kcr-modiప్రధానికి స్వయంగా వివరించిన సి.ఎం. కె.సి.ఆర్‌

పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. పెద్దనోట్ల రద్దుతో ఉత్పన్నమైన వివిధ సమస్యల గురించి ఆయన ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు సూచనలు కూడా చేశారు.

కేంద్రప్రభుత్వం 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ నవంబర్‌ 8న నిర్ణయించడం, బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ, నోట్ల మార్పిడి, ఖాతాలలో నగదు జమచేయడంపై ఆంక్షలు విధించడంతో అటు ప్రజానీకానికి, మరోవైపు ప్రభుత్వానికి ఎదురవుతున్న పలు సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీకి రావల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు నవంబర్‌ 18న ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరునాడు, నవంబర్‌ 19న ప్రధానిని కలిసి సుదీర్ఘంగా చర్చించారు.

ఢిల్లీ వెళ్ళేముందు పెద్ద నోట్ల రద్దువల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ఉన్నతాధికారులు, వివిధ వర్గాల వారిని సంప్రదించి, సామాన్య ప్రజానీకానికి కలుగుతున్న అసౌకర్యం, ప్రభుత్వానికి వచ్చిన కష్టనష్టాల గురించి ముఖ్యమంత్రి క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సమీక్షలలో వెల్లడైన పలు అంశాలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకొని వెళ్ళారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నోట్లు అందుబాటులో లేకపోవడం, ఫలితంగా బ్యాంకులు, ఎ.టి.ఎంల ముందు ప్రజలు గంటలతరబడి క్యూలలో నిలబడవలసి రావడంతోపాటు, నోట్ల రద్దువల్ల ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరమని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ జనాభాలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలలో వున్నందున సహకార బ్యాంకుల ద్వారాకూడా నోట్ల మార్పిడికి వీలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ నిర?యం కారణంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవల్సిన చర్యల గురించి ప్రధానితో సి.ఎం. కె.సి.ఆర్‌ వివరంగా చర్చించారు.

భద్రాద్రికి అనుమతులివ్వండి

కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో జెన్‌ కో ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు సహకరించాల్సిందిగా కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా నవంబర్‌ 20న కేంద్రమంత్రిని కలసి భద్రాద్రి థర్మల్‌ ప్లాంటు నిర్మాణ ఆవశ్యకతను తెలియజేసి, ఈ ప్లాంటుకు అవసరమైన అనుమతులను సత్వరం మంజూరు చేయాల్సిందిగా కోరారు.

విద్యుత్‌ కొరత నుంచి బయటపడి మిగులువిద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సుమారు 2700 మెగావాట్ల విద్యుత్‌ కొరత తో వున్నదని, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ప్రకారం తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా చేయక పోయినా తట్టుకొని నిలబడ్డామని, ఇకపై విద్యుతుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

సుమారు 5044 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన యంత్ర పరికరాల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బి.హెచ్‌.ఈ.ఎల్‌ కు 987 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని, భూసేకరణ కోసం మరో 70 కోట్ల రూపాయలు చెల్లించామని ముఖ్యమంత్రి వివరించారు.

పర్యావరణ మంత్రిత్వశాఖ వివరణతో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వడానికి అభ్యంతరం లేదని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ స్పష్టం చేసిందని, వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేస్తే వచ్చే ఏడాదినాటికే ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

విద్యుత్‌ కొరతను అధిగమించి, మిగులు దిశగా తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రశంసించారు. ఉదయ్‌ పథకం గురించి, ఉజ్వల్‌ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో పంపిణీ అవుతున్న ఎల్‌ఈడీ బల్బుల గురించి కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ తోపాటు రాష్ట్ర విద్యుత్‌ శాఖా మంత్రి జగదీశ్‌ రెడ్డి, జెన్‌ కో సి.ఎం.డి ప్రభాకర్‌ రావు, ప్రత్యేకప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తెజావత్‌ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రంలో నిర్మిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లతోపాటు, సోలార్‌ ప్లాంట్లు, ఉదయ్‌ పథకం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు.

