అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని అందిపుచ్చుకున్న తెలంగాణ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని మరోసారి ప్రదర్శించిన కేసీఆర్ జలవివాదాలను పరిష్కరించుకునేందుకు ఆచరణాత్మక వైఖరి పాలమూరు, డిండి ప్రాజెక్టులు పాతవేనని సాక్ష్యాధారాల ప్రదర్శన కృష్ణా నీటి వాటాలు తేల్చేందుకు ట్రిబ్యునల్ వత్తిడికి నిర్ణయం ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారమే నీటిని వాడుకోవాలని పరస్పర అంగీకారం సమర్థ వాదన, సరైన ఆధారాలతో ఆంధ్రప్రదేశ్ ఆరోపణలకు సమాధానం ప్రాజెక్టుల నిర్వహణకు టెలిమెట్రీ, జాయింట్ కమిటీలు ఆరు అంశాల్లో కుదిరిన పరస్పర అంగీకారం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా స్నేహహస్తం సాచింది. జల వివాదాలను పరిష్కరించు కునేందుకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కార మార్గాలను ఎంచుకున్నది. ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశంలోనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో తెలంగాణ రాష్ట్రం తన వ్యూహాత్మక, స్నేహపూర్వక వైఖరిని ప్రదర్శించింది. తెలంగాణ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీలేకుండా వ్యవహరించింది. తమకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని మరోసారి స్పష్టం చేసి తన నైతికతను చాటుకున్నది. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. ముఖ్యంగా పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు కొత్తవని సాకు చెప్పి వాటిని ఆపుచేయించాలని ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యేలా సరైన ఆధారాలతో సమర్థ వాదన వినిపించింది. కేంద్రానికి, యావత్ దేశానికి తెలంగాణ నిబద్ధత అర్థమయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర బృందం పక్కా ప్లాన్‌తో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఉపయోగించుకున్నది. తెలంగాణ రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు కడుతున్నదని ఆరోపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చివరికి ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తామే అనుమతులు లేని ప్రాజెక్టులు కడుతున్నామని స్వయంగా వారి అధికారులే ఒప్పుకోవాల్సి వచ్చింది.
పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు కొత్త ప్రాజెక్టులని, ఇవి కడితే దిగువన ఉన్నతమకు నష్టం కలుగుతుందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపెక్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసింది. ఇదే విషయంలో ఆంధ్రప్రాంతానికి చెందిన రైతులు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కూడా కేసును అపెక్స్ కౌన్సిల్ కే రిఫర్ చేసింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 21 ఢిల్లీలో కేంద్ర మంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర రావు, ఎన్. చంద్రబాబు నాయుడుతో కూడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశమయింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖల మంత్రులు తన్నీరు హరీష్‌రావు, ఉమా మహేశ్వర్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఇ ఎన్ సి విజయ్ ప్రకాశ్ పాల్గొన్నారు.
అబద్ధాలు, నిరాధార ఆరోపణలతో ఏపీ ప్రజంటేషన్
ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను కట్టవద్దని, కేంద్రం జోక్యం చేసుకుని ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీటి పారుదల శాఖ మంత్రి ఉమా మహేశ్వర్ రావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ వాదనలు వినిపించారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ లో పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా పేర్కొనలేదు కాబట్టి, అవి కొత్త ప్రాజెక్టులేనని ఆంధ్రప్రదేశ్ వాదించింది. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కడితే తమకు నీటి లభ్యత తగ్గిపోతుందని, కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు కట్టవద్దని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేసింది.
