తెలుగుదేశ చరిత్రను
‘లోచూపు’తో పరిశీలిస్తే తెలంగాణ ప్రాంతంలో క్రీస్తు పూర్వయుగంనుంచే గొప్ప సాహిత్య చైతన్యం, వాతావరణం నెలకొని ఉన్నట్లు విశదమవుతుంది. పదవ శతాబ్దానికి ముందే బహుభాషా పాండిత్యం, శాసన కవిత్వం, ఛందఃశాస్త్ర రచన, సాహిత్య చైతన్య ప్రతీకలుగా ప్రకాశిస్తాయి.
హాలశాతవాహనుని ఆస్థాన కవియైన గుణాఢ్యుడు (1వ శ.) పైశాచీ ప్రాకృతభాషలో రచించిన ‘బృహత్కథ’ భారతదేశంలో వెలసిన తొలి కథాకావ్యం. కథలకాణాచియైన ఈ గ్రంథం సంస్కృతాను వాదాలద్వారా వ్యాప్తిలో ఉంది. కవిత్వాభిమానియైన హాలుడు తన రాజ్యంలోని సుమారు 273మంది కవులు ‘గాథా’ ఛందస్సులో విరచించిన 700 పద్యాలను సేకరించి ‘గాథాసప్తశతి’ పేరుతో తొలి కవితా సంకలనం రూపొందించాడు. నాటి తెలంగాణలోని సంస్కృతీ సంప్రదాయాలు, గ్రామీణ జీవితం, ప్రకృతి సౌందర్యం ఇందులో హృద్యంగా వర్ణితమైనాయి. వేములవాడ చాళుక్యరాజు రెండవ ఆరికేసరి (910-930) ఆస్థాన కవియైన పంప కన్నడంలో ‘ఆదిపురాణ’ (జైన తీర్థంకరుని చరిత్ర), ‘విక్రమార్జున విజయ’ (పంపభారతం) వెలువరించి రత్నత్రయంలో (పంప, పొన్న, రన్న) ఆదికవిగా ప్రసిద్ధి పొందాడు. ‘కవితాగుణార్ణవ’ బిరుదుగల పంప రచించిన తెలుగు కావ్యం (జినేంద్రపురాణం) ఆలభ్యంగా ఉంది.
ఆంధ్రప్రాంత ఆదికవియైన నన్నయభట్టు మహాభారత రచనకు (1050) నూరు సంవత్సరాలముందే మన వేములవాడకు చెందిన జైన కవి మల్లియరేచన ఛందోకావ్యం ‘కవిజనాశ్రయము’ (950) తొలి తెలుగు గ్రంథంగా కీర్తి పొందింది. కుర్క్యాల బొమ్మలగుట్టలోని తొలి కందపద్య శాసనకర్త వాచకాభరణ బిరుదాంచితుడు అయిన జినవల్లభుని (1946) ప్రోత్సాహంతో ‘శ్రావకాభరణుడు’ అయిన రేచన కవిజనా శ్రయములోని లక్షణపద్యాలు (113) కందం ఛందంలోనే విరచితమైనాయి. కంద పద్యానికి పుట్టినల్లుగానేకాక ఆటపట్టుగా కూడా తెలంగాణ విలసిల్లిందనటానికి మల్లికార్జున పండితుని ‘శివతత్త్వసారము’ కూడా (489 కంద పద్యాలు) సాక్ష్యంగా నిలుస్తుంది. సాహిత్యం ద్వారా వీరశైవ ప్రచారానికి పూనుకొన్న తొలి శివకవి, ఆరాధ్యశైవ సంప్రదాయ ప్రవర్తకుడు మల్లికార్జున పండితారాధ్యుడు (1120-1190).
తెలుగు సాహితీవనంలో దేశిఛందస్సులో గానం చేసిన తొలి కవి కోకిల పాల్కురికి సోమనాథుడు.
”తొలికోడి కనువిచ్చి నిలిచి మైవంచి
జలజలరెక్కలు సడలించి నీల్గి….
