అనుభూతుల రంగులలో ముంచితీసిన కుంచెతో వేసిన ఆ చిత్రాలు ఎలా ఉంటాయో వేరుగా చెప్పనవసరం లేదు. ఎంతో వైవిధ్య భరితంగా, మానవీయంగా చిత్రించిన ఆ బొమ్మలు ఏ కాలానికి చెందినవో, ఏ తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాయో వర్గీకరించే వీలులేకుండా అవి సార్వజనీనమైనవిగా నిలిచాయి. ఆయన గీసిన చిత్రాల్లో ఆయన జీవించాడు. ఏనాటికీ జీవిస్తాడు.
టి. ఉడయవర్లు
అట్టి చిత్రాలను గీసిన సాటిలేని మేటి చిత్రకారుడు సయీద్ బిన్ మహ్మద్. నీటి ఉపరితలంపై తైలవర్ణాలతో విన్యాసం చేసి కళా హృదయుల మదిలో హరివిల్లులు విరిపించడం ఈ ప్రక్రియ విశేషం. నీటిరంగులు, తైలవర్ణాలు, టెంపెరాలాంటి వివిధ ప్రక్రియలలో తన ముద్రగల చిత్రాలు సయీద్ బిన్ మహ్మద్ ఎన్ని వేసినా, ఆయన అభివృద్ధి చేసిన ‘అబ్రిటెక్నిక్’ అంటే మేఘమాల లాంటి పద్ధతిలో చిత్రించిన ఆయన కళాఖండాలు దేశం మొత్తం మీదనే వినూత్నమైనవి. ఈ విధాన చిత్రీకరణలో సయీద్ బిన్ మహ్మద్ అద్వితీయుడు.
ఒకసారి తైలవర్ణాన్ని నీటిలో చల్లినప్పుడు, అది పొరలు పొరలుగా విడిపోతూ మేఘాలలాగ వివిధ అకృతులు పొందుతూ, చిత్రకారుడి పనితనంతో తన మనోవీధిలో తచ్చాడే ఆకృతుల పోలుతుంది. దీన్ని కాగితంపైకో, క్వాన్వాస్‌పైకో ఈ ‘అబ్రిటెక్నిక్’ ద్వారా సయీద్ బిన్ మహ్మద్ తెచ్చాడు. పాలరాయి కాగితాన్ని నీట ముంచి, రంగులు అద్దుతూ, ప్రయోగాలు చేసి ఫలితాన్ని సాధించాడు సయీద్ బిన్ మహ్మద్. ఈ విధానంలోని అల్లిక జిగిబిగి ఇంతర పద్ధతులలో సాధించలేము.
గట్టిగాజుపై రంగుచల్లి అది అనుకున్న తరహాలో రూపొందిన తర్వాత దాన్నే కాగితంపైకి లేదా క్యాన్వాస్ పైకి మార్చే ‘మోనో-టెక్నిక్’ ఉన్నప్పటికీ, సయీద్ బిన్ మహ్మద్ ప్రయోగించి సాధించిన ‘అబ్రిటెక్నిక్’ నేరుగా నీటి ఉపరితలంపై తైలవర్ణం చల్లి, వేగంగా మారు ఆకృతుల నేపథ్యంలో చిత్రకారుడు ఆశించిన, ఊహించిన ఆకృతులుగా మలచడం ఈ పద్ధతి.
పుస్తకాల అట్టలకు, అట్టల అలంకరణకు వాడే పాలరాయిలాంటి కాగితం పై గుర్రపు పరుగులను, ఉరుకుల జింకలను, వాటి ప్రవాహ వేగం చూపేలాగా వేశాడు. లేదా ప్రకృతి చిత్రాలను, అమూర్త చిత్రాలను రంగుల సింగిడిలా ఈ టెక్నిక్‌లో కన్నులకు కట్టాడు. పదేండ్లకు పైగా ఈ పద్ధతిలో ఆయన ప్రయోగాలు చేశాడు. అయితే ఆయన శిష్యులెవరికీ ఈ టెక్నిక్‌లో చిత్రాలు వేయడంలో అభినివేశం లేకపోవడం విచారకరం.