సాక్ష్యాధారాలతో తెలంగాణ ప్రజంటేషన్
తర్వాత తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి తెలంగాణ తరఫు వాదన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. పాలమూరు, డిండి పాత ప్రాజెక్టులేనని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. డిండి ప్రాజెక్టు నిర్మాణం కోసం 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 159ని, పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 72ను తెలంగాణ అధికారులు ఉమాభారతితో సహా సమావేశంలో పాల్గొన్న అందరికీ అందచేశారు. ఇవి రెండు పాత ప్రాజెక్టులే అని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏమి కావాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. దీంతో ఆంధ్ర అధికారులు విభజన చట్టాన్ని ప్రస్తావించారు. చట్టంలోని 11వ షెడ్యూల్లో ఆరు ప్రాజెక్టులను మాత్రమే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా పేర్కొన్నారని, వాటిలో పాలమూరు, డిండి లేదు కాబట్టి వాటిని పాత ప్రాజెక్టులుగా పరిగణించలేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుంటూ విభజన చట్టం రూపొందించే సందర్భంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల వివరాలను అసమగ్రంగా రూపొందించారని చెప్పారు. కేవలం ఆరు ప్రాజెక్టులు మాత్రమే చూపించారని, కానీ ఆంధ్ర, తెలంగాణలో దాదాపు 25 ప్రాజెక్టులు కడుతున్నారని చెప్పారు. వాటిలో కష్ణా బేసిన్లో ఎఎంఆర్పి, ఎస్ఆర్బిసి, ముచ్చిమర్రి, గోదావరి బేసిన్లో దేవాదుల, ప్రాణహిత, రాజీవ్ దుమ్ముగూడెం, ఎల్లంపల్లి, వరద కాలువ, పోలవరం తదితర ప్రాజెక్టులను కూడా 11వ షెడ్యూల్ లో పేర్కొనలేదని, మరి అవి కూడా కొత్త ప్రాజెక్టుల కిందనే జమ కడతారా? అని ప్రశ్నించారు. దీంతో 11వ షెడ్యూల్లో పేర్కొన్న వాటినే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా పరిగణించలేమని చంద్రబాబు కూడా ప్రకటించారు.
సంచలనం కలిగించిన మోడీ ప్రసంగం వీడియో, మేనిఫెస్టోలు
పాలమూరు, డిండి ప్రాజెక్టులు పాత ప్రాజెక్టులే అని నిరూపించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అనేక ఆధారాలు సేకరించి సమావేశంలో ప్రస్తావించింది. 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడి మహబూబ్‌నగర్ సభలో చంద్రబాబు సాక్షిగా చేసిన ప్రసంగాన్ని సభలో ప్రదర్శించారు. అందులో నరేంద్రమోడీ మాట్లాడుతూ, మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీరు లేక రైతులు చనిపోతున్నారని చెప్పారు. సాగునీరు అందిస్తే జిల్లా రైతులు మట్టిలో బంగారం పండిస్తారని చెప్పారు. ఈ జిల్లా రైతుల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకం కడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనిచేయలేదని విమర్శించారు. తల్లీ కొడుకులు (సోనియా, రాహుల్) నిద్రపోయారా? అని కూడా నరేంద్రమోడీ నిలదీశారు. ఈ వీడియోను ఉమాభారతితో పాటు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనించారు. ఇదే సందర్భంలో 2014లో బిజెపి, కాంగ్రెస్, టిడిపి విడుదల చేసిన మేనిఫెస్టోలు కూడా చూపించారు. ఈ మూడు పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రణాళికలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామనే హామీని అక్షరాలా రూపొందించాయి. చంద్రబాబు ఫోటోతో ఉన్న తెలంగాణ తెలుగుదేశం మేనిఫెస్టోలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని ప్రకటించిన విషయాన్నీ, బిజెపి కూడా పాలమూరును పూర్తి చేస్తామని చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా
మరెవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఈ రెండు ప్రాజెక్టులు కొత్తవనే వాదనలో వాస్తవం లేనందున ఆంధ్రప్రదేశ్ వాదన నిరాధారమైందని తేలిపోయిందని, కాబట్టి ఆ రాష్ట్ర వాదనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి చెప్పారు. దాంతో పాలమూరు, డిండి పాత ప్రాజెక్టులా? కొత్త ప్రాజెక్టులా? అనే విషయంలో చర్చ ముగిసింది.
సాగునీరు లేని తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణలో మూడు జిల్లాలు
దేశ వ్యాప్తంగా సాగునీటి సౌకర్యం సరిగా లేని తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం తన పిపిపిలో పేర్కొన్నది. ఈ మూడు జిల్లాలకు నీరందించడానికే తాము పాలమూరు, డిండి ప్రాజెక్టులు కడుతున్నామని స్పష్టం చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సబబు కాదని విన్నవించింది.