జాతీయ రహదారులకు సత్వర అనుమతులు

తెలంగాణలోని నాలుగు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి తగిన అనుమతులివ్వాలని కేంద్ర రోడ్లు, రవాణాశాఖా మంత్రి నితిన్‌ గడ్కరీని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్ళు పూర్తయినా , కేంద్రం ప్రకటించిన జాతీయ రహదారులకు ఇప్పటివరకూ అనుమతులు రాలేదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

తన ఢిల్లీ పర్యటనలో భాగంగా నవంబర్‌ 21న కేంద్రమంత్రి గడ్కరీతో సి.ఎం భేటీ అయ్యా రు. తెలంగాణలోని నాలుగు రాష్ట్ర రహదా రులను జాతీయ రహదారులుగా మార్చడానికి గతంలోనే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీటిలో సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌ – జగదేవ్‌పూర్‌-భువనగిరి-చౌటుప్పల్‌ (152 కిలోమీటర్లు), చౌటుప్పల్‌- ఇబ్రహీంపట్నం-ఆమనగల్‌-షాద్‌నగర్‌-చేవెళ్ళ-శంకర్‌పల్లి-కంది (186 కిలోమీటర్లు), మెదక్‌-సిద్ధిపేట-ఎల్కతుర్తి ( 133 కిలోమీటర్లు), హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు-వలిగొండ-తొర్రూరు-నెల్లికుదురు-మహబూబాబాద్‌-ఇల్లెందు-కొత్తగూడెం ( 234 కిలోమీటర్లు) ఉన్నాయి.

హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌ కూడలి నుంచి బోయినపల్లి వరకు జాతీయ రహదారి నెంబర్‌ 44 విస్తరణ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ రహదారి మూసివేతతో మరో రహదారి ఏర్పాటుకు అనుమతులివ్వాలని కూడా ముఖ్యమంత్రి కోరారు.

ముఖ్యంగా నాలుగు అంశాలను ముఖ్యమంత్రి ఈ సంద ర్భంగా కేంద్రమంత్రి దష్టికి తెచ్చారు. 1) రాష్ట్రానికి మంజూరు చేస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు జాతీయరహదారుల నిర్మాణానికి తగిన అనుమతులు మంజూరు చేయడం, 2) రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం, 3) జాతీయ రహదారుల అథారిటీకి సమర్పించిన డి.పి.ఆర్‌లకు అను గుణంగా భూసేకరణకు అనుమతించడం, 4) నాలుగు జాతీయ రహదారులను నాలుగు లేన్లకు వెడల్పు చేయడానికి అను మతులు మంజూరుచేయడం. ముఖ్యమంత్రి కోరిన పలు అంశాలపై కేంద్రమంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతోపాటు ,రాష్ట్ర రహదారుల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటు సభ్యులు జితేందర్‌ రెడ్డి, వినోద్‌ కుమార్‌ కూడా కేంద్రమంత్రిని కలుసుకున్నారు.

సమైక్య రాష్ట్రంలో యాభై ఏండ్లుగా తెలంగాణ ప్రాంతంలో జాతీయ రహదారులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ఈ విషయంపై దష్టి కేంద్రీకరించారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే వెసులుబాటుకు అనుగుణంగా ఈ సంవత్సరమే 2800 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా వున్నట్టు సి.ఎం కె.సి.ఆర్‌ కేంద్రమంత్రికి వివరించారని తెలిపారు. గోదావరి నదిపై ఇన్లాండ్‌ వాటర్‌ వే వ్యవస్థ గురించి, డ్రై పోర్టు గురించి కూడా ముఖ్యమంత్రి చర్చించారు.

కేంద్రమంత్రి గడ్కరీతో భేటీ అనంతరం అదేరోజు రాత్రి ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ హైదరాబాద్‌ కు తిరిగి వచ్చారు.
పెద్దనోట్ల ఇబ్బందులపై ప్రధానికి సి.ఎం కె.సి.ఆర్‌ సూచనలు

పెద్దనోట్ల రద్దువల్ల ప్రజలు, వివిధ రంగాలవారు పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి

ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ దిగువ సూచనలు చేశారు.

పెద్దనోట్ల రద్దుతో నిర్మాణ రంగం కుదేలైంది. హైదరాబాద్‌లో సుమారు 10 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. రోజువారీ కూలీలు నవంబర్‌ 8 నుంచి ఖాళీగా వున్నారు. వీరిని ఆదుకొనేందుకు తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలపి ప్రత్యేక నిధికి శ్రీకారం చూట్టాలి. ఇండ్లు, రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాల అభివద్ధి వంటి పనులు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలి.

