సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియన్ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం మాసబ్‌ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా సింగపూర్, తెలంగాణల మధ్య మరింత బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాల పైన చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కంపెనీలు, సంస్థలు కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని మంత్రి కాన్సుల్ జనరల్‌కు తెలియజేశారు. ముఖ్యంగా పలు రంగాల్లో సింగపూర్ అనుభవాలను మరింతగా ఉపయోగించుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటి అండ్ ఈ రంగంలో శిక్షణ, ఫార్మ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం వంటి రంగాల్లో సింగపూర్ గణనీయమైన ప్రగతి సాధించిందని ఈ రంగాల్లో తెలంగాణకు సహకారం అందిస్తామని కాన్సుల్ జనరల్ ప్రతిపాదించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నదని, ఈ ఫార్మాసిటీ కోసం సింగపూర్ కు చెందిన సుర్బాన జరొంగ్ మాస్టర్ ప్లానింగ్ చేస్తున్నదని మంత్రి తెలిపారు. కాలుష్య రహితంగా ఫార్మాసిటీ ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఈ మేరకు సింగపూర్ లాంటి దేశాల అనుభవాన్ని ఉపయోగించు కుంటామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో గణనీయమైన పారిశ్రామిక ప్రగతి సాధించిందని, అనేక ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడులు తెలంగాణ కు తరలివచ్చాయి అని, ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం అని మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్-ఐపాస్ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాల్లో ఒకటని తెలిపారు. దీంతోపాటు దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలుస్తూ వస్తున్నదని ఇలాంటి చోట పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల నుంచి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని కాన్సుల్ జనరల్‌కు తెలిపిన మంత్రి సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలను వివరించేందుకు సింగపూర్ కంపెనీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రస్తుతం తెలంగాణలో
ఉన్న మౌళిక వసతులను ఇక్కడి ఈకో సిస్టంని పరిశీలించేందుకు స్థానిక ఐటీ పార్కులు మరియు టి-హబ్ వంటి ప్రాంతాలను సందర్శించాలని కాన్సుల్ జనరల్‌ను మంత్రి కోరారు. వచ్చే సంవత్సరం జరుగనున్న బయో ఏషియా సదస్సుకి సింగపూర్లోని ఫార్మ దిగ్గజాలను భాగస్వాములను చేసేందుకు కాన్సుల్ కార్యాలయం సహకరించాలని కోరారు.
ఈ సమావేశం ద్వారా తెలంగాణ ప్రభుత్వ పాలసీలు ప్రాధాన్యతల పట్ల మరింత స్పష్టత వచ్చిందని తెలిపిన కాన్సుల్ జనరల్, ఇక్కడి ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ఇక్కడి ప్రభుత్వ నాయకత్వాన్ని చూశాక సింగపూర్ లాంటి దేశాలకు చెందిన కంపెనీలు స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టేందుకు ప్రోత్సాహంగా ఉంటుందని, ఈ మేరకు సింగపూర్ పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని మంత్రి కేటీఆర్ కి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమలు మరియు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.