tsmagazine
సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. సింగరేణి ఏరియాల్లో బొగ్గు తీయడంద్వారా వచ్చిన ఆదాయంనుంచి సమకూరిన డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ ట్రస్టు (డీఎంఎఫ్‌టీ) నిధులతోపాటు ఇతరత్రా సమకూరే నిధులు వినియోగించి రహదారుల నిర్మాణంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.

సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ప్రగతిభవన్‌’లో సమీక్ష నిర్వహించారు. ‘సింగరేణి గనుల ద్వారా ఎంతో విలువైన ఖనిజ సంపద బయటకు వస్తుంది. అది జాతి అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ ఇదే సమయంలో బొగ్గు గనులున్న ప్రాంతాలు మాత్రం ఛిద్రమైపోతున్నాయి. రోడ్లు పాడవు తున్నాయి. దుమ్మువల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కేవలం బొగ్గు గనులున్న ప్రాంతాలే కాకుండా, అక్కడినుంచి బొగ్గు తరలించే మార్గాల్లో కూడా రోడ్లు బాగా దెబ్బతింటున్నాయి. కాబట్టి బొగ్గు గనులున్న ప్రాంతాలు, వాటి ప్రభావం కలిగిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధితోపాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి. సింగరేణి గనులున్న గ్రామాలన్నీ మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలే. అక్కడ మౌలిక సదుపాయాలు కూడా అరకొరగానే ఉంటాయి. వాటికితోడు సింగరేణి బొగ్గు రవాణావల్ల మరికొన్ని అసౌకర్యాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి.

‘మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతోనే జిల్లాల పునర్విభజన సందర్భంగా కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా చేసుకున్నాం. ఆయా జిల్లా కేంద్రాలలో అభివృద్ధి పనులు జరగాలి. మౌలిక వసతులు కల్పించాలి. సింగరేణి సంస్థ ద్వారా వచ్చే నిధులతో ఏర్పడిన డీఎంఎఫ్‌టీ నిధులు దాదాపు రూ. 1500 కోట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (ఎల్‌డబ్ల్యూఈ) అభివృద్ధి నిధులు, నరేగా నిధులు, ఇరిగేషన్‌ నిధులు, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా సమకూరే నిధులన్నింటినీ అనుసంధానం చేసుకుని సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. ఏ ప్రాంతంలో ఏ అవసరం ఉందో గుర్తించి, దాని ప్రకారం పనులు చేపట్టాలి. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి పనులను నిర్ధారించి, నిధులు విడుదల చేయాలి. ఈ నిధులతో చేపట్టే పనులను కలెక్టర్లు పర్యవేక్షించాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

హామీలన్నీ నెరవేరాలి: సీఎం

సింగరేణి ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలతోపాటు, ఇటీవల సింగరేణి ప్రాంతాలు పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరుశాతం అమలు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన 17 హామీలను నూటికి నూరుశాతం అమలు చేయడంకోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని, అన్నింటినీ అమలు చేస్తున్నామని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ తెలిపారు.

2017-18 సంవత్సరంలో 6.2శాతం వృద్ధిరేటుతో రికార్డుస్థాయిలో 646 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడంపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సీఎండీ శ్రీధర్‌, కార్మికులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. సింగరేణి థర్మల్‌ వపర్‌ ప్లాంటులో 91.1 శాతం పీఎల్‌ఎఫ్‌తో విద్యుత్‌ ఉత్పత్తి జరగడంపట్ల కూడా సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో చెప్పినట్టే తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో సింగరేణి తనవంతు పాత్ర పోషిస్తున్నదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు, సింగరేణి సీఎండీ ఎన్‌. శ్రీధర్‌, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, జలగం వెంకట్రావు, కోవ లక్ష్మి, పుట్ట మధు, పాయం వెంకటేశ్వర్లు, దివాకర్‌రావు, కోరం కనకయ్య, మనోహర్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్‌ నర్సింగ్‌రావు, పెద్దపల్లి, ఆసిఫాబాద్‌, కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల కలెక్టర్లు దేవసేన, ప్రశాంత్‌పాటిల్‌, హన్మంతు, అభయ్‌కుమార్‌, కన్నన్‌ తదితరులు పాల్గొన్నారు.

Other Updates