kcrబొగ్గు ఉత్పత్తిలో తెలంగాణకు చెందిన సింగరేణి కాలరీస్‌ దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించి నెంబర్‌ వన్‌ గా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆనందం వ్యక్తం చేశారు. సింగరేణి సిఎండి, ఇతర ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లోని డివిడెండ్‌ రూ.66.42 కోట్ల చెక్కును సిగరేణి సిఎండి ఎన్‌. శ్రీధర్‌ జనవరి 18న క్యాంపు కార్యాలయంలో సిఎంకు అందచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగరేణి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ మొత్తం రూ. 490కోట్ల లాభాలు పొందింది. 7.5 శాతాన్ని డివిడెండ్‌గా నిర్ణయించింది. దీని ప్రకారం 51 శాతం వాటా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రూ. 66.42 కోట్లు, 49శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రూ. 63.58 కోట్లు లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ డివిడెండ్‌ను సంస్థ జనవరి 18న ప్రభుత్వానికి చెల్లించింది.

2014-15 సంవత్సరంలో 520 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి, 2015-16 సంవత్సరానికి 600 లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటిదాకా లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి సాధించింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎనిమిది కోల్‌ ఇండియా సంస్థల్లోకెల్లా సింగరేణి అత్యధిక ఉత్పత్తి సాధిస్తున్న సంస్థగా నిలిచింది. ఈ ఏడాది సింగరేణి 23శాతం వృద్ధి సాధించింది. కోల్‌ ఇండియా సగటు వృద్ధి రేటు 8శాతం ఉంది. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో కూడా సింగరేణి గణనీయమైన ప్రగతి సాధిస్తున్నదని, సింగరేణి సంస్థ అభివ ద్ధికి ప్రభుత్వం కూడా చేయూత అందిస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణలోనే మరో 50 ఏళ్ల వరకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని, అయినప్పటికీ ఇతర చోట్ల గనులను కూడా నిర్వహించాలని సంస్థ అధికారులను ముఖ్యమంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్‌ రమేష్‌ బాబు, జిఎం నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Other Updates