మెడసాచి నిక్కి మున్సూచి”
కొక్కొరో అని కూసిన కోడికూతను ద్విపద ఛందస్సులో జాను తెనుగులో ఆలపించిన ప్రజాకవి పాల్కురికి (1190-1270). తెలుగులో తొలి దేశి పురాణం, చారిత్రక కావ్యం, శతకం ఉదాహరణం, రగడ మొ|| దేశి ప్రక్రియలకు ఆద్యుడైన సాహితీకీర్తి సోమన. వీరశైవ మత ప్రచారములైన 30 గ్రంథాలు తెలుగు (12), కన్నడ (7), సంస్కృత (11) భాషల్లో ఆయన రచించాడు. సంఖ్యానియమం మకుట నియమం కలిగిన తొలి తెలుగు శతకం ‘వృషాధిపశతకం’ సోమన కృతం. సోమనాథుని ఆరాధ్యదైవాలు శివస్వరూపులైన బసవేశ్వరుడు, మల్లికార్జున పండితుడు. వారి కథలను ద్విపదలో గ్రంథస్థం చేసిన ‘బసవ పురాణం’ తొలి దేశికావ్యంగా, ‘పండితారాధ్య చరిత్ర’ తొలి చారిత్రక కావ్యంగా యశస్సు గడించాయి. పండిత చరిత్రలోని శ్రీశైల యాత్ర వర్ణన సమకాలీన సాంఘిక సాంస్కృతిక విశేషాల కూడలి. సోమన బహుభాషా పరిజ్ఞానానికి, వివిధ శాస్త్ర వైదుష్యానికి నిదర్శనాలు ఈ రెండు కృతులు. తెలుగు సాహిత్య చరిత్రలో దేశికవితా బ్రహ్మగా చిరస్మరణీయుడు పాల్కురికి సోమనాథుడు.
పాలమూరు జిల్లా వర్థమానపురం (వడ్డెమాను) రాజు గోన బుద్ధారెడ్డి (1290-1300) రచించిన ‘రంగనాథ రామాయణం’ తెలుగులో తొలి రామాయణ కావ్యంగా ప్రశస్తి వహించింది. శైవకవియైన పాల్కురికి సోమన ద్విపద కవితకు ప్రథమాచార్యుడు కాగా, విష్ణుపరమైన కావ్యకర్త గోన బుద్ధారెడ్డి ద్వితీయాచార్యుడుగా వాసికెక్కారు. వీరిద్దరూ తెలంగాణావారు కావటం గర్వకారణం. బుద్ధారెడ్డి రామకథకు చేసిన సేవ ‘ఉడతాభక్తి’కాదు. అది ”బంగారు కొండకు వేసిన రత్నాల నిచ్చెన.” తెలుగులో పద్య (చంపూ) రూపంలో వెలసిన తొలి రామాయణ కావ్యం కూడా తెలంగాణలోనే విరచితమైంది. హుళక్కి భాస్కరుడు, మల్లికార్జునభట్టు, కుమార రుద్రదేవుడు, శాకల్య అయ్యలార్యుడు రెండవ ప్రతాపరుద్రుని అశ్వసేనాధిపతి సాహిణిమారనకు (1311-1333) అంకితంగా రచించిన ‘భాస్కర రామాయణం’ కథానువాద పద్ధతిలో కొనసాగిన స్వతంత్రకావ్యంగా పేర్కొనదగినది.
తెలుగులో తొలి వచనకీర్తనలు రచించిన ప్రథమ సంకీర్తనా చార్యుడు శ్రీకంఠం కృష్ణమాచార్యులు పాలమూరు జిల్లా సంతపూరుకు చెందినవాడు. పుట్టుకచేత అంధుడైనా సింహాచల నరసింహస్వామి అనుగ్రహం పొంది వెలువరించిన అసంఖ్యాక ‘సింహగిరి వచనాల’లో నేడు 300 మాత్రమే లభ్యమైనాయి. ‘సింహగిరి నరహరి వచనమాల’ ప్రభావం తాళ్లపాక అన్నమాచార్యుని పద కవితలపై గోచరమవుతుంది. మార్గపురాణ ప్రక్రియకు ఆద్యుడైన మారన అష్టాదశమహా పురాణములలోని ‘మార్కండేయ పురాణము’ను ఆంధ్రీకరించాడు. మారన పురాణంలోని ఉపాఖ్యానాలు మనుచరిత్రాది ప్రబంధాలకు మార్గదర్శక మైనాయి. సబ్బిమండలంలోని (కరీంనగర్ జిల్లా) రామగిరి ప్రభువైన వెలిగందల కందనామాత్యునికి కావ్యాలను అంకితం చేసిన మడికి సింగన (15వ శ||) తొలి తెలుగు సంకలన కావ్యాన్ని (సకలనీతి సమ్మతము), తొలి భాగవత భాగాన్ని (దశమ స్కంధం) రచించిన కవిగా ప్రసిద్ధుడు. ”సకల న్యాయశాస్త్ర మతములు సంగ్రహించి” గ్రంథ మొనరించిన ‘సకలనీతి సమ్మతము’ రాజనీతి పద్యాల సంకలనం. తొలి ప్రాకృత కవితా సంకలనం, తొలి తెలుగు పద్య సంకలనం-రెండూ కరీంనగర్ జిల్లా నుంచే వెలువడటం గమనార్హం. హరిశ్చంద్రుని కథను ప్రత్యేక కార్యరూపంగా వ్యాప్తికి తెచ్చిన గౌరన (1400-1450) దేవరకొండకు చెందినవాడు. హరిశ్చంద్రోపాఖ్యానము, నవనాథ చరిత్రము ద్విపద కావ్యాలు, సంస్కృత లక్షణదీపిక ఇతని రచనలు.
