నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ – మహారాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందం చరిత్రాత్మకమైందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. అత్యంత సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుని రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం కావడం సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సందర్భమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ – మహారాష్ట్ర ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో అంత:రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడం దేశానికే ఆదర్శమని కేసిఆర్ అన్నారు. ముంబాయిలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్లో ఆగస్టు 23 ఒప్పందం కుదిరిన తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేశంలో ఒక మంచి ఒరవడికి ఇది నాంది పలుకుతుందని సిఎం కేసిఆర్ అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులు నిర్మాణం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్నేహ హస్తం అందించడం పట్ల ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంపాటు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎప్పటికప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి విశేష కృషి చేశాడని ప్రశంసించారు. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు పరస్పరం సహకరించుకొని, సందేహాలను నివృత్తి చేసుకుని ఒప్పందం కుదు ర్చుకునేందుకు దోహదపడడం పట్ల ముఖ్యమంత్రి ఆభినందించారు.
ప్రతి సంవత్సరం సముద్రం పాలయ్యే గోదావరి నీటిని రెండు రాష్ట్రాల రైతులకు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఇప్పటికే 1400 టిఎంసిలు సముద్రం పాలయ్యాయని, ప్రాజెక్టులు కట్టి వుంటే ఈ నీటితో రైతులు బాగుపడేవారన్నారు. ఓ పక్క గోదావరి నీళ్లు సముద్రం పాలవుతుంటే, మరో పక్క రైతుల పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు సిఎం వెల్లడించారు.
”సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడకుండా చేశారు. సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాము. నేను మొదటి సారి ముంబాయి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాను. మాకు కావలసింది నీళ్లు తప్ప వివాదాలు కాదు. రైతు ఎక్కడివాడైనా రైతే. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల రంగంలో తీవ్రంగా నష్టపోయాము. తెలంగాణ ఉద్యమం ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే సాగునీటి రంగానికి మేము అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాము. ముంపు సమస్య లేకుండా ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశాము. తమ్మిడి హట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కడతామని అప్పటి సమైక్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. సమస్య పరిష్కారం కాలేదు. 152 మీటర్ల ఎత్తులో కట్టడానికి ఎలాంటి ఒప్పందం జరుగలేదు. ఈ పరిస్థితిని నివారించడానికే మేము తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ బ్యారేజిని డిజైన్ చేశాము. 101 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మించడానికి అనువుగా బేస్మెంట్ నిర్మిస్తాము. 100 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కడతాము. తమ్మిడి హట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లందిస్తాం. పెన్ గంగపై చనాఖా – కొరాటాతో పాటు ఇతర బ్యారేజీల నిర్మాణానికి కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం అంగీకారానికి రావడం శుభసూచకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వున్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు జగడాలు పెట్టుకుని ప్రాజెక్టులను కట్టలేదు. మేము ప్రేమ భావనతో ముందుకు పోతున్నాం. గతంలో ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రాలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికి ఒప్పందానికి రాలేకపోయారు. కానీ ఇప్పుడు మూడు ప్రాంతాల్లో మూడు వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నా ఒక్క మాట మీదికి రాగలిగాము. ఇలాంటి వైఖరి వల్ల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు న్యాయం జరుగుతుంది. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. కృష్ణా నీటి పంపిణీ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇలాంటి స్నేహ పూరిత వైఖరినే కొనసాగిస్తుంది. కేవలం సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాకుండా అన్ని విషయాల్లో మహారాష్ట్ర – తెలంగాణ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోతాయి” అని ముఖ్యమంత్రి అన్నారు.
