magaతెలంగాణ తృతీయ ఆవిర్భావ వేడుకల సందర్భంగా   మే 26-29 వరకు ‘సింఫనీ ఆఫ్‌ కలర్స్‌’ పేరిట ఒక శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కళా శిబిరానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ‘తెలంగాణ ప్రాంత చిత్ర, శిల్పకళ’లకు ఎంతో ఆదరణ వుందని తెలిపారు. తెలంగాణ కళాకారులతోపాటు, దేశంలోని ప్రముఖ కళాకారులతో నిర్వహించిన ఈ శిబిరం నిర్వహణ చాలా గొప్పగా వుందని అన్నారు.

సీయంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ… తెలంగాణ కళలకు పుట్టినిల్లువంటిదని, కాపు రాజయ్య, పీటీ రెడ్డి, కొండపల్లి శేషగిరిరావు, విద్యాభూషణ్‌, వాసేదేవ్‌ కపట్రిల్‌లాంటి ఎందరో గొప్ప కళాకారుల స్ఫూర్తితో వర్ధమాన కళాకారులు ఎదగాల్సిన అవసరం వుందని అన్నారు.

యావత్‌ దేశంలోనే తొలిసారిగా 210మంది కళాకారులతో ఈ శిబిరాన్ని నిర్వహించడం ద్వారా చరిత్ర సృష్టించామని, మున్ముందు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ శిబిరాలను నిర్వహిస్తామని టూరిజం సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు.

కొద్దిమంది వ్యక్తుల గుప్పిట్లో ఇమిడిపోయి, వాణిజ్యపర లావాదేవీల్లో ఆధునిక చిత్ర/శిల్పకళలు బలైపోతున్నాయని, కళాకారులందరూ సంఘటితంగా అప్రమత్తంగా వుండాలని ప్రముఖ కళాకారుడు ప్రభాకర్‌ కల్టే అన్నారు. ఈ కళా శిబిరం యువ కళాకారులకు స్ఫూర్తిని, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు.

వేలాది ప్రజానీకాన్ని ఒక వేదికకు రప్పించవచ్చుకానీ, పదిమంది కళాకారులను ఒకచోట చేర్చడం ఎంతో కష్టమైన పని, అటువంటిది 210మంది కళాకారులను ఒక దగ్గరికి చేర్చి ఈ శిబిరాన్ని నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందని ప్రముఖ చిత్రకారిణి సీమఖోళి అన్నారు.

రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బి.ఎస్‌. రాములు ఈ ఆర్ట్‌ క్యాంపును సందర్శించి పులకించిపోయారు. ఊహకు కూడా అందనటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకుడు ప్రముఖ చిత్రకారుడు రమణారెడ్డి అభినందనీయుడని, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా తమ కృతజ్ఞతలు తెలయజేసుకుంటున్నామని ప్రముఖ కళాకారుడు తోట వైకుంఠం అన్నారు.

ఈ శిబిరంలో పాల్గొన్న 210మంది చిత్రకారుల చిత్రాలను జూన్‌ 1న ప్రదర్శనకు పెట్టారు. ఈ ప్రదర్శనను ప్రారంభించిన గవర్నర్‌ నరసింహన్‌ సృజనాత్మకతకు మూలం కళ అని, కళాకారులు సామాజిక ప్రగతికి వారధులవంటివారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి చందూలాల్‌ మాట్లాడుతూ కళాకారులకు ప్రభుత్వం అన్నివేళలా అండగా వుంటుందని అన్నారు. కళాకారులు తమ ఊహా ప్రపంచాన్ని జయించి చిత్రించిన పల్లె అందాలు, పడుచు సొగసులు, ప్రకృతి సోయగాలతోపాటు ఆధునిక పోకడలతో ఎన్నో కళాకృతులు ఈ శిబిరంలో కొలువుదీరాయి.

ఎం.వి. రమణారెడ్డి

Other Updates