ట్రిబ్యునల్ తీర్పు త్వరగా కావాలి
పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవా? పాతవా? అనే చర్చే అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తమకున్న నీటి వాటాను ఎక్కడి నుంచైనా, ఏ ప్రాజెక్టుల ద్వారా అయినా వాడుకునే హక్కు రాష్ట్రాలకు ఉంటుందని, దాని ప్రకారమే తెలంగాణ రాష్ట్రం నీరు వాడుకుంటుందని తేల్చి చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరుతామని సీఎం తేల్చి చెప్పారు. కృష్ణా నదిలో ఎవరెన్ని నీళ్లు వాడుకోవాలనే విషయంలో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడాల్సి ఉందని, ట్రిబ్యునల్ కేటాయించిన నీటి వాటా ప్రకారమే తాము నీటిని వాడుకుంటామని సీిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని సీఎం కేసీఆర్ కోరారు. చంద్రబాబు కూడా ఈ డిమాండ్ కు మద్దతు పలికారు. దీంతో కేంద్ర మంత్రి ఉమాభారతి ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వెలువరించాలని కోరతామని చెప్పారు.
రెండేళ్ల నాలుగు నెలల సమయం వృధా చేశారు
తెలంగాణ ఏర్పడి రెండేళ్ల నాలుగు నెలలు పూర్తయ్యాయని, ఇప్పటి వరకు తమ రాష్ట్రానికి నీటి కేటాయింపులు జరగలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత సమయం వృధా అయిందని, నీటి వాటా తేలకుండా ప్రాజెక్టుల విషయంలో ఎవరికీ స్పష్టత రాదని సీఎం అన్నారు. నీటి వాటాల విషయంలో సెక్షన్ 3 కింద రిట్ పిటిషన్ వేశామని, సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నదని, ఎక్కడా ఇంకా స్పష్టత రావడం లేదని చెప్పారు. అసలు కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా సీడబ్ల్యూసీ అనుమతి లేదని సీఎం అన్నారు. దీనికి ఆంధ్ర అధికారులు కూడా మద్దతు పలికారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు తమ ప్రణాళికలు తాము రూపొందించుకుని ముందుకు పోతాయని, లెక్కలు తేలకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు.
శ్రీశైలం దగ్గర కావాల్సినంత నీరు
పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం సోర్సుగా పెట్టుకోవడాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుపట్టింది. శ్రీశైలంలో కావాల్సినంత నీరు లేదని ఏపీి ముఖ్యమంత్రి చంద్రబాబు వాదించారు. దీనికి కేసీఆర్ సమాధానమిస్తూ ఏదో ఒకసారి తప్ప మెజారిటీ సందర్భాల్లో శ్రీశైలం వద్ద కావాల్సినంత నీటి లభ్యత ఉందన్నారు. గత 48 సంవత్సరాల్లో శ్రీశైలం డ్యామ్ వద్ద ఏ ఏడు ఎన్ని టిఎంసిల నీటి లభ్యత ఉందో చెప్పే సిడబ్ల్యుసి వెల్లడించిన గణాంకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి ఉమాభారతికి అందించారు. 48 సంవత్సరాల్లో మెజారిటీ సందర్బాల్లో వెయ్యి టిసిఎంలకు పైగా నీటి లభ్యత ఉందని, సగటు ఏడాది నీటి లభ్యత 1204 టిసింసిలు ఉంటుందని ముఖ్యమంత్రి సిడబ్ల్యుసి లెక్కలను అందించారు. గోదావరిలో సగటున మూడు వేల టిఎంసిలు, కృష్ణాలో సగటున వెయ్యి టిఎంసిలు అందుబాటులో ఉంటాయని, నాలుగువేల టిఎంసిలను తెలివిగా వాడుకుంటే రెండు రాష్ట్రాల రైతులు బాగుపడతారని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు.