తొలి దేశికవి పాల్కురికి సోమన భక్తకవి శిఖామణి బమ్మెర పోతన (15వ శ) ఓరుగల్లు ప్రాంతవాసులు కావటం తెలంగాణ నోచుకొన్న అదృష్టం. సంస్కృత మహాభాగవతంలోని ఎనిమిది స్కంధాలను పోతన, మిగతా నాలుగు స్కంధాలను ఆయన శిష్యులు తెనుగించారు. భాగవత వస్తువుతో తాదాత్మ్యం చెందిన పోతన భక్తి పారవశ్యం మందారమకరంద మాధుర్యయుక్తమై ప్రత్యక్షర ప్రస్ఫుటంగా ద్యోతకమవుతుంది. ఆంధ్ర భాగతంతో వర్ణితమైన బలి చక్రవర్తి దండయాత్ర సమకాలీన చరిత్రకు నేపథ్యాన్ని స్ఫురింపజేస్తుంది. దేవతల రాజధానియైన అమరావతి నగరం అచ్చంగ మహ్మదీయుల దండయాత్రకు గురియైన ఓరుగల్లు కోటను ప్రతిబింబిస్తుంది. ”తెలుగుల పుణ్యపేటి” అయిన పోతన మహాకవి అంత్యానుప్రాసలు ఆయన కవితాశైలి మణిపూసలు.
విశిష్ట కథా కావ్యమైన కొరవి గోపరాజు (15వ శ.) ‘సింహాసన ద్వాత్రింశిక’ విజ్ఞాన సర్వస్వ లక్షణాలను సంతరించుకొన్న ఆణిముత్యం. సమకాలికమైన విద్యా వైజ్ఞానిక అంశాలు, సాంఘిక విశేషాలు, ఆచార వ్యవహారాలు మున్నగు పలు విషయాలు ఇందు చోటు చేసుకొన్నాయి. సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’కు ఇది ఎంతో ఉపయుక్తమైంది. నూతన కవి సూరన ‘ధనాభిరామము’ (145), చరిగొండ ధర్మన ‘చిత్ర భారతము’ (1510), తొలి తెలుగు కల్పిత కావ్యాలుగా పేర్కొనదగిన వినూత్న కావ్యాలు. రూపం గొప్పదా, ధనం గొప్పదా అన్న వివాదం ధనాభిరామం ఇతివృత్తం కాగా, పేరుకు తగినట్లుగా చిత్రమైన కథాకల్పనతో కూడిన కావ్యం చిత్రభారతం. అష్టాదశవర్ణనా భరితమైన ధర్మనకృతి పారిజాతాపహరణం మొదలగు సమకాలీన ప్రబంధవర్ణనలకు దారిచూపటమేకాక, కృష్ణార్జునయుద్ధం కథా వస్తువుగాగల ఆధునిక యుగంలోని ‘గయోపాఖ్యాన’ నాటకాదులకు మార్గదర్శకమైంది. పింగళి సూరన ‘కళాపూర్ణోదయము’కంటే ముందే పై రెండు స్వతంత్ర కావ్యాలు వెలువడినాయన్నది చారిత్రక సత్యం. ద్విపదలో ఉత్తర రామాయణం రచించిన గోన బుద్ధారెడ్డి పుత్రులు కాచరెడ్డి, విఠలరెడ్డి తొలి తెలుగు జంట కవులనీ, వరాహపురాణకర్తలైన నంది మల్లయ, ఘంట సింగనలు కాదనీ గమనించవలసిన మరొక వాస్తవం.
లభ్యమవుతున్న తొలియక్షగానకర్త (సుగ్రీవ విజయం) కందుకూరి రుద్రకవి, తొలి అచ్చ తెనుగు కావ్యకర్త పొన్నిగంటి తెలగన (యయాతి చరిత్ర), విప్రనారాయణ చరిత్రను ‘వైజయంతీ విలాసము’ పేరుతో రసవత్కారవ్యంగా మలచిన సారంగుతమ్మయ గోలకొండ సుల్తానులు కుతుబ్‌షాహీల సాహిత్య పోషణకు ప్రత్యక్ష సాక్షులు. కాకతీయ ప్రభువుల చరిత్రను గ్రంథస్థం చేసిన ఏకామ్రనాథుని ‘ప్రతాపచరిత్ర’ (1550) తెలుగులో విరచితమైన మొదటి వచన గ్రంథం. దానిననుసరించి ద్విపదలో వెలువడిన మరొక చారిత్రక కావ్యం కాసె సర్వప్ప ‘సిద్దేశ్యర చరిత్రము’.