స్పటికాకారంలో గరుకుగా ఉండే పాలరాయి కాగితం పదహారవ శతాబ్దిలో బుకారా, టర్కీ, ఇరాన్ లాంటి దేశాలతో పాటు మనదేశంలోను వాడేవారు. ఈ కాగితం గట్టితనానికి, మెత్తదనానికి, మీదుమిక్కిలి మన్నికకు ప్రసిద్ధి. ఇటీవల అమెరికా, టర్కీ, భారతదేశంలోనే కాకుండా జపాన్, పాకిస్తాన్‌లోను ఈ కాగితాన్ని చిత్రలేఖనానికి వినియోగిస్తున్నారు. దక్కన్ చిత్రకారులు ముఖ్యంగా చిత్రలేఖనానికి వినియోగిస్తున్నారు. దక్కన్ చిత్రకారులు ముఖ్యంగా బీరుకాపూర్‌లో ఈ పాలరాయి కాగితాన్ని చాలామంది చిత్రకారులు వాడుతున్నారు. ఈ పాలరాయి కాగితంపై చిత్రాలు వేయడం ఆషామాషీకాదు. అది చాలా క్లిష్టమైంది. చిత్రకారుడు ఉద్దేశించిన అంశం ప్రతిఫలించేలాగా పాలరాయి కాగితాన్ని సాంకేతికంగా మలచుకోవలసి ఉంటుంది.
‘చతుర్ముఖ పారాయణం’పై ఈయన ఈ పద్ధతిలో వేసిన చిత్రాల శ్రేణి చూడముచ్చటైనవి. ఇందులో పేకాట ఆడేవారే కాకుండా పేకముక్కలను సైతం ఆలోచనాత్మకంగా చూపారు.
అట్లాగే పరుగెత్తే గుర్రాన్ని ఆయన సజీవ చిత్రమేమో అన్నరీతిలో వేశాడు.
ఆయన 48*144 ప్రమాణంలో టెంపోరా టెక్నిక్‌లో పార్లమెంట్‌లో తీర్చిదిద్దిన ”గౌతమీ పుత్ర శాతకర్ణి” ఆనాటి చరిత్రకు పట్టిన అద్దంలా రూపొందించాడు అజంతా గుహలలోని రాజసం ఉట్టిపడే ‘మహాజనక్’ చిత్రం దీనికి ప్రేరణగా చెప్పుకోవచ్చు. అంతేకాదు జలవర్ణ చిత్రాలు వేయడంలోను సయీద్‌బిన్ మహ్మద్‌కు సాటి మరొకరు లేరు. వారు వేసిన చిత్రాల్లో జలవర్ణ చిత్రాల సంఖ్య కూడా ఎక్కువే. ఈ చిత్రాల్లోని ముఖ చిత్రాల్లో ఆయా వ్యక్తుల విశాల నేత్రాలు – కొన్నింట్లో అత్యంత విశ్వాసం, ఇంకా కొన్నింట్లో ఆశ, మరికొన్నింట్లో నిరాశా నిస్పృహలు చిత్రించిన తీరు ఎంతో వైవిధ్యంగా, మానవీయంగా ఉన్నాయి. తొలి రోజుల్లో వాస్తవిక వాదానికి పెద్దపీట వేసిన సయీద్ బిన్ మహ్మద్ అనంతర కాలంలో అమూర్త చిత్రాలు వేశాడు.
ఆయన వేసుకున్న స్వీయ చిత్రాలు చెప్పుకోదగినవే. అలాంటి ఒక చిత్రం ఆగ్రభాగంలో వారి మాతృమూర్తి లీలగా, ప్రేమతో కన్పిస్తుంది. ఇట్లా తల్లీ – పిల్లలను ప్రేక్షకులకు చూపి, ఇరువురి మనసులను ఆయన దోచుకున్నాడు.
ముఖ చిత్రాలు వేస్తూ వేస్తూనే మధ్య మధ్య గీసిన రొట్టెలు చేసే మహిళ చిత్రం వస్తురీత్యానే కాదు వేసిన పద్ధతి, రంగులు వాడిన తీరు ఆయనకే సాధ్యం. అలనాటి అపురూప జానపద చిత్రకారుడు జామినీ రాయ్‌ని గుర్తుచేస్తుంది.
