magamagaతెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతిభవన్లో ఆవిష్క రించారు. సాహిత్య అకాడమీ లోగోను సిద్ధ్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఎం.వి. రమణారెడ్డి రూపొందించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్‌ రూపొందించారు.

సాహిత్య అకాడమీ లోగో మధ్యలో ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రించారు. హంస ముక్కు స్థానంలో పాళి కనిపిస్తుంది. హంస కింద పుస్తకం పుటలను నీటి అలలుగా చిత్రించారు. లోగో పైభాగంలో తెలంగాణ చిత్రపటంలో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్లు ప్రతీకాత్మకంగా పొందుపరిచారు. లోగో మధ్యలో పాల్కురికి సోమన పద్యభాగం ‘సరసమై బరగిన జాను తెనుగు’ అనే పద్యపాదాన్ని ప్రముఖంగా చేర్చారు. ఇక తెలుగు మహాసభల లోగోలో కాకతీయ తోరణం, మధ్యలో తెలంగాణ చిత్రపటం, కాకతీయ సామ్రాజ్య చిహ్నాలైన గజరాజులను నకాశీ చిత్రరీతిలో పొందుపరిచారు. లోగో పై భాగంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను చిత్రించారు. ”మన తెలంగాణము తెలుగు మాగానము” అనే వ్యాక్యం కనిపిస్తుంది.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిదారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.

Other Updates