మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద గల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం దేశంలో ఎంపిక చేయబడిన 25 అత్యుత్తమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఒకటిగా 8వ రాంకును సాధించింది.జాతీయ స్థాయిలో గల ఎలక్ట్రిసిటి అథారిటీ వారు ఈ ఆర్ధిక సంవత్సరంలో గడచిన ఆరు నెలలకాలంలో అత్యధిక పి.ఎల్‌.ఎఫ్‌.సాధించిన 25 విద్యుత్‌ కేంద్రాలకు రాంకులు ఇవ్వగా సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 86.87శాతం తో 8వ రాంకు సాధించింది. తెలుగు రాష్ట్రాలలో ఏ ఇతర థర్మల్‌ కేంద్రానికి ఈ స్థాయి దక్కలేదు.రామగుండం సూపర్‌ థర్మల్‌ స్టేషన్‌ ఒక్కటే 82.04 పిఎల్‌ఎఫ్‌తో 19వ స్థానం దక్కించు కొగలిగింది.

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం జాతీయ స్థాయిలో 8వ రాంకు సాధించడంపై సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ తన హర్షం ప్రకటిస్తూ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇదే విధంగా ఉత్తమ పి.ఎల్‌.ఎఫ్‌తో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. జాతీయస్థాయిలో ప్రకటించిన జాబితా లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 750మెగావాట్ల బుడ్గె బుడ్గె థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 99.77 శాతంపి.ఎల్‌.ఎఫ్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది.

మొదటి నుండి ఉత్తమ స్థాయిలోనే…

సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ నిరంతర పర్యవేక్షణ, సమీక్షల ఫలితంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మొదటినుంచి మంచి పి.ఎల్‌.ఎఫ్‌తో ముందుకు పోతోంది. ఆగస్టు 2017లో ఈ స్టేషన్‌ అత్యధికంగా 98.43శాతం పి.ఎల్‌.ఎఫ్‌.తో రికార్డు సాధించింది. అలాగే స్టేషన్‌లోగల యూనిట్‌ -1 గత ఎప్రిల్‌ నెలలో 100శాతం పి.ఎల్‌ ఎఫ్‌. సాధించగా యూనిట్‌ -2 గత ఫిబ్రవరి, మే నెలల్లో 100% పి.ఎల్‌.ఎఫ్‌ నమోదుచేసాయి.

గత 6నెలల కాలంలో…

ఈ స్టేషన్‌ 4,613 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసి దానిలో 4,325 మిలియన్‌ యూనిట్లు గ్రిడ్‌ కు సరఫరా చేసింది.కాగా ఈ ప్లాంట్‌ తన ప్రారంభం నుండి సెప్టెంబర్‌ 2017 వరకు 8,862 యూనిట్ల విద్యుత్‌ఉత్పత్తి చేయగా 8,272 మిలియన్‌ యూనిట్లను రాష్ట్ర అవసరాలకు అందించింది.

Other Updates