ఎన్నో డబ్బులిచ్చి, తమ చిత్రాలు వేయించుకున్న శ్రీమంతుల చిత్రాల కన్నా, గడ్డం పెరిగిన బిచ్చగాడు, రుమాలుచుట్టుకున్న పెద్ద మనిషి, ముడుతల పడిన ముఖంగల మహిళ, కోపిష్టి యువకుడు చిత్రాలు నిస్సందేహంగా గొప్పవి.
జలవర్ణాలలో, లేదా తైలవర్ణాలలో, టెంపెరా పద్ధతిలో ముఖ చిత్రాలు వేయడంలోను సయీద్ బిన్ మహ్మద్ ఆరితేరినాడు. ఈ విద్యను తన గురువు, సుసమాన్ దేవ్‌స్కర్ అనుసరించిన విధానాన్ని సయీద్ బిన్ మహ్మద్ ఇట్టే పట్టేశాడు. ఇది ప్రాచ్యరీతిలో రేఖల్లో ముఖ కవళికలు వ్యక్తం చేసే పద్ధతికి భిన్నమైనది. పాశ్చాత్య పద్ధతిలో విభిన్న వర్ణాలు, వాటి మోతాదు ద్వారా అనుభూతుల వ్యక్తపరిచారు. ”తారాపూర్‌వాలా” చిత్రంలో రంగులతో తన మార్క్‌ద్యోతకం చేశాడు. షేర్వాణి వేసుకున్న పెద్ద మనిషి మెరిసే కళ్ళు కట్టిపడేస్తాయి. మరో మనిషి వేసుకున్న కోటు, కట్టుకున్న టైతో వారి వ్యక్తిత్వాలను వ్యక్తం చేశాడు. ఒక్కొక్క మనిషి తీరుతెన్నులు వారు ధరించిన దుస్తులను బట్టి చెప్పే తీరులో ఉన్నాయి.
చారిత్రక వస్తువులను తీసుకుని చిత్రాలు వేయడం సయీద్ బిన్ మహ్మద్‌కు సరదా. గోల్కొండ కోట ముందు చావుబతుకులకు ఒడ్డి పోరాటం చేస్తున్న అబ్దుల్ రజాక్ షేర్ తైలవర్ణ చిత్రం ఇలాంటిదే. ఈయనకు అజంతా కుడ్య చిత్రాల ప్రతులు రూపొందించే అవకాశం లభించింది. బోలెడు అనుభవం గడించాడు. దేశ విదేశీ చిత్రలేఖన విభాగాల్లోను సాధన చేసి ఎన్నో కళా ఖండాలు రూపొందించారు. భారతీయ అభ్యుదయ ఉద్యమంలోను సయీద్ బిన్ మహ్మద్ ముందు వరుసలో సాగాడు. ఆయన మిత్రులు కొందరు కవులుగా, మరికొందరు రచయితలుగా, పత్రికా రచయితలుగా కొనసాగగా, ఆయన చిత్రలేఖకుడుగా తన ఉనికిని చాటాడు.
ఇంత గొప్ప చిత్రకారుడు సయీద్ బిన్ మహ్మద్ 1921 సెప్టెంబర్ 7వ మహబూబ్‌నగర్‌లో పుట్టాడు. ఈయన తండ్రి మహ్మద్ బిన్ సయీద్ బబదార్. అదేమి చిత్రమో గాని బాల్య దశలోనే సయీద్ బిన్ మహ్మద్‌లో చిత్రకళ పట్ల ఆసక్తి కలిగింది. ఆయన చూసిన ప్రతి వస్తువును, ఆ తర్వాత సంఘటనలను గీతలు గీసి, రంగులు అద్ది అందరిని అబ్బురపరిచాడు. ఈ తరుణంలో వారి పాఠశాలలో అధ్యాపకుడు గంగాధరరావు పాఠక్ చేరదీసి, సూచనలిచ్చారు. గురువు మాటను అనుసరించి 1938లో మద్రాసు రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించే లోయర్, ఆ తర్వాత హయ్యర్ డ్రాయింగ్ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులయ్యాడు.
