ ఐ టి కి నీరు అందించడం అనే లక్ష్యాలతో గోదావరి పై చెక్ డ్యాం
శ్రీ మెదక్ జిల్లాలో నిజాం కాలంలో మంజీరా నదిపై నిర్మించిన ఘన్ పూర్ ఆనకట్ట ఎత్తు పెంచి ఆయకట్టును స్థిరీకరించడం
ఈ రకంగా ప్రభుత్వం అన్ని జిల్లాల సాగునీటి అవసరాలని దష్టిలో ఉంచుకొని ప్రణాళికలు తయారు చేస్తున్నది. పైన స్థూలంగా వివరించిన ప్రభుత్వ సాగునీటి విధానాన్ని, ప్రభుత్వ ప్రాధాన్యతలని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ వేదికగా మార్చి 31, 2016న సవివరమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం ప్రజలందరు చూసినారు. స్వాగతించినారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలు :
శ్రీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు, ఆదిలాబాద్ జిల్లా కొమురం భీం, గొల్లవాగు, నీల్వాయి, జగన్నాథ్ పూర్ తదితర మధ్యతరహా ప్రాజెక్టులను 2017 జూలై నాటికి పూర్తి చేయడం.
శ్రీ వచ్చే మూడేండ్లలో ప్రాణహిత, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, డిండీ ఎత్తిపోతల పథకాలని పూర్తి చెయ్యడం
శ్రీ నాగార్జున సాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ కాలువల ఆధునీకీకరణ పనులని జూలై 2016 నాటికి పూర్తి చెయ్యడం
శ్రీ 2019 నాటికి మిషన్ కాకతీయ అయిదు దశల్లో 46500 చెరువుల పునరుద్దరణ పనులని పూర్తి చెయ్యడం
శ్రీ కష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాని సంపూర్ణంగా వినియోగించుకొని ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో కనీసం ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి ఎకరాలకు సాగునీరు అందించడం.
శ్రీ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చెయ్యడానికి నిధులను సమకూర్చడం. ఈఆర్థిక సంవత్సరంలో సాగునీటిరంగ అభివ ద్దికి బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లను కేటాయించడం దేశ చరిత్రలోనే ప్రథమం.
శ్రీ ఆంధ్రప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాలతో ఉన్న అంతర రాష్ట్ర సమస్యలను చర్చల ద్వారా, పరస్పర అవగాహనతో పరిష్కరించుకొని ఇచ్చి పుచ్చుకునే వైఖరితో అభివద్ది పథంలో ముందుకు సాగడం. అందుకు మహారాష్ట్రతో గోదావరి, పెన్ గంగ బ్యారేజీల నిర్మాణానికి ఒప్పందం చేసుకోవడం, రాజోలిబండ మళ్ళింపు పథకంలో పనులను పూర్తి చెయ్య డానికి కర్నాటక ప్రభుత్వంతో చర్చించడం ఉదాహరణలు.
గత పదేండ్లుగా ప్రాజెక్టుల పురోగతికి అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ పరుగులు పెట్టిస్తున్నారు. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు టార్గెట్లు పెట్టి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఈ జూలై నాటికి పూర్తి అయ్యే ప్రాజె క్టులు, వచ్చే సంవత్సరం జూలై నాటికి పూర్తి అయ్యే ప్రాజెక్టులను గుర్తించి వాటికి నిధుల కొరత లేకుండా చూడడం, ప్రభుత్వపర మైన అనుమతులు ఇప్పించడం తదితర అంశాలపై దష్టి సారించి ప్రాజెక్టులు పూర్తి కావడానికి చర్యలు తీసుకుంటున్నారు.