రైతులు, కౌలుదార్లలో అధికశాతం మంది నగదులావాదేవీలపై ఆధారపడతారు. ఇంట్లో కొంత నగదును ఉంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. వివాహాల సీజన్‌ కావడంతో కొందరు తమ భూములను అమ్మి నగదు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులుచేసే డిపాజిట్లపై సాధారణ పన్ను విధించాలి.

భారత ఆర్ధిక వ్యవస్థలో చిరువ్యాపారులే అధికంగా వున్నారు. వీరంతా నగదు లావాదేవీలపైనే ఆధారపడతారు. కాబట్టి వారి డిపాజిట్లపై సాధారణ పన్నును ఏకమొత్తంగా విధిస్తే సరిపోతుంది.

ఎం.ఎస్‌.ఎం.ఈ రంగంపై ఆధారపడ్డవారు నాన్‌ పెరా??ర్మింగ్‌ అసెట్స్‌ (నిరర్ధక ఆస్తులు) ప్రకటించక ముందే మరో ఆరు నెలల వరకూ వారి రుణ వాయిదాను చెల్లించే అవకాశం కల్పించాలి.

కోడిగుడ్లు, మాంసం త్వరగా పాడవుతాయి. ఈ వ్యాపారంలో నగదు లావాదేవీలే ఏక్కువ. నోట్ల రద్దు తర్వాత ఈ రంగంలో 70 శాతం వ్యాపారం పడిపోయింది. ఆదుకునేందుకు బ్యాంకు రుణాలపై రెండేండ్ల దాకా మారటోరియం విధించే అంశాన్ని పరిశీలించాలి.

చిన్న వ్యాపారులు బ్యాంకునుంచి తీసుకొనే మొత్తాన్ని లక్ష రూపాయలకు, పెండ్లిళ్ళ కోసం తీసుకొనే నగదు పరిమితిని 4 లక్షల రూపాయలకు పెంచాలి. ప్రయివేటు ఆస్పత్రులలో పాతనోట్లను అనుమతించాలి. పెట్రోల్‌ బంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో చెల్లింపులకు నవంబరు 24 తరువాత కూడా పాతనోట్లను అనుమతించాలి.

తెలంగాణలో ఆదాయం నవంబరు మొదటి వారంతో పోల్చితే పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత వారంలో 50 శాతం తగ్గిపోయింది. ఇలాగే కొనసాగితే మిగతా ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఫలితంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడతాయి. కాబట్టి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.

వడ్డీరేట్లు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రాలు అధికవడ్డీకి తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకొనే అవకాశం కల్పించాలి. ఇందుకు కేంద్రం రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటుచేయాలి. ద్రవ్య నియంత్రణ, బడ్జెట్‌ నిర్వహణ పరిమితి గతంలో 3.35 శాతం వుంది. దీనిని ఆయారాష్ట్రాల స్థూల ఉత్పత్తినిబట్టి 0.5 నుంచి 1 శాతం పెంచాలి. వడ్డీరేట్లు తగ్గినందువల్ల స్థూల వుత్పత్తి తగ్గే అవకాశం వుంది.

కేంద్రానికి రాష్ట్రాలు చెల్లించవలసిన రుణాలు, వాటి వడ్డీలపై కనీసం ఏడాదిపాటు మారటోరియం విధించాలి.

పలు ఆర్థిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన అసలు మొత్తంపై ఏడాదిపాటు మారటోరియం విదించాలి.

రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదురయిన నగదు ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి అమ్మకం పన్నుల రూపంలో రావల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి.

ఈ-లావాదేవీలు ఒక్కసారిగా పెరగనున్న నేపథ్యంలో సర్వర్‌ సామరా?్యన్ని తక్షణం పెంచాలి.

అన్నిరకాల డెబిట్‌, రూపీ కార్డులను అందుబాటులోకి తేవాలి.

ఆధార్‌ కార్డు వివరాలు, యూనిక్‌ బ్యాంకు ఖాతా సమాచారాన్ని తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు అందజేయాలి. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు లేనిచోట ఇది ఉపయోగపడుతుంది.

మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ ( ఎం.డి.ఆర్‌) ను తగ్గిస్తే కార్డు వినియోగం పెరుగుతుంది.

అన్ని బ్యాంకులు వీలైనంత త్వరగా తగినన్ని స్వైపింగ్‌ మిషన్లు అందుబాటులో వుంచాలి

Other Updates