1940 ప్రాంతంలో బెంగాలి చిత్రలేఖన ప్రభావం మచిలీపట్నంపై పడింది. అది హైదరాబాద్ చిత్రకారుల దాకా ప్రాకింది. మరో ప్రక్క మద్రాసు చిత్రకళా ప్రభావం పడింది. ఈనేపథ్యంలో హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నెలకొల్పడం జరిగింది. అప్పటికి ఇంకా హైదరాబాద్ భారతదేశంలో విలీనం కూడా కాలేదు. 1941లో సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత అది లలితకళలు – వాస్తు కళాశాలగా రూపొంది జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయానికి అనుబంధ కళాశాల అయింది.
ఖాన్ బహదుర్ సయీద్ అమ్జద్ ఆ తర్వాత పాశ్చాత్య చిత్రలేఖనంలో చేయి తిరగిన తన గురువులు సుకుమార్ దేవ్‌స్కర్ ప్రభావానికిలోనై చిత్రాలు గీయడంలో ఒకానొక ప్రత్యేకతను సయూద్ బిన్ మహ్మద్ సాధించాడు. తాను పెయింట్‌లో డిప్లొమా చదువుకున్న కళాశాలలోనే అధ్యాపకుడై కూర్చున్నాడు. ఎందరో యువ చిత్రకారులను తయారు చేశాడు.
సయీద్ బిన్ మహ్మద్ తాత ముత్తాతలు హైదరాబాద్ సైనిక దళంలో ఉండేవారు. యువకుడుగా ఆయన సైనిక దళానికి చేదోడుగా మెలిగేవాడు. ఎవరైనా ఆగంతకుడు వస్తే ఇట్టే పసిగట్టే నైపుణ్యం ఆయనకు సైనిక దళంతో కలిసిమెలిసి ఉండడం వల్ల అబ్బింది. అరబ్ సైనికుల ముఖాలు స్పష్టంగా ఆయన మనసులో నిలిచిపోవడం వల్ల, వాటిని ఎంతో స్పష్టంగా, సృజనతో బొమ్మలు గీసేవాడు. అట్టి బొమ్మలు చూసి అరబ్ సైనికులు సంతోషపడేవారు. ఆ బొమ్మలను టీ-కాఫీ హెటళ్లలో అప్పట్లో అలంకరించేవారు.
తొలుదొలుత 1942లో నవాబ్ సాలార్‌జంగ్ బహదూర్ సయీద్ బిన్ మహ్మద్ గీసిన చిత్రానికి ముగ్దుడై కొనుగోలు చేశాడు. ఆ తర్వాతే 1945లో చత్తారి స్వర్ణపతకం ఈయన చిత్రం గెలుచుకున్నది.
1953లో దేవ్‌స్కర్ స్వర్ణపతకం పొందాడు. 1941-53 మధ్య కాలంలో తొమ్మిది రజత పతకాలు వివిధ పోటీ ప్రదర్శనలలో పాల్గొని గెలుచుకున్నాడు. 1945-54 మధ్యకాలంలో మూడు కాంస్య పతకాలు వివిధ అఖిల భారత కళా ప్రదర్శనలలో గెలుపొందాడు. 1950-60 మధ్య కాలంలో ”ఆర్ట్ వ్యూ” స్థాపించి యువ చిత్రకారులకు శిక్షణ ఇచ్చాడు.
హైదరాబాద్ నగరంలోని పాత రెసిడెన్సి ముందు 1957లో నెలకొల్పిన 1857 నాటి స్వాతంత్య్ర సమరయోధుల స్మారక స్థూపం రూపకల్పన చేశాడు.
‘నాగార్జున సాగరం తొలి విహంగ వీక్షణం’ను ఆయన సాగర నిర్మాణానికి ముందుగానే చిత్రించారు.