పాలమూరును ఆపేది లేదని తెగేసి చెప్పిన కేసీఆర్
మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని బీడు భూములకు సాగునీరు అందించడానికి ఉద్దేశించిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. ఆ రెండు పాత ప్రాజెక్టులే కాబట్టి కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎన్ని నీళ్లు కేటాయిస్తే, వాటిలో నుంచే ఈ రెండు ప్రాజెక్టులకు నీటిని తీసుకుంటామని ముఖ్యమంత్రి కేంద్రానికి, ఆంధ్రప్రభుత్వానికి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ద్వందవైఖరిని నిలదీసిన తెలంగాణ
వాదనలు, ప్రతివాదనలు జరుగుతున్న దశలో స్నేహపూర్వకంగా మెదిలితే సమస్యలు పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీంతో తెలంగాణ మంత్రి హరీష్ రావు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు స్నేహపూర్వకంగా ఉందామంటూనే మరోపక్క తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నారని విమర్శించారు. పాలమూరు, డిండి కట్టవద్దని అపెక్స్ కమిటీలో ఎలా వాదిస్తారని చంద్రబాబును నిలదీశారు. స్నేహ పూర్వకంగా మెదిలే వారు ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు. తమ నల్గొండ జిల్లా ప్రజలను ఖాళీ చేయించి మరీ పులిచింతలలో నీళ్లు నింపుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించామని, పంటలు ఎండిపోతున్నాయంటే నాగార్జున సాగర్ నీళ్లు విడుదల చేశామని, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం తమకు ప్రతీ విషయంలో అడ్డుతగులుతోందన్నారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ పనులు చేయించుకుంటుంటే కూడా అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని తరలించు తున్నందున కృష్ణాలో తమకు 45 టిఎంసిల న్యాయమైన వాటా పెరగాల్సి ఉన్నా, ఈ విషయంలో కూడా వాదన చేస్తున్నారని విమర్శించారు. నందిగామ ప్రాంతంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నందున నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నీళ్లు అక్కడికి చేరేదాకా శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ఉమామహేశ్వర్ రావు కోరినప్పుడు కూడా హరీష్ రావు అదే విధంగా స్పందించారు. ఒక వైపు నాగార్జున సాగర్ నీరు విడుదల చేయాలంటారు, మరోవైపు శ్రీశైలం నీటిని విడుదల చేయరు అని హరీష్ విమర్శించారు.
ఇచ్చిపుచ్చుకునే ధోరణిని వెల్లడించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానిది ఇచ్చిపుచ్చుకునే ధోరణి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అధికారులు కూడా తమ వాదనలు వినిపించే క్రమంలో సాగునీటి విషయంలో మహారాష్ట్రతో, కర్ణాటకతో మంచి సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అలాంటి సంబంధాలే కోరుకుంటున్నామని, వివాదాలు కోరుకోవడం లేదని చెప్పారు.
ఆరు అంశాల్లో కుదిరిన అంగీకారం
ఢిల్లీలో జరిగిన అపెక్స్ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆరు అంశాల్లో పరస్పర అంగీకారం కుదిరింది. ఇద్దరు ముఖ్యమంత్రుల అభిప్రాయాలకు అనుగుణంగా కేంద్ర మంత్రి ఉమాభారతి వాటిని సమావేశంలో నిర్థారించారు.
1. రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రాజెక్టుల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు ఉమ్మడి కమిటీ వేయాలి. తెలంగాణలోని ప్రాజెక్టులను ఆంధ్ర అధికారులు, ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులను తెలంగాణ అధికారులు సందర్శించవచ్చు. పరిశీలించవచ్చు.
2. ఏ ప్రాజెక్టులోకి ఎంత ఇన్ ఫ్లో ఉంది, ఎంత ఔట్ ఫ్లో ఉంది అనే విషయాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికి టెలిమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. రెండు మూడు నెలల్లోనే ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇందుకు అయ్యే వ్యయం రెండు రాష్ట్రాలు భరించాలి.
3. కృష్ణా జలాల కేటాయింపుకు సంబంధించి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వీలైనంత త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎవరెన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా, కమిటీ ఇచ్చిన తుది తీర్పును అనుసరించి, కేటాయించిన నీటి వాటాకు అనుగుణంగానే నీటి వాడకం జరగాలి.
4. కృష్ణా జలాల వినియోగంపై వేసిన ఐదుగురు సభ్యుల కమిటీలోని ఛైర్మన్‌తో పాటు మరో సభ్యుడి నిష్పాక్షికతపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కమిటినీ పునర్వ్యవస్థీకరించాలి. దీనిపై కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని రెండు రాష్ట్రాలు గౌరవించాలి.
5. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించినందున నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతానికి 45టిఎంసిల అదనపు నీటిని కేటాయించే విషయంలో గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వ్యవహరించాలి. ఏ నిష్పత్తిలో పంచాలో కమిటీ నిర్ణయిస్తుంది.
6. విభజన బిల్లులోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టుల వివరాల్లో ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల విషయంలో అసమగ్రత ఉన్న దష్ట్యా, దానిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
చంద్రబాబు ఫోటోతో ఉన్న తెలంగాణ తెలుగుదేశం మానిఫెస్టోలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని ప్రకటించిన విషయాన్నీ, బిజెపి కూడా పాలమూరును పూర్తి చేస్తామని చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా మరెవరూ ఏమీ మాట్లాడలేకపోయారు.