2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో సింగరేణి కార్మికులకు 27 శాతం వాటా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. గత ఏడాది 25 శాతం వాటా ఇచ్చామని, ఈ సారి మరో రెండు శాతం పెంచి 27 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని సింగరేణి సీఎండి శ్రీధర్ ను సీఎం ఆదేశించారు. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన ఎనిమిదేళ్ల పిఆర్పి (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) బకాయిలను వెంటనే చెల్లించాలని సీఎం చెప్పారు. సింగరేణి అధికారులు హైదరాబాద్ లో ఇండ్లు నిర్మించుకోవడానికి అవసరమైన స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల మాదిరిగానే సంస్థలోని అందరు అధికారులు, ఉద్యోగులకు కూడా ఇంటి నిర్మాణం కోసం వడ్డీ లేకుండా పది లక్షల రూపాయల రుణాన్ని అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇకపై సింగరేణిలో కార్మికులను వర్కర్లు అని పిలవవద్దని, వారిని కూడా ఉద్యోగులుగానే సంబోధించాలని సీఎం చెప్పారు. యాజమాన్యం, కార్మికులు వేర్వేరు అనే భావన విడనాడాలని, అంతా ఒక కుటుంబమనే భావన పెంపొందాలని సూచించారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, టిబిజికెఎస్ నాయకులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిశారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం సింగరేణి అధికారులు ఈ సందర్భంగా కోటి రూపాయల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా సీఎం నాయకులతో సమావేశమయ్యారు. గతంలో సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినందుకు ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. వాటిపట్ల కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, వెంటనే నిర్ణయాలు ప్రకటించారు.
”సింగరేణికి 120 సంవత్సరాల అనుభవం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల వాతావరణంలోనూ పనిచేసే నేర్పు ఉంది. భూగర్భంలోని బొగ్గును వెలికితీసిన అనుభవం, పరిజ్ఞానంతో సింగరేణి సంస్థ మరింత ముందుకుపోవాలి. ఇతర మైనింగ్ రంగాలకు విస్తరించాలి. సింగరేణి సంస్థ ఇప్పటికే థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో అపారంగా ఉన్న ఇసుక నిల్వలు, గ్రానైట్ నిల్వలను వెలికి తీయడానికి సింగరేణి ముందుకు రావాలి. బయ్యారం గనుల్లో కూడా తవ్వకాలు జరిపే బాధ్యతను సింగరేణికి అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏఏ రకమైన మైనింగ్ కార్యకలాపాల్లో సింగరేణి సంస్థ పనిచేయగలదనే విషయంపై అధ్యయనం చేసి, అధ్యయన పత్రం రూపొందించాలి. అనుభవం, పనితీరు ఉపయోగించుకుని సింగరేణి సంస్థ మరింత విస్తరించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.
సిబ్బందికి రూ. 327 కోట్ల్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఇచ్చిన హామీల మేరకు 2017-18 సంవత్సరానికి గాను సింగరేణికి వచ్చిన నికర లాభాల్లో 27 శాతం సుమారు రూ. 327 కోట్ల రూపాయలను చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేసింది.
సింగరేణి చరిత్రలో ఇప్పటి వరకూ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 1212 కోట్ల లాభాలు రావడం వల్ల ఉద్యోగుల భాగస్వామ్యం క్రింద ఈ సంవత్సరం అత్యధిక స్థాయిలో సుమారు 327 కోట్ల రూపాయలు లాభాల బోనస్ క్రింద చెల్లించడం జరుగుతోంది. తెలంగాణా రాకపూర్వం 10 నుంచి 18 శాతంగానే ఉన్న లాభాల బోనస్, తెలంగాణా వచ్చిన తర్వాత 21 శాతం నుండి మొదలై ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా 27 శాతానికి చేరుకుంది.
దేశంలో ఏ సంస్థలో లేని విధంగా లాభాల్లో కార్మికులకు భాగస్వామ్యం ఇవ్వడం అనేది సింగరేణి సంస్థలోనే ఉంది. 1999 సంవత్సరం నుండి ఈ విధానం అమలులో ఉండగా, 1999 నుండి 2014 వరకూ పదిహేను సంవత్సరాల కాలంలో మొత్తం రూ. 573.64 కోట్లు ఈ పధకం కింద చెల్లించగా, తెలంగాణా వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే సుమారు 774.49 కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతోంది. అదే విధంగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఇతర హామీల ప్రకారం అధికారులకు చెల్లించవల్సిన పీ.ఆర్.పీ 2016-17కాలానికి సుమారు 22 కోట్ల రూపాయలను సెప్టెంబర్ 5వతేదీన చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్.సీ.డబ్ల్యు.ఏ ఉద్యోగుల మాదిరిగానే అధికారులకు కూడా పది లక్షల వరకూ ‘ఇంటి ఋణం’ పై వడ్డీచెల్లింపు పధకాన్ని అమలు పరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్పత్తి, ఉత్పాదకతలపై దష్టి పెట్టి అంకిత భావంతో పనిచేస్తే మరెన్నో శిఖరాలను అధిరోహించవచ్చని ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.