కేసిఆర్ది స్నేహపూర్వక వైఖరి – దేవేంద్ర ఫడ్నవీస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు నిత్యం ఘర్షణ పూరిత వైఖరి వుండేదని, తెలంగాణ ఏర్పడిన తరువాత సంబంధాలు మెరుగయ్యాయని, దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అనుసరిస్తున్న స్నేహపూర్వక వైఖరే కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సామరస్య పూర్వకంగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఒప్పందాలు చేసుకోవడం శుభపరిణామని ఫడ్నవీస్ అన్నారు. తక్కువ ముంపుతో ఎక్కువ నీళ్లు ఉపయోగించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ చేసిందని ఫడ్నవీస్ అభినందించారు. ఇపుడు చేసుకున్న ఒప్పందం వల్ల గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నీళ్లను రెండు రాష్ట్రాల రైతులు ఉపయోగించుకొని బాగుపడతారన్నారు. ఇది మంచి సంప్రదాయమని చెప్పారు. రాబోయే కాలంలో కూడా ఇదే సహకార స్ఫూర్తి కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
హరీష్ రావుకు ఇద్దరు సిఎంల అభినందన
తెలంగాణ – మహరాష్ట్రల మధ్య సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందం కుదరడానికి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విశేష కృషి చేశారని ఇద్దరు ముఖ్యమంత్రులు అభినందించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు ఎప్పటికిప్పడు సమాచారం అందిస్తూ వారి అనుమానాలను హరీష్ రావు నివృత్తి చేసుకుంటూ వచ్చారని సిఎం కేసీిఆర్ అన్నారు. మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి గిరీష్ మహజన్తో, అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమై సమస్యను పరిష్కరించడానికి కృషి చేశాడన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయంలో హరీష్రావు ఎంతో కష్టపడ్డాడని ప్రశంసించారు. ఎప్పటికప్పుడు మంత్రుల స్థాయిలో, అధికారుల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయంతో వ్యవహరించాడన్నారు. వెంటపడి మరీ తక్కువ సమయంలోనే ఒప్పందం కుదరడానికి కారణమయ్యాడన్నారు.
పరస్పరం సన్మానాలు
ఒప్పందం కుదిరిన తరువాత తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు పరస్పరం శాలువాలు కప్పి సత్కరించుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వెండి చార్మినార్ ప్రతిమను కేసీిఆర్ బహుమానంగా ఇచ్చారు. కేసీిఆర్ కు వెండి వినాయకుడి ప్రతిమను ఫడ్నవీస్ కానుకగా అందించారు. మహారాష్ట్ర మంత్రులకు తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు, తెలంగాణ మంత్రులకు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహజన్ జ్ఞాపికలు అందించారు.
గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పరస్పర అంగీకారం కుదుర్చుకుంటూ చేసిన ఒప్పందాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ముంబయిలోని సహ్యాద్రి అతిథి గృహంలో ఆగస్ట్ 23న జరిగిన ఇంటర్ స్టేట్ వాటర్ బోర్డు సమావేశంలో ఈ చారిత్రక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో గోదావరి, ప్రాణహిత, పెన్ గంగలపై మూడు బ్యారేజిల నిర్మాణానికి ముఖ్యమంత్రులు పరస్పరం అంగీకారం తెలిపారు.
ఒప్పందం – 1
గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో, 16 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణానికి అంగీకారం కుదిరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే ఈ బ్యారేజి ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18.19 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చెందుతుంది.
ఒప్పందం – 2
ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో, 1.8 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజి నిర్మాణం జరుగుతుంది. దీని వల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్ – కాగజ్ నగర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
ఒప్పందం – 3
పెన్ గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో చనఖా – కొరాటా బ్యారేజి నిర్మాణం జరుగుతుంది. మహారాష్ట్రలోని పొలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, జైనథ్, బేలా మండలాలకు సాగునీరు అందుతుంది.
రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గిరీష్ మహాజన్, ఇంటర్ స్టేట్ వాటర్ బోర్డు సభ్యులుగా ఉన్నతెలంగాణ, మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఈటెల రాజేెందర్, సుధీర్ మంగత్రాయ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్, రెవెన్యూ శాఖ మంత్రులు మహమూద్ అలీ, చంద్రకాంత్ పాటిల్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జి.జగదీష్ రెడ్డి, ఎంపిలు బి. వినోద్ కుమార్, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పుట్ట మధు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లు ఎన్. వెంకటేశ్వర్లు, భగవంత్ రావు, ఇతర బోర్డ్ సభ్యులు, సాగునీటి శాఖ మంత్రి ఒ.ఎస్.డి. శ్రీధర్ దేశ్ పాండే తదితరులు హాజరయ్యారు.