రామా చంద్రమౌళి పదవ కవితా సంపుటి ‘ఒక ఏకాంత సమూహంలోకి’. ఇందులో 31 కవితలున్నై. వీటిల్లో మొట్టమొదటి కవిత ‘ఆమె బహుళ’ మన వ్యవస్తలోని స్త్రీ జీవితం తెలిపేది. అందులో ”అద్దం ముందు నిలబడి.. తన బొట్టునూ, ముఖాన్ని, గాజులనూ, కళ్ళనూ / శరీరాన్నీ ప్రేమగా చూచుకుంది / మనిషి అంటే సముద్రంలా ఒక సంపుటి…” అనిచెబుతూ ఇంకా ”…అప్పుడప్పుడు.. కరిగి కరిగి.. కన్నీళ్ళు కూడా ఔతారు..” అని చూపాడు కవి. జ్ఞాన, ఆరోగ్యాల్ని ప్రసాదించేదిగా పుస్తకాన్ని అభివర్ణిస్తూ రాసిన కవిత ‘సంభాషించే పుస్తకాలు’ పుస్తక ప్రేమికులందరూ చదవాల్సిన కవిత.
”నువ్వది చేయకుంటే.. నేనిది చేయను / నువ్వది చేస్తే.. నేనిది చేస్తా….” అనేవిధంగా ‘గివ్ అండ్ టేక్ పాలసీలు’ తో లోకం తీరును ‘ఒక నది.. రెండు తీరాలు’ కవితలో, మరో కవిత ‘ఒడంబడికలూ.. ఉల్లం ఘనలూ’ లో కూడా అభివర్ణించి చూపాడు కవి. ‘కవిత్వానికి లొంగనిది’ అనే కవితలో ”… చూరు కొసల నుండి రాలుతున్న వర్షపు నీటి / నిశ్శబ్ద నిస్సహాయత.. ఒదగవు.. భాషకు లొంగవు” కాబట్టే అసంపూర్ణంగా ఉంటుందని చెప్పి బ్రతుకూ, మృత్యువూ, కన్నీళ్ళు మొదలైనవన్నీ కవిత్వమేనని చెప్పడంతో ”కాదేదీ కవిత కనర్హం” అన్నది గుర్తుకొస్తుంది. ”ఇద్దరు మనుషుల మధ్య దూరాన్ని తెలుసుకోవడమే తెలియనప్పుడు/ రెండు మనసుల మధ్య దూరం అస్సలే అర్థంకాదు” అంటూ మనుషుల తీరును ‘తాళం చెవి దొరకడం లేదు’ అనే కవితలో చెప్పిన కవి, భార్యాభర్తల మధ్య జీవితాన్ని ‘ఇద్దరు మనుషులు’ కవితలో చూపారు.
ఈ సంకలనం పేరేగాక ఇందులోని చాలా కవితల శీర్షికలూ కవిత్వాత్మకంగా ఉన్నాయి. విషయపరంగా చూస్తే స్త్రీల కష్టాలను, నేటి యువకుల తీరు, మనుషుల మనస్తత్వం, ఇలా తనచుట్టూ ఉన్న వ్యవస్థ మేడిపండును వొలిచి చూపాడు కవి రామా చంద్రమౌళి. ఇటీవల వస్తున్న సంకలన కుసుమాలలో దీని గుభాళింపు విశిష్టమైనది.
ఒక ఏకాంత సమూహంలోకి రచన: రామాచంద్రమౌళి, పేజీలు : 110, వెల: రూ. 80, ప్రతులకు: సాయి వెంకటరమణ పుస్తక పపిణీ దారులు, గాంధీ నగర్, హైదరాబాద్., నవోదయ బుక్ హౌస్, కాచీగూడా క్రాస్ రోడ్స్, హైదరాబాద్ – 500 027
– డా. రాపోలు సుదర్శన్