సాహితీ జగత్తులో హిమాలయం కన్న మిన్నగా కన్పిస్తున్న మాన్యులు కపిలవాయి లింగమూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందని తెల్సినా, నల్లగొండ వాస్తవ్యులు డా. కొల్లోజు కనకాచారి చాలా శ్రమించి ”సాహితీ వనంలో ఒకమాలి” అనే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. తొమ్మిది పదులు దాటిన శతాధిక గ్రంథ కర్త కాబట్టి వారి అన్ని గ్రంథాల గురించి తెలుసుకోవడం మనకు ఒకింత కాని పనేమరి. అయితే, వారి రచనల గురించి ఎంతో మంది పరిశోధించి, డాక్లరేట్లు పొందినట్లుగానే కనకాచారి కూడా వీరి చాలా రచనల గురించి ఇందులో పరిశీలనాత్మక సమాచారాన్నందించారు.
సాహిత్యంతో పాటు చారిత్రక విషయాలు రాసినా, తాళపత్ర గ్రంథాలేగాక శాసనాలను, ఆయా ప్రాంత ప్రజల నుండి విషయ సేకరణ చేసి నిక్కచ్ఛిగా రాస్తారని తెలిసినప్పుడు రచనల గురించి వారు చేసిన కృషిని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎన్ని శతకాలు రాసినా ప్రత్యేకంగా గణిత శాస్త్రమునకు సంబంధించిన ”సహమాన శతకం”తో పాటు ”దుర్గాభర్గ శతకం”, తిరుమలేశ శతకం, ఆర్యా శతకం లాంటి యెన్నో శతకాలతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేయడం జరిగింది.
మాంగల్య శాస్రం, స్వర్ణ శకలాలు, సుందరీ సందేశం, విశ్వ బ్రాహ్మణులు – సంస్కృతి – అనుకరణ (కన్నడం నుండి అనువాదం), లాంటి మరెన్నో ప్రముఖ గ్రంథాలు వీరి కలం నుండి వచ్చినవే. సాహిత్యంలో ఇప్పుడొస్తున్న ప్రక్రియలు గాకుండా పద్య, గద్య, నాటక, నాటిక, వ్యాస, చారిత్రక, బుర్రకథల్లాంటి అన్ని ప్రక్రియల్లో అనేకానేక అంశాల గురించి రచనలు చేసి పండితులతో పాటు పామరులను గూడా మెప్పించడం వీరి రచనా శైలిలోని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వీరి రాతప్రతులు, తోచినప్పుడల్లా రాసిన చిత్తు పేపర్లూ, విడివిడి కాగితాలన్నింటిని జాగ్రత్తగా పదిలపరచి, పుస్తక రూపంలోకి తీసుకురావడానికి వీరి పుత్రులు చేసిన కృషి అభినందనీయం.
గొప్ప సాహిత్యారాధకుడుగా పేరొందిన కపిలవాయి ”పరిశోధక పరమేశ్వరుడు, అనన్య విశిష్ట కావ్య నిర్మాత” లాంటి ఎన్నెన్నో బిరుదులు వరించినట్టు తెలుస్తోంది. వీరి రచనల పట్టికతో పాటు అనేకానేక సన్మాన, సత్కార, పురస్కారాల గురించి గూడా తెలియజేయడం జరిగింది. ఇంకా వీరి గురించి సాహితీ పెద్దల అభిప్రాయాలు ఇందులో పొందుపర్చడం జరిగింది. వీరి ఏడు పుస్తకాలను తి.తి.దే. వారు ముద్రించారంటేనే ఎంతో గర్వకారణం. ఇంతే గాకుండా ”పాలమూరు జిల్లా దేవాలయాలు” అనే గ్రంథంలో 186 దేవాలయాల వివరాలున్నట్లు తెలియజేశారు.డా. కొల్లోజు కనకాచారి ఎంతో శ్రమించి, విలువైన ఈ గ్రంథాన్నందించినందుకు అభినందిస్తున్నాను.
– కన్నోజు లక్ష్మీకాంతం