రెక్కలు ముక్కలుచేసుకొని నల్లబంగారాన్ని దేశానికి సంపదగా అందిస్తున్న సింగరేణి కార్మికులు తమ కొలువులు తమ వారసులకు దక్కాలని సుదీర్ఘకాలంగా కన్నకలలు ఎట్టకేలకు నెరవేరాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2002 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలపై నిషేధం విధించి కార్మికుల ఆశలపై నీళ్ళుచల్లారు. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చండ్రశేఖర రావు కార్మికుల కలలను నెరవేర్చారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర?యంతో సింగరేణి కార్మికులలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.
సింగరేణి సమస్యలపై ఈ ఏడాది దసరాకు ముందు అధికారులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జరిపిన సమీక్ష సందర్భంగా వారసత్వ ఉద్యోగాలపై ఆయన ఇచ్చిన ఆదేశాలమేరకు నవంబరు 4న సి.ఎం.డి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సింగరేణి బోర్డు డైరెక్టర్లు వారసత్వ ఉద్యోగాల నియామకానికి ఆమోదముద్ర వేశారు. వారసత్వ ఉద్యోగాలపై ప్రాథమిక నిబంధనలు వున్నాయి. నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ ప్రకారం 48-59 ఏండ్లమధ్య వయసువారి వారసులే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 11 నాటికి (దసరా పండుగ నాటికి) 48 సంవత్సరాల వయసు నిండిన కార్మికుల తమ్ముడు, కొడుకు, అల్లుడు ఎవరైనా నిబంధనల ప్రకారం దరఖాస్తుచేసుకోవచ్చు. అయితే, వీరివయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యనే వుండాలి. గతంలో ఉద్యోగి తమ్మునికి అవకాశం వుండేది కాదు. ఇప్పుడు కొత్తగా ఆ అవకాశం కూడా కల్పించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించిన అనంతరం నియామకాల ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతం సింగరేణిలో 58 వేలమంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 2500 మంది అధికారులు కాగా, మిగిలినవారంతా కార్మికులే. ఈ కార్మికులంతా వారసత్వ ఉద్యోగాలలో తమ వారిని నియమించుకోవడానికి అర్హులే. సింగరేణిలో 50 సంవత్సరాల వయసు పైబడిన కార్మికులు ప్రస్తుతం 70 శాతం ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం సంస్థలో ఉద్యోగి సగటు వయసు 52 సంవత్సరాలుగా వుంది. దీనిని బట్టి వారసత్వ ఉద్యోగాల కోసం సుమారు 10,000 మంది దరఖాస్తు చేసుకోవచ్చున్ని అంచనా. సింగరేణి యాజ మాన్యం తీసుకున్న ఈ తాజా నిర?యం వల్ల సింగరేణిలో యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఇది సంస్థ మరింత ప్రగతిపథంలో పయనించేందుకు దోహదం చేస్తుంది.
బొగ్గు ఉత్వత్తిలో సింగరేణి జాతీయస్థాయిలో ప్రథమస్థానంలో వుంది. 2015-16 సంవత్సరంలో లక్ష్యాలను అధిగమించి 60 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసింది. గత ఏడాది వచ్చిన 1066 కోట్ల రూపాయల లాభాలలో 23 శాతం మొత్తాన్ని కార్మికులకు బోనస్ గా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశించడంతో ఒక్కో కార్మికునికి దాదాపు లక్ష రూపాయల వరకూ లభించింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మొదటి సంవత్సరంలోనే సింగరేణిలో 5000 మంది నియామకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనుమతినిచ్చారు. ఇప్పుడు వారసత్వ ఉద్యోగాల కల నెరవేరడంతో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. బంగారు తెలంగాణ సాధనకు ముఖ్యమంత్రి కె.సి.ఆర్ చేస్తున్న కృషిలో సింగరేణి సిబ్బంది భాగస్వాములై సంస్థను మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకొనివెళ్ళాలని సిఎండి శ్రీధర్ ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు.