విద్యార్థి దశలో చిక్కని కవితలు ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ కవి రామగిరి శివకుమారశర్మ. ఎనభయ్యవదశకంలో ప్రచురించిన ‘సముద్ర దాహం’తోనే ఎత్తుగడలో కొత్తదనం ఎలా గుండెలకు హత్తుకుంటుందో తన కవితలద్వారా ఆయన నిరూపించారు. తోడబుట్టిన తమ్ముడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన విషాదం ‘సింగిడి’గా వెలువడింది. ‘నువ్వు శ్రమించిన నేలమీద ఎంత ప్రేమైతే నీ చివరి ఊపిరికి నేల తల్లి మంచు పచ్చల ఒడి శరణమైంది’ అంటూ తమ్ముడి వియోగాన్ని దు:ఖ భారంతో వ్యక్తం చేసిన తీరు పాఠకులకు కన్నీళ్ళు తెప్పిస్తాయి. పెళ్ళి చేసి కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు కన్నతండ్రి) గుండె చెరువై ఎలా క్షోభ పడతాడో కవిత్వీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. నలభై ఏళ్ళుగా చోటు చేసుకున్న మార్పులు, ఆవేదనలు, ఆయా సందర్భాల్లో ఎదురైన అనుభవాలపట్ల శివకుమార్‌శర్మ స్పందనలు కట్టిపడేస్తాయి. ప్రతీ పంక్తిలో అపూర్వమైన భావనలను పేర్చిన ఈ కవితా సర్వస్వం ఆద్యంతం విశేష అనుభూతుల సమాహారం. ఇకపై శివకుమార్‌శర్మ వెలువరించే మరో కవితా సంకలనం ఎప్పుడా అని పాఠకులను నిరీక్షింపజేసేలా ‘సింగిడి’ రంగులద్దుకుంది. చక్కని కవిత్వాన్ని ఆస్వాదించే వారందరికీ ఇది విందు భోజనం.
సింగిడి
పేజీలు: 242,
వెల: రూ. 80/-;
ప్రతులకు: అన్ని పుస్తక విక్రయకేంద్రాలలో లభించును.
www.logili.com
www.avkf.org/books