”శతలేఖిన్యవధాన పద్య రచనా సంధాసురత్రాణ చిహ్నిత నాముడు” అయిన చరిగొండ దర్మనకు తర్వాతివాడైన మరింగంటి జగన్నాధాచార్యలు (16వ శ||) కూడా ”శతావధాన శతలేఖినీ సార్వభౌమ బిరుదభూష ణుడు”గా వాసికెక్కాడు. మరింగంటి (ఆసూరి) సింగరాచార్యులు తెలగన్న బాటలో అచ్చ తెనుగు కావ్యరచన చేయటమేకాక నిరోష్ఠ్య కావ్య రచనకు (దశరథ రాజనందనచరిత్ర) చతురర్థికావ్య రచనకు (నలయాదవరాఘవ పాండవీయం) మార్గదర్శకుడైనాడు. ‘విద్వద్గద్వాల’ సంస్థాన ఆస్థానకవి కాణాదం పెద్దన సోమయాజి ‘ముకుంద విలాసము’ చిత్ర-బంధ-గర్భ కవితారీతులకు నెలవై కందుకూరి వీరేశలింగం ప్రశంసలనందుకొన్నది.
భక్తశిఖామణి రామదాసుగా ప్రసిద్ధుడైన కంచెర్ల గోపన్న (17వ శ||) గోలకొండ చెరసాలలో ఆర్తితో ఆలపించిన కీర్తనలు నవరసములకంటె, నవనీతముకంటె రుచికరములై వాగ్గేయకారుడైన త్యాగరాజును ప్రభావితం చేశాయి. రామదాసు ‘దాశరథీ శతకం’ కాకుత్సం శేషప్పకవి ‘నరసింహశతకం’, అతని మనుమడు నరసింహదాసు ‘శ్రీకృష్ణ శతకం’ మొ|| భక్తిపూరిత శతకాలు తెలుగునాట ఆబాలగోపాలంనోట బహుళ ప్రచారంలో ఉన్నాయి. గౌడ కులస్థుడైన కైరం భూమదాసు ‘రావికంటి రామచంద్రశతకం’, కుమ్మరి సిద్దప్ప వరకవి పద్యశతకం, దళితకవి చింతపల్లి దున్న ఇద్దాసు, మన్నెంకొండ హనుమద్దాసు, వేపూరు హనుమద్దాసు, రాకమచెర్ల వెంకటదాసుల సంకీర్తనలు సాహిత్య సృజన కులవర్గాలకు అతీతమైనదన్న సత్యాన్ని చాటి చెబతాయి.
జానపద సాహిత్యంలోకూడా తెలంగాణకు గణనీయమైన స్థానం ఉంది. దేశికవితాశాఖకు చెందిన జానపద గేయగాథలు-సర్వాయి పాపన్నకథ, సదాశివరెడ్డి కథ, నల్ల సోమనాద్రి కథ, బల్మూరి కొండవ్రాయుని కథ, మియాసాబుకథ, పండుగ సాయన్న కథ, బెల్లాల చెరువుపాట, ప్రాంత చైతన్యాన్ని ‘జాగృతం’ చేసిన బతుకమ్మ పాటలు తెలంగాణ జనజీవన సంస్కృతికి దర్పణం పడతాయి. లక్షల సంఖ్యలో అమ్ముడుపోయిన చెర్విరాల బాగయ్య యక్షగానాలు, దాసరి రాములు మొదలుగువారి యక్షగానాలు, తిరునగరి రామాంజనేయులు-అడ్లూరి అయోధ్య రామయ్య, సుద్దాల హనుమంతు బృందం వారి బుర్ర కథలు తెలంగాణ దేశి కవితా పతాకలుగా నిలుస్తాయి. ఈ ప్రాంత కవుల ప్రక్రియా వైవిధ్యం, వస్తు వైవిధ్యాలను నిశితంగా పరిశీలిస్తే భారతీయ భాషల్లో తెలంగాణ సాహిత్య చరిత్రకుగల విశిష్ట స్థానం, ప్రముఖస్థానం బహిర్గతమవుతుంది. తెలుగు సాహితీ వైభవానికి పునాదులు వేసిన బంగారుభూమి తెలంగాణా అన్న వాస్తవ సత్యం ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతోనైనా వెలుగులోకి రావాలి.
ఆచార్య ఎస్వీ రామారావు