1966లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ రజతోత్సవాల సందర్భంగా చిత్రలేఖన కళకు వీరు చేసిన సేవలను గుర్తింపుగా ‘తామ్రపత్రం ప్రదానం చేశారు. 1969లో కలకత్తాకు చెందిన లలిత కళల అకాడెమీ నుంచి ఉత్తమ చిత్రం బహుమతి పొందారు. 1945-70 మధ్యకాలంలో స్వర్ణ, రజిత, కాంస్య పతకాలతో పాటుగా ఎన్నో పర్యాయాలు ప్రథమ బహుమతులు, ప్రశంసా పత్రాలు పొందారు. ఎన్నో సార్లు నగదు బహుమతులు అందుకున్నారు.
1955-74 మధ్యకాలంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఐదు పర్యాయాలు, హైదరాబాద్‌లో మరో ఐదు పర్యాయాలు అలంకరణ శకటాలను రూపొందించారు.
1973లో 14 అడుగుల కుడ్యచిత్రాన్ని హైదరాబాద్‌లో టాకీస్‌పై మెజాయిక్‌తో రూపకల్పన చేశారు. 23*8 ప్రమాణంలో వార్నర్ హిందుస్థాన్ లిమిటెడ్‌లో మెజాయిక్‌తో కుడ్య చిత్రం తయారు చేశారు. 1975లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రథమ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా వీరిని సత్కరించారు. 1976లో 14*300 వినర్‌టెక్స్ మాధ్యమంలో ముకరం జాహి రోడ్‌లో గృహ నిర్మాణ సంస్థ భవనంపై కుడ్య చిత్రం రూపకల్పన చేశారు.
చిత్రలేఖన కళలో సయీద్ బిన్ మహ్మద్ చూపిన విశేష శేముషి, జీవిత వివరాలను ప్రస్ఫుటిస్తూ 1973లో ఆంధ్ర ప్రదేశ్‌లో లలిత కళా అకాడెమీ ఒక మోనోగ్రాఫ్ ప్రచురించింది.
కేవలం మన దేశంలోని పలు సంస్థలు నిర్వహించిన సమష్టి చిత్రకళా ప్రదర్శనలలోనే కాకుండా అఫ్ఘనిస్థాన్, ఈజిప్టు, రష్యా, అమెరికా లాంటి దేశాలలోను ఎన్నో కళా సంస్థలు నిర్వహించిన సమష్టి కళా ప్రదర్శనలలో సయీద్ బిన్ మహ్మద్ చిత్రాలు ప్రదర్శించారు.
నిజానికి ఆయన ఉధృతంగా చిత్రాలు గీస్తున్న సమయంలో ప్రోత్సహించడానికి అకాడెమీలు లేవు. కనీసం అప్పుడు హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీలాంటి సంస్థలైనా లేవు. ఆయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, అపురూపమైన చిత్రాలెన్నింటినో ఆయన గీశాడు. 1982లో సయీద్ బిన్ మహ్మద్ కలం ఆగిపోయింది, కాలం చేశారు.
ఎన్నెన్నో వైవిధ్య చిత్రాలను వినూత్న పద్ధతులలో సయీద్ బిన్ మహ్మద్ చిత్రించినా, ఆయన జీవిత కాలంలో కనీసం ఒక్క వ్యక్తి చిత్ర కళా ప్రదర్శననైనా నిర్వహించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఆయన పిల్లలు, తమ తండ్రి పట్ల అనురాగంతో ఆయన పోయిన తర్వాత వ్యష్టి చిత్రకళా ప్రదర్శన నిర్వహించి ఒక సృజనశీలి అపురూప చిత్రాల పట్ల కళాభిమానులకు గల కుతి తీర్చారని భావించవచ్చు. సయీద్ బిన్ మహ్మద్ స్మృత్యర్థం ఏర్పాటు చేసిన ప్రదర్శనలోని చిత్రాలు ఆయన కాలానికి పట్టిన దర్పణాలు. ఇవ్వాళ సయీద్ బిన్ మహ్మద్ లేకపోయినా ఆయన చిత్రాలు ఈనాటికీ చెరిగిపోని కళా సౌందర్యాన్ని రుచి చూపుతూ, ఈ కళను అభ్యసించే వారికి అవి అమూల్య పాఠాలుగా నిలుస్